గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79
119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి
బాల్యం –విద్యాభ్యాసం
ఆరామ ద్రావిడ శాఖకు చెందిన బంకుపల్లి మల్లయ్యశాస్త్రి గారు 1876 లో గంగన్న ,సూరమ్మ దంపతులకు ఉర్లాం సంస్థానం వారి ఆశ్రమం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .బాల్యం ఉర్లాం లోనే గడిచింది .బళ్ళమూడి లక్ష్మణ శాస్త్రి గారి దగ్గర కావ్య ,నాటక అలంకార సాహిత్యాలలో ప్రజ్ఞ సాధించారు .పిమ్మట టుని సంస్థాన పండితులు ,షడ్దర్శన ప్రవీణులు మహా మహోపాధ్యాయ పరవస్తు రంగా చార్యుల వద్ద శిష్యులై వ్యాకరణ శాస్త్రం నేర్చారు .ఉర్లాం ‘’శ్రావణి’’వారి పరీక్ష రాసి పండిత సత్కారం పొందారు .తర్వాత విజయనగర పండితులు ,తర్క వేదంత పారం ఎరిగిన కూరెళ్ళ సూర్య నారాయణ శాస్త్రి గారి అంతేవాసియై భాష్యాంతం ,తర్కం అభ్యసించారు .భార్య చనిపోవటం తో కొంత వైరాగ్య భావన ఏర్పడింది .
సకలకళానిది
బంకుపల్లి కామ శాస్త్రి గారి వద్ద మంత్రం శాస్త్రం నేర్చుకొన్నారు .భువనేశ్వరీ మంత్రం దీక్ష గురువు గారి వద్ద తీసుకొని అనుస్టింఛి సిద్ధి సాధించారు .1897 లో శ్రీకాకుళం ఉన్నత పాఠశాల లో తెలుగు పండితులుగా ఉద్యోగించారు . విద్య నేర్పటం కన్నా విద్య నేర్వటం పైన శాస్త్రి గారికి ఆసక్తి మెండుగా ఉండేది .భల్ల మూడి దక్షిణా మూర్తి శాస్త్రి గారి దగ్గర పంచ దశ ప్రకరణం ,గీతాభ్యాసం పూర్తీ చేశారు .తర్వాత శ్రీ కూర్మం వెళ్లి నౌడూరి వెంకట శాస్త్రి గారి నుండి మనోరమ ,పరిభాషేందుశేఖరం ,మొదలైన శాస్త్ర గ్రందాధ్యయనం చేశారు .భాష్యాంతము ,వ్యాకరణం బోధించే సామర్ధ్యాన్ని పెంపొందిం చుకొన్నారు .
పర్లాకిమిడి ఉన్నత పాఠశాల లో ఆంద్ర పండితులుగా రెండేళ్ళు పని చేసి ,రాజావారి అనుగ్రహ పాత్రులై పర్లాకిమిడి సంస్థాన పండితులుగా తర్వాత సంస్కృత ఉపన్యాసకులుగా నియమింప బడి గౌరవం పొందారు .ఇంతటితో సంతృప్తి చెందితే వారు బంకుమల్లి వారు అనిపించుకోరు .చదువుపై మంచి’’ మంకు పట్టు ‘’ఉండేది బంకుపల్లి వారికి .ఆస్థాన దైవజ్ఞులు నీల మణిపాణిగ్రాహి గారి వద్ద జ్యోతిష శాస్త్రం అభ్యసించారు .సూర్య సిద్దాంతం అను సరించి దృక్ సిద్ధాంత పంచాంగం గణించే నేర్పు సాధించి పంచాంగ రచన చేశారు .దీనితోనూ ఆగలేదు .గంటి సూర్య నారాయణ గారి దగ్గర వేదాంత ,మీమాంసా శాస్త్రాలు చదువుకొన్నారు .ఇంతటితోనూ ఆగలేదు .గిడుగు రామ మూర్తి గారి వద్ద ఆంగ్ల భాషాజ్ఞానమూ పొందారు .అయినా వీరి విజ్ఞాన తృష్ణ తీరలేదు .పోకల సింహాచలం గారి వద్ద సంగీతం నేర్చుకొన్నారు .శాస్త్రి గారి లయజ్ఞానం ఆది భట్ల నారాయణ దాసు గారినే ఆశ్చర్య పరచింది .
నిత్య నేర్వరి
నేర్వటం అనేది శాస్త్రి గారికి ఒక సద్గుణ వ్యసనం అయింది .భారత రామాయణాలను ,వసు చరిత్రాది ప్రబంధాలను ‘’పురాణ హరి కధ ‘’పేరు తో నృత్యం ,గీతం ,తాళ,లయ బద్ధం గా పాడి ఆంద్ర దేశం లో పల్లె పట్టణం అనే తేడా లేకుండా తిరిగి పాడి ప్రదర్శించి పండిత పామర రంజనం చేశారు .పర్లాకిమిడి రాజా వారు స్థాపించిన ‘’నాటక సంఘం ‘’సభ్యులై సంస్కృతాంధ్ర నాటకాలలో పాత్ర ధారులై రసజ్ఞుల మన్ననలు అందుకొని నటనలోను తన కళా విశ్వ రూపాన్ని ప్రదర్శించారు .శాస్త్రి గారు సకల కళా వల్లభులని పించుకొన్నారు .ఇంతటి ఉపజ్న ఇన్ని విషయాలలో ప్రదర్శించిన వారు దాదాపు లేనే లేరని ఘంటా పధం గా చెప్ప వచ్చు .
ఆచరణ సంస్కర్త
సనాతన ధర్మాను రక్తులైన శాస్త్రి గారు గొప్ప సంస్కార వంతులు .ధర్మ శాస్త్రాన్ని మదించిన వీరు రజస్వలానంతర వివాహం ,హరిజనోద్యమం ,విధవా పునర్వివాహం శాస్త్ర సమ్మతాలే నని పండిత సభలలో వాదోపవాదాలు చేసి దక్షిణ దేశమంతా ప్రచారం చేసి ఆధునిక భావాలకు అండగా నిలిచారు .పండితులతో చర్చించారు .వారిని మెప్పించారు ,ఒప్పించారు .వివాహ తత్త్వం ,అస్పృశ్యత అనే గ్రంధాలు తెలుగులో రచించి జనసామాన్యానికి ధర్మ రహస్యాలు తెలియ జేశారు .శాస్త్రి గారు అనర్గళం గా అసాదారణంగా యుక్తి యుక్తం గా చాతుర్యం గా సంస్కృతాంధ్రాలలో సంభాషించే మహా వక్త కూడా . శాస్త్రి గారు మాటల మనిషి మాత్రమె కాదు చేతల మనిషి కూడా. అదే వారి విశిష్ట వ్యక్తిత్వం .స్త్రీ పునర్వివాహం మొదలైన ఆదర్శాలను ప్రచారం చేయటమే కాదు తన కుమార్తెకు కూతురికి సంస్కరణ వివాహాలు జరిపించిన గొప్ప సంస్కార వంతులు .’’అధీతి బోదా చరణ ప్రచారం’’ తో జీవితాన్ని సార్ధకం చేసుకొన్న పుణ్య మూర్తి శాస్త్రి గారు .పండిత దిగ్గజం అని ప్రశంసింప బడ్డారు .
గ్రంధ రచన
కావూరి వినయాశ్రమం వారి ప్రేరణ తో విద్యారన్యుల భాష్యానికి అనుగుణం గా నాలుగు వేదాలను ఆంధ్రీకరించిన అసాధ్య రచయిత.వీటిలో ఋగ్వేదాన్ని ఆశ్రమం వారి ముద్రించారు .వీరివి అముద్రిత గ్రందాలెన్నో ఉండిపోయాయి .వీటిలో అరవిందుని పురుషోత్తమ తత్త్వం ,ఆధారంగా భగవద్గీత పై రాసిన ‘’గీతా రహస్యం ‘’,అనేగ్రంధం ,సాహిత్య దర్పణానికి ఆంధ్రాను వాదం ఉండటం ఆంధ్రులు చేసుకొన్నా దురద్రుస్టమేమో ?.శాస్త్రిగారు ఎన్నో యక్షగానాలు రాశారు .వాటిలో పర్లాకిమిడి రాజ వారికి అంకితమిచ్చిన –చైతన్య చరిత్ర ,ముద్దాడ వెంకటప్పల నాయనకు అంకితం చేసిన రుక్మిణీ కళ్యాణం ముద్రణా భాగ్యానికి నోచుకోవటం మన అదృష్టం .కంస వధ ,కృష్ణ జననం ,రామ కృష్ణ పరమ హంస చరిత్ర మొదలైనవి అచ్చు అవ్వాల్సినవి .
సంస్కృత హరికధలు
సంస్కృతం లో సీతా కల్యాణం ,జానకీ వహ్ని ప్రవేశం అనే హరికధలు రాసి ,చెప్పి ‘’చీకటి సంస్థానాదిపతులచే’’ ‘’పురాణ వాచస్పతి’’ బిరుదు పొంది భూరి బహుమతు లందు కొన్న పౌరాణిక విద్వాంస కవి శాస్త్రి గారు .భార్యా సమేతం గా కాశీ యాత్ర సంపూర్తి చేసి తిరిగి వస్తూ ఈ విద్వాన్మణి బంకుపల్లి మల్లన్న శాస్త్రి గారు ఖర్గ పూర్ లో అకస్మాత్తుగా డెబ్భై వ ఏట మరణించి తీరని లోటును సంస్కృతాంధ్ర సాహిత్యానికి కలిగించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు