వెండి తెర జడ్జి పి జె. శర్మకు కి వెయ్యి అవమానాలు

వెండితెర జడ్జి

ఆదివారం మృతి చెందిన పి.జె. శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వరశర్మ. విజయనగరం జిల్లా కల్లేపల్లిలో పుట్టి పెరిగిన శర్మ మొదట రంగస్థలంపై పేరు తెచ్చుకొని, సినీ నటుడు కావాలనే సంకల్పంతో మద్రాస్‌ వెళ్లారు. ‘ఇల్లరికం’లో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు స్నేహితుల్లో ఒకడిగా చేసిన చిన్న పాత్రతో నటునిగా పరిచయమయ్యారు. శ్రీశ్రీ, ఆరుద్ర ఆయనకు సమీప బంధువులు. అప్పట్లో శ్రీశ్రీ తెలుగు డబ్బింగ్‌ సినిమాలతో బిజీగా ఉండేవాళ్లు.
నటుడిగా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న శర్మను డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ప్రయత్నించమని సలహా ఇచ్చింది వాళ్లే. అలా కంఠమే పెట్టుబడిగా ఆయన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మారి, బిజీ అయ్యారు. తన కెరీర్‌లో దాదాపు వెయ్యి సినిమాల్లో వివిధ పాత్రలకు ఆయన తన కంఠాన్ని అరువిచ్చారు. అయితే నటుడిగా పేరు సంపాదించుకోవాలనేదే ఆయన ప్రగాఢ వాంఛ. కానీ వందలాది సినిమాలు చేసినా, ఆయనకు బలమైన పాత్రనిచ్చేవాళ్లే లేకపోయారు. నటునిగా ఆయనది విఫల చరిత్ర. సాధారణంగా ఆయన దగ్గరకు వచ్చేవి జడ్జి పాత్రలు, డీజీపీ, ఐజీ స్థాయి పోలీసు పాత్రలు వంటి హుందా పాత్రలే. చేసినవాటిలో కాస్త మెరుగైనవి ‘తల్లి ప్రేమ’, ‘తుకారాం’, ‘దాన వీర శూర కర్ణ’, ‘ఎర్ర మల్లెలు’, ‘కలెక్టర్‌ జానకి’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలు.
అడుగడుగునా అవమానాలే

అప్పట్లో చెన్నైలోని తేనాంపేటలో ఉన్న ఫిల్మ్‌చాంబర్‌ ప్రివ్యూ థియేటర్‌లో సినిమాల ప్రివ్యూలు ప్రదర్శించేవాళ్లు. తను నటించిన సినిమాల ప్రివ్యూలకు కుటుంబంతో కలిసి వెళ్లే ఆయనకు అవమానాలు ఎదురయ్యేవి. కుర్చీలు నిండాక ఎవరైనా ప్రముఖులు వస్తే, మొదట కుర్చీల నుంచి లేపేది శర్మ కుటుంబాన్నే. వాళ్లను నిల్చుని చూడమని చెప్పేవాళ్లు, లేదంటే బయటకు వెళ్లమనేవాళ్లు. ఈ అవమానాలు తట్టుకోలేక ఆయన ప్రివ్యూలకు వెళ్లడం మానేశారు. ‘‘ఆ రోజుల్లో మా అమ్మానాన్నలకు గౌరవప్రదంగా ప్రివ్యూ చూపించాలనేది నా కల. చెన్నైలోని దేవి-శ్రీదేవి ప్రివ్యూ థియేటర్‌లో నా ‘పోలీస్‌ స్టోరీ’ని వాళ్లకు చూపించడం ద్వారా ఆ కలను నిజం చేసుకున్నా. థియేటర్‌లో అమ్మానాన్నలిద్దరే కూర్చుని సినిమా చూశారు. నేను కూడా వాళ్ల పక్కన కూర్చోకుండా, ప్రొజెక్షన్‌ రూమ్‌లో కూర్చున్నాను’’ అని చెప్పారు సాయికుమార్‌. తన కెరీర్‌లో శర్మ మంచి అవకాశాల కోసం మధనపడని రోజు లేదు. ఏదైనా సినిమా ప్రారంభమైతే, అందులో తనకు పాత్ర ఉంటుందా, ఒక వేళ ఉంటే, దానికి నాలుగు డైలాగులన్నా ఉంటాయా, లేదా అని మధనపడేవాళ్లు. ఆయన గంభీరమైన గొంతును ఉపయోగపెట్టుకొనే పాత్రలు రాకపోవడం నిజంగా విచారించదగ్గ విషయం.
ఆజానుబాహువైన ఆయన బూట్ల సైజు 11 అంగుళాలు. ఆ సైజు బూట్లను తెప్పించకుండా సొంత బూట్లనే తెచ్చుకోమనేవాళ్లు ప్రొడక్షన్‌ మేనేజర్లు. అంతేకాదు, ఎక్కువ సందర్భాల్లో సొంత కాస్ట్యూమ్స్‌నే ఆయన వాడాల్సి వచ్చేది. ఇంతాచేసి, ఆ పాత్ర చేశాక, సినిమాలో అది ఉంటుందా, ఎడిటింగ్‌లో పోతుందా అనే టెన్షన్‌ కూడా ఆయనను వేధించేది. ఎందుకంటే సినిమా నిడివి ఎక్కువైనప్పుడు ఎడిటింగ్‌లో ఆయన పాత్రను తీసేసిన సందర్భాలు కూడా తక్కువేమీ కాదు. ఆయన నటించిన సినిమాలు వంద రోజుల వేడుక జరుపుకున్నప్పుడు జ్ఞాపిక ఇచ్చినట్లే ఇచ్చి, ఆయన వేదిక దిగాక, ఆయన చేతుల్లోంచి నిర్వాహకులు ఆ జ్ఞాపికను తిరిగి తీసేసుకున్న సందర్భాలూ ఎక్కువే. అలాగే ఆ వేడుకల తర్వాత యూనిట్‌కు ఏర్పాటుచేసే పార్టీకి ఎవరైనా ముఖ్యమైన వాళ్లు వస్తే టేబుల్‌ దగ్గర నుంచి మొదట లేవమని చెప్పేది కూడా ఆయననే. శర్మ ఎదుర్కొన్న ఇలాంటి అవమానకర సంఘటనలకు ఆయనతో పాటు కలిసి తిరిగే ఆయన పెద్ద కుమారుడు సాయికుమార్‌ ప్రత్యక్ష సాక్షి. అందుకే తన కుమారులు సినిమాల్లోకి రావాలని శర్మ కోరుకోలేదు. కానీ ఆయన అనుకున్నట్లు జరగలేదు. ముగ్గురు కొడుకులూ సినిమాల్లోనే కెరీర్‌ను వెతుక్కోవడం విధి వైచిత్రి.
సంతాపం

పి.జె. శర్మ మృతికి చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం శర్మ అంత్యక్రియలకు ముందు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన చిరంజీవి, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. అలాగే ఓ ప్రకటనలో శర్మ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మురళీమోహన్‌, అలీ సంతాపం తెలిపారు.
  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.