గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92
138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి
గోదావరి జిల్లా కండ్రిక అగ్రహారం లో సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సుబ్బయ్య ,బుచ్చి నరసమ్మ దంపతులకు 10-12-1897 న జన్మించారు .కృష్ణా జిల్లా చిరివాడ వాస్తవ్యులు శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారి వద్ద కావ్య ,నాటక అలంకార వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనం చేశారు .తిరుపతి ,మద్రాస్ ప్రాచ్య కళాశాలలలో చదివి శిరోమణి ,విద్వాన్, పి.ఒ.ఎల్.మొదలైన పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు .సికందరాబాద్ మహబూబ్ కాలేజి హైస్కూల్ లో ఉపాధ్యాయులుగా చేరి ముప్ఫై అయిదేళ్ళు పనిచేశారు .తర్వాత రావు బహద్దర్ వెంకట రామ రెడ్డి కాలేజిలో సంస్క్రుతోపన్యాసకులుగా 1954 నుండి ఎనిమిదేళ్ళు ఉన్నారు .
శాస్త్రి గారి భార్య అకాల మరణం చెందారు .ఈ బాధను మర్చిపోవటానికి సాహిత్య రచన ప్రారంభిం చారు .రచన అంటే వీరికి నిద్రా హారాలు గుర్తుకు రావు .అలా పని చేసి రామ రాజ భూషణుని ‘’కావ్యాలంకార సంగ్రహం ‘’కావ్యానికి సమగ్ర మైన వ్యాఖ్య రాసి సమర్ధత ను రుజూవు చేసుకొన్నారు .ఈ అపూర్వ గ్రంధం ప్రాచ్య ,పాశ్చాత్య ఆలంకారికుల పాలిటి చింతామణి , కల్ప వృక్షమే, కామ దేనువే అయింది .వీరి ‘’తత్సమ చంద్రిక ‘’వ్యాకరణ గ్రంధం వ్యాకరణ శాస్త్రం లో తలమానిక మైనది .చిన్నయ సూరి బాలవ్యాకరణానికి కూడా వ్యాఖ్యానం రాశారు .సంస్కృతాంధ్ర వ్యాకరణాలు మొత్తం చదివి అర్ధం చేసుకొని వ్యాఖ్యానించి రాసిన శాస్త్రి గారి పై రెండు గ్రంధాలు వ్యాకరణ విద్యార్ధులకు ,వ్యాకరణం బోధించే పండితులకు శిరో దార్యాలుగా నిలిచాయి .
శాస్త్రి గారు సంస్క్తుతం లో 20 కి పైగా గ్రంధాలు రచించారు .తెలుగులో 25వరకు అరుదైన పుస్తకాలు రాశారు .రెండు భాషల లోను వీరు రచించిన గ్రంధాలు మృదు మధుర శైలిలో ఉండి రసజ్నులను ఆకట్టుకొన్నాయి .వీటిలో కొన్ని ముక్తకాలు, కొన్ని ఖండకావ్యాలు ఉన్నాయి .తెలుగు నుంచి సంస్కృతం లోకి ,సంస్కృతం నుండి తెలుగు లోకి శాస్త్రి గారు తర్జుమా చేసిన గ్రందాలెన్నో ఉన్నాయి .అంటే అనువాదకులుగా శాస్త్రిగారు గొప్ప కృషి చేశారు .రచనలన్నీ శిష్ట వ్యాకరణ ప్రయోగాలతో ఉంటాయి. అందుకే వీరిని ‘’ఆ జన్మ సిద్ధ కవి ‘’అన్నారు .జాతక కధలను కొన్నిటిని ‘’జాతక కదా గుచ్చం ‘’పేరుతొ సంతరించారు .’’గోవర్ధనుడి ‘’సప్త శతీ సారం ‘’ను తెలుగు లోకి అనువాదం చేశారు . ముక్కు తిమ్మన పారిజాతాపహరణం ను ‘’భర్త్రు దానం ‘’గాను ,పోతన గారి కొన్ని భాగవత ఉపాఖ్యానాలను ‘’భాగవతాను వాదః ‘’,పింగళి సూరన కళా పూర్ణోదయ ప్రబంధాన్ని ‘’కళా పూర్ణోదయం ‘’గా సంస్కృతీకరించారు .దీని వలన తెలుగు కవుల ప్రబంధ నిర్మాణ సౌందర్యాన్ని యావద్భారత సంస్కృత పండితులకు మ్రుస్టాన్న భోజనం గా అందజేశారు .రుక్మిణీ కళ్యాణం ను ‘’కీర సందేశం ‘’గా ,రాశారు .ద్వంద్వ యుద్ధం ,ఖడ్గ తిక్కన ,వాసవ దత్త ,రేణుక విజయం వివేకానందం అనే సుప్రసిద్ధ రచనలు చేశారు .
అమృత కణాలు ,స్మరగీతి ,మొదలైన ముక్తక సంకలనాలు తెచ్చారు .’’నది మంత్రపు సిరి ‘’అనే అధిక్షేప కావ్యాన్ని రాశారు .తెలుగు లోని మను చరిత్రాది పంచ మహాకావ్య కధలను ‘’ఆంధ్ర ప్రబంధ కధలు ‘’గా రాశారు .దీనినే ‘’ఆంద్ర కావ్య కతాః’’గాను ,తెనాలి రామ కృష్ణుని కధలను ‘’ఆంద్ర దేశ హాస్య కదాః ‘’గా ను సంస్కృతం లో రాసి ఆ భాషాభిమానులకుతెలుగు రుచి చూపించి పరిచయం చేశారు .శాస్త్రి గారు ‘’కాదంబరీ పరిణయః ‘’అనే స్వతంత్ర సంస్కృత నాటకం రాశారు .స్వంత తెలుగు రచనలను సంస్కృతం లో కి అనువదించుకొన్న వారిలో సూర్య నారాయణ శాస్త్రి గారే ప్రప్రధములు .ఆ కీర్తి చిరస్మరణీయం .
వన పర్తి ,గద్వాల ,సంస్థానాధీశులు శాస్త్రి గారిని ఆహ్వానించి గౌరవించి సత్కరించారు .ప్రతి ఏటా వార్షికాలు ప్రదానం చేశారు .ఎందరో జమీన్ దారులు ,సాహిత్య సంస్థలు శాస్త్రిగారిని సన్మానించాయి .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ లో విశిష్ట సభ్యులను చేసి ప్రభుత్వం గౌరవించింది .ఖమ్మం జిల్లా ఇల్లెందువిద్వత్ సమావేశం లో ‘’విద్యా రత్న ‘’బిరుదు అందుకొన్నారు .ఆఖరి శ్వాస వరకు సాహిత్య జీవనం సాగించిన సాహిత్య్పజీవి సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారుఎనభై అయిదేళ్ళు జీవించి 14-10-1982న సరస్వతీ సన్నిధానం చేరారు .వారి లోటు సాహిత్య లోకం లో తీరనిదిగా మిగిలిపోయింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు
.
.
Pingback: గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 387-పోతన భాగవతం సంస్కృ తీకరించిన –సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి(1897