గీర్వాణ కవుల కవితా గీర్వాణం -80
120-ఖచరమణిపేటికర్త ,సకల శాస్త్రాభిజ్న –అలుకూరు గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి
అలుకూరు మల్లికార్జున శాస్త్రి పాత నిజాం రాష్ట్రం రాయచూరు మండలం అలుకూరు గ్రామం లో వెంకట రామ శాస్త్రులు సుబ్బమాంబ దంపతులకు 1871లో జన్మించారు .వీరిది గోల్లాపిన్ని వంశం .భారద్వాజస గోత్రీకులు .ఆపస్థంభ సూత్రం .వీరి వంశపు వారంతా దిగ్గజాలైన సంస్కృతాంధ్ర కవి పండితులే ,శాస్త్ర నిధులే .ఏడు తరాలకు పూర్వం వీరి వంశం లో మోటప్ప ఆనే ఆయనకు ‘’పల్లెలాంబ ‘’అనే గ్రామ దేవత ప్రత్యక్షమై బంగారు ,పలకా బలపం ఇచ్చి ఆ వంశం లో ఏడు తరాల వరకు అందరూ పండితులే అవుతారని దీవించిందిట .శాస్త్రిగారి భార్య సుబ్బమాంబ .అత్తా కోడళ్ళది ఒకే పేరు అవటం విశేషం .
బాల విద్యా కిశోర
నాలుగవ ఏట వీధి బడికి పంపించారు అ రోజు సాయంత్రమే ఉపాధ్యాయ్డు ఈ బాలుడిని వెంట బెట్టుకొని ఇంటికి వచ్చి తండ్రిగారితో తనకు వచ్చిన విద్య నంతా ఒక్క రోజులోనే ఆ బాలుడు నేర్చేసేడని,ఇక తానూ బోధించటానికి ఏమీ లేదని చెప్పి అప్పగించాడు .అంతటి బాల మేధావి శాస్త్రిగారు . తండ్రి వెంకట రామ శాస్త్రులుగారి దగ్గరే నాకాంతక సాహిత్యం ,తత్వ బోధినీ వ్యాఖ్యాన సహితం గా కౌముదిని ,న్యాయ వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేశారు .తండ్రిగారి వెంట గద్వాల ,వనపర్తి ,ఆత్మకూరు సంస్థానాలను బాల్యం లోనే దర్శించి తన విద్యా వైదుష్యాన్ని ప్రదర్శించి పండిత బృందం చే మెప్పు పొంది ‘’భారతీ బాల లీలా రూపుడు ‘’అనే బిరుదు పొందారు .
సకల శాస్త్రాభిజ్నులు
తండ్రిగారి మరణం తర్వాత గడేహోతూరు వెంకట రామ శాస్త్రులు గారి వద్ద శిష్యరికం చేసి జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకొన్నారు .కాళహస్తి చేరి విక్రాల రాఘవాచార్యుల అంతేవాసి అయి మహా భాష్యంత వ్యాకరణం ,ముహూర్త జాతక సిద్ధాంత స్కంద త్రయ జ్యోతిష శాస్త్రాలలో సర్వ ప్రధములుగా ఉత్తీర్ణులైనారు .గురువు రాఘవాచార్యు లవారు’’కన్ను స్వామి ‘’అనే మారు పేరుతొ ‘’indian Ephimeries రాశారు .గురువు గారి అనుమతితో కలియుగం దశ సహస్ర వర్షాల(పది వేల సంవత్సరాలు )కు సరిపడా తిది ,వార ,నక్షత్ర ,యోగ ,కరణ ,ఘటికా ,విఘటికల ప్రమాణాన్ని అతి వేగం గా అత్యంత సులభం గా బోధించే మహా గ్రంధ రాజం ‘’ఖచర మణి పేటి’’‘’అనే బృహత్తర పంచాంగం రచించి జ్యోతిషం లో కొత్త దారి చూపారు .గురు ఆశీస్సులతో కాళహస్తి దేవాలయం లో నిష్టగా కూర్చుని ‘’శని వర్గు ‘’గుణిస్తుంటే శనీశ్వరుడు ప్రత్యక్షమై నాడు . ఈ గ్రంధాన్ని గురుదేవులకు అంకిత మిచ్చి తన గురు భక్తిని చాటుకొన్నారు .శాస్త్రి గారి తమ్ముడు రామ శాస్త్రిగారు గొప్ప సూర్యోపసకులు .సూర్యోదయం నుండి మధ్యాహ్నం పన్నెండుగంటల వరకు సూర్యుని తదేకం గా చూస్తూ ధ్యానమగ్నులై ఉండేవారు .మన శాస్త్రిగారి లాగానే ఆయనా త్రికాలజ్ఞాని .
స్వగ్రామం ఆలూరు కు తిరిగి వచ్చి తాతగారైన సుబ్బా శాస్త్రుల వారి వద్ద సమగ్ర వేదాంత శాస్త్రం నేర్చుకొని ఇరవై వ ఏట విద్యా వ్యాసంగాన్ని ముగించారు .ఇంత పిన్న వయసులో ఇన్ని విద్యలు నేర్వటం ,అన్నిటా ప్రతిభ చూపటం శాస్త్రి గారి ప్రత్యేకత .బళ్ళారి ,కడప వగైరా సంస్థానాలు పర్యటించి శతావదానాలతో మెప్పించి సన్మానాలు పొందారు .గద్వాల ,వనపర్తి ,ఆత్మ కూరు సంస్థానాలలో తన పాండిత్య ప్రదర్శన తో ఆకర్షించి గౌరవ సత్కారలందు కొన్నారు .
బిరుదులు –సన్మానాలు
కవి సార్వ భౌమ ,సకల శాస్త్రాభిజ్న బిరుదులూ వీరి కవితా ప్రాగాల్భ్యానికి సకల శాస్త్ర పారంగత్వానికి పొందారు .శాస్త్రి గారు ‘వాసు దేవా నంద ‘’అనే అలంకార శాస్త్ర గ్రంధం రచిం చారు .కాని ఇది ముద్రితం కాలేదు కాని ఇది చిత్ర ,విచిత్ర కవితా భాండారం .ఇందులో అమితాస్చార్యపరచేది ‘’సహస్ర దళ పద్మ బంధం ‘’1008దళ పద్మంలో అనేక శ్లోకాలు నిక్షిప్తమైన అపూర్వ సృష్టి .అయిదు వందల శ్లోకాలతో పదహారు ప్రకరణాలతో ఉన్న అపూర్వ గ్రంధం ఇది .ఇందులో ఉన్న నూరు శ్లోకాలతోనే గ్రంధం ప్రచురింప బడింది .దీనిని నలభై రోజుల్లో శాస్త్రిగారు రాశారంటే అమితాస్చర్యం వేస్తుంది ..వివిధ ఛందస్సులతో ‘’పురుషోత్తమ శతకం ‘’రాశారు .’ధర్మ శాస్త్ర రాత్నాకరమూ రాశారు .’పతంజలి భాష్యార్ధం అనే గోప్పరచనా చేశారు .
దీర్ఘ సత్ర యాగం
శాస్త్రి గారు 15-1-1906 తమ స్వగ్రామం అలుకూరు లో ఒక ఏడాది పాటు ‘’దీర్ఘ బ్రహ్మ సత్ర యాగం‘’నిర్వ హించారు .వందలాది పండితులు ,రాజులు ,మంత్రులు ధన వంతులు ,వేలాది మంది పేదలకు కుల మత భేదం లేకుండా అన్న సంతర్పణ జరిగింది .అందరిని సత్కరించి పంపిన రాత్రి శ్రీ విరూపాక్ష స్వామి కలలో కన్పించి’’అవబ్రుధ స్నానం ‘’కాశీ లో చేయమని ఆజ్ఞా పించాడు .బంధు జనం తో కాశీ వెళ్లి ఆ కార్యక్రమం సంతృప్తి గా నిర్వహించి ప్రయాగ ,గయాది క్షేత్ర సందర్శనం చేసి ఇంటికి తిరిగి వచ్చారు .
జగద్గురువుల ఆశీః ప్రశంస
.జ్యోతిష శాస్త్ర సుధర్మ సారం ‘’అనే మరో గ్రందాన్నీ రాశారు .ఆది శంకరాచార్యుల వారి జన్మస్థలమైన కర్నాటక దేశం లోని ‘’కాలడి ‘’గ్రామం లో శృంగేరీ పీఠాదిపతులు శ్రీ నృసింహ భారతీ తీర్ధ స్వాములవారు శంకరా చార్యుల విగ్రహ ప్రతిష్టచేసినప్పుడు జరిగిన పండిత సభలో శాస్త్రి గారు తాను రచించిన ‘’జ్యోతిష శాస్త్ర సుధర్మ సార’’గ్రంధాన్ని మహా స్వాములకు అంకితమిచ్చారు .ఆ సభలో జగద్గురువులు ఆ గ్రంధం లోనుండి 2000సంవత్సరంలో స్వామివారు అడిగిన తిదికి పంచాంగ గణన చేయమని సభాసదులను కోరారు .చాలా మంది చెప్పలేమని చేతులెత్తేశారు. కొందరు కనీసం మూడు గంటల వ్యవదికావాలన్నారు .అప్పుడు మల్లికార్జున శాస్త్రి గారు ఇరవై నిమిషాలలో గణన చేసి స్వామివారితో సహా అందరినీ ఆశ్చర్య పరచారు . వీరి విద్వత్తును అభినందించి జగద్గురువులు ‘’పండిత సార్వ భౌమ ‘’బిరుద ప్రదానం చేసి సత్కరించారు .అప్పుడు జగద్గురువులు ‘’ఉపాధి భేదం చేత మీరు అక్కడ .మేము ఇక్కడ .మీరేమేము .మేమే మీరు ‘’అని ప్రశంసించారు .
శాస్త్రి గారి మహిమలు
గద్వాల రాజు రాంభూపాల్ మరణించగా సంస్థానం పదేళ్లు ‘’కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ‘’ లో ఉంది .అప్పుడు వారసుడైన సీతా రాం మల్లి కార్జునుని శరణు వేడాడు .ఈయన ఏడాది గడువు పెట్టి ,హంపీ విరూపాక్షునికి‘’అగ్ని స్టోమ ,కోటి బిలార్చన చేయ సంకల్పించి అందరి సహకారం తో ఆ పని పూర్తీ చేశారు .గడువు లోపలే సీతా రాం కు గద్వాల రాజ్యం దక్కింది .
ఒక సారి యవ్వనం లో శాస్త్రి గారు ఎండలో నడిచి వస్తున్నాడు .ఒక పేద రైతు కనిపించి వర్షాలే లేవని కరువు తో జనం అలమటిస్తున్నారని చెప్పాడు .’’పెద్ద వర్షం వస్తుంది .ఇంటికి పో ‘’అన్నారు శాస్త్రి .అంతే కుండ పోత గా వర్షం కురిసింది .ఇంకో సారి స్వగ్రామం బయట ఏటి ఇసుక లో ధ్యాన నిష్ఠలో ఉండగా విపరీతం గా వర్షం కురిసి ఇసుకలో శాస్త్రి గారు కూరుకు పోయారు .కొన్ని రోజుల తర్వాత ఆ వాగు ఎండి పోయింది .మంచి నీటి కోసం చలమలు తవ్వు తుంటే శాస్త్రి గారు పద్మాసనం లో అలానే చలించ కుండా కని పించారు .ఏదైనా మహిమ చూప మని ఒక శిష్యులు అడిగితే ‘’ఒక శివా లయం లో నాలుగు స్తంభాల మద్య శివుడికి ఎదురు గుండా కూర్చొని కనులు మూసు కొని ఒక్క సారిగా శరీరాన్ని గాలి లోకి లేపి, ఆ స్తంభాల మద్య చుట్టూ వేగం గా గిర గిరా తిరిగి ,మళ్ళీ కిందికి దిగి శివుని ధ్యానించారు .
మరో సారి మల్లేశ్వరాలయం లో బావ మరది దోనే కంటి రామయ్య భాగవతం లో ‘’పురంజనో పాఖ్యానం‘’చదువు తుంటే శాస్త్రి గారు ఆధ్యాత్మ పరం గా వ్యాఖ్యానం చేస్తున్నారు .పూర్తీ అవగానే రామయ్య‘’అంతేనా బావా?’’అన్నాడు .శాస్త్రి గారు ‘’అంతేరా’’అన్నారు .అంతే- రామయ్య వెంటనే లేచి భుజం పై ఖండువా దులిపి మళ్ళీ బుజం మీద వేసుకొని అదే పోత పోయాడు .తల్లీ, శాస్త్రి భార్యా మొత్తు కొన్నావెను తిరిగి చూడ లేదు ‘’’’వాడిక రాడు లే అంతే ‘’అని వారికి సమాధానం చెప్పారు శాస్త్రి .అంటే ఆత్మ బోధ అయిందన్న మాట బావ మరది కి .
శాస్త్రి గారి లీల ఇంకోటి .గద్వాల రాజు మూడు రోజుల పండిత గోష్టి లో ఉండగా ఒక రోజు నిజాం ప్రభువు తాను రాయ చూరు వస్తున్నానని తనను అక్కడ కలుసు కోమనిరాజుకు ఫర్మానా పంపాడు .ఏమి చేయాలో తోచక శాస్త్రి గారిని అడిగాడు రాజు .కంగారేమీ పడక్కర లేదని నిజాం రాడనీ రేపే ఆవిషయం తెలుస్తుందని చెప్పాడు ఇరకాటం లో పడ్డాడు రాజు .అనుకోన్నట్లే నవాబు వాడీ వరకు వచ్చే సరికి కడుపు నొప్పి ఎక్కువై హైదరాబాద్ తిరిగి వెళ్లి పొయ్యి నట్లు మర్నాడు వార్త వచ్చింది .అంతటి వస్య వాక్కు శాస్త్రి గారిది .
1917 లో అలుకూరు గ్రామం లో ప్లేగు వ్యాధి విపరీతం గా వ్యాపించింది .శాస్త్రి గారు మల్లికార్జున పుష్కరిణి ని ‘’అష్ట దిగ్బంధం ‘’చేసి .ఆ నీళ్ళు తాగిన వారికి ప్లేగు రాదనీ చెప్పారు .’’మారికా దేవి‘’ప్రత్యక్షమై అంత కఠోర నియమం పనికి రాదనీ అది తనకే నష్టం అనీ చెప్పింది .అందర్నీ ధర్మవరం పంపించి ,తానొక్కడే ఆ ఊర్లో ఉండిపోయారు ..గ్రామ ప్రజలందర్నీ బయటికి పంపించే శాడు .తాను కుటుంబం తో తుంగ భద్రా నది ఒడ్డున ఉన్న రామా పురం వెళ్లారు .శాస్త్రి గారికి ప్లేగు సోకింది .కుండ పోతగా వర్షం కురుస్తోంది .ఎవరు బయటకు వచ్చే అవకాశం లేదు .శాస్త్రి గారికి సమయం లో వైద్య సాయం అంద లేదు .అంతే 5-9-1917 నాడు చని పోయారు .ధర్మ వరం లో ఉన్న అల్లుడు శ్రీని వాస శాస్త్రి టెలిగ్రాం చూసి వచ్చాడు .అప్పటికే ఆలస్య మై పోయిందని శవ దహనం చేశారు .చితా భస్మం వర్షపు నీటిలో అంతా కొట్టుకు పోయింది .చితా భస్మం కూడా మిగుల కుండా చేసి ,నలభై ఆరేళ్ళ వయసులో చని పోయిన మహా జ్ఞాని కవి ,పండిత సార్వ భౌములు అలుకూరు గొల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి గారు
.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-14-ఉయ్యూరు