గీర్వాణ కవుల కవితా గీర్వాణం -90
135-వ్యుత్పత్తి నిఘంటు రచయిత –తాత వెళ్లి మిఠాచార్ శేషగిరి శాస్త్రి
తమిళదేశం లో గీర్వాణ పంట
తమిళనాడు ఉత్తర ఆర్కాట్ జిల్లా తిరువత్తూరు తాలూకా లో పుదూరు ద్రావిడ కుటుంబం లో తాతవెళ్ళి మిఠాచార్ శేష గిరి శాస్త్రి 1847 లో జన్మించారు .వారిది విద్వత్ కుటుంబం .చిన్నతనం లోనే అసాధారణ ప్రతిభా ప్రదర్శనం చూపించారు .మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి లో 1871 లో పట్ట భద్రులయ్యారు .అదే కాలేజిలో సంస్కృత పండితులుగా పని చేశారు .తర్వాత 1875లో సంస్కృతాంధ్రాలలో ఏం ఏ .సాధించారు .మద్రాస్ లో మొట్టమొదటి సారిగా సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ పొందిన వ్యక్తిగా చరిత్రకెక్కారు .
ఉద్యోగ వైబోగం
విద్యాశాఖలో చేరి స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గా ,ప్రెసిడెన్సి కాలేజిలో గీర్వాణ భాషా మహోపాద్యాయులుగా సేవ చేశారు .తర్వాత మద్రాస్ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం లో ‘’క్యూరేటర్ ‘’గా చివరి వరకు పదవి నిర్వహించి చివరలో 1893 లో ‘’డాక్టర్ అవార్డ్ ‘’ను పొందారు .పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రెసిడెన్సి కాలేజి ‘’ప్రాక్తన శాఖాధ్యక్షులు’’ గా కొనసాగారు .సంస్కృత ,తమిళ భాషలకు ఫైలాలజికి ,మరాఠీ భాష కు ఎన్నో సంవత్సరాలు పరీక్షకులుగా ఉన్నారు .
బహుభాషలలో భాషా సేవ
శాస్త్రిగారు విస్తృత పరిశోధకులు .తులనాత్మక పరిశోధనలు చేసిన భాషాభిమాని .’’ఆంద్ర శబ్ద తత్త్వం ‘’అనే రెండు భాగాలతెలుగులో ఉద్గ్రంధం రాశారు .’’తమిళ శబ్ద తత్త్వం ‘’ఆనే తమిళ భాషలో గ్రంధం రచించారు .’’ఆంద్ర భాషా తత్వ పరిశీలనం ‘’అనే ప్రధమ భాగాన్ని ఇంగ్లీష్ లో రాశారు .’’తమిళ సారస్వత చరిత్ర ‘’ను ఆంగ్లం లో వెలయింప జేశారు .‘’అర్దానుసార తత్త్వం ‘’ తెలుగు గ్రంధమూ రాశారు .
శేషగిరి శాస్త్రి గారి వివిధ భాషా పరిశోధనకు ప్రావీణ్య నైపుణ్యాలకు మేటి ఉదాహరణలు వీరు రాసిన సంస్కృత ,ఆంద్ర ,కన్నడ ,తమిళ మళయాళ భాషలకు రాసిన ‘’ప్రత్యెక వ్యుత్పత్తి నిఘంటువులు ‘’ అనితర సాధ్యమైన కృషి ఇది అని భాషా శాస్త్ర వేత్తలు బహుదా ప్రస్తుతించారు శాస్త్రిగారిని .కాని ఇవి పూర్తీ గా రాయకుండానే శాస్త్రి గారు మరణించటం ఆ భాషలు చేసుకొన్న దురదృష్టం .యాభై నాలుగేళ్ళు మాత్రమె జీవించి ఇంతటి భాషా సంపదను భాషలకు అందజేసిన శేష గిరి శాస్త్రిగారు 1901లో పరమ పదించారు . .
136-బాల వ్యాస ,వ్యాకరణాలంకార –వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి
విద్యార్జన
వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తూర్పు గోదావరిజిల్లా కాకినాడ తాలూకా వాజులూరులో భావనారాయణ ,కామేశ్వరమ్మ దంపతులకు1894 లొ జన్మించారు .షష్టి నాడు పుట్టారు కనుక చదువుల మేటి సుబ్రహ్మణ్యీశ్వరుని పేరు పెట్టారు .పేరు సార్ధకం చేశారు శాస్త్రిగారు. మాతామహులు రేగిళ్ళకామ శాస్త్రి గారి దగ్గార సంస్క్రుతకావ్యాలు చదివి ,పిఠాపురం చేరి పేరి పేరయ్య శాస్త్రిగారి వద్ద సిద్ధాంత కౌముది ని నేర్చారు .పితాపురాస్థాన విద్వాంసులైన వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారి సన్నిధానం లో మహా భాష్యాంతం వ్యాకరణాన్ని మంజూష తో సహా ఆపోసన పట్టారు .ఆస్థాన తర్క విద్వాంసులైన శ్రీపాద లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి శిష్యులై న్యాయ శాస్త్రాన్ని నేర్చుకొన్నారు .ఆస్థాన వేదాంత శాస్త్రజ్ఞులైన దెందుకూరి నరసింహ శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాన్ని గ్రహించారు .
విద్యాదానం
అనేక ప్రాంతాలనుండి తన వద్దకు విద్య నేర్వటానికి వచ్చిన యాభై కి పైగా విద్యార్ధులకు భోజన వసతులు ఏర్పాటు చేసి విద్య గరపారు .శిష్యులకు కావ్య నాటకాలంకారాలను వ్యాకరణాన్ని బోధించారు .1930-50మధ్య ఇరవై ఏళ్ళు పిఠాపురం లోని వీరి గృహం ఒక ఆదర్శ గురుకులం గా భాసించేది .నిత్య పాఠ ప్రవచనాలు ,ఆర్హ గ్రంధ పరిశీలనం గ్రంధ రచన చేయటం వీరి దిన క్రుత్యమైపోయింది .వీరి శిష్యులందరూ వీరి అంత పాండిత్యం సంపాదించి గురువుగారి పేరు నిలబెట్టి శాస్త్ర పాఠాలు చెప్పి శాస్త్ర విద్యా ప్రచారం చేసి ఆర్ష ధర్మాన్ని నిలబెట్టినవారే .అలాంటి వారిలో కప్పగంతుల సుబ్రహ్మణ్య శాస్త్రి ,ముళ్ళపూడి నారాయణ శాస్త్రి ,ప్రతాప హనుమచ్చాస్త్రి మొదలైన వారున్నారు .
ప్రజ్ఞా సుబ్రహ్మణ్యీయం
పిఠాపురం ప్రజల అభ్యర్ధన మేరకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ మద్రామయణాన్ని ధారావాహికం గా ప్రవచనం చేసి అందరి అభిమానాన్ని సంపాదించి ఘన సత్కారం తోబాటు గురువుగారి సమక్షం లో ‘’బాల వ్యాస ‘’బిరుదును ,గుర్తుగా బంగారు ఉంగరాన్ని తమ గురు బ్రహ్మ చేత వెలికి తోడిగించుకొన్న అదృష్ట వంతులు . .ఆంద్ర దేశం లోని విద్వాద్ లోకం వీరికి ‘’తర్క వ్యాకరణ వేదాంత కేసరి ‘’,’’మహోపాధ్యాయ ‘’గౌరవం తో సన్మానించింది .విజయ వాడ పండిత పరిషత్తు ‘’వ్యాకరణాలంకార ‘’బిరుదు నంద జేసింది .అయోధ్య సంస్కృత పత్రికాదిపతులు ‘’మహా భారత మర్మజ్న ‘’తో గౌరవించి సత్కరించారు .ఇతర రాష్ట్రాలవారు ఆహ్వానించి సన్మానించారు .
మహా గ్రంధ రచన
శాస్త్రి గారు విమర్శనా సాహిత్యం లో అందే వేసిన చేయి .వ్యాసభారతం పై వచ్చిన దుర్విమర్శలకు దీటైన సమాధానాలు చెప్పి ,భారత ప్రామాణ్యాన్ని నిరూపించి ‘’మహా భారత తత్వ కధనం ‘’అనే ఆరుభాగాల మహా గ్రంధం రచించారు .’’కర్ణోత్పత్తి ‘’గ్రంధం కూడా రాశారు .’’శ్రీ మద్రామాయణ తత్వ కధనం ‘’,రామాయణ రహస్యాల సమీక్ష ‘’అనేవి మరో రెండు ముఖ్య గ్రంధాలు రాశారు .నాస్తికత్వానికి సరైన సమాధానాలు విపులంగా రాసి ‘’ఆస్తికత్వం ‘’అనే పేరుతొ మూడు భాగాల అద్భుత రచన చేశారు .సంస్కృత భాషలో ‘’మహా భారత తత్వ దీపః ‘’అనే మహోన్నత గ్రంధం రాశారు .ఈ గ్రంధానికి ఉత్తర ప్రదేశ్ ,ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాలు పురస్కారాలు అంద జేశాయి .ఈ దేశం లోనే కాక విదేశాలలోనూ విద్వాంసుల ప్రశంసలనూ అందుకొన్న గ్రంధ రాజం ఇది .శాస్త్రిజీ అనేక పత్రికలకు వివిధ విషయాలపై ఎన్నో వ్యాసాలూ రాసి జ్ఞాన బోధ చేశారు .’’శాస్త్రి గారి వాణి ఆర్ష వాజ్మయానికి భద్ర కవచం ‘’అన్నారు విద్వాంసులు .అన్నిటా విఖ్యాత ప్రామాణికులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .ఈ విద్యా తపస్వివారణాసి వారు ఎనభై నాలుగు సంవత్సరాలు ఆరోగ్యం గా జీవించి సార్ధక జీవనం సాగించి 1979 లో ఆ వారణాసి విశ్వనాదునిలో ఐక్యంయ్యారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-14-ఉయ్యూరు