గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85-
127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి
సంస్కృతమే అన్నీ
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి లో 2-7-1911 నశ్రీనివాస శాస్త్రి ,పద్మావతి దంపతులకు జన్మించారు .తిరుపతి ,అన్నామలై ,మద్రాస్ సంస్కృత కళాశాలలో చదివి సాహిత్య శిరోమణి ,వేదాంత శిరోమణి డిగ్రీలు పొందారు
ఉద్యోగం – ఎదుగుదల
.వనపర్తి సంస్థానం లో ఆస్థాన విద్వాంసులుగా గౌరవ స్థానం అలంకరించారు .అక్కడే హైస్కూల్ లో భాషా పండితులుగా పని చేశారు .తర్వాత హైదరాబాద్ ప్రభుత్వ సమాచార శాఖలో అసిస్టంట్ డైరెక్టర్ గా చేరారు .పిమ్మట ఆంద్ర ప్రదేశ్ విద్యాశాఖ లో డిప్యూటీ డైరెక్టర్ అయ్యారు .ఈ పదవిలో ఉండగానే ప్రాచ్య కళాశాలల ఉపాయాధ్యాయుల జీతాలను మిగిలిన డిగ్రీ కళాశాలల ఉపాధ్యాయుల జీతాలతో సమానం గా ఉండేట్లు చేసి భాషా పండితులకు గౌరవ ప్రదమైన జీతాలు వచ్చేట్లు చేసి అందరి అభిమానానికి పాత్రులయ్యారు .
సంస్కృత భాష స్పెషల్ ఆఫీసర్ గా కొనసాగి దేశమంతా తిరిగి సంస్కృత భాషా వ్యాప్తికి ఎన లేని కృషి చేశారు .మళ్ళీ సమాచార శాఖలో డిప్యూటీ డైరెక్టర్ అయి ,’’హైదరాబాద్ టు డే’’,’’ఆంద్ర ప్రదేశ్ ‘’మొదలైన ప్రభుత్వ పత్రికలకు సంపాదకులుగా ఉన్నారు .
లక్ష్మణ శాస్త్రీయం
మాదిరాజు విశ్వనాధ రావు అనే తోటి కవితో కలిసి ‘’బిల్హణుని విక్రమామ్క దేవ చరిత్ర కావ్యాన్నీ ‘’,కర్ణ సుందరి ‘’నాటకాలను ప్రబంధ శైలిలో ఆంధ్రీకరించారు ‘’తెలుగు –సంస్కృత కోశం ‘’,’’సంస్కృత వాచకాలు ‘’రచించారు .విజ్ఞాన సర్వస్వం సంగ్రహాంద్ర విజ్ఞాన కోశం ‘’లలోను, వివిధ పత్రికలలోనూ లెక్కకు మించి వ్యాసాలూ రాశారు .శాస్త్రిగారు మహా వక్త .తెలుగు సంస్కృతం ,కన్నడ ,తమిళ ,మరాఠీ ,హిందీ ఉర్దూ భాషలలో ఉద్దండ పండితులు. ఆ భాషలలో అనర్గళం గా ప్రసంగించే నేర్పున్న వారు .ఈ భాషలలోని ఎన్నో గ్రంధాలను తెలుగులోకి అనువాదం చేశారు .భారత ప్రధమ రాష్ట్ర పతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు హైదరాబాద్ సందర్శించి నప్పుడు లకష్మ శాస్త్రి గారు కావ్య ప్రబంధ ధోరణిలో స్వాగత శ్లోకాలు రాసి ఆహ్వానించారు –ఆ శోభ చూద్దాం
‘’నిష్ణాతః ప్రాచ్య విద్యా స్వనితర ధిషణే-దుర్గమే రాజ్య తంత్రే –విద్వాన్ పాశ్చాత్యతంత్రే ష్వఖిల భారత భూ –వాసినాంభాగ్య సీమా –రాజ్యానాం పాలనే చ ప్రభురతి నిపుణో-ప్యప్రద్రుష్యోభిగ్యః –జీయత్ రాజేంద్ర విద్వా నతి శత శరదం –భారతం సేవ మానః ‘’
సత్కార పురస్కార బిరుదాoకితాలు
కాశీ సంస్కృత విశ్వ విద్యాలయం ,ఆంధ్రా ,ఉస్మానియా విశ్వ విద్యాలయాల బోర్డ్ ఆఫ్ స్టడీ స్ లో సభ్యులై సేవలందించారు .’’సురభారతి ‘’వ్యవస్థాపక అధ్యక్షులు .ఆంద్ర సారస్వత పరిషత్ స్థాపక సభ్యులు ..తిరుపతి లో జరిగిన విద్వత్ సభలో శాస్త్రి గారి కి ‘’ఆంద్ర బిల్హణ’’బిరుద ప్రదానం చేసి గౌరవించారు .ఉత్తర ప్రదేశ్ లోని మదన మోహన మాలవ్యా విద్యా సంస్థాన్ ‘’సుధీంద్ర మౌళి ‘’తో గౌరవించి సన్మానించింది .’’బ్రహ్మ భూషణ ‘’అన్నది వీరి సాహితీ పాండితికి లభించింది .కాశీ విద్వత్ పరిషత్తు శాస్త్రి గారిని ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదం తో సన్మానించింది .తిరువాన్కూర్ ,గ్వాలియర్ జగద్గురు శంకరాచార్యుల వారి చేత కప్పగంతుల వారు ఘనం గా సత్కరింప బడ్డారు .విద్యా మంత్రి మండలి వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి జలగం వెంగల రావు గారి నిర్వహణలో జరిగిన ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలో లక్ష్మణ శాస్త్రి గారు ప్రత్యేకం గా సన్మానం అందుకొన్నారు .దేశం లోని ప్రముఖ సాహిత్య సంస్థలన్నీ శాస్త్రి గారిని ఆహ్వానించి వారి ఉపన్యాస లహరిలో తడిసి విశేష సత్కార ,పురస్కారాలు అందజేశాయి ..
వీలైనప్పుడల్లా వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ అక్కడి స్థానిక భాషలైన హిందీ మరాఠీ కన్నడం తమిళం మొదలగు భాషలలో ప్రసంగిం ఛి వారిని ముగ్ధులను చేసేవారు .వీరి ఆధ్వర్యం లో ఏర్పడిన ‘సార్వభౌమ సంస్కృత ప్రచార కార్యాలయం ‘’కు అధ్యక్షులుగా వ్యవహరించారు .వీరి పాండిత్యాన్ని మెచ్చుకొన్న పండిత ద్వివేదీ శాస్త్రి సంస్కృతం లో వీరిని
‘’మూర్తిర్మత్త గజేంద్ర దర్ప దళినీ వాణీ వినోద ప్రియా –వ్యాఖ్యాలేఖ కవిత్వ కౌశల కళా పారంగతా ,శేముషీ
శక్తి స్సంస్కృత భాషణే ప్యనుపమా విద్వజ్జనే స్వాదరః –శ్రీ మల్లక్ష్మణ శాస్త్రిణాంగుణ గణాః కేషాంన తోషా వహాః’’అని శ్లాఘించారు .
శాస్త్రి గారు తుది శ్వాస వదిలే వరకు ‘’కాశీ సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ‘’’’ఎమిరిటస్ ప్రొఫెసర్ ‘’గా (సమ్మాన్య ప్రాచ్యాచార్యులు )గా ఉన్నారు .శాస్త్రిగారు అందరికి మిత్రులే .తర తమ భేదం లేనివారు. అందరూ శాస్త్రి గారికి అత్యంత ఆత్మీయులే మిత్ర బృందం లోని వారే .అదీ వారి ప్రత్యేకత .డెబ్భై సంవత్సరాలు సార్ధక జీవనం గడిపి 10-1-1981 తేదీన ఈ సంస్కృత సాహితీ వాజ్మయ శిఖరం నేల వ్రాలింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-14-ఉయ్యూరు