గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85
128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి
విద్యోపాసన
పశ్చిమ గోదావరి కోన సీమ లోని పేరూరు అగ్రహారం లో శ్రీ విద్యోపాసకులైన పేరి అనంత రామావధానులు ,వెంకమాంబ దంపతులకు లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు 1877లో జననమొందారు .తండ్రి గారే ప్రధమ గురువు గారు .తాతగారైన వేదాధ్యన సంపన్నులు ,నిత్య పార్ధివ లింగ పూజా దురంధరులు ,శ్రీ విద్యో పాసకులైన సుబ్బావదానుల వారు.చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన దురదృష్ట వంతులు వీరు .తల్లిగారు అన్నీ అయి పెంచారు .అల్లారు ముద్దుగా పెరిగారు .ఎనిమిదవ ఏట శాస్త్రిగారికి ఉపనయనం చేశారు .
పదహారో ఏడు వచ్చేదాకా నైయాకరణ చూడామణి అయిన మందా చెన్నయ్య శాస్త్రి గారి దగ్గర శిష్యులై సంస్కృత కావ్య నాటక ,న్యాయ వేదాంత ప్రకరణాలను క్షుణ్ణం గా అధ్యాయం చేసి కరతలా మలకం చేసుకొన్నారు .దురవ గాహన మైన శాస్త్ర విషయాలను అతి సునాయాసం గా అర్ధం చేసుకొని వంట బట్టించు కొన్నారు .తన దిషణా సంపదత తో గురువు గారినే ముచ్చట పడేట్లు చేశారు .
విజయ నగరం రాజా వారి సంస్కృత కళాశాలలో న్యాయ శాస్త్ర అధ్యాపకులైన గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి గారు అనే అపర గౌతముల వద్ద పదేళ్ళు ,పిఠాపుర సంస్థాన వైయాయిక సార్వ భౌములని పేరొందిన శ్రీ పాద లక్షీనరసింహ శాస్త్రి గారి అంతేవాసిగా రెండేళ్ళు మొత్తం పన్నెండేళ్ళు న్యాయ శాస్త్రాన్ని మధించారు .
విద్యా బోధన
తన అసాధారణ వైదుష్యం తో పిఠాపురం ,ఉర్లాం మున్నగు సంస్థానాలను సందర్శించి పండితులను ప్రభువులను మెప్పించి గొప్ప సన్మానాలు అందుకొన్నారు .అన్ని శాస్త్ర పరీక్షలలో సర్వోత్తములుగా ఉంటూ అందరికీ చేరువయ్యారు ఆస్థానం లో న్యాయ వేదాన్తాలను అతి సులభ విధానం లో బోధిస్తూ ఎందరో శిష్యులకు విద్య నేర్పి తీర్చి దిద్దారు .దీనితో వీరి కీర్తి చంద్రిక దశ దిశలా వ్యాపించింది .
1902లో విజయ నగర సంస్కృత మహా విద్యాలయం లో న్యాయ శాస్త్రాధ్యాపకులుగా పదవీ బాధ్యతలు చే బట్టారు . 1913లో .గురువు సంగమేశ్వర శాస్త్రి గారు పదవీ విరమణ చేసిన పిమ్మట లక్ష్మీ నారాయణ శాస్త్రి గారుప్రధాన న్యాయ శాస్త్ర పండితులుగా నియమింప బడి సేవలందించారు .
వైదుష్య ప్రదర్శన –బిరుద సత్కారాలు
1924 లో రాజా గారి ఆజ్ఞ తో రాజస్థాన్ లోని జయ పుర సంస్థానాన్ని దర్శించారు .అక్కడ మహా విద్వత్ సభలో తన ప్రతిభా సామర్ధ్యాలను వాదనా పటిమను ,ధీశక్తిని ప్రదర్శించి మెప్పించి ‘’న్యాయ భూషణ ‘’బిరుదాన్ని సత్కారాన్ని అందుకొన్నారు . విజయ వాడలోని ‘’త్రిలింగ విద్యా పీఠం’’వ్యవస్థాపక అధ్యక్షులు ముదిగొండ వెంకట రామ శాస్త్రి గారు శాస్త్రిగారిని ఆహ్వానించి శాస్త్ర ప్రదర్శన చేయించి ‘’న్యాయ స్థాపక ‘’గౌరవ బిరుదు ప్రదానం చేసి ఘనం గా సత్కరించారు .ఈ గౌరవాన్ని పొందిన ఆంధ్రులలో వీరు అయిదవ వారు .అధీతి బోధనా చరణ తో జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు .అ నాటి బ్రిటిష్ ప్రాభుత్వం శాస్త్రి గారికి ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు ను అందజేసి తగిన గౌరవం కలిగించిది .న్యాయ వేదాన్తాలనే కాకుండా మంత్రం ,జ్యోతిష శాస్త్రాలను అధ్యయనం చేసి అనుస్టించిన నైస్ష్టికులు శాస్త్రి గారు .వీటిని నిరంతరం శిష్యులకు బోధించేవారు .
రచనా పాటవం
ఒక పట్టాన లొంగని తల పండిన మహా విద్వాంసులకే కొరుకుడు పడని ఉదయ నాచార్యుడు రాసిన ‘’కుసుమాంజలి ‘’ని శాస్త్రి గారు అతి సులువుగా ,సరళం గా ఆంధ్రీకరించారు .గదాధర భట్టా చార్యుని ‘’హేత్వభాస సామాన్య నిరుక్తి ;,’’నవ్యభి చార సామాన్య నిరుక్తి ‘’అనబడే నవ్య న్యాయ శాస్త్ర మహా గ్రంధాలకు ‘’లలిత’’అనే సరళ వివరణలు రాసి అందరికి అందుబాటులోకి తెచ్చారు .దీనివల్ల శాస్త్రిగారి అసాధారణ న్యాయ శాస్త్ర పాండిత్యం అవగాహన ,వ్యుత్పత్తి ,అనుసరణ లు తెలుస్తున్నాయి .ఇదేగాక మాధవాచార్యుల ‘’సర్వ దర్శన సంగ్రహం ‘’లోని ఎన్నో భాగాలను అనువదించారు .దురదృష్ట వశాత్తు ఈ గ్రంధం ముద్రణకు నోచుకోలేదు .డెబ్భై రెండేళ్ళు జీవించిన ఈ న్యాయ శాస్త్ర కోవిదులు ,న్యాయ భూషణులు పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు 1949లో నారాయణ సన్నిధానం చేరారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-14-ఉయ్యూరు
.