33 కోట్ల దేవుళ్లున్నారా?- డాక్టర్‌ కె. అరవిందరావు

33 కోట్ల దేవుళ్లున్నారా?- డాక్టర్‌ కె. అరవిందరావు

గత వ్యాసాల్లో దేవుణ్ణి రెండు స్థాయిల్లో తెలుసుకున్నాం. ఒకటి అంతటా వ్యాపించి ఉన్న శుద్ధచైతన్యం. మరొకటి సృష్టికర్తగా మనం భావించుకుని పూజించే దేవుడు. మొదటిస్థాయిలో ఉన్నది తాత్త్విక పరమైన విషయం. రెండవ స్థాయిలోని దేవుడికి సృష్టించడం, పోషించటడం, భక్తుల్ని రక్షించడం మొదలైన గుణాలను అతనిపై మోపి మతం స్థాయిలో నిర్మించుకున్న దేవుడు. 
దేవుడికే సంబంధించిన మరొక ప్రశ్న గూర్చి తెలుసుకోవాల్సి ఉంది. మనకు ముప్పదిమూడు కోట్ల దేవుళ్లనీ, ఏ దేవుణ్ణి పూజించాలో తెలియదనీ వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి. గోవును పూజించాలని చెప్పే సందర్భంలో టీవీలలో ప్రవచనాలు చెప్పేవారు కూడా గోవు కడుపులో 33 కోట్ల దేవుళ్లు ఉన్నట్టుగా పురాణాల్ని ఉటంకించి చెబుతూంటారు. అసలు ఈ 33 అనే సంఖ్య ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఇది మనకు కొంత గజిబిజిగా అనిపించవచ్చు. కాని ఓపికగా గమనిద్దాం.
మనకు ఉపనిషత్తులు మూలగ్రంథాలు. బృహదాకరణ్యకం అనే ఉపనిషత్తు (శాకల్యబ్రాహ్మణం అనే అధ్యాయం) జనకమహారాజు సభలో జరిగిన వేదాంత చర్చను చెబుతుంది. యాజ్ఞవల్క్యుడు అనే బ్రహ్మజ్ఞానితో మిగతా పండితులందరూ దేవుడంటే ఏమిటి అనే విషయమై చర్చిస్తారు. దేవుళ్లు ఎందరు అని కూడా ఒక ప్రశ్న వస్తుంది. యాజ్ఞవల్క్యుడు వేదంలోని మాటనే ఉటంకించి దేవతలు 3,306 అంటాడు. వాళ్లందరూ ఎవరు అనే ప్రశ్నకు వారందరూ కూడా 33 రకాల దేవతల యొక్క అనేక రూపాలు అని చెబుతాడు. ఆ 33 ఎవరు అనే ప్రశ్నకు ఆరు దేవతల రూపాలు మాత్రమే అంటాడు. ఆ ఆరు ఎవరు అంటే ఇద్దరి రూపాలు మాత్రమే. అలా క్రమక్రమంగా చివరకు ఒక్క దేవుడే అనేక రూపాలలో కనిపిస్తాడని చెబుతాడు. 3,306 అనడం దేవతలు అనంత సంఖ్యలో ఉంటారు అని చెప్పడానికి మాత్రమే.
దేవతలు అనే పదానికి మనం అనుకునే అర్థం వేరు. వేదంలో ఉన్న అర్థం వేరు. దివ్‌ అనే సంస్కృత ధాతువుకి ప్రకాశించేది, చైతన్య స్వరూపమైనది అని అర్థం. ప్రకృతిలోని పృథ్వి, వాయువు, మేఘం మొదలైనవన్నీ చైతన్య స్వరూపాలే. విశ్వంలో ఉన్న జీవశక్తి మొత్తాన్ని పరిశీలిస్తే 33 దేవతలు అనేవి ముప్పై మూడు తరగతులుగా మనం చూడగల్గిన జీవశక్తులే అని తెలుసుకోగలం. అలాగే‘ కోటి ’ అనే పదానికి మనం అనుకునే అర్థం వేరు. నూరు లక్షలు అనేది ఒకానొక అర్థం మాత్రమే . ఈ సందర్భంలో కోటి అంటే తరగతి , category అని అర్థం. ప్రాణికోటి, వృక్షకోటి , జీవకోటి , శిష్యకోటి అన్నట్లుగా. ముప్పదిమూడు కోట్ల దేవతలు అనప్పుడు ముప్పది మూడు తరగతుల చైతన్య స్వరూపాలు అని అర్థం.
33 రకాలు ఏమిటి ? సృష్టిలో కొన్ని శక్తులు మనల్ని పోషిస్తాయి. కొన్ని కష్టపెడతాయి. మరికొన్ని కాలానికి సంబంధించినవి. మనల్ని పోషించి, నివసింపజేసే శక్తుల్ని వసువులు అన్నారు. ఈ కోవకు చెందినవి ఎనిమిది. విశ్వాన్ని మనం పరిశీలిస్తే ప్రాణికోటి బతకడానికి ఆధారమైన ఎనిమిది ఏవి అని గమనించగలం. అవి అగ్ని , భూమి , వాయువు, అంతరిక్షం , సూర్యుడు , చంద్రుడు , నక్షత్రాలు మొదలైనవి. కేవలం ఈ ప్రకృతి శక్తులన్నీ మనిషి జీవించడానికి అవసరం. ఇవే పరిణామం చెంది మనిషి శరీరంగానూ, ప్రాణాలుగానూ ఏర్పడ్డాయి. ప్రాణులు దేహం. ఇంద్రియాలను కలిపి microcosm గా భావిస్తే విశ్వమంతా microcosm అని భావించవచ్చు. విశ్వంలో ఉన్నదే శరీరంలోనూ ఉంది. విశ్వంలో ఉన్న పై శక్తులే తాము జీవిస్తూ ప్రాణుల్ని జీవింపచేస్తాయి కావున వీటిని వసువులు అన్నారు ( వసు అంటే సంస్కృతంలో జీవించడం అని అర్థం ).
రోదనం చేయించే ( బాధపెట్టే ) శక్తుల్ని రుద్రులు అన్నారు. రుద్రులు అంటే ఇక్కడ ఈశ్వరుడు అనే అర్థం కాదు. ఏకాదశ రుద్రులు ( పదకొండు రుద్రులు ) అని మనం మామూలుగా వింటూంటాం. ఇవి మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు, మనస్సు మొత్తం పదకొండు. మనిషి మరణించే సందర్భంలో ఈ పదకొండూ నశిస్తాయి. మన దగ్గర వాళ్లైన బంధుమిత్రులను ఏడిపిస్తాయి. అందువల్ల ఇవి రుద్రులు అని ఈ మంత్రానికి అర్థం.
మిగతా కొన్నింటిని ఆదిత్యులు అన్నారు. ఇవి పన్నెండు. పన్నెండుగురు ఆదిత్యులు ఎవరన్న ప్రశ్నపై సంవత్సరంలో ఉన్న పన్నెండు మాసాలే ఇవి అని సమాధానం. కాలం మనందరి ఆయుర్ధాయాన్నీ, కర్మఫలాన్ని మెలమెల్లగా క్షయం చేస్తూ వెళుతూంటుంది. ఆదదానం అంటే సంస్కృతంలో స్వీకరించడం అని అర్థం. మన ఆయుర్ధాయాన్ని తీసుకుంటూ పోతున్నాయి కావున వీటిని ఆదిత్యులు అన్నారు.
వసువులు 8, రుద్రులు 11, ఆదిత్యులు 12 మొత్తం కలిపితే ముప్పది ఒకటి. వీటితో పాటు ఇంద్రుడు , ప్రజాపతి అనే ఇద్దరితో కలిపి 33 అవుతుంది.
యాజ్ఞవల్క్యుడి సమాధానాలన్నీ వివిధ దృష్టి కోణాల నుంచి చెప్పిన మాటలే. విశ్వమంతా అనేక రూపాల్లో ప్రకటనమైయున్న ఒకే ఒక చైతన్యశక్తి, హిరణ్యగర్భుడు అని వ్యవహరించబడినది ఒకే దేవతాస్వరూపం అని ఉపనిషత్తు చెబుతుంది.
ఇంద్రుడు, ప్రజాపతి ఎవరు అంటే వర్షించే సమయంలో మెరపు ( వజ్రాయుధం ) ఆయుధంగా గల ఇంద్రుడు లోకరక్షణకు చిహ్నం. ప్రజాపతి అంటే యజ్ఞం అని అర్థం. యజ్ఞం అనేది వైదిక సంస్కృతిలో మనుష్యులకు, ప్రకృతిలోని శక్తులకు ఉన్న సంబంధాన్ని , పరస్పరం ఆధారపడి ఉండటాన్ని సూచిస్తుంది.
మరో దృష్టికోణం నుండి చూస్తే విశ్వమంతా అన్నము, ప్రాణము అనే రెండు శక్తులు మాత్రమే. దీన్నే ఆధునికmatter and energy అనవచ్చు. ఒకటి తినబడేది, మరొకటి తినేది. వైదికభాషలో దీన్నే అగ్ని, సోమము అన్నారు. మనం తినే అన్నమంతా సోమము. ప్రాణుల దేహాల్లో వైశ్వానరుడు అనే పేరుతో ఉన్నదే అగ్ని. మనం రోజూ భోజనం చేసేటప్పుడు ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా అంటూ ప్రాణానికి వేసే ఆహూతులే వైశ్వానరుడనే అగ్నికి వేసే ఆహుతులు . ప్రాణం యొక్క మరో రూపమే అగ్ని. ఈ విధంగా చేయడం భోజనాన్ని ఒక యజ్ఞంగా భావించడమని పెద్దలు చెబుతారు.
చివరగా ఒక్కదేవుడు ఎవరు అంటే అదే హిరణ్యగర్భుడు ( చైతన్యంలో ఏర్పడే మొదటి cosmic being ) అని యాజ్ఞవల్క్యుడంటాడు. ఆ ప్రాణశక్తి ఒక్కటే రకరకాల పేర్లతో రూపాలతో , వివిధ కర్మలతో, గుణాలతో , శక్తిభేదాలతో అనేక రూపాలు పొంది మూడురకాలుగా, 33 రకాలుగా, 3306 గా ప్రకటమవుతూంటుంది. అలాగే ముక్కోటి దేవతలు అన్నప్పుడు మూడు తరగతులుగా ప్రకటమవుతున్న జీవశక్తి అని అర్థం. ఇవే భూమికి సంబంధించిన నీరు, అగ్ని మొదలైనవి, అంతరిక్షానికి సంబంధించిన గాలి మొదలైనవి, ఆకాశానికి సంబంధించిన సూర్యుడు మొదలైనవి.
ఉపనిషత్తులో ఆ తర్వాత జరిగే సంభాషణ గమనిస్తే విశ్వంలో ఉన్న జీవశక్తి అంతా కేవలం హిరణ్యగర్భుడు మాత్రమే అని తెలియడమే కాక ఈ విశ్వమనేదే సత్యం, జ్ఞానం, అనంతం, అనబడే శుద్ధచైతన్యంలో కనిపించే ఒకానొక దృశ్యం మాత్రమే అంటూ యాజ్ఞవల్క్యుని ప్రతిపాదన నడుస్తుంది. ఇది శుద్ధవేదాంత చర్చ. ‘ ఏకం సత్‌ విప్రా : బహుధా వదన్తి ’- ‘ఉన్నది ఒకటే, పండితులు అనేక విధాలుగా వివరిస్తారు ’ అనే మాటలకు పై చర్చయే వ్యాఖ్యానం. ఆవు కడుపులో దేవుళ్లున్నట్లు చెప్పడం పురాణాల ధోరణి.
డాక్టర్‌ కె. అరవిందరావు

రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.com కు పంపండి

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

1 Response to 33 కోట్ల దేవుళ్లున్నారా?- డాక్టర్‌ కె. అరవిందరావు

  1. bnrao అంటున్నారు:

    very good explanation

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.