గీర్వాణ కవుల కవితా గీర్వాణం- 89 – 132-క్రోడ పత్ర రచయిత-గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- 89

132-క్రోడ పత్ర రచయిత-గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి

ఏదైనా ఒక శాస్త్రం మీద రాసిన సంగ్రహ విమర్శను ‘’క్రోడ పత్రం ‘’అంటారు .గుమ్మలూరి  సంగమేశ్వర శాస్త్రి గారు రాసిన క్రోడపత్రాలు నేటికీ తర్క శాస్త్రాధ్యయనం చేసే వారికి కరదీపికలుగా నిలిచాయి .అంతటి ధిషణ శాస్త్రి గారిది .తర్కాన్ని తక్రం (మజ్జిగ  )తాగినట్లు అలవోకగా నేర్చి నేర్పిన విదుషీ మణి.

జననం –విద్య

శాస్త్రిగారు బొబ్బిలి తాలూకా గంగన్న పాడు గ్రామం లో గుమ్మలూరి లక్ష్మీనారాయణ ,వెంకమాంబ దంపతులకు 1863లో జన్మించారు .బొబ్బిలి ఆస్థాన పండితులైన మండపాక పార్వతీశ్వర కవి వద్ద సంస్కృత కావ్యాధ్యయనం చేశారు .సుసర్ల సీతా రామ శాస్త్రి గారి దగ్గర తర్క శాస్త్రం చదువుకొన్నారు .శ్రీపాద రామ శాస్త్రి గారి నుండి న్యాయ శాస్త్రాన్ని మధించారు .ఇప్పటికే వీరి కీర్తి చంద్రికలు దశ దిశలా వ్యాపించాయి .

నేర్చుకోవాలన్న తపన మాత్రం శాస్త్రి గారిని వదిలి పెట్టలేదు .విజయనగరం చేరి భీమాచార్యుల వారి వద్ద ,కాశీ వెళ్లి ప్రఖ్యాత పండితుల వద్ద తాను నేర్చిన పాండిత్యానికి మెరుగులు దిద్దుకొన్నారు .స్వగ్రామం చేరారు .అప్పటికే శాస్త్రి గారి బహుముఖీన ప్రజ్ఞ లోకం లో విశదమై దాదాపు ఎనభై మంది శిష్యులు గా చేరి విద్య నేర్చారు .వీరందరికీ గురుకుల వాసం లో వసతి ,భోజనాలు కల్పించి విద్యా బోధనా చేయాలి .అప్పుడే పశ్చమ గోదావరిజిల్లా కాకర పర్రు గ్రామస్తులు శాస్త్రిగారిని శిష్య సమేతం గా తమ గ్రామం వచ్చి ఉండమని విన్నవించుకొన్నారు .వారి అభ్యర్ధన మేరకు అక్కడికి చేరుకొన్నారు .మూడున్నర ఏళ్ళు గ్రామస్తులిచ్చిన సహకారం తో కాకర పర్రులోనే ఉంది శిష్యులకు విద్యాదానం చేశారు.

ఉద్యోగ వ్యాసంగం

1898లో విజయ నగరం మహారాజా ఆనంద గజ పతి గారు శాస్త్రి గారిని ఆహ్వానింఛి తమ సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా నియమించి గౌరవించారు .శాస్త్రి గారి శాస్త్ర వాదనా పటిమ ముందు యెంత కొమ్ములు తిరిగిన పండితుడైనా బోల్తా కొట్టాల్సిందే .అంత ఉద్దండ పండితులు సంగమేశ్వర శాస్త్రి గారు .1921లో మధ్వస్వామి  ‘నైయాయిక మహా సభ నిర్వహించారు .శాస్త్రి గారు పాల్గొని ,తన నిరుపమాన వాదనా సామర్ధ్యం తో అందరినీ చకితులను చేసి మధ్వ స్వామి వారి మెప్పు పొంది ఘనంగా సత్కరింప  బడ్డారు  నవద్వీపం వెళ్లి అక్కడి తర్క శాస్త్ర మేధావులను మెప్పించి  మురిపించి ప్రశంసా పత్రాలను అందుకొన్నారు .

పాశ్చాత్య ప్రశంస

భారతీయ పండితులే కాదు పాశ్చాత్య పండితులు కూడా శాస్త్రిగారి వాదనా నైపుణ్యానికి అబ్బుర పడేవారు .వారి వైదుష్యానికి జోహార్లు పలికారు .అలాంటి వారిలో ‘’జాన్సన్ అనే జర్మనీ పండితుడు ‘’శాస్త్రిగారి శాస్త్ర సామర్ధ్యానికి ముగ్ధుడై ఆయన వద్ద చేరి శాస్త్ర రహస్యాలను ఆకళింపు చేసుకొనేవాడు .దీనితో శాస్త్రి గారి కీర్తి దేశం లోనే కాక విదేశాలలోనూ మారు మోగిపోయింది .పాశ్చాత్యులు మెచ్చి శాస్త్రిగారికి గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేశారు .

క్రోడ పత్ర క్రోడీకరణ

శాస్త్రిగారు పిఠాపురం ,ఉర్లాం సంస్థానాలలో తర్క శాస్త్ర పరీక్షాదికారిగా ఉన్నారు .సంగమేశ్వర శాస్త్రి గారి పేరు వినగానే అందరికి వీరి ‘’క్రోడ పత్రాలు ‘’చప్పున జ్ఞాపకానికి వస్తాయి .శాస్త్రి గారు రాసిన ‘’మాధురీ పంచ లక్షణీ క్రోడపత్రాలను 1933 లో మైసూరు ప్రభుత్వం ముద్రించి గౌరవిస్తే ,’’జగదీశ్వర సిద్ధాంత లక్షణ క్రోడపత్రం ‘’ను ఆంద్ర విశ్వ కళాపరిషత్తు ప్రచురించి  గౌరవించింది .తర్క శాస్త్రం చదివే మన దేశ పండిత విద్యార్ధులకు శాస్త్రిగారి క్రోడపత్రాలు కరదీపికలు .యాభై సంవత్సరాలు మాత్రమె జీవించిన ఈ తర్క న్యాయ శాస్త్ర మహా విద్వాంసుడు గుమ్మలూరి సంగ మేశ్వర శాస్త్రి గారు 1913లో శివైక్య మయ్యారు .

133-శంకరాద్వైత నిష్ణాతులు –చదల వాడ సుందర రామ శాస్త్రి

ఆంద్ర దేశం లో వావిళ్ళ రామ స్వామి అండ్ సన్స్ ప్రెస్ ప్రఖ్యాతి చెందింది .దీని స్థాపకులే వావిళ్ళ రామ స్వామి శాస్త్రిగారు .వీరు సంస్కృతాంధ్రాలలో అరుదైన పుస్తకాలన్నీ సేకరించి పరిష్కరించి ప్రచురించారు .పుస్తక ముద్రణకు ఒక ‘’హాల్ మార్కు ‘’రామ స్వామి శాస్త్రి గారు .వీరి అల్లుడే చదల వాడ సుందర రామ శాస్త్రి గారు .1840 లో జన్మించారు .రామ శాస్త్రిగారు సంస్కృతాంధ్రాలలో దిట్ట .పందొమ్మిదవ శతాబ్దపు ప్రసిద్ధ పండితులలో ఒకరుగా గుర్తింపు పొందారు శంకరాద్వైతం లో నిష్ణాతులు .సంస్కృతం లో స్రగ్ధరా వృత్తం లో ‘’ఆదిత్య స్తవం ‘’అనే శతకం రచించారు .ఇది మయూరుడు సంస్కృతం లో రాసిన సూర్య శతకానికి దీటుగా ఉందని పండితులు ప్రశంసించారు .భగవద్గీతా భాష్యాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ,పరిశీలించి ,పరిశోధించి ,’’ఆనంద చంద్రిక ‘’అనే వ్యాఖ్యానం తో ఆరు సంపుటాలు ప్రచురించారు .వాల్మీకి మహర్షి రాచిన శ్రీ మద్రామాయణానికి ప్రతి పద ,టీకా తాత్పర్యాలు రాసి 15 సంపుటాలుగా ముద్రించారు మామగారు మరణించిన తర్వాత వావిళ్ళ వారి ప్రెస్ బాధ్యతలను చేబట్టి పుస్తక ప్రచురణను కొన సాగించారు ..డెబ్భై అయిదేళ్ళు జీవించి 1925 లో మరణించారు .

 

134-కులపతి –కప్ప గంతుల సుబ్రహ్మణ్య శాస్త్ర్తి

బాల్యం –విద్యాభ్యాసం

1911లో పశ్చిమ గోదావరిజిల్లా నిడమర్రు మండలం ‘’చిన నిండ్ర కొలను ‘’గ్రామం (ఫత్తేపురం )లో పోతుకూచి వారి కన్నాపురం అగ్రహారం లో వేదం శాస్త్ర పారంగతులు కప్పగంతుల  కామావధానులు ,మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .తండ్రి వద్దే వేదాధ్యయనం చేశారు .పిసుపాటి రామ చంద్రయ్య గారి దగ్గర ఆంద్ర ,ఆంగ్ల హిందీలను నేర్చుకొన్నారు .గుంటూరులో ప్రతాప కృష్ణ మూర్తి శాస్త్రి గారి దగ్గర సాహిత్యం చదివారు .కంభం పాటి రామ మూర్తి ,అభినవ విద్యా రణ్య ,పద్మ విభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి ,బాలవ్యాస వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారల  నుండి ‘’భాష్యంత వ్యాకరణం‘’ఆసాంతం నేర్చుకొన్నారు .బ్రహ్మశ్రీ మండలీకా వెంకట రామ శాస్త్రి గారి శిష్యులై వేదాంత ,న్యాయ శాస్త్రాలను ,సంపూర్ణం గా గ్రహించారు .చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారి వద్ద ‘’కావ్యజ్న శిక్షా భ్యాసం ‘’చేశారు .

ప్రతిభా సుబ్రహ్మణ్యీయం

సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మహా వక్త .వారి వాగ్ధాటి అమోఘం .కాళిదాస శ్రీ  హర్షాది  కవుల సౌందర్య ప్రతిభపై ఎన్నో ప్రసంగాలు చేశారు వ్యాకరణ శాస్త్ర గాంభీర్యాన్ని గూర్చి ,సంస్కృత సాహిత్య లోతులపైనా ,వేదం శాస్త్ర విషయాల గురించి ,వేదాంత శాస్త్ర రహస్యాలపైనా పలు ప్రసంగాలు చేసి శ్రోతలను ఆకట్టుకొనే వారు .పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరు లో స్తిరపడ్డారు

సంస్కృత విద్యాలయ ప్రారంభం

ఏలూరు లో  గుండు కృష్ణ మూర్తి ,సోమంచి లింగయ్య ,సభాపతి వంటి వారి సహాయ సహకారాలతో పవరుపేట లో ‘’హేలాపురి సంస్కృత పాఠశాల ‘’ను 4-3-1943 నస్థాపించి ప్రాచీన సంప్రదాయ విధానం లో విద్యార్ధులకు సాహిత్య ,వ్యాకరణ ,వేదాంత శాస్త్రాలు బోధించేవారు .విద్యార్ధులకు ఉచిత భోజన వసతి ,ప్రతిభా వంతులైన వారికి ఉపకార వేతనాలు కల్పించి ప్రోత్సహించారు .శాస్త్రి గారు ఈ విద్యాలయానికి ‘’కుల పతి ‘’గా వ్యవహరించేవారు .విద్యా ప్రవీణ భాషా ప్రవీణ  హిందీ  బి ఏ .పరీక్షలకు విద్యార్ధులకు శిక్షణ నిచ్చేవారు ఉపాధి అవకాశాలున్న విద్యలనూ నేర్పించేవారు .                     శిష్య మహానుభావులు

పెదముత్తేవి  ముముక్షు పీఠాదిపతులు .శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రులు ,ప్రసిద్ధ సంస్కృత కవి పండితులు ఏలూరు పాటి అనంతరామయ్య ,మానాప్రగడ శేష సాయి ,సూరి భోగేశ్వర శాస్త్రి ,కప్పగంతుల వీర భద్ర శాస్త్రి ,శ్రీమాన్ రొంపి చర్ల శ్రీనివాసా చార్యులు ,మొదలైన ఉద్దండ శాస్త్ర పండితులందరూ ఈ పాఠశాలలో చదివి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శిష్యరికం చేసిన వారే .ఆ నాటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ పి.ఎల్.శివరాం ,ఈవిద్యాలయం లోనే చదివి ,శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యాయం చేశారు .ఈ సంస్కృత విద్యాలయాన్ని రాష్ట్రం లోనే ప్రామాణిక మైన విద్యా సంస్థగా శాస్త్రి గారు తీర్చి దిద్దారు .

ఉపన్యాస లహరి –వితరణ

శాస్త్రి గారు భారత భాగవత రామాయణ పురాణాలపై  ,వేదాంత భాష్య విచారణ పై ఎన్నో ప్రవచనాలు ,ప్రసంగాలు చేసి వచ్చే ఆదాయాన్ని విద్యాలయ విద్యార్ధుల పోషణకు ,విద్యాలయాభి వృద్ధికి విని యోగించిన ధర్మ పరాయణులు .వీరి సంస్కృత భాషా సేవకు పాండిత్యానికి కంచి కామ కోటి పీఠాది పతులు . గౌరవించి సత్కరించి ప్రశంసించారు .నిరంతర గీర్వాణ విద్యా సేవలో జన్మ చరితార్ధం చేసుకొన్నా కప్పు గంతుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 14-10-1974 న అరవై మూడవ ఏట సుబ్రహ్మణ్య సన్నిధి చేరారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-14-ఉయ్యూరు

 

 

.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.