”బాపు అనిర్వచనీయుడు ”-వి ఏ కె రంగారావు

.ఏ నిర్వచనానికి లొంగని వారు
– విఏకె రంగారావు
‘‘బాపు-రమణలతో నా పరిచయం 1957 నాటిది. అప్పట్లో నేను ఆటోమొబైల్‌ ప్రొడక్ట్స్‌ ఆఫ్‌ ఇండియా అనే ఒక స్కూటర్‌ (లాంబ్రెట్టా) కంపెనీలో పనిచేస్తూ ముంబైలో ఉండే వాడ్ని. ఆ రోజుల్లో మల్లీశ్వరి సినిమాలో చిన్న నాగరాజుగా వేసిన నా స్నేహితుడు వెంకటరమణతో కలిసి ఇద్దరూ నేను ఉంటున్న పేయింగ్‌ గెస్ట్‌ గదికి వచ్చారు. అందులో ఒకరు బాపు. ఈ వెంకటరమణ గోవిందరాజు సుబ్బారావు తమ్ముడి కుమారుడు. పిల్లలు లేకపోవడంతో సుబ్బారావు పెంచుకునే వారు. ఈ వెంకటరమణ సోదరి బాపు భార్య. ఆ రోజు ముంబైలో కలవడానికి ముందే బాపు గారి కార్టూన్‌ కథ పుస్తకం ‘సుహేళి’ చూశాను అన్నాను. బాపు ‘చూశారా?’ అని సంతోషించారు. ఆ మధ్యలో రెండు సంవత్సరాలు బొబ్బిలిలో ఉంటూ, తరచూ మద్రాసు వెళ్లేవాణ్ని, ఆ రోజుల్లో బాపుతో పాటు వారి మేడ మీద ఉండే రమణను కూడా కలిసేవాణ్ని. చివరకు 1960లో నేను చెన్నైలో స్ధిరపడిన తరువాత బాపు-రమణలతో పరిచయం స్నేహంగా మారింది. వీరి ద్వారా నాకు మల్లాది రామకృష్ణ శాస్ర్తిగారు, పి.బి. శ్రీనివాస్‌, బెంగళూరుకు చెందిన సినిమా నిర్మాత, థియేటర్‌ యజమాని (బాపు రమణలకు మంచి మిత్రుడు) భక్తవత్సలం వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. అంటే 1960 తరువాతే నాకు రామకృష్ణ శాస్ర్తిగారితో పరిచయం కలిగింది. అప్పటికే శాస్ర్తి గారి పేరుతో వచ్చిన ‘చిన్నకోడలు’, ‘రేచుక్క’, ‘రాజనందిని’ సినిమాలు నేను చూశాను. మల్లాది వారి రచన ‘రాజనందిని’ నాకు ఎంతో నచ్చిన సినిమా. ఆ సినిమా ఎక్కడ ఆడుతూ కనిపించినా చూశాను. బాపు-రమణలే నన్ను ఆంధ్రపత్రిక వీక్లీ సంపాదకులు శివలెంక రాధాకృష్ణగారికి ‘ఈయన రికార్డుల గురించి రాస్తా‘రని పరిచయం చేశారు. అపుడు నేను రాయవలసిన వ్యాసాలకు శీర్షికగా రమణ ఏవో పేర్లు చెప్పినా నాకు అంతగా నచ్చలేదు. రామకృష్ణ శాస్ర్తి గారే ‘సరాగమాల’ అన్నారు. వెంటనే అంగీకరించాను. తరువాత జ్యోతి మాసపత్రిక కోసం ఒకసారి కృష్ణ జయంతి సందర్భంగా కృష్ణునిపై ప్రత్యేక సంచిక ‘కృష్ణజ్యోతి’ తేవాలనుకున్నాం. దానికి రమణ సకాలంలో కథ ఇవ్వలేదు. కానీ మరో వారంలోనే కృష్ణునిపై రమణ రాసిన ‘కానుక’ అనే కథ వేరే వార పత్రికలో వచ్చింది, నాకు ఎంతో కోపం వచ్చి, ‘‘యు ట్రైటర్‌’’ అంటూ టెలిగ్రాం యిచ్చాను. ఆ తరువాత ఆ కథను రమణ ఒక పుస్తకంగా వేసి నాకే అంకితమిచ్చారు! అలాగే ‘ప్రేమించి చూడు’ షూటింగ్‌ సమయంలో హార్సిలీ హిల్స్‌లో ఏఎన్‌ఆర్‌తో అనుబంధం కూడా బాపు-రమణల ద్వారానే జరిగింది. అంతకు ముందు పరిచయం ఉన్నా, స్నేహంగా బలపడింది బాపు-రమణ ద్వారానే. ఇక నా ‘జనార్దనాష్టకం’ పుస్తకానికి అందమైన బొమ్మలు బాపు ఉచితంగా వేసిచ్చారు. బాపు-రమణలకు సంబంధించి వారి చిత్రాల్లో ‘వంశవృక్షం’, ‘గోరంత దీపం’ నాకు ఎంతో నచ్చుతాయి. ఒకసారి ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో అనుకుంటాను ‘మంచిదినము నేడు’ అనే మూవనల్లూరు సభాపతయ్య గారి ‘పదం’ పెట్టాలన్నారు. నేను వద్దు అది చాలా స్లోగా ఉంటుంది. ఎవరూ యిష్టపడరు కొంత స్పీడున్న ‘కృష్ణం కలయ సఖీ సుందరం’ పెట్టమన్నాను. అయితే సినిమాలో ఆ పాటను వారు వాడుకున్న తీరు నాకు నచ్చలేదు. ఆదే వారికి చెప్పాను. మా మధ్య అన్నీ అంగీకారాలే అంటే అది అసత్యం. మేం ఎన్నో విషయాల్లో విభేదించుకునేవారం. కోతి కొమ్మచ్చిలో రమణ సూచనగా అన్నాడు కూడా ‘రంగారావు ఆయనతో ఆయనే ఏకీభవించడు’ అని. అంతవరకే. బుల్లెట్‌ సినిమాలో కూడా ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటలో ‘అమరావతినగర అపురూప శిల్పాలు’ అని ఉంది. దీనిపై నాకు రమణ గారికి పెద్ద పంచాయతీ జరిగింది. అయితే రచయిత శ్రీరమణ మార్చాడు అన్నారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డు నావద్ద ఉంది అందులో ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అనే ఉంది. రచయిత రాసిన దానిని మార్చకూడదు అనేది నా వాదన. అంతవరకే, దీని వలన మా స్నేహానికి వచ్చిన యిబ్బంది ఏమీ లేదు. రమణ నన్ను ‘చిక్కి’ అంటారు. ఇతరులను నొప్పించే గుణం ఏమాత్రం లేదు. వీరు కళాకారులుగా నిర్వచనానికి అందరు. బాపు దర్శకత్వ ప్రతిభలో 20శాతం రమణకు, రమణ రచనా నైపుణ్యంలో 20 శాతం బాపుకీ దక్కుతుందని నా నమ్మకం. ఒక్కోసారి రమణ ఏమైనా అంటారు కానీ, బాపు దేనికి స్పందించరు. సినిమా బాగాలేదు అన్నా ‘అలాగా? సరే!‘ అంటారు. చాలా బావుంది అన్నా ‘అలాగా! సరే!’ అని నవ్వి ఊరుకుంటారు.
బాపు బొమ్మ అంత అందంగా బొమ్మ వేసేవారు లేదు. బాపు లాగా ‘పెర్స్‌పెక్టివ్‌’ తెలిసేలా చిత్రించిన వారు లేదు. దేశంలోనే అటువంటి చిత్రకారుడు లేడు. అమ్మాయి చదువుతుంటుంది, అటుపక్క తలుపు, ఓ దీపం, మరచెంబు, వాకిలి, గేటు వద్ద పూల తీగ వంటివి ‘ఒక ఫ్రేమ్‌’ చిత్రించడం బాపు ప్రత్యేకత. బాపుకి పాత హిందీ సినిమా సంగీతం తెలిసినంతగా మరో దర్శకునికి తెలియదు. ఆయన మా యింటికి వచ్చి ఎన్నో పాటలు స్వయంగా రికార్డు చేసుకువెళ్లేరు. బాపుకి గజళ్లపై కూడా మంచి పట్టుంది. ఒక్క సంగీత దర్శకుడు సత్యం గారికే అంతటి అవగాహన ఉండేది. రమణకు సినిమా పాటలు రాయడం యిష్టం లేదు. కానీ దగ్గరుండి మంచి పాటలు రాయించుకోగలరు. ‘సీతాకల్యాణం’, ‘సంపూర్ణరామాయణం’ రెండూ రామాయణ కథలే అయినా, వాటిని తీసిన పద్ధతిలో ఎంతో తేడా ఉంది. ‘బాపురమణీయం’ పుస్తకంలో తప్పులను సవివరంగా పేర్కొన్నపుడు కూడా అంతే, మరుసటి రోజు రమణ బొకే పట్టుకుని వచ్చి ‘‘చిక్కీ, నువ్వు రాసినట్లు మరెవ్వరూ రాయలేదు. అయితే, ఆ పుస్తకం మీద నువ్వు పెట్టినంత శ్రద్ధ మేం పెట్టలేదు’’ అన్నారు. మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా అవి స్నేహానికి ఎన్నడూ అడ్డురాలేదు. రమణ రాసిన ‘కానుక’, ‘ఒకబృందావన విహారం’, ‘రాధా గోపాలం’ కథలు జీవితానికి దగ్గరగా ఉంటాయి. అవీ నాకు ఎంతో యిష్టం. మేం అప్పట్లో (1960-65) ఎల్‌ఫిన్‌స్టన్‌ థియేటర్‌ వద్ద సోడా ఫౌంటెన్‌కి (ఐస్‌క్రీం పార్లర్‌) తరచూ వెళ్లే వాళ్లం. అక్కడ లభించే ఫ్లేవర్స్‌ అంటే బాపు, రమణలకి ఎంతో యిష్టం. అప్పట్లోనే అక్కడ ఎనిమిది రకాల ఫ్లేవర్స్‌లో ఐస్‌క్రీంలు లభించేవి. ఆ షాపతను స్వీడన్‌ నుంచీ ఎసెన్స్‌లు తెప్పించే వారు. బాపు రమణలతోనే నాకు రామకృష్ణ శాస్ర్తి అనే నిధితో పరిచయం కలిగింది. అలాగే నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘సరాగమాల’ ప్రారంభానికి వారే కారకులు. ఆ విధంగా నేను వారికి ఎంతో రుణపడి ఉంటాను. బాపు- రమణలు గొప్ప వారని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు ఏ నిర్వచనానికీ లొంగని వారు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.