గీర్వాణ కవుల కవితా గీర్వాణం -94
139- అవధూత –శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యతి
ఆతుర సన్యాసం
ఎన్నో సంస్కృత గ్రంధాలు రచించిన సదా శివ బ్రహ్మేంద్ర యతి తమిళ దేశం లో జన్మించారు .కాలం పద్దెనిమిదవ శతాబ్దం గా భావిస్తున్నారు .జన్మ నామం శివ రామ కృష్ణుడు .కావేరీ తీరం లో ‘’తిరు విశవల్లూరు’’అనే షాహాజీ పురం లో జన్మించారు .తండ్రి మోక్షం సోమ సుందరం అవధాని , గురుకుల విద్యాభ్యాసం లో విద్య నేర్చారు .అప్పటికే వివాహమైంది .భార్య పుష్ప వతి అయిందన్న వార్తా గురుకులం లో ఉండగా మామ గారు వార్త పంపారు .గుర్వాజ్న తో ఆఘ మేఘాల మీద మామగారింటికి చేరుకొన్నారు .కాని అక్కడ ఆయనను ఎవరూ పట్టించుకో లేదు .నడిచి అంత దూరం వెళ్ళటం తో విపరీత మైన బడలిక కలిగి ఆకలి కూడా విజ్రుమ్భించింది ఎవరికీ అల్లుదిగారి అతీ గతీ పట్ట లేదు ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు .ఇది అవమానం గా ,బాధగా అని పించింది .అంతే- శివరామ కృష్ణ కు ఆ క్షణం లో సంసారం పై తీవ్ర విరక్తి కలిగింది .వెంటనే సన్య సించాడు .తురీయాశ్రమ నామమే ‘’సదాశివ బ్ర హ్మేంద్రుడు .’’ .ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కాని ఒక సంఘటనే ఆయన జీవితాన్ని మలుపు తిప్పేసింది .సంసార జంఝాటం నుంచి తప్పించింది .
కంచి వారి శిష్యరికం –యోగ సిద్ధి సాధన
ఆ నాటి కంచి కామ కోటి పీఠాదిపతిశ్రీశ్రీ పరమ శివేంద్ర సరస్వతి సన్నిధిని చేరి శిష్యులై పోయారు సదాశివ బ్రహ్మేన్ద్రులు .వారి వద్దనే విజ్ఞాన గ్రంధాలన్నీ క్షుణ్ణంగా అభ్యసించారు .నిత్యాభ్యాసం పూర్వ జన్మ సంస్కారం ,స్వంత మేధస్సు లతో అనేక యోగ శక్తులను స్వాధీనం చేసుకొన్నారు .పరిపూర్ణ సిద్ధులు అనిపించు కొన్నారు .భాగవత జడ భరతుని లాగ అవధూత గా మారిపోయారు .గురువు గారి దగ్గరకు వచ్చిన శాస్త్ర వాదులను ఎదుర్కొని గురువుగారి తరఫున తానే వాదించి గురు విజయం చేకూర్చేవారు .ఈ విషయాన్ని అసూయా గ్రస్త శిష్యులు గురువు గారికి ‘’మోశారు .’’. గురువు గారు తెలుసుకొని శిష్యుడినే మందలించి అలాంటి పని చేయవద్దన్నారు .ఆ రోజు నుండి నిరంతర మౌన మే వ్రతం గా గడిపారు .
మహిమా విభూతి
సదాశివుని మహత్తులు చాలా ప్రచారం లో ఉన్నాయి .ఒక సారి ఒక పొలం లో చేయి తలకింద దిడుగా పెట్టుకొని పడుకొంటే ఒక రైతు వచ్చి సర్వ సంగ పరిత్యాగికి దిండు కావాల్సి వచ్చిందా అని ఎద్దేవా చేశాడట .తన యోగ శక్తి రైతుకు చూపించాలన్న తపన తో చెయ్యి లేకుండానే గాలిలో తేలి పడుకొన్నారు .అదే రైతు మళ్ళీ వచ్చి ఒక్కొక్కడికి యోగి అయినా అహంకారం వదలదు అన్నాడట .అప్పుడు అర్ధమయింది తన అహంకారానికి అంతం చేయటానికి రైతు వేషం లో లో వచ్చినవాడు సాక్షాత్తు భగవంతుడే అని గ్రహిం చారు .ఏది దొరికితే అది తింటూ ఎక్కడ చోటు దొరికితే అక్కడే ఉంటూ పరమ హంస లా అవధూత లాగా సంచరించారు .శిష్యుడు పొందిన ఉన్నత యోగ స్థితిని గుర్తించి తాను ఆ ఉన్నతదశను అందుకోలేక పోయానని బాధ పడే వారట .పుదుక్కొట రాజు తొండర మాన్ కు దక్షిణా మూర్తి మంత్రోపదేశం చేసినట్లు కనపడుతోంది .తంజావూర్ లో పున్ననల్లూర్ మరియమ్మ ,దేవ దాన పట్టిలో కామాక్షీ దేవాలయం ,తంజావూరులో నాలుకాల్ మండపం లో వెంకటేశ్వర దేవాలయం లో హనుమాన్ విగ్రహం ప్రతిస్టించ టానికి ప్రోత్సహించారు .కుంభ కోణం లో తిరు రాఘ వెండ్ర రాహు స్థలం లో వెంకటేశ్వర దేవాలయం లో మహా మహిమాన్విత గణపతి యంత్రాన్ని ప్రతిష్టించి అక్కడ గణపతిని ప్రతిష్టచేసి దేవాలయం కట్టించారు .
బ్రహ్మేంద్ర యతి సాహిత్య వైభవం
జీవిత చరమాకం లో అవధూత గారు ‘’నేరూరు ‘’లో ఉండిపోయారు .తాను మిధున మాసం లో శుద్ధ దశమి రోజున ముక్తి పొందుతానని ,ఆ రోజే కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు ‘’బాణ లింగాన్ని ‘’తెస్తాడని ,దాన్ని తమ సమాధిపై ప్రతిస్టించమని శిష్యులకు ముందే చెప్పారు .వారు అన్నట్లే ఖచ్చితం గా జరిగింది. ప్రతి ఏడాది ఆ తిది నాడు బ్రహ్మాండమైన ఉత్సవం నిర్వ హిస్తారు .
సదాశివేంద్ర యతి రచించిన పుస్తకాలు అనేకం ఉన్నాయి .బ్రహ్మ సూత్రాలపై ‘’బ్రహ్మ తత్వ ప్రకాశిక ‘’,వ్యాఖ్యానం ,’’యోగ సుధాకరం ‘’,అని పతంజలి సూత్రాలకు వ్యాఖ్యానం ,’’సిద్ధాంత వల్లి ,’’కేసర వల్లి ,అనే రెండు గ్రంధాలను అప్పయ్య దీక్షితుల సిద్ధాంతాలకు సంగ్రహ రూపాలుగా రాశారు .’’నవ మణి మాల ‘’,ఆత్మాను సంధానం ,స్వప్నోదితం ,స్వాను భూతి ప్రకాశిక, ఆత్మ విద్యా విలాసం ,రాశారు ఇవి కాక ద్వాదశోప షత్తులపై వ్యాఖ్యానాలు రచించారు .పురాణాలలో ఉన్నఅపూర్వ అద్వైత వేదాంత విశేషాలను సేకరించి గ్రంధస్తం చేశారు .హాయిగా తేలికగా భజనరూపం లోఅద్వైత వేదాంతాన్ని పాడుకొనే పాటలుగానూ రాశారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు