గీర్వాణ కవుల కవితా గీర్వాణం -95
140 –గురువులకు గురువు ,సర్వ శాస్త్ర వేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి
గురువులకు గురువులు
దాదాపు అరవై డెబ్భై ఏళ్ళ క్రితం ఏ సంస్కృత పండితుడిని అడిగినా తాను తాతా సుబ్బరాయ శాస్త్రి గారి శిష్యుడి నని కాలర్ –సారీ ఖండువా ఎగరేసి చెప్పేవారు .అంతటి విఖ్యాతి వారిది .విజయనగరానికి సమీపం లో ఒంటి తాడి అగ్రహారం లో 25-1-1867 న తాతా సూర్య నారాయణావధాని ,సోమి దేవమ్మ దంపతులకు సుబ్బరాయ శాస్త్రి గారు జన్మించారు .కొడుకును శాస్త్ర పండితుడిని చేయాలనే బలీయమైన కోరిక ఉన్న వీరి తల్లిగారు కొడుకును చంకన ఎత్తుకొని దాదాపు రెండుకిలో మీటర్లు నడిచి విజయనగరం లో గురువుగారి వద్ద దింపి వచ్చేది .అంత పట్టుదల చూపింది ఆ మహా ఇల్లాలు కుమారుని విద్యకోసం .ఆ శ్రమ ఊరికే పోలేదు ఫలించింది .తల్లి ఋణం తీర్చుకొన్నారు శాస్త్రి గారు .పెరిగి పెద్ద వారైన శాస్త్రి గారు విజయ నగరం లో బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద చేరి సంస్కృత సాహిత్యం అభ్యసింఛి ప్రావీణ్యం సాధించారు .శాస్త్రి గారిది పాదరసం లాంటి చురుకైన బుద్ధి .మేధావిగా పరిగణన చెందారు .వీరి శ్రద్ధాసక్తులు ,వినయం, మేధావి తనం కర్ణాకర్ణీగా విన్న రుద్రా భట్ల రామ శాస్త్రి లక్ష్మణ శాస్త్రి సోదరులు సుబ్బరాయ శాస్త్రిగారిని ఆహ్వానించి ,చేర దీసి, వ్యాకరణ అలంకార శాస్త్రాలు నేర్పి అసామాన్య పండితునిగా తీర్చి దిద్దారు .గొప్ప శిష్యునికోసం వెదికిన ఆ గురు సోదరులు ధన్యులు .వారు నేర్పిన విద్యనేర్చి ఈశిష్యుడూ గురూణంతీర్చుకొన్నారు .
బహు శాస్త్ర పరిజ్ఞానం
ధర్మ శాస్త్రం నేర్వాలన్న కోరిక కలిగి గుమ్మలూరు సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులై ఆసాంతం అభ్యసించారు .కొల్లూరు కామ శాస్త్రి గారిని చేరి వేదాంతం అంతం చూశారు .సంగీతం మీద మోజు కలిగి కట్టు సూర్య నారాయణ గారి వద్ద సంగీత గుట్టు మట్టులన్నీ గ్రహించారు .ఇలా శాస్త్రి గారి బహుశాస్త్ర పరిజ్ఞానం దేశమంతా వ్యాపించి గొప్ప గుర్తింపు నిచ్చింది .ఆంధ్రా దేశం లో ఏ శాస్త్రం లో ఏ రకమైన సందేహాలు వచ్చినా చివరికి వీరి దగ్గరకు రావాలి సిందే. వీరి తీర్పే తుది తీర్పు ,శిరోదార్యమూ అయింది. అంతటి నిష్పాక్ష పాతం గా శాస్త్ర బద్ధం గా ధర్మ, న్యాయ బద్ధం గా వ్యవహరించేవారు .గంభీర హృదయులు .తొట్రు పాటు లేని ప్రశాంత మూర్తి శాస్త్రి గారు .
సుదీర్ఘ విద్యాదానం –అరుదైన రికార్డు
ఆ నాటి మేటి పండితులలో సుబ్బా రాయ శాస్త్రి గారు నాగరికులు అనిపించుకొన్నారు .లౌకిక జ్ఞానం లోనూ అసాధారణ ప్రజ్ఞ ఉండేది .వీటి వలననే విజయ నగర పురపాలక సంఘం లోను, సహకార సంఘం లోను సభ్యులై స్థానిక సంస్థలలో ప్రధాన సభ్యులుగా అనేక మార్లు ఎన్నుకో బడ్డారు .అంతటి విశేష మైన మూర్తిమత్వం వారిది .విజయనగరం రాజా వారి సంస్కృత కళాశాలలో శాస్త్రిగారు నలభై ఏళ్ళు సుదీర్ఘ కాలం ప్రధానాచార్యులుగా పని చేసి శాస్త్రాధ్యాపనం చేశారు .ఒక రకం గా ఇదొక రికార్డే .
గ్రంధ రచన లో మేటి
భారత దేశం లో ఉత్తమ వ్యాకరణ గ్రంధం గా పరిగణింప బడుతున్న నాగశ భట్టు రచించిన ‘’శబ్దెందు శేఖరం ‘’ను ఉత్తరదేశ పండితులు ఖండించటం మొదలు పెట్టి గ్రందాలుకూడా రాశారు .శాస్త్రి గారు వారి వాదాలనన్నిటిని గడ్డిపోచల్లాగా తేలిగ్గా తీసి పారేసి ,ఖండనలకు ప్రతిఖందనలు చేసి నాగశ భట్ట హృదయాన్ని ఆవిష్కరిస్తూ ‘’గురు ప్రసాదం ‘’అనే మహా ఉద్గ్రంధం రాసి ,నోరు మూయించారు .ఈ గ్రంధాన్ని ఆంద్ర విశ్వా విద్యాయం గౌరవం గా ముద్రించించి లోకానికి అందించింది .దీనితో మారుమూల ప్రాంతాల వారికి కూడా శాస్త్రి గారి పాండితీ గరిమ తెలిసి శిష్యులై విద్య నేర్చుకొన్నారు .అంతటి ప్రభావం చూపింది. ఆ గురుప్రసాద శిష్యుల పాలిటి వరమే అయింది .శాస్త్రిగారు ఈ గ్రంధాన్ని ‘’స్వర సంధి ‘’వరకు రాశారు .శిష్యులు పేరి వెంకటేశ్వర శాస్త్రి ‘’గురు ప్రసాద శేషం ‘’పేరిట ‘’కారకాంతం ‘’వరకు రాసి పూర్తీ చేశారు .అంతటి గొప్ప శిష్యులను తయారు చేశారు తాతా వారు .శాస్త్రి గారి అమోఘ పాండిత్యానికి వారసులుగా వీరు ఉన్నారు అనటానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్షం .దీనినీ ఆంధ్రా యూని వర్సిటీ యే ముద్రించింది . సుబ్బరాయ శాస్త్రి గారు హరి శాస్త్రి రాసిన ‘’శ్శబ్ద రత్న ‘’వ్యాఖ్యను పరిశీలించి టీకా రాసి పరిష్కరిస్తే ఆంద్ర విశ్వ కళా పరిషత్ ప్రచురించింది .
పురస్కార గౌరవ రికార్డ్
1912లో ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదం శాస్త్రి గారిని వరించింది .ఆ బిరుదు పొందిన మొట్ట మొదటి వ్యక్తీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారే ఇదీ ఒక రికార్డే .ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇండియా వచ్చినప్పుడు శాస్త్రిగారిని సగౌరవం గా మద్రాస్ కు ఆహ్వానించి ,తనపేరు చెక్కబడిన ‘’సువర్ణ కంకణాన్ని ‘’స్వయం గా శాస్త్రిగారి చేతికి తొడిగి అలంకరించాడు .ఇది ఒక భారతీయ అందునా ఆంద్ర దేశానికి చెందినా శాస్త్ర పండితునికి లభించిన అరుదైన గౌరవం .ఇది మూడవ రికార్డు .వి జయనగరం లోనే కాక ఉర్లాం ,పిఠాపురం సంస్థాన పండిత పరీక్షలకు శాస్త్రి గారు ఎప్పుడూ ప్రధాన పరీక్షకులుగా ఉండేవారు .ఇంతటి శాస్త్ర పండితునికి సంఘ సంస్కరణ పై మిక్కిలి అభిమానం ఉండటం ఆ రోజుల్లో ఆశ్చర్య పడే విషయం .దురాచారాలను కాలాన్ని బట్టి మార్చుకొని సంస్కరించుకొని శాస్త్ర సమ్మతాలైన వానిని అనుసరించాలని ఎప్పుడూ ప్రబోధించేవారు .మహాత్ముని ఖద్దరు వస్త్ర ధారణా ,వీరిపై ప్రభావం చూపింది .నిత్యం సన్నని పొందూరు ఖద్దరు వస్త్రాలే జీవితాంతం ధరించేవారు .
శాస్త్ర వాద తీర్పరి
ఆంద్ర సాహిత్య పరిషత్తు సమావేశానికి ఒక సారి అధ్యక్ష స్థానం లో ఉండి ఆంద్ర భాష ఔన్నత్యం కోసం మార్గ నిర్దేశం చేస్తూ చేసిన ప్రసంగం మహోపన్యాసం అనిపించింది .రాజ మండ్రి శ్రోత్రియ మహాసభ ,విశాఖ జ్యోతిశ్శాస్త్ర సభలలో పండితులు చేసిన చర్చోప చర్చలకు శాస్త్రి గారినే ఉభయ పక్షాల వారు’’ తీర్పరిగా’’ఉండమని వేడుకోవటం ,శాస్త్రిగారి సర్వతోముఖ ప్రతిభకు ,నిష్పాక్షికతకు నిలు వెత్తు నిదర్శనం .శాస్త్రిగారు కాశీ ,దర్భంగా ,పుదుక్కొట వగైరా సంస్థానాలను దర్శించి శాస్త్ర చర్చలు జరిపి పండితులను ఓడించి గెలిచి’’ జయ పత్రాలు ‘’అందుకొన్నారు .శాస్త్ర వాదాలలో అగ్ర గణ్యులని గుర్తింపు పొందిన కాశీ పండితుడైన ‘’జయ దేవ మిశ్ర ‘’పండితుడు –సుబ్బరాయ శాస్త్రి గారి ‘’పేరు విన్నంతనే ,’’అమాంతం ‘’రెండు చేతులు జోడించి’’ నమస్కరించే వారట .అంతటి మహోన్నత పండితులు మన సుబ్బా రాయ శాస్త్రి గారు .సుబ్రహ్మణ్యం పేరులోనే ఉంది ఆ ధిషణ.శాస్త్రి గారి 63 వ జన్మ దినోత్సవం నాడు శిష్య ,ప్రశిష్య బ్రందం ఆత్మయ పండిత సాహితీ బృందం అందరూ కలిసి మహా వైభవం గా గురు పూజోత్సవం జరిపి కృతజ్ఞతలు తెలియ జేసుకొని ఘంగా సన్మానించి గౌరవించి చిరకీర్తి ని ఆర్జించారు .
మహా మహోపాధ్యాయ ,గుగ్గురువులు శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రిగారు 77 సంవత్సరాలు శాస్త్ర సింహులుగా ,ఓటమి ఎరుగని పండితులుగా ,బహు గ్రంధ కర్త గా జీవించి1944లో కీర్తి శేషులయ్యారు .
రెండవ విరామం
మనవి- సాహితీ బంధువులకు శుభ కామనలు-‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గా ఇంగ్లాండ్ ,అమెరికా దేశపు 125 మంది పూర్వకవుల పై రాసి ప్రచురించిన తర్వాత ,నా మనసులో ఒక బాధ పీడిస్తూనే ఉంది .మన దేశ పూర్వ కవులపై ఇంతవరకు రాయలేక పోయానే అనేది మనసులో తొలుస్తూనే ఉంది .ముఖ్యం గా మన సాహిత్యానికి మూలం సంస్కృతం కనుక పూర్వ సంస్కృత కవులపై రాసి ఆ లోటు భర్తీ చేయాలని పించింది .శీర్షిక కోసం రెండు మూడు రోజులు ఆలోచిస్తే ఫ్లాష్ గా ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’పేరు స్పురించింది .వెంటనే రాయటం మొదలు పెట్టాను .అది పెరిగి పెరిగి విస్తృత రూపం దాల్చింది .మధ్యలో కొద్ది రోజులు విరామం తర్వాత కొన సాగించి ఈ రోజుకు 95 ఎపి సోడ్ లలో ,140మంది సంస్కృత కవుల గురించి రాశాను .నా అంతర్జాల రాత ప్రయత్నాలలో ఇది చాలా బృహత్తరమైనదే .నేను రాసినవి చాలా ప్రాధమిక విషయాలే .వారిగురించి తెలుసుకోవాల్సింది చాలా ఉండి ఉంటుంది నాకు లభించిన సోర్సు ల నుండి గ్రహించి మీ కు తెలియ జేశాను అంతే .ఇంకా ఎందరో నా దృష్టికి రాని వారు ఉండవచ్చు .
ఇంత మంది సంస్కృత మహా కవులు, రచయితలను సంస్మరించగలిగాను .వారి గురు పరంపరను స్పృశించి ధన్యమయ్యాను .ఇది నా అదృష్టం గా భావిస్తున్నాను .ఇంకా నా దృష్టికి రాని వారిగురించి తెలుసుకొని వారినీ చేర్చే ప్రయత్నం చేస్తాను .అంత వరకు ఈ శీర్షిక కు ‘’మరొక కామా లేక మరో విరామం ‘’గా భావించండి .ఆదరించిన వారందరికీ ధన్యవాదాతో కూడిన కృతజ్ఞతలు .
మరొక ముఖ్య విషయం –నేను ఎప్పటికప్పుడు తనకు అంకితం ఇద్దామను కొన్న నాలుగు పుస్తకాలను ఒకటి తమ తల్లి కీ శే .సౌభాగ్యమ్మగారికి ,రెండవది అర్ధాంగి శ్రీమతి సత్య వతి గారికి ,మూడవది తన బావ గారు డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారికి కి నాల్గవది తన జీవితానికి మార్గ దర్శి అయిన ‘’కపటమెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి’’ శ్రీ కోగంటి సుబ్బారావు గారికి అంకితం ఇవ్వమని చెప్పి ,ఇప్పించిన స్పాన్సర్ గా ఉన్న ఉదార హృదయులు నాకు బహు ఆత్మీయులు ,సరసభారతి కి అత్యంత శ్రేయోభిలాషులు ,,మార్గ దర్శి శ్రీ మైనేని గోపాల కృష్ణ –(అమెరికా )గారికి ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అనే ఈ అంతర్జాల గ్రంధం ,అంతర్జాల సాక్షిగా –రూపాయి కూడా వారికీ నాకు ఖర్చు లేని విధం గా వారి సాహిత్యాభి లాషకు ,సరస హృదయానికి ,సౌశీల్యతకు స్నేహ ధర్మానికి మాతృ దేశాభిమానానికి మాతృభాషా భిమానానికి ,భారతీయ అధ్యాత్మకత పై ఉన్న గౌరవానికి , గుర్తింపు గా 10-1-2015న శ్రీ గోపాల కృష్ణ గారి 80 వ జన్మ దినోత్సవం సందర్భం గా ఇప్పుడే కృతజ్ఞతా పూర్వకం గా , చిరుకానుక గా ఈ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అంతర్జాల గ్రంధాన్ని అంకితమిస్తున్నాను .
ఇదేదో వారిని మభ్య పెట్టి గ్రంధ రూపం లో దీనిని తీసుకు రావానే ఆలోచన తో మాత్రం కాదని ,వారు ‘’ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న అంకిత విషయం ‘’పై నా నిర్ణయమే నని సవినయం గా మనవి చేస్తున్నాను .వారికి తెలియ బరచ కుండా నే నేను చేసిన ఈ సాహసానికి గోపాల కృష్ణ గారు సహృదయం తో అర్ధం చేసుకొంటారని భావిస్తున్నాను .
పూర్వం పెట్టిన కామా తర్వాత – ఈ రచనకు తోడ్పడిన గ్రంధాలు
1-తెలుగు విజ్ఞాన సర్వస్వం
2-20 వ శతాబ్ది తెలుగు వెలుగులు (1,2 భాగాలు )-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ
3-వీకీ పీడియా
మొదలైనవి
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-14-ఉయ్యూరు
.
.