గీర్వాణకవుల కవితా గీర్వాణం -83
124-కళానిధి ,విద్యా వాచస్పతి –విక్రాల రామ చంద్రా చార్యులు
బాల మేధావి
కవి పండిత శ్రేస్టూలు సకల శాస్త్ర నిధి మహోపన్యాసకులు విక్రాల రామ చంద్రాచార్యులు గారు 1879 జూన్ ఆరున ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా కలికివాయి గ్రామం లో జన్మించారు .తండ్రి కళత్తూర్ విక్రాల రాఘవాచార్యులు తల్లి కనకమ్మ .వీరి వంశం లో’’ కవిపంతారామం ‘’గా ప్రసిద్ధులైన విక్రాల వంశ మూల పురుషులు విక్రాల నరసింహా చార్యుల వారు భగవద్ రామానుజులకు ప్రత్యక్ష శిల్యులు .వారి తర్వాత అరవైనాలుగు పురుషాంతరాలు గడిచి పోయాయి .వంశం లో జన్మించిన వారంతా ప్రసిద్ధ కవి పండితులే అవటం మరో విశేషం .
రామ చంద్రా చార్యుల వారు బాల మేధావిగా పరిగణింప బడ్డారు .బాల్యం లోనే అసాధారణ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించారు .అయిదవ ఏట అక్షరాభ్యాసం జరిగిన ఒక్క రోజులోనే ఒత్తులు గుణింతాలుతో సహా తెలుగు అక్షరాలన్నీ నేర్చేసి అందర్నీ ఆశ్చర్య పరచారు .ఏడవ ఏటనే ‘’లీలావతీ గణిత సార సంగ్రహం ‘’మొదలైనవి ఆపోశన పట్టేశారు .ఒకే ఒక్క రోజు రాత్రి పంచాంగ రచనకు అవసరమైన లేక్కలన్నిటినీ గ్రహించే చే శారు ..పదమూడవ ఏట తండ్రిగారి వద్దే షట్ శాస్త్రాలు అభ్యసించి తిరుగు లేని పండితులని పించుకొన్నారు .తర్వాత మేనమామ పర్ణ శాల రాఘవాచార్యుల వద్ద సాహిత్య ,వ్యాకరణ ,తర్క శాస్త్రాలను నేర్చుకొన్నారు .అనంతరం శ్రీ కాళహస్తి వెళ్లి అక్కడ సింగా రాజు సూర్య నారాయణ ఉపాధ్యాయుల వారి వద్ద కృష్ణ యజుర్వేదం అధ్యయనం చేశారు .రామ దత్తా నంద తీర్ధుల వద్ద సిద్ధాంత ,జాతక ,ముహూర్త ,వాస్తు ,ప్రశ్న భాగాలు నేర్చుకొన్నారు .
యవ్వన విజయం
పద్దెనిమిదేళ్ళ వయసులో ‘’శూల మేని ‘’లో జరిగిన యాగానికి సదస్య బాధ్యతా వహించి యాగాన్ని నిర్విఘ్నంగా యదా విధిగా నిర్వహించి మహా మహా వాళ్ళకే సంభ్రమం కలిగించారు .మద్రాస్ వెళ్లి మహా భారత రహస్యాలను ,జ్యోతిష్ శాస్త్రాన్ని గూర్చి మహోపన్యాసాలు చేసి అందరిని అలరించి స్స్వర్ణ సింహ తలాటపు మురుగులు ,గడియారం బహుమతులుగా పొందారు .
పూనా లో మొదటి ఓరిఎంటల్ సమావేశం జరిపితే మద్రాస్ నుండి ఆచార్యులవారు ప్రతి నిదిగా హాజరై ,అక్కడి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలను పొందారు .తిరువనంతర పుర విద్వత్ సభలో తలపండిన విద్వాం సులనే తన ఉపన్యాస ఝరి తో తల పంకింప జేసి ‘’విద్యారణ్య పంచానన ‘’గౌరవాన్ని ,తిరువాన్కూర్ మహా రాజా వారి ఘన సన్మానాన్ని అందుకొన్నారు .
నడి వయసు సూరీడు
1922కలకత్తా ఓరియెంటల్ కాన్ఫ రెన్స్ లో సాధికార పూరిత ప్రసంగం చేసి ,గవర్నర్ నుండి విశిష్ట సత్కారం పొందారు ..నవ ద్వీపం లో విద్వన్మండలి లో ప్రసంగించి ,తన సర్వ శాస్త్ర విజ్ఞానం వక్రుత్వాలకు విశేష ఆదరాన్ని పొంది సర్ ఆశుతోష్ ముఖర్జీ నుండి ‘’విద్యా వాచస్పతి ‘’బిరుదు ను ,మహా గౌరవ ప్రదమైన సత్కారాన్ని అందుకొన్నారు .మరో సభలో ‘’కళానిధి ‘’బిరుదు వరించింది .1923లో నండూరి గ్రామం లో జరిగిన ఆంద్ర సాహిత్య పరిషత్ వార్షిక సభ ఆచార్యులవారికి ‘’మహోపాధ్యాయ ‘’గౌరవం కల్పించి కీర్తించింది .చాలా రాజాస్థానాలను సందర్శింఛి ప్రభువులను మెప్పించి విద్వాంసులను ఆశ్చర్య పరచి అఖండ సన్మానాలందు కొన్నారు .
గీర్వాణ రచనాచార్యం
విక్రాల రామ చంద్రా చార్యుల వారు సంస్కృతాంధ్రాలలో మొత్తం 89 గ్రంధాలు రాసి ,సాహిత్య రచనలో మేటి అనిపించుకొన్నారు .అందులో ముఖ్యం గా సంస్కృతం లో 16 ఉద్గ్రంధాలు రచించారు .వాటిలో ‘’త్రేతాకాండ మంత్రం భాష్యం ‘’,’’అపస్తంభాది షట్ శాఖా నిరూపణం ‘’,’’అనువాక నిర్ణయం ‘’,ఉన్నాయి ఇవికాక గీర్వాణ భాషలో రాసిన ‘’అబ్దనామ నిర్వచనం ‘’,సంఖ్యాను శాసనం ‘’,జ్యోతిర్దశా నిర్ణయం ‘’, ‘’మానాంతర బోధం ‘’మొదలైన జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన పద్నాలుగు గ్రందాలున్నాయి .మానాంతర బోధనం అనే వీరి జ్యోతిష్ శాస్త్ర ఉద్గ్రంధం ఇంగ్లీష్ లోకి ‘’దిడేట్ కాల్క్యు లేటర్’’పేరు మీద అనువాదం పొంది విశ్వ వ్యాపితం గా కీర్తి చంద్రికలను వెలయించింది .
ఆచార్య ఆంద్ర రచనోత్సవం
ఆచార్య శ్రీ తెలుగులో 40గ్రంధాలు రాశారు .అందులో ‘’కల్ప సూత్రసంగ్రహం ‘’, ‘’దివ్య దేశ మార్గ బోధిని ‘’,’’వేదాంతపు జడ్జి మెంట్ ‘’,’’వర్దిష్ణుహితోపదేశం’’,రెండుభాగాలలో’’ రామ జాతకం ‘’,’’స్త్రీ పునర్వివాహ శాస్త్రీయతా నిరూపణం ‘’,మొదలైనవి ఉన్నాయి .
రాజకీయాచార్యకం
విక్రాల వారు రాజ కీయ ప్రవేశం చేసి ,అక్కడా తమ అవక్ర పరాక్రమం చూపి ,సాహిత్య సేవతో బాటు సంఘ సేవలోనూ పునీతులయ్యారు .1904లో ఒంగోలు తాలూక బోర్డు సభ్యులుగా నియమితులై రాజకీయ అరంగేట్రం చేశారు .పిమ్మట తొమ్మిదేళ్ళు నెల్లూరు జిల్లా బోర్డు సభ్యులుగా సేవలందించారు .1911లో ‘’దక్షిణ భారత సంస్థ ‘’లో సభ్యులయ్యారు .1912లో మద్రాస్ పచ్చయప్ప కాలేజి ప్రెసిడెంట్ గా ఇతోధికం గా విద్యా సేవ చేసే అవకాశం పొంది సంతృప్తిగా విద్యా సేవ చేశారు .తన స్వంతగ్రామం కలికి వాయి లో ఇంట్లోనే ‘’సరస్వతీ పుస్తక భాండా గారం ‘’సమకూర్చుకొని వాణీ మాత నిత్య సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు .సుమారు అర్ధ శతాబ్ది కాలం మాత్రామే అంటే యాభై మూడేళ్ళు మాత్రమె జీవించిన ఈ కళానిధి మహోపాధ్యాయ ,విద్యా వాచస్పతి శ్రీ విక్రాల రామ చంద్రాచార్యుల వారు 7-4-1932 గీర్వాణ లోకం చేరారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-12-14-ఉయ్యూరు