కృతజ్ఞత’లో ప్రతిఫలించే వ్యక్తిత్వం..
- -మార్తి వెంకటేశ్వర శాస్ర్తీ
- 13/12/2014

మ్యాజిక్
ఆంగ్ల మూలం: రోండా బర్న్
తెలుగుసేత: సత్యవతి
ప్రచురణ: 2014, వెల: రు.295/-
ప్రచురణ: మంజుల్ పబ్లిషింగ్ హౌస్ (పి.)లిమిటెడ్
2 ఫ్లోర్, ఉషాప్రీత్ కాంప్లెక్స్,
42, మాలవియనగర్,
భోపాల్- 462003.
పుస్తకానికి మ్యాజిక్ అని పేరు పెట్టారు గానీ, ఇదేమీ ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకం కాదు. ఒక రకంగా చూస్తే దీనిని వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకంగా భావించవచ్చు.
‘‘ఎవరి దగ్గరయితే ఎక్కువగా ఉంటుందో వారే మరింత ఎక్కువగా పొందుతారు. ఎవరి దగ్గర ఉండదో వారు దగ్గరున్నది కూడ పోగొట్టుకుంటారు’’ అని పవిత్ర గ్రంథం బైబిల్‌లోని మాథ్యూ సువార్తలో చెప్పబడిన దానిని కొన్ని శతాబ్దాలుగా చాలామంది సరిగా అర్థం చేసుకోలేకపోయారని రచయిత్రి తెలిపారు. ఇక్కడ చెప్పబడింది ‘సంపద’ గురించి అని ఇటీవలి వరకూ భావించారని, అయితే ‘కృతజ్ఞత’ గురించి చెప్పబడిన సంగతి ఈమధ్యనే బోధపడిందని అన్నారు.
ఈ పుస్తకం మొత్తం ‘కృతజ్ఞత’ అన్న ఒకే ఒక్క పదం చుట్టూ కేంద్రీకృతమయింది. కృతజ్ఞతాభావాన్ని జీవన శైలిలో అలవరచుకోవటానికి వీలుగా ఉండేటట్లు ఇందులో 28 అభ్యాసాలున్నాయి.
పుస్తకంలో థాంక్యూ అన్నమాట అనేకసార్లు కనిపిస్తుంది. మొక్కుబడిగా థ్యాంక్యూ అనడం వల్ల ప్రయోజనమేదీ ఉండదనీ, మనస్ఫూర్తిగా థాంక్యూ అనడం అలవరచుకోవాలనీ రచయిత్రి అన్నారు.
అంతా మనమంచికే అన్న విశ్వాసంతో సరియైన జీవన విధానం అవలంబిస్తూ మంచి ఆలోచనలుచేస్తూ కృతజ్ఞతాభావాన్ని అలవరచుకున్నప్పుడు మంచి ఫలితాలు చేతికందుతాయని రచయిత్రి స్పష్టపరిచారు.
ఇది విదేశీ రచన కాబట్టి ఇందులో దైవానుగ్రహం, పూర్వజన్మ సుకృతం వంటి పదాలు కనిపించవు. అయితే పుస్తకాన్ని ఒకటికి రెండుసార్లు చదివినప్పుడు సృష్టినీ, గ్రహగతులనూ నియంత్రిస్తున్న పరమాత్మను ఉద్దేశించి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పినట్లుగా బోధపడుతుంది. కోరికలు నెరవేరకముందే, నెరవేరినట్లు విశ్వసించి, కృతజ్ఞతలు తెలుపుకోవటం వల్ల అవి తప్పకుండా నెరవేరుతాయని రచయిత్రి ప్రకటించారు.
జాలి, కరుణ, కృతజ్ఞత వంటి మంచి భావాలను అలవరచుకోవాలనీ, ఎవరినీ నిందించటం గానీ, ద్వేషించటం గానీ చేయకూడదని, అప్పుడే అన్ని రకాల సంపదలూ అప్రయత్నంగా సిద్ధిస్తాయనీ వివరించారు.
ఎవరైనా ఏదయినా సహాయం చేసినప్పుడు కృతజ్ఞతలు చెప్పటం సహజంగా అందరూ చేసేదే. ప్రకృతిలో మనకు తోడ్పడే వాటికి కూడా థాంక్స్ చెప్పాలంటారు రచయిత్రి. మనం తినే ఆహారానికి, తాగే నీటికి, పీల్చే గాలికి కూడా మనం కృతజ్ఞతలు తెలపాలన్నారు. (పే.90)
మనం ఆతృతగా ఎదురుచూస్తున్న డబ్బు సరియైన సమయానికి చేతికందటం గానీ, అనుకోని పరిస్థితులలో ఎవరో కొత్త వ్యక్తి తటస్థపడి తగిన సహాయం చెయ్యటంగానీ జరిగినప్పుడు దానిని అదృష్టం అనో లేక కాకతాళీయంగా జరిగిందనో భావిస్తుంటామనీ- అయితే అటువంటి సందర్భాల వెనుక ఒక సార్వజనీనమైన సత్యం ఉంటుందని రచయిత్రి అభిప్రాయపడ్డారు. (పే.159)
‘మానవులలో ఉండే మంచి లక్షణాలలో తప్పులు చెయ్యటం కూడా ఒకటి. అయితే అందులోనుంచి సరయిన పాఠం మనం నేర్చుకోవాలి’ అని చెప్తూ దీనిని ఉదాహరణలతో ఆసక్తికరంగా 26వ అభ్యాసంలో తెలిపారు.
ఫిర్యాదులు చెయ్యటం, ప్రతికూల ఆలోచనలు చెయ్యటం వంటివి మానెయ్యటానికి కొన్ని సూత్రాలను 7వ రోజు అభ్యాసంలో ఇచ్చారు.
పుస్తకంలోని 28 అభ్యాసాలను రోజుకొకటి చొప్పున ఆచరణలో పెట్టటానికి వీలుగా రూపొందించారు.
‘ఉదయం లేస్తూనే నేలమీద కాలు మోపి భూమికి కృతజ్ఞతలు చెప్పండి’ అని చెప్తూ ఇంకా ఏయే వస్తువులకు థ్యాంక్స్ చెప్పాలో 11వ అభ్యాసంలో తెలిపారు. బాత్‌రూములో అద్దానికి, తొడుక్కునే బట్టలకు, కాళ్లకు వేసుకునే పాదరక్షలకూ థ్యాంక్స్ చెప్పాలన్నారు. ప్రతి వస్తువులోనూ చైతన్యం ఉంటుందని భగవాన్ రమణమహర్షి చెప్పిన సంగతి మనకు తెలిసిందే.
నిత్య జీవితంలో తటస్థపడే అనేకమందికి ‘్థ్యంక్యూ’ అనాలని వివరించారు. ఈ పుస్తకంలోని విషయాలన్నీ తన అనుభవంలో చేసి చూశానని, అద్భుతమైన ఫలితాలు సాధించానని రచయిత్రి తెలిపారు. తన బంధుమిత్రులలో అనేకమందికి కూడా చక్కటి ఫలితాలు రావటం చూశాకనే ఈ పుస్తకం ప్రకటించినట్లు తెలిపారు. మీరు ఎంతోకాలం కలలుకన్నవన్నీ హఠాత్తుగా మీకు అందవచ్చు. అవలా సాధ్యం కావటానికి ఏయే శక్తులు సహకరించాయో మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే అద్భుతాలన్నీ అదృశ్యసీమలలోనే జరుగుతాయి’’అని రచయిత్రి అన్నారు. (పేజి 3).
అనువాదం బాగుంది. పుస్తకంలోని అంశాలూ బాగున్నాయి.
అక్షరాలను తడిపిన ‘బహుముఖ వర్షం’
- -మానాపురం రాజా చంద్రశేఖర్
- 13/12/2014

బహుముఖ వర్షం
యక్కలూరి వై.శ్రీరాములు
వెల: రూ.60/-
ప్రతులకు:
కౌండిన్య పబ్లిషర్స్,
15/140, పి అండ్ టి కాలనీ,
దిల్‌సుఖ్‌నగర్,
హైదరాబాద్- 500 060
ఫోన్: 9866171648
భావుకతను ప్రాణవాయువుగా చేసుకుని శ్వాసిస్తున్న యువకలాల్లో కవి యక్కలూరి వై.శ్రీరాములుగారిది ఒక ప్రత్యేకశైలి. పలు రకాల అనుభూతుల్ని వర్షంరూపంలో పలవరిస్తూ కవిత్వంగా కలవరించడం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నం ఆయన రాసిన ‘బహుముఖ వర్షం’లో ప్రతిఫలిస్తుంది.
‘‘అనుభూతుల మేఘాలనుండి రాలిన
చినుకుల పలుకులతో
వేనవేల వాక్యాల రంగుదారాలు పేనుతూ
ధారగా సాగుతూ/ పుడమి పుటలపై
పంచరంగుల పూల కవితల్ని
అల్లుతున్న వాన’’ అని విశే్లషించి చెప్పడంలో -్యళఆజష ఉనఔళఒఒజ్యశ బయటపడుతుంది. ఈ ముప్పేట అల్లికలో వర్షపు చిక్కదనం చినుకుల సవ్వడితో కవిత్వపు చక్కదనంగా మారిపోతుంది. భావధార రంగురంగుల పూల దారాల కవితల్ని అల్లుతుంది. కాబట్టే వచనానికీ కవిత్వానికి మధ్య దాగిన అడ్డుపొర చిరిగి చినుకుల స్పర్శకు చిత్తడిగా రూపాంతరం చెందుతుంది.
‘‘రాత్రి వచ్చిన వానలో తడుస్తూ
నా కవితలోంచి ఎగిరి వచ్చిన అక్షరాలే
చెట్టు కొమ్మపై/ వాలిన పక్షులయ్యాయి’’ అంటూ అక్షరాల్ని, పక్షులుగా మలిచిన తీరు శ్రీరాములుగారి కవితాదృష్టికి అద్దంపడుతుంది. మామూలు వానకి సాహిత్యపు వానకి తారతమ్యం కొట్టొచ్చినట్టు రూపుకట్టేది ఈ దృశ్యవీక్షణంలోనే! అనుభూతి పరాకాష్ట దశకు చేరుకున్నపుడే ఇది సాధ్యపడుతుంది.
‘వాన నడక వయ్యారం’ కవితలో-
‘‘ఎండిన మట్టిపెంకుల పెళ్ళలతో
నిండిన చెఱువుగట్టుపై నిలబడి
కన్నీరైన మా వూరికి/ నేనో మంచి నీటి సముద్రాన్నవుతాను’’ అని చెబుతుంటే… ధ్వని ప్రధానమైన సమస్యకేదో పరిష్కారమార్గాన్ని కనుక్కొని కవితా పాదాల రూపంలో పరుస్తున్నట్టు అనిపిస్తుంది. పాదరసం లాంటి చురుకైన మనసు గాలికంటే వేగంగా పరుగెత్తి మదిలోతుల్లో మిగిలిపోయిన వెనుకటి దృశ్యానికి ఇక్కడ అక్షరరూపం ఇవ్వగలిగింది. ఇదే దీనికి అదనపు ప్రయోజనం. ఈ ఒడుపును అందిపుచ్చుకునేదే అసలైన కవిత్వం. ఈ లక్షణం శ్రీరాములుగారిలో అడుగడుగునా కనిపిస్తుంది.
ఇంకోచోట అంతర్ముఖత్వంతో కవి ఇలా ప్రవహిస్తారు.
‘స్వప్నచలన వర్షం’ శీర్షికలో…
‘‘కడలినై పైకెగరి/ మేఘమై ఊగి/ చినుకై రాలి
నదై సాగి/ మీలో నేనై/ నాలో మీరై
నాలోనేను ప్రవహించాలని వుంది’’
తాదాత్మ్యం చెందిన ఒకానొక స్థితిలో చైతన్యస్వరం కవితాస్వరమై క్షణాల మధ్య ప్రవహిస్తుంది. దీని తీవ్రతను ఒడిసిపట్టుకోవడం ఎవరితరమూ కాదు. జ్వలన స్వభావాన్ని కలిగి, చలనగీతాన్ని ఆలపించి, పురోగమన దిశలో ముందుకు దూసుకుపోతుంది. ఇది హృదయ కవిత్వానికి ప్రతిబింబం. నిలువెత్తు దృశ్యసమాహారానికి అక్షరరూపం. కాబట్టి ప్రవాహం అంతర్ముఖత్వమైంది.
మొత్తంమీద చూస్తే ఈ బహుముఖ వర్షంలో తడిసిన పద్య పాదాలు కవిత్వ చరణాలై హొయలుహొయలుగా వంకలుతిరిగి అనేక వయ్యారాలు పోయాయి. ఈ తపనను అనేక సందర్భాల్లోంచి ఏరుకుని ఒకచోట కుప్పబోశారు శ్రీరాములుగారు. అలాంటి విరుపులని మెరుపుల రూపంలో ఒక్కసారి తనివితీరా తడిమి కళ్ళతో పొదివి పట్టుకునే ప్రయత్నం చేద్దాం.
‘‘పిడికిళ్ళ నిండా మేఘాల్ని నింపుకున్న ఆకాశం/ చినుకుల విత్తనాల్ని నేలపై చల్లుతోంది’’ అంటారు. ‘‘వాన పాటకు మేఘపు పైటవేసి/ నదిలో నావగా వదులుతాను’’ అని అంటారు ఇంకోచోట. ‘‘చినుకుల జీవాక్షరాల్ని/ పలుకుల బీజాక్షరాలుగా మలిచి/ మనిషి నాలుకపై లిఖిస్తుంది’’అని చెప్పడం మరో ఎత్తుగడ. ‘‘మట్టికి విత్తనానికి/ పెళ్ళిచేసే అక్షింతలు కదా/ ఈ వాన చినుకులు’’ అంటూ వేరొక శిల్ప నిర్మాణాన్ని ప్రదర్శిస్తారు. వానని ప్రస్తావిస్తూ… ‘‘వానంటే/ మన్నూ, మిన్నూ కలిపే కరచాలనం/ వానంటే/ నిన్నూనన్నూ నిలిపే జీవజాలం’’ అంటారు కవి యక్కలూరి వై.శ్రీరాములు.
ఇలా చెప్పుకుంటూ పోతున్నపుడు… వాస్తవాన్ని వాస్తవంగా
వెలుగు సూర్యుడిగాను/ శ్రద్ధ సహనంగాను
పరిణామం చెందటమే పరమార్థం’’ అనటంలో చాలా దూరదృష్టి కనబడుతుంది. లోచూపునకు పదునుపెడుతుంది. లోపభూయిష్టమైన వ్యవస్థను ఎత్తిచూపుతుంది. అక్షర లక్షల విలువచేసే సారాన్ని, జీవన సారాంశంగా తెలియజేస్తుంది. శిల్పపరమైన ఈ ఎత్తుగడ ఒక పరిణామ దశకు కొనసాగింపుగా వెలుగునీడగా పరుచుకుంటుంది.
కాలం గోరంతల్ని కొండంతల్నిచేస్తే, సామాజిక వ్యవస్థ ఆధునిక జీవన దృశ్యాల్ని బతుకు భూతద్దంలోంచి చూపించి యాంత్రికతను బయటపెడుతుంది. అలా నలిగి, రాటుదేలి, మొనదేరిన చైతన్య శీలత్వమే కవి వీరభద్రాచారిగారు మననుండి ఆశించేది. ఆ ఆశ తీరాలంటే నవనవోనే్మషమైన, నిశ్చల నిర్మలాకృతి మయమైన వర్తమాన సంక్షుభిత జీవన వాస్తవికతను కళ్ళకు కట్టించే ప్రయత్నంచెయ్యాలి. ఆ నమ్మకం కార్యరూపం దాల్చాలంటే ఈ వాక్యాల తడుములాటలోని భావచైతన్యాన్ని అందిపుచ్చుకోవాలి. అప్పుడే ఈ ‘దర్పణం’లోని అంతర్మథనాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అలాంటి దిశగా ఆశావహ దృక్పథంతో అక్షరానుభవాల వెంట పరుగులుతీద్దాం.