గీర్వాణ కవుల కవితా గీర్వాణం -87
130-షేక్స్ పియర్ నాటక కధలు సంస్కృతం లో రాసిన –మేడేపల్లి వెంకట రమణాచార్యులు
పండిత వంశం
మేడేపల్లి వెంకట రమణాచార్యులు గోల్కొండ వ్యాపారి బ్రాహ్మణులు .వైష్ణవ మతావలంబులైన ఆచార్యులు .ప్రపత్తి ప్రవరుణులు .ఊరట్ల జమీందారు లైన సాగి వారి ఆస్థానం పండితులైన వీరి వంశం లో తాతరామాచార్యులగారి కమారుడు రఘునాధ దాసు వీరి తండ్రి గారు . అనకా పల్లి లో 1862లో జన్మించారు ..వీరి మూడవ ఏట తండ్రి ఉద్యోగం కోసం విజయ నగరం చేరారు .
తపో నిష్ట తో సర్వం స్వాధీనం
ఆచార్యులవారు తండ్రి వద్దనే పంచాకావ్యాలను చదువుకొన్నారు .విజయ నగరం మహా రాజా వారి హైస్కూల్ లో విద్య నార్జించి 1877లో మెట్రిక్ పాసైనారు .కూరెళ్ళ సూర్య నారాయణ శాస్త్రి గారి వద్ద ‘’కౌముది ‘’,’’కాళికా వ్రుత్తి ,’’తర్క ప్రకరణలు ‘’ అభ్యసించారు .సంస్కృత భాషలో గొప్ప పాండిత్యాన్ని సాధించారు .కాలేజీ లో గుమాస్తాగా ఉద్యోగించారు .రమణాచార్యులు నిత్య తపో నిస్టాపరులు .దీనితో వారికి అలవడని విద్య లేకుండా పోయింది .అన్నిటా అసాధారణ మేధస్సు అలవడింది .
విద్వద్ శిరోమణి ముడుంబై నరసింహా చార్యుల గారి శిష్యులై ,వేదాంత విద్యనూ ,వారి తమ్ముడు వరాహ స్వామి వద్ద’’ ద్రావిడ ఆమ్నాయం ‘’నేర్చారు .1891లో రాజావారి కళాశాలలో సంస్కృత ఉపాధ్యాయులుగా చేరి 1935వరకు నలభై అయిదేళ్ళ సుదీర్ఘ కాలం పని చేశారు .ఆంగ్ల భాషా పాండిత్యమూ ఉండటం తో ఆచార్యుల వారు తులనాత్మక భాషా శాస్త్రం ను ,(కంపారటివ్ ఫైలాలజి ),సంస్కృత భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసి అపార విద్వత్తు సాదించుకొన్నారు వీటిని బోధించటం లో వీరి నేర్పు అమోఘం గా ఉండేదని ప్రశంసలు పొందారు .
చతుర్భాషా కవితాచార్యం
ఆచార్యుల వారి ఆంద్ర భాషా వైడుష్యమూ చిన్న నాటి నుండే అలవడింది .విద్వత్ కవిఅయిన మహారాజా వారి ఆస్థానం లో ఉండటం బాగా కలిసి వచ్చింది .రాజావారు ‘’సతతము సంతస మొసంగు సత్య వ్రతికిన్ ‘’అనే మకుటం ఇచ్చి ఆస్థాన కవులను శతకం రాయమని కోరారు .వాటిలో ఆచార్యుల వారు రాసిన ‘’’’సత్య వతీ శతకం ‘’ఉత్క్రుస్ట కావ్యం గా ఎన్నికై మంచి కీర్తిని తెచ్చి పెట్టింది .ఆచార్యుల వారి తొలిరచనే ఇది .దీనికి ప్రశస్తి రావటం ముదావహమైన విషయం .
‘’నమ్మాళ్వార్ల గాదా సహస్ర మైన ‘’’’తిరు మొళి’’ని పద్యాలుగా ఆంధ్రీకరణం చేసి తన ఉభయ భాషా పటిమను నిరూపించుకొన్నారు .ఈ పద్యాలకే ‘’ఆంధ్రా గీర్వాణ శట కోప సహస్రం’’పేరుతొ సంస్కృత శ్లోకాలు రాసి ప్రచురించారు .’’దేవ వ్రత చరిత్ర ‘’ఆంద్ర కావ్యాన్ని ప్రౌఢ ప్రబంధ శైలిలో రచించి విద్వత్తును ప్రకటించారు .’’నాలాయిరం ‘’అనే నాలుగు వేల ద్రావిడ భాషా గాధలను తెలుగు పద్యాలుగా మలచారు .
పార్ధ సారధి శతకం ,శ్రీ కృష్ణ చరిత్ర ‘’గద్య ,,’ ఆంద్ర సేతు బంధ మహాకావ్యం ,’’ఆంద్ర హర్ష చరిత్ర ‘’గద్యం రాశారు .అన్నిటికన్నా బాగా అందరినీ ఆకర్షించినది ఆచార్యుల వారు ఆంగ్ల మహా కవి షేక్స్ పియర్ రాసిన చారిత్రాత్మక మైన అద్భుత నాటకాల కధలను సంస్కృతం లో రచించటం .ఎవరూ చేబట్టని గొప్ప ప్రక్రియ .ఇవికాక తెలుగులో ‘’ప్రాకృత భాషోత్పత్తి ‘’,’’నిఘంటు చరిత్ర ‘’,,’’పాండురంగ మహత్మ్య విమర్శనం ‘’,ఆర్ష భాగా విభాగం ‘’,’’అలంకార శాస్త్ర చరిత్ర ‘’అనే అపూర్వ గ్రంధాలను రచించి భాషా శాస్త్రం లో తనకున్న పట్టు ను నిరూపించుకొన్నారు .ముప్ఫై రెండు ఉపనిషద్ విద్యలకు తెలుగులో విస్పష్ట విపుల వ్యాఖ్యానం రాసి చరితార్దులయ్యారు ఆచార్యుల వారు .జీవితాంతం గ్రంధ పఠనం ,గ్రంధ రచనలతోనే కాలక్షేపం చేసిన మహా విద్వద్ వరేన్యులు శ్రీ మేడే పల్లి వెంకట రామణాచార్యుల వారు ఎనభై ఒక్క సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యం గా జీవించి 1943 లో వేంకట రమణ ధామం చేరుకొన్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-14-ఉయ్యూరు