గీర్వాణ కవుల కవితా గీర్వాణం -86
129-రేడియోలో సంస్కృత పాఠాలు చెప్పిన ,సర్వోదయ ప్రచారకులు .-కే నృ .వేం .అప్పారావు
విద్యా వైదుష్యం
కేశి రాజు వెంకట నృశింహ అప్పారావు గారు 1913లోమార్చి పద్నాలుగున తూర్పు గోదావరిజిల్లా దేవీ పట్నం లో జన్మించి ,ప్రాధమిక విద్య అక్కడే చదివి తర్వాత కొవ్వూరు జిల్లా బోర్డ్ హైస్కూల్ లో సెకండరీ విద్య పూర్తీ చేశారు కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠం లో విద్య నేర్చారు .హిందీ లో రాష్ట్ర భాష పరీక్ష పాసైనారు .ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి సంస్కృతాంధ్రాలలో ఉభయ భాషాప్రవీణ డిగ్రీ పొందారు .’’ఇండో యూరోపియన్ భాషా శాస్త్రం’’ పై పరిశోధన చేసి పత్రాన్ని సమర్పించి ఆంద్ర విశ్వ కళాపరిషత్ నుండి పి .ఓ.ఎల్ డిప్లమా తీసుకొన్నారు .నాగ పూర్ యూని వర్సిటీ నుండి ఏం .ఏ.డిగ్రీ సాధించారు .
విద్యా బోధన-రాజకీయ ప్రవేశం
కొవ్వూరు లో వాడ్రేపు జోగాయమ్మ సంస్కృత కళాశాల అంటే ఆంధ్రగీర్వాణ విద్యా పీఠంలో ఆంధ్రోపన్యాసకులుగా పని చేశారు .దేశ భక్తీ మెండుగా ఉన్న అప్పారాగారు ఉద్యోగం చేస్తూనే 1941 వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొని అరెస్ట్ అయి నాలుగు మాసాలు జైలు శిక్ష అనుభవించిన దేశ భక్తులు .క్విట్ ఇండియా ఉద్యమం లోనూ పాల్గొని ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవించారు .గాంధీ గారి పిలుపై స్పందించి ఎన్నో నిర్మాణాత్మక కార్య క్రమాలలో పాల్గొన్నారు .ఆచార్య వినోబాభావేగారి సర్వోదయ ప్రభావం అప్పారావు గారిపై పడింది .తెనాలి నుండి వెలువడే ‘’సామ్య యోగం ‘’అనే సర్వోదయ పక్ష పత్రికకు గౌరవ సంపాదకులుగా సేవ చేశారు .
సామాజిక సేవ –
కొవ్వూరులో రెబ్బాప్రగడ మందేశ్వర శర్మ గారు స్థాపించిన ‘’వీర మందిరం ‘’అనే సంస్థ ద్వారా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజనుల విద్యా సంస్కృతుల అభివృద్ధి కోసం అవిశ్రాంత కృషి సల్పారు .వారి జీవితాలలో వెలుగులు పూయించారు .
కేశవ నృసింహీయం
1938నుండి పదేళ్ళు కొవ్వూరు సంస్కృత కాలేజి లోఅధ్యాపకులు గా పని చేసి ,ఉపాధ్యక్షులు గా పదోన్నతి పొందారు .1948 నుండి 1974వరకు ఆంద్ర గీర్వాణ కళాశాలాధ్యక్షులుగా సేవలందిం చారు .1975లో ఆంధ్రా యూని వర్సిటిలో సంస్కృత శాఖలో రిసెర్చ్ ఫెలోగా ఉన్నారు .సంస్కృతం హిందీ భాషలలో ఎన్నో పుస్తకాలు రచించారు .అందులో ఖండకావ్యాలు ,కధలు ,విమర్శనా వ్యాసాలున్నాయి .వీరి సంస్కృత కావ్యాలు –‘’పంచవటి ‘’,గంగా లహరి ‘’మొదలైనవి .వీటికి తెలుగు అనువాదమూ తామే చేసి ప్రచురించారు .’’బృందావనం ‘’అనే కావ్యాన్ని సంస్కృతం హిందీ ,తెలుగు భాషలలో రచించి తన పాండిత్య ప్రకర్షను ప్రకటించుకొన్నారు .
గాంధీజీ బోధనలను ఏర్చి కూర్చి ‘’గాంధీ గీతా ‘’గాను ,వినోబా భావే సామ్య వాడ సూత్రాలకు వివరణాత్మకం గా ‘’సంయోగ కరికాః’’ అనే గ్రంధాన్ని రాశారు .వీరి కధలు’’ ఆకాశ వాణి ‘’ద్వారా చాలా ప్రసారమయ్యాయి .వడ్ల మూడి గోపాల క్రిష్నయ్య గారు సాంఖ్య యోగాత్మకం గా మాత్రా చందసులో రాసిన ‘’మనిషి –మహర్షి ‘’అనే గేయ కావ్యాన్ని అదే రాగ తాళ లయలతో మాత్రా ఛందస్సులోనే సంస్కృతం లో రచించి యెనలేని కీర్తిని పొందారు .వినోబా హిందీలో రాసిన ‘’శిక్షణ విచార ధారా’’ను తెలుగులోకి తర్జుమా చేశారు .కాళిదాసుఅభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని తెలుగు నాటకం గా మలిచారు .తెలుగులో ఖండ కావ్యం గా ‘’వసుంధరా సాంత్వనం ‘’రచించారు .తన తెలుగు వ్యాసాల సంపుటిని ‘’వ్యాస పీఠం ‘’గా వెలువరించారు ఆంగ్ల భాషలో ‘’ఎస్సేస్ ఆన్ స సింథేసిస్ ‘’వ్రాసి ముద్రించారు .విజయ వాద ఆకాశవాణి ద్వారా ”అమర భారతి ”పేరిట విద్యార్ధులకు సులభం గా సంస్కృత బోధనా కార్యక్రమాన్ని ఎన్నో ఏళ్ళుగా నిర్వహించిన ఘనత నృసింహ అప్పా రావు గారిది .”కేయూరాని విభూషితే ”’అనే శ్లోకం తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఎందరినో ప్రభావితం చేసింది . శబ్ద ప్రయోగాలు శ్లోక వివేచనా ,కవితా ప్రతిభా ,కవి చేసిన చమత్కారాలను అప్పారావు గారు అరటి పండు వొలిచి చేతిలో పెట్టినంత సులువుగా వివరించి ఉత్సుకతను కల్గించేవారు
పురస్కార గౌరవాలు
ఆంద్ర విశ్వ విద్యాలయం ఎకడమిక్ కౌన్సిల్ సభ్యులుగా నియమింఛి అప్పారావు గారిని గౌరవిం చింది .సంస్కృత బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులుగా సేవ చేశారు .వీరి సాహిత్య సాంఘిక సేవా కార్య క్రమాలను పరిగణన లోకి తీసుకొని ఆంద్ర విశ్వ విద్యాలయం 1974లో ‘’కళా ప్రపూర్ణ ‘’బిరుదు గౌరవం అందజేసి సత్కరించింది .అప్పారావు గారు అరవై నాలుగేళ్ళు జీవించి 1977 జనవరి పన్నెండున అకాల మరణం పొంది సాహితీ లోకానికి వెలితి మిగిల్చారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-14-ఉయ్యూరు