నన్ను మామిడి పండులా ఉన్నావు ”అని బాపు అన్నారని”ముత్యాలముగ్గు” నటి సంగీత

మామిడి పండులా ఉందన్నారు

బాపు సినీకావ్యాల్లో చెప్పుకోదగినది ‘ముత్యాలముగ్గు’. ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపించే చిత్రం అది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆ టైటిల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీనియర్‌ నటి సంగీత. బాపు మలచిన కుందనపు ‘బొమ్మ’ల్లో సంగీత కూడా ఒకరు. బాపు జయంతి సందర్భంగా ఆయన గురించి సంగీత చెబుతున్న విశేషాలు…
‘‘నేను మేగజైన్‌లో యాడ్‌లు చేసేదాన్ని. ఒకసారి ప్రకటనల కోసమని స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ భూషణ్‌ నా ఫోటోల్ని తీశారు. ఆయన బాపుగారి సినిమాలకు కూడా పనిచేసేవారు. నా ఫోటోలు బాపుగారికి చూపించడం, ఆయనకి నచ్చడంతో ‘ముత్యాలముగ్గు’లో అవకాశం వచ్చింది. ఈ సినిమా కంటే ముందు ‘అందాలరాముడు’ చేయాల్సింది. కానీ, కుదరలేదు. నేనేమో ఇండస్ర్టీకి కొత్త. ఏం తెలిసేది కాదు. అవే ఫోటోలు చూసి విశ్వశ్వరరావుగారు ‘తీర్పు’లో అవకాశం ఇచ్చారు. అది హీరోయిన్‌గా నాకు తొలి సినిమా కాగా విడుదలైంది మాత్రం ‘ముత్యాలముగ్గు’.
మేకప్‌ లేకుండా నటించమన్నారు

‘తీర్పు’ షూటింగ్‌ జరుగుతుండగానే ‘ముత్యాలముగ్గు’కి నన్ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు చెప్పారు. మేకప్‌ లేకుండా నటించాలన్నప్పుడు కొంచెం ఫీలయ్యాను. ‘సినిమా అంటే గ్లామర్‌ కదా, మేకప్‌ లేకుండా నటించామంటారేంటి?’ అనుకున్నాను. అంతకుముందు బాపుగారి గురించి నాకు తెలీదు. సినిమా అంటేనే పెద్దగా తెలీదు. స్కూల్లో స్కిట్స్‌ చేసేదాన్ని. మా స్వస్థలం వరంగల్‌. సెలవులకు సికింద్రాబాద్‌లో ఉన్న మా పెద్దక్క దగ్గరకి వెళ్లినప్పుడు పక్కనే ఉన్న డాన్స్‌ స్కూల్‌లో డాన్స్‌ నేర్చుకున్నాను. మద్రాసుకి వచ్చిన తరువాత కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం చేశాను. చిన్నప్పుడు స్కూల్లో చేసిన డాన్స్‌లతోనే సినిమాపై ఇష్టం పెరిగింది. ‘మంచి ఫోటోజెనిక్‌ ఫేసు. సినిమాల్లో ఎందుకు ట్రై చేయకూడదు’ అని మా ఫ్రెండ్స్‌ అనేవారు. ‘తీర్పు’ పూర్తికాకుండానే ‘ముత్యాలముగ్గు’లో నటించాను. సరదాగా కూర్చుని మాట్లాకుంటున్నప్పుడు షాట్‌ రెడీ అంటే వెళ్లిపోయేవాళ్లం. కొద్దిగా టచప్‌ చేసేవాళ్లంతే.

పాట నా ఫస్ట్‌ షాట్‌
నా ఫస్ట్‌ షాట్‌ ‘ముత్యమంత ముగ్గు…’ పాట. ముఖం పక్కకు తిప్పి చూడాలి. అలా రెండు, మూడు షాట్‌లు తీసి వేరే వర్క్‌ చేసుకున్నారు. నన్ను మళ్లీ పిలవలేదు. ‘రెండు షాట్‌లే తీశారు. మళ్లీ పిలవడం లేదు. ఈ సినిమాలో ఉంటామా, లేదా’ అని ఫీలయ్యాను. మరుసటి రోజు ఉదయం సెట్స్‌కి వచ్చి చూస్తే అందరి ముఖాల్లో ఒకటే సంతోషం. బాపుగారు, రమణగారు… అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. బాపు నా చేయి పట్టుకుని ‘మామిడిపండులా ఉంది నీ ముఖం’ అన్నారు. మేకప్‌ లేకుండా చేయడం సినిమాలో ఎలా ఉంటుందోనని టెస్ట్‌ చేశారనుకుంటా. ముఖానికి పసుపు రాసుకుని, కుంకుమ పెట్టుకోవాలంతే. లిప్‌స్టిక్‌ రాసుకుంటే.. రవ్వంత ఎక్కువైనా ‘తుడిచేయ్‌ తుడిచేయ్‌..’ అనేవారు.
స్ర్కిప్టు చూస్తే సినిమా చూసినట్టే…
సెట్‌లో బాపుగారు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు. అలాగే పని చేయించుకుంటారు. ‘ఇలా చేయమ్మా, అలా చేయమ్మా’ అని చెప్పరాయన. స్ర్కిప్టు చేతికిచ్చేస్తారు. స్ర్కిప్టు ప్యాడ్‌ ఇచ్చి, బొమ్మలు చూపించి అలా చేయమనేవారు. అందులో బొమ్మలు, సీను, డైలాగులు.. అన్నీ ఉంటాయి. ప్రతి షాట్‌ బొమ్మ గీసేస్తారు. ఒక సీనులో 50 షాట్లుంటే, 50 బొమ్మలుంటాయి. బాపుగారి స్ర్కిప్టు చూస్తే సినిమా చూసినట్టే ఉంటుంది. అన్ని క్యారెక్టర్లకి బొమ్మలు గీసేస్తారు. ఆయన దర్శకత్వంలో ఏడెనిమిది సినిమాలు చేసుంటాను. అన్నింట్లోను ఇంతే. ‘ముత్యాలముగ్గు’ షూటింగ్‌ పూర్తయ్యాక ప్రొజెక్షన్స్‌ వేశారు. నేను 10-15 ప్రొజెక్షన్స్‌ చూసుంటాను. ఎవరి కోసం ప్రొజెక్షన్‌ వేసినా వెళ్లేదాన్ని. నా సినిమా చూడాలని అంత ఆసక్తిగా, ఆరాటంగా ఉండేది. తరువాత ఏ సినిమానూ నేనన్ని సార్లు చూడలేదు.
మాది తండ్రీ కూతుళ్ల బంధం
ముత్యాలముగ్గు సినిమాతో బాపుగారి కుటుంబానికి బాగా దగ్గరయ్యాను. రమణగారి కుటుంబం కూడా అంతే. బాపు ఎంత తక్కువగా మాట్లాడేవారో, రమణ అంత బాగా మాట్లాడేవారు. మంచిచెడ్డలు చెప్పుకోవడం రమణగారితోనే. బాపుతో మాట్లాడాలంటే కొంచెం భయంగానే ఉండేది. అనవసరంగా కదిపితే విసుక్కునేవారు. ఒకసారి ‘పెళ్లి కొడుకు’ షూటింగ్‌లో ఒక ఆర్టిస్ట్‌ సమయానికి రాలేదని బాపుగారికి కోపం వచ్చింది. షూటింగ్‌ ఆలస్యమవుతోంది, వెలుతురుపోతుందన్న టెన్షన్‌ ఆయనది. ఆ మూడ్‌లోనే నాపై కూడా కేకలు వేశారు. నాకేం అర్థం కాలేదు. ‘నేనేం తప్పుచేయలేదు, నన్నెందుకు తిడుతున్నారు’ అని బాధపడ్డాను. ఆర్టిస్ట్‌ వచ్చాక రెడీ అవుదామన్న ఉద్దేశంతో నేనున్నాను. ఆ ఆర్టిస్ట్‌ వచ్చాక నేను రెడీ అవుతున్నాను వెంటనే ఆయన రూమ్‌కి వచ్చి ‘ఏంటమ్మా ఏమనుకుంటున్నావు. ఆలస్యం ఏమిటి? ఇలా అయితే ఎలా..’ అని తిట్టారు. ఆ తరువాత షాట్‌ తీశారు. ఆ తరువాత బాపుగారు నన్ను దగ్గరకి పిలిచి ‘సారీ సంగీత, టెన్షన్‌లో అనేశాను. అయినా నీపై నాకు ఆ చొరవ ఉందమ్మాయ్‌. అందుకే తిట్టాను’ అన్నారు. ఆ మాటతో అప్పటి వరకు పడిన బాధంతా పోయింది.
దీర్ఘం తీసి తిట్లు తిన్నాను…
బాపుగారితో ‘పెళ్లీడు పిల్లలు’, ‘త్యాగయ్య’, ‘పెళ్లికొడుకు’, ‘సుందరకాండ’ సినిమాలతోపాటు భాగవతం సీరియల్‌ చేశాను. అందులో రామాయణం ఎపిసోడ్‌లో ‘కైకేయి’ పాత్ర ఇచ్చారు నాకు. బాపుగారు ఆ విషయం చెప్పగానే ‘కైకేయి.. పాత్రా…’ అని కాస్త దీర్ఘం తీశాను. వెంటనే ఆయన ‘ఏం చేయలేవా? ఆ రోజుల్లో జమున చేసింది. ఎంత పెద్ద హీరోయిన్‌ ఆవిడ’ అంటూ మందలించి ఆ సినిమా చూడమని చెప్పారు. ఆ క్యారెక్టర్‌కి నన్ను అడిగారేంటబ్బా అని దీర్ఘం తీయడంతో నేను నటించనని చెప్తున్నాను అనుకున్నట్టున్నారు.
అంతా బొమ్మల ప్రపంచమే…
ఆయన దగ్గర నేను నేర్చుకున్నది చేసే పనిని సంతోషంగా 100 శాతం ఇన్వాల్వ్‌మెంట్‌తో చేయడం. సెట్‌లో రమణతో లేక కెమెరామెన్‌తో డిస్కస్‌ చేస్తారేగానీ, సరదాగా కబుర్లు చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. షూటింగ్‌ గ్యాప్‌లో కూడా స్ర్కిప్టుతోనే ఉంటారు. సెట్లోనే కాదు ఇంట్లో కూడా ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎప్పుడు చూసినా ఇంట్లోని స్టూడియో రూమ్‌లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవారు. చివరిగా ‘సుందరకాండ’లో ఆయనతో పనిచేశాను. ఒంట్లో బాగోలేదని రమణగారు చెన్నైలోనే ఉండిపోయి షూటింగ్‌ రాకపోతే బాపు చాలా ఒంటరిగా ఫీలయ్యేవారు. 

అలా మాట్లాడ్డం చాలా అరుదు…

ఇండస్ర్టీకి వచ్చి 35 ఏళ్లు దాటింది. ఇప్పటికీ నన్ను చూస్తే ‘ముత్యాలముగ్గు సంగీత’ అనే అంటారు. ‘లవకుశ’ సినిమాకి సాంఘిక రూపం ‘ముత్యాలముగ్గు’. దాన్ని మరిపింపచేసేలా ఈ సినిమా తీశారు. ఇన్నేళ్లయినా ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే అదే ‘బాపు రమణీయం’. ‘పద్మశ్రీ’ వచ్చినప్పుడు శుభాకాంక్షలు చెబుదామని ఇంటికి వెళ్లాను. మీకు ‘పద్మభూషణ్‌’ వస్తే బాగుంటుంది అన్నాను. ‘ఏ ఎందుకు భారతరత్న వస్తే బాగుండదా?’ అని గట్టిగా నవ్వేశారు. అవార్డుల్ని ఆశించే తత్వం కాదని తమాషాగా చెప్పారు. ఆయన ఇలా జోక్‌గా మాట్లాడ్డం చాలా అరుదు.

ఆ షాక్‌లో ఏడుపు రాలేదు…
బాపుగారి మరణం చాలా పెద్ద షాక్‌. టీ వీలో బాపుగారు మరణించారని చూసినప్పుడు నాకస్సలేమీ అర్థం కాలేదు. ‘బాపు ఇక లేరు’ అన్నది తప్పేమో, ఇంకెవరైనా అయ్యుంటారేమో అన్న భావనలోనే ఉన్నాను. అబద్ధం అయితే బాగుండని దేవుడ్ని కోరుకున్నాను. ఆ షాక్‌లో ఏడుపు రాలేదు. వృత్తిపరంగా డబ్బు కోసం సినిమాల్లో నటించడం పక్కనబెడితే, మనసుకి నచ్చి పనిచేయడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. అలా చేసిన సినిమాలు బాపు సినిమాలు. ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మాకెప్పుడూ ఉంటాయి. ఆయన నాకిచ్చిన ‘ముత్యాలముగ్గు సంగీత’ అన్న పేరు నిలబెట్టుకుంటే నా జీవితం ధన్యమైనట్లే.’’
‘‘ఆయన ఆఖరి సినిమా ‘శ్రీరామరాజ్యం’లో నటించే అవకాశం చేజారిందన్న బాధ ఉంది. ఈ సినిమాలో క్యారెక్టర్‌ ఉంది, తరువాత చెబుతాను అన్నారు. ఒకరోజు రాత్రి కో-డైరెక్టర్‌ ఫోన్‌ చేసి ‘రేపు ఉదయం షూటింగ్‌ ఉంది. రండి’ అన్నారు. అప్పుడు నేనో తమిళ సినిమాలో నటిస్తున్నాను. మరుసటి రోజు షూటింగ్‌ ఉంది. వాళ్లని పర్మిషన్‌ అడిగితే ‘కాంబినేషన్‌ సీన్‌ ఉంది, కుదరద’న్నారు. ఎల్లుండి వస్తానని కో-డైరెక్టర్‌కి చెప్పాను. వేరే కారణాలతో ఆ పాత్రలో నటించలేకపోయాను. రాముడి సోదరి పాత్ర నేను చేయాల్సింది..’’
 గనిరెడ్డి అరుణ్‌కుమార్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in ముళ్ళపూడి & బాపు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.