గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77
116-షడ్దర్శన తత్వావ గాహి –ముడుంబై నరసింహా చార్య స్వామి
1842లో పాలకొండ దగ్గర అచ్యుతాపురం లోముడుంబై నరసింహా చార్యులు జన్మించారు .తండ్రి రాఘవాచార్యులు తల్లి గంగమాంబ .చిన్నతనం లోనే తండ్రి చనిపోగా తాతగారి వద్ద కావ్యాలను దర్శన శాస్త్రాలను చదువుకొన్నారు. మరుగంటి కూర్మాచార్యుల దగ్గర ఆంధ్ర వ్యాకరణం చందోరీతులను అభ్యసించారు .తెలుగు కవిత్వం లో అసమాన ప్రతిభను చూపారు .తాతగారి మరణం తర్వాత ఇరవై ఏళ్ళ వయసులోనే తమ్మునితో కలిసి దక్షిణ దేశ యాత్ర చేసి దివ్య క్షేత్రాలన్నిటిని దర్శించారు .ఆయా దేవస్తానాలలోని పండితులను తన కవనం పాండితీగరిమలచేత మెప్పించి సత్కరాలందు కొన్నారు .
గొట్టు ముక్కల కృష్ణం రాజు సహాయం తో విజయ నగర రాజు ఆనంద గజపతి సంస్థానం దర్శించారు .తన ఆంద్ర గీర్వాణ కవితా పాటవాన్ని రాజుగారి ముందు ప్రదర్శిం చారు . వీరి ఉభయ భాషా పాండిత్యం అద్వితీయ కవితా వైభవం రాజుగారి మెప్పును పొందాయి ఘన సన్మానం అందుకొన్నారు .విజయనగరం లో . నివాసం ఉన్నారు .రోజూ రాజాస్థానానికి వెళ్లి వచ్చేవారు .రాజు గారి తండ్రి విజయ రామ గజపతి సన్నిధిలోఒక రోజు ఆనంద గజపతి గారు మన కవిని సభకు పరిచయం చేశారు . ఆ రోజు శ్రీ కృష్ణ లీలా మహోత్సవం జరిగింది .అప్పుడు ఆచార్యుల వారు ఆశువుగా చెప్పిన పద్యానికి రాజుగారి తండ్రి విజయ రామ గజపతి మెచ్చి ప్రతినెల భ్రుతిని ఏర్పరచి ఆస్థా న కవిగా నియమించారు .
ఆచార్యుల వారు వేద వ్యాస మహర్షి గూర్చి నలభై రోజులు పంచాగ్ని మధ్యమం లో తపస్సు చేశారు .వ్యాస మహర్షి సాక్షాత్కరించి ఆర్ష ప్రతిభను ప్రదానం చేశాడు .అప్పటినుండి నరసింహాచార్య స్వామి అయ్యారు ..ప్రభువుకు స్వామి గారిపై అమిత గౌరవ ఆదరాలుం దేవి
వ్యాసుడు ప్రసాదించిన బుద్ధి కుశలత వలన దర్శనాలన్నిటికి విపుల విశేష వ్యాఖ్యానాలు రచిం చారు .దీనితో వీరి అసామాన్య ప్రతిభా విశేషాలను గుర్తించిన ప్రభువు సన్నిధి లోని విద్వత్ పరి షత్తు కు అగ్రాసనాదిపతిని చేశారు .1873లో ప్రభువు ఆనంద గజ పతి రాజు కాల ధర్మ చెందారు .ఆచార్యుల వారికి ఉత్సాహం అంతా నీరుకారిపోయింది .
సదా భగవధ్యానం లో కాలం గడిపేవారు .భగవద్ వాజ్మయ సృష్టికి ఉపక్రమించారు .అమూల్య గ్రంధాలను రాసి ప్రచురించారు .అసం ప్రజ్ఞాత యోగ ఫలం గా ఆచార్య స్వామి శేష జీవితాన్ని గడిపారు .నిత్య భగవత్ సాక్షాత్కారం పొందిన మహా యోగ శ్రేస్టూలు స్వామీజీ .వేదాంత దర్శన శాస్త్రాలను శిష్యులకు నిరంతరం బోధిం చేవారు .స్వంత ముద్రణాలయాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. మూడవ కూతురు పర్య వేక్షణలో తాను రాసిన గ్రందాలన్నిటిని ముద్రించారు .సర్వ దర్శనాలకు ఆచార్య స్వామి రాసిన వ్యాఖ్యానాలు యాభై కి పైనే ఉన్నాయి .సంస్స్కృత కావ్యాలు చంపువులు ,నాటకాలు రాశారు .తెలుగులో ‘’ముగ్ధ శృంగారం ‘’,ప్రౌఢ శ్రుంగారం ‘’,’’సంకీర్ణ శ్రుంగారం ‘’కామినీ దుస్ట శ్రుంగారం ,’’అంగ శ్రుంగారం ‘’రాశారు .
నృసింహా చార్య స్వామి పదహారవ ఏట రచించిన రుక్మిణీ కృష్ణుల విప్రలంభ శృంగారాన్ని వర్ణించే ‘’రంగేశ శతకం ‘’లోని ప్రతిపద్యం అమృత రస బిందువే .మొత్తం కావ్యం అమృత సింధువే.ఒక రస పేటికే.ఇందులోని ఒక తెలుగు పద్యానికి వీరే సంస్కృతం లో రాసిన ఒక శ్లోక వైభవం చూద్దాం –
‘’తన్వంగీ కుసుమాస్త్ర ఝాంకరణ వజ్జ్యా దూత చాతూశుగాత్ .-భీతా ‘’కిం శరణం భావే దిహ మమే ‘’త్వాలోచ్య నద్యాం జనేః
సాకం జాత మ వేత్య పద్మమ భజత్ ,తడ్బాధాతే హంత తాం –‘’జ్ఞాతిస్చేదన లేన కిం’’ వచ ఇదం స్వార్ధాత్ కదం స్స్ఖ్రలేత్ ‘’.
తొంభై రెండేళ్ళ నిండు జీవితాన్ని అనుభ వించి ఆచార్య శ్రీ 1924లో వ్యాస సన్నిధికే చేరుకొన్నారు .
117-అజాత శత్రువు- పళ్ళేపూర్ణ ప్రజ్ఞాచార్యులు
ఆంద్ర ఆస్థానకవి శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారి అల్లుడుగారు పళ్ళేపూర్ణ ప్రజ్ఞాచార్యులు .ఆ పేరుకు అన్నివిధాలా సార్ధకతను సాధించిన విద్వత్కవి వరేన్యులు .15-6-1897న నెల్లూరు జిల్లా కోవూరు దగ్గర సంగం లో జన్మించారు .అనేక చోట్ల విద్య నభ్యసించారు .వేదుల సూర్య నారాయణ శాస్త్రి ,నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి ల వద్ద వ్యాకరణం చదివారు వేమూరి రామ బ్రహ్మం ,దెందులూరి పానకాల శాస్త్రుల దగ్గర తర్కాన్ని అభ్యసించారు .ఈ శాస్త్రాలలో గురువును మించిన శిష్యుఅలని పించుకొన్నారు.గురుకుల విద్య చాలా క్లిస్టతరంగా సాగింది .
ఆచార్యుల వారు చివరికి గుంటూరు లో స్తిరపడ్డారు .కాశీ కృష్ణా చార్యుల వారివద్ద కావ్యాలంకార ,వేదాన్తాలను నేర్చుకొన్నారు. కాశీ వారి అల్లుడై ‘’ఆంద్ర కాదంబరి’’ కావ్యం రాసి మామ గారికి అంకిత మిచ్చి ఋణం తీర్చుకొన్నారు .1916నుండి ఇరవై ఏళ్ళు గుంటూరు టౌన్ హైస్కూల్ ,1937నుండి మరో ఇరవై ఏళ్ళు గుంటూరు హిందూ కాలేజి లోను సంస్కృత ఉపాధ్యాయ ,అధ్యాపకులుగా పని చేసి పదవీ విరమణ చేశారు .తర్వాత కే వి కే .సంస్కృత కళాశాలలో ,సంస్కృతాంధ్ర పండితులుగా సేవలందిం చారు .
భాష్యాంత వైదుష్యం తో శోభిల్లిన ఆచార్యుల వారికి ఇసుమంతైనా అసూయ కాని గర్వం కాని లేక పోవటం మహా విశేషం .జీవితం అంతా ‘’పఠన ,పాఠనాలకే ‘’అంకితం చేసిన విద్వన్మూర్తి ఆచార్యుల వారు .ఆకాలం లో కొప్పరపు కవులకు తిరుపతికవులకు కవితా స్పర్ధలు తార స్థాయిలో ఉండేవి .పూర్ణ ప్రజ్ఞా చార్యుల వారు మాత్రం ఏ ముఠాకూ చెందకుండా సమకాలీన సాహితీ లోకం లో ‘’అజాత శత్రువు ‘’గా నిలిచారు .
ఆచార్యులవారు యెంత ప్రాచీన సంప్రదాయ వాదులైనా నవీనతను కాదనలేదు .మామగారు కృష్ణా చార్యుల వారితో కలిసి అష్టావధాన శతావధానాలను జంట వదానాలుగా నిర్వహించారు .తానూ స్వయం గా కూడా అవధానాలు చేశారు .ఎన్నో ఆశుకవితా ప్రదర్శనలిచ్చారు .’’కవి శేఖర ‘’,మహోపాధ్యాయ ‘’,విద్యాలంకార ‘’,సాహిత్య రత్న ‘’,వంటి బిరుదాలు పొందారు .ఆచార్యుల వారు రాసిన గ్రంధాలు వందకు పైనే ఉన్నాయి .6-3-1976నశ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి డి .లిట్ .బిరుదు నందు కొన్నారు .
వంద గ్రంధాలు రాసినా ఆచార్యులవారి ముద్రిత గ్రంధాలు నలభై మాత్రమె .’’శ్రీరామ కల్యాణం ‘’అనే పద్య కావ్యం తొలి రచన .’’కైకేయీ సౌశీల్యం ‘’మరో పద్య కావ్యం .’’ఆంద్ర కాదంబరి ‘’అనువాద రచన .ద్విపద మేఘ దూతం రచించారు సంస్కృత ,ప్రతిమ,ప్రతిజ్ఞా యౌగంద రాయణం ,చారుదత్త నాటకాలకు తెలుగు అనువాదం చేశారు .రాఘ వేంద్ర,,జయ తీర్ధ, వాదిరాజు ,వ్యాస రాయ ,పూర్ణ బోధ విజయ ‘’కావ్యాలలో ద్వైతమత సిద్ధాంతాలను పొందుపరచారు .ఆంద్ర మహా భారతానికి విరాట పర్వం వరకు ప్రామాణికమైన లఘు టీక రాశారు .ఆచార్య శ్రీ శాస్త్ర పాండిత్యానికి గొప్ప ఉదాహరణ ‘’శత లక్షిణి ‘’.అనే విమర్శ గ్రంధం .ఈ గ్రంధమే తిరుపతి కవులకు వాద ప్రతివాదాలలో ‘’కరదీపిక ‘’గా నిలిచింది అని అంటారు .ఎనభై ఏళ్ళ సంపూర్ణ సార్ధక జీవితం గడిపి పళ్ళేపూర్ణ ప్రజ్ఞాచార్యుల వారు 1977లో ‘’పూర్ణ ప్రజ్న’’లోకి చేరుకొన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు