సంగీత” చక్రి ”వర్తి

న్నాడు అలా వెళ్ళిపోయాడు..!

‘చక్రి .. హృదయమున్న మనిషి. ఒక్క ట్యూన్‌ ఇచ్చాడంటే చాలు.. అది గుండెల్ని తాకాల్సిందే..’ అంటున్నారు దర్శకుడు వంశీ. చక్రి సంగీత సారథ్యంలో వచ్చిన తన చిత్రం ‘గోపి గోపిక గోదావరి’లో ‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల’ పాటను గుర్తు చేసుకున్నారాయన. చక్రి గురించి వంశీ చెప్పిన మరిన్ని విషయాలే ఇవి…
‘‘ఈ మధ్యనే చక్రి ఆఫీసుకు వెళ్లాను నేను. వాణ్ణి అదే ఆఖరుసారి కలవడం. మాటల్లో ‘‘మనమిద్దరం త్వరలో ఒక అద్భుతం చేయబోతున్నాం’’ అన్నాడు. ఆ అద్భుతం చేయకుండానే అలా వెళ్లిపోయాడు. చక్రికి నాకు ఉన్న బంధం ఈనాటిది కాదు. డేటు సరిగా గుర్తు లేదు కాని.. కొన్నేళ్ల కిందట సిరివెన్నెల సీతారామశాసి్త్ర మిత్రుడు సాయి అనే వ్యక్తి నాకు చక్రిని పరిచయం చేశాడు. మేమిద్దరం కలవడం అదే తొలిసారి. అప్పటి వరకు నా సినిమాలకు ఇళయరాజా గారు సంగీతం అందించారు. అయితే తక్కువ బడ్జెట్‌లో ఒక సినిమాను తీయాలనుకున్నాం. అలా తీసిన సినిమానే ‘ఔను… వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’. ఇళయరాజాతో మ్యూజిక్‌ చేయిస్తే బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది కాబట్టి.. చక్రీని అప్రోచ్‌ అయ్యాను. మా సినిమా బడ్జెట్‌ను చూసి.. అతను సరే అన్నాడు. చక్రితో నా మొదటి చిత్రం అదే అయ్యింది! అతనితో ఉన్న సౌలభ్యం ఏమిటంటే – మనకు ఏ ట్యూన్స్‌ కావాలంటే ఆ ట్యూన్స్‌ను అందించడం. మళ్లీ మళ్లీ మార్చమని అడిగినా సరే.. కించిత్తు విసుక్కోడు. అయితే అతనితో సమస్యల్లా ఆలస్యంగా రావడం. అడిగింది ఇచ్చేవాడు కాబట్టి.. అదేమంత పెద్ద సమస్య అనిపించలేదు నాకు. కొత్తపాత ఏమీ లేదు. భేషజాలైతే మచ్చుకు ఉండవు. చక్రితో ఒకసారి పరిచయం అయితే ఇక ఆ వ్యక్తి ఫ్రెండ్‌ అయిపోయినట్లే! అతని వ్యక్తిత్వాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే ‘హెవీఫ్రెండ్లీ మనిషి’.
హౌస్‌బోట్‌లో కంపోజింగ్‌..
నా సినిమాల్లో ఏడింటికి చక్రి మ్యూజిక్‌ అందించాడు. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా’ చిత్రం కోసం ఇద్దరం ఆసి్ట్రయా వెళ్లాము. కేవలం మ్యూజిక్‌ను కంపోజ్‌ చేసేందుకే అక్కడికి చేరుకున్నాం. చక్రి ఒక కీబోర్డుతో వచ్చాడు. ఆ చిత్రంలోని పాటలన్నీ అద్భుతం. ‘సరేలే సరేలే..’ అనే పాట నాకు బాగా ఇష్టం. ఆ పాట ట్యూన్‌ పండింది. చక్రిలో ఉన్న నైపుణ్యం ఏంటంటే.. అతను కంపోజ్‌ చేసే ట్యూన్‌లోనే పల్లవి పలుకుతుంది. ‘గోపి గోపిక గోదావరి’ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చేందుకు కేరళకు వెళ్లడం కూడా అద్భుతమైన అనుభవం. అప్పుడు నేను, చక్రి ఒక హౌస్‌బోట్‌ తీసుకున్నాం. బ్యాక్‌వాటర్‌లోనే పదిరోజులు ప్రయాణిస్తూ.. రకరకాల ట్యూన్స్‌ను సెట్‌ చేసుకున్నాం. ఆ బోట్‌ సకల సౌకర్యాల విడిది. ‘గోపి గోపిక..’ చిత్రంలో ఇప్పటికీ వినిపిస్తూ ఉండే పాట‘‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా..’’. ఆ పాటకు ట్యూన్‌ చెప్పినప్పుడే లిరిక్‌ పాడాడు చక్రి.
పల్లవి చెబితే హిట్‌..
నేను నిత్య చదువరిని. సాహిత్యాన్ని బాగా చదువుకున్న వాణ్ణి. అయితే చక్రి పెద్దగా సాహిత్యాన్ని చదువుకోలేదు. అయితే అతను పల్లవి చెప్పాడంటే ఆ పాట సూపర్‌హిట్‌ అయ్యేది. అదే అతని ప్రత్యేకం. ఆ సృజనాత్మక నైపుణ్యం అతనికి.. తండ్రి నుంచి అబ్బింది అనుకుంటా. వాళ్ల నాన్న కూడా మంచి కళాకారుడు కదా! మ్యూజిక్‌ కంపోజింగ్‌లో మా ఇద్దరి మధ్య ఏనాడు విపరీతమైన భేదాభిప్రాయాలు వచ్చిన సందర్భాలు లేవు. నేనే కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడినా.. తిరిగి పల్లెత్తు మాట అనేవాడు కాదు. చాలా నిగ్రహశీలి. సహృదయుడు. ఎంత చిన్నోళ్లయినా పెద్దోళ్లయినా హర్ట్‌ చేసేవాడే కాదు. ఏదైనా ఓపిగ్గా కన్విన్స్‌ చేసేవాడు.
ఇక, ఫ్యామిలీ విషయానికొస్తే – పని ఒత్తిడిలో ఉన్నాసరే కుటుంబానికి ఏ కొరత రానిచ్చేవాడు కాదు. తల్లిని, భార్యను, ఇద్దరు చెల్లెళ్లను ఆప్యాయంగా చూసుకునేవాడు. ఎవరికీ ఏ లోటు రానివ్వడు. చనిపోయేముందు ‘మీరు టీనేజ్‌ లవ్‌ స్టోరీ చేస్తే బావుంటుందేమో ఆలోచించండి’ అన్నాడు. ఈ లోపు వాడు వెళ్లిపోయాడు. చక్రిని మాత్రమే నేను ‘ఒరే బిడ్డా’ అనేవాణ్ణి. వాడంటే నాకు అంత ప్రేమ.
చక్రిలోని మరో కోణం..
యాదృచ్చికమో ఏమో కాని.. సరిగ్గా ఇదే డిసెంబరులో (2009) వంశీ, చక్రిలను ఒక చోట కలిపింది ‘నవ్య’. వారిద్దరి మధ్య అల్లుకున్న స్నేహబంధాన్ని ‘జుగల్‌బందీ’ శీర్షికన పాఠకులకు అందించింది. అప్పట్లో చక్రి గురించి వంశీ పంచుకున్న అనుభవాలలో కొన్ని ఇవి..
‘‘మాది తూర్పుగోదావరి. అంటే కోస్తా. వీడిది వరంగల్‌. అంటే తెలంగాణ. వీడితో స్నేహం చేసిన తర్వాత తెలంగాణ అంటే అపారమైన ప్రేమ ఏర్పడింది. వీడితో పరిచయం అయ్యే వరకు తెలంగాణ ప్రజలు ఇంత గొప్పగా ఉంటారని తెలియదు. ఎక్కడ చక్రీ. ఎక్కడ నేను’’
‘‘సినిమా వాళ్లకు అభిమానుల నుంచి ఫోన్లు రావడం సహజం. అలా ఒక రోజున – ఒక వ్యక్తి చక్రీకి ఫోన్‌ చేసి ‘‘మా రెండేళ్ల పాపకు హార్ట్‌ ప్రాబ్లమండీ. వైద్యం కోసం డబ్బులు సరిపోవడం లేదు. మీరు సహాయం చేస్తారా?’’ అని అడిగాడతను. సమయం మించిపోతే పాప బతకదు. అందుకని చక్రీ ఒక మనిషికి డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తి వద్దకు పంపించాడు. ‘‘ఆపరేషన్‌ అయిన తర్వాత ఆ బిడ్డ యోగక్షేమాలు నాకు తెలియజేయండి’’ అని చెప్పి మరీ పంపించాడు. సినిమా వాళ్లలో ఎంతమందికి ఇంత ఉదారత ఉంటుంది? మనుషులకు ఆపదొస్తే ఆదుకునే కోణం చక్రిలో నేను చూశాను’’
‘‘అన్నం, ఆవకాయ ఎప్పుడూ టేస్టే కదా! అలా వాడు నేను కలిస్తే బావుంటుంది. అన్నం, ఆవకాయే కాదు.. అన్నం, మెంతి మాగాయ కూడా. అలాంటిదే మా మధ్య అల్లుకున్న బంధం’’
ఆరు రూపాయల అన్నంతో కడుపునింపుకున్నా..
చక్రివి సినిమా కష్టాలు కాదు. బతుకుపోరాటంలో ఎదురైన ఆటుపోట్లు. సినిమాల మీద మమకారంతో.. ఎవరి అండదండలు లేకపోయినా.. ధైర్యంగా సంగీత ప్రపంచంలోకి వచ్చి.. తనకంటూ ప్రత్యేకముద్రను సాధించుకున్నారు. చిన్న వయసులోనే కెరీర్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నేళ్ల కిందట ‘నవ్య’కు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారాయన. ‘అనుభవం’ శీర్షిక కింద ప్రచురితమైన ఆ ఇంటర్వ్యూను మళ్లీ సంక్షిప్తంగా ఇస్తున్నాం..
‘‘మాది మహబూబాబాద్‌ మండలంలో కంబాలపల్లి గ్రామం. సినిమాల మీద పిచ్చితో హైదరాబాద్‌కు వచ్చి కృష్ణానగర్‌లో రూమ్‌ తీసుకుని ఉండేవాణ్ణి. ఒక్కణ్ణే అద్దె కట్టలేక ముగ్గురితో షేర్‌ చేసుకున్నాను. మొదట్లో డబ్బులకు ఇబ్బందులొచ్చి.. చిన్న ఉద్యోగం చేశా. అయితే మ్యూజిక్‌ నేర్చుకోవడానికి కష్టమని దాన్ని మానేశాను. కొన్నాళ్లు ఆర్కెసా్ట్ర నడిపా. సొంతంగా ఆల్బమ్స్‌ చేశా. ఆ అనుభవంతో కోఠిలోని ఆడియో సంస్థల వాళ్ల నుంచి పిలుపు వస్తుందని ఎదురుచూసేవాణ్ణి. కొన్నిసార్లు రమ్మని కబురుపెట్టేవాళ్లు. తీరా వెళితే గంటలు గంటలు ఎదురుచూడ్డం నా వంతు అయ్యేది. జేబులో అయితే పది, ఇరవై రూపాయలకంటే ఎక్కువ ఉండేదే కాదు. ‘‘ఇప్పుడే పిలుస్తాం. కాసేపు వెయిట్‌ చేయండి’’ అనేవాళ్లు. ఎదురుచూసి చూసి మధ్యాహ్నం అయ్యేది. మంచి భోజనం చేయడానికి పైసలు లేవు కాబట్టి.. ఆరు రూపాయలు ఇస్తే దాల్‌-రైస్‌ వచ్చేది. అదే నా భోజనం. సాయంత్రం రెండు మిరపకాయ బజ్జీలు. అంతే! పూట గడిచేది. రాత్రి తొమ్మిదింటికి ఆడియో కంపెనీల వాళ్లు నా వద్దకు వచ్చి ‘‘ప్రస్తుతం ఆడియో బిజినెస్‌ టైట్‌గా ఉంది. మీ కాన్‌సెప్ట్‌తో వర్కవుట్‌ కావు. అనుకూలించినప్పుడు కబురు పెడతాం రండి’’ అని చావుకబురు చల్లగా చెప్పేటోళ్లు.
రిజెక్ట్‌ చేసేవాణ్ణి..
సినీరంగం వైపు అడుగులు వేశాను. ఆ సినిమా తీస్తున్నాం. ఈ సినిమా తీస్తున్నాం.. అంటూ నా జేబులోని డబ్బునే ఖర్చు పెట్టించేవారు తప్పిస్తే.. ఆఖరికి అవకాశం వచ్చేది కాదు. ఓ పది సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. అప్పట్లో ‘చిరునవ్వు’ అనే నా ఆల్బమ్‌తో నాక్కొంచెం గుర్తింపు వచ్చింది. ‘వందేమాతరం’ ఆల్బమ్‌తో సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా కొన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చే ఛాన్స్‌ వచ్చింది. పాటలు రికార్డ్‌ అయ్యేవి కాని సినిమా షూటింగ్‌ జరిగేది కాదు. ‘లిటిల్‌హార్ట్స్‌’ అనే చిత్రానికి పనిచేస్తున్నప్పుడు పూరిజగన్నాథ్‌ ‘బాచి’కి అవకాశం ఇచ్చారు. అప్పటికి నాకు అంత అనుభవం లేదు. సింగర్స్‌ విషయంలో పూరిజగన్నాథ్‌ తీసుకున్న నిర్ణయాలను నేను కాదన్నాను. నేను రిజెక్ట్‌ చేసిన వారిలో అందరు సీనియర్‌ సింగర్సే! నా దృష్టిలో ఉన్నికృష్ణన్‌, మనోహర్‌, హరిహరన్‌, ఉదిత్‌ నారాయణ్‌, సిక్విందర్‌ల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లనే అందరికీ చెబుతున్నాను. ఈ ధోరణి వల్ల అవతలి వాళ్ల మనసు నొచ్చుకుంటుందని గ్రహించలేకపోయాను. పూరి వద్దకు వెళ్లి ‘‘సారీ సార్‌, ఇప్పటి వరకు మీరు చెప్పింది వినిపించుకోలేదు’’ అన్నాను. ఆయన చిరునవ్వుతో భుజం మీద చేయివేసి ‘సరేసరే’ అన్నారు. ‘బాచి’ యావరేజ్‌గా ఆడినా పాటలు మాత్రం నాకు పేరుతెచ్చాయి. ఆ తర్వాత సినిమాల్లో వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి..’’
జగనన్నను చూడాలని ఉంది : చక్రి ఆఖరి మాట
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ఇమేజ్‌ ఏర్పాటు చేసుకున్న సంగీత దర్శకుడు చక్రి చనిపోక ముందు మాట్లాడిన మాటలు….
ఎందుకో జగనన్న ( పూరిజగన్నాథ్‌ )ను చూడాలని ఉందిరా అంటూ ఆదివారం అర్థరాత్రి తన ఆఫీసు బాయ్‌తో అన్నారు. తన రికార్డింగ్‌ స్టూడియోలో పని ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు
కారులో ఆఫీసు బాయ్‌కు చక్రికి మధ్య జరిగిన సంభాషణ.

పూరిజగన్‌, చక్రికి మధ్య ఉన్న సంబంధం వేరే చెప్పనక్కర్లేదు. వీరి కాంబినేషన్‌లో ఎన్నో హిట్‌ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ‘బాచి, ఇట్టు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, 143, నేనింతే, గోలిమార్‌, ఆంధ్రావాలా’ వంటి మ్యూజికల్‌ హిట్స్‌ వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఒకేసారి కెరీర్‌ మొదలుపెట్టిన వీరి మధ్య అన్నదమ్ముల సంబంధం కొనసాగేది అంటే అతిశయోక్తి కాదు. చక్రి మృతిపట్ల పూరి స్పందిస్తూ ‘ నా సోదరుడు (చక్రి)ని నేను చాలా మిస్‌ అవుతున్నానంటూ ట్వీట్‌ చేస్తూ చక్రికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు’.
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి చిత్ర పరిశ్రమ సంతాపం..

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రికి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చక్రి మృతి పట్ల మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నిర్మాత రామానాయుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు, నటులు రవితేజ, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌, దర్శకుడు మారుతి, సంగీత దర్శకురాలు శ్రీలేఖతో సహా పలువురు చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేశారు. చక్రి మరణ వార్త విని నమ్మలేకపోయానని చిరంజీవి అన్నారు. చక్రి చాలా మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి దూరం కావడం బాధకరమని నిర్మాత రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
చక్రి నాకు తమ్ముడు లాంటివాడని, చక్రికి నేను పెద్ద అభిమానిని, తను లేని లోటు తీర్చలేనిది అని బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. చక్రి లేడనే వార్తను నేను నమ్మలేక పోతున్నానని సంగీత దర్శకురాలు శ్రీలేఖ అన్నారు. చక్రి మన మధ్య లేకపోయినా..ఆయన అందించిన పాటల్లో బతికే ఉన్నారు. ‘జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది’ అంటూ ఆయన ఎందుకు కంపోజ్‌ చేశారో తెలియదు కానీ అది సరిగ్గా ఆయనకే వర్తిస్తుందనుకుంటున్నానని శ్రీలేఖ సంతాపం తెలిపారు.
చక్రి మృతి పట్ల పూరి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ – ”నా సోదరుడు (చక్రి)ని చాలా మిస్ అవుతున్నాను. మా ఇద్దరి కెరియర్ ఒకేసారి ఆరంభమయ్యింది, ఎన్నో అనుభూతులు పంచుకున్నాం. నా సినిమాలకు ఎన్నో మంచి పాటలిచ్చారు” అని పేర్కొన్నారు.
జగమంత కుటుంబాన్ని వదిలి… ఏకాకిగా వెళ్లిపోయాడు
పొద్దున్నే న్యూస్‌ చానళ్లలో ‘సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం’ అనే వార్త చూసినవాళ్లు ఓ పట్టాన నమ్మలేకపోయారు. సినీ వర్గాలు, ముఖ్యంగా సంగీత ప్రపంచం అసలు నమ్మలేకపోయాయి. చక్రి అనగానే ముఖాన చిరునవ్వులు చిందించే అతని స్థూలకాయమే కళ్లముందు కదులుతుంది.
‘అతను ఒళ్లు తగ్గించుకుంటే బాగుంటుంది కదా’ అనే అభిప్రాయం కలుగుతుంది. అంటే చక్రిని తెలుగువాళ్లంతా తమ ఇంటి సభ్యుడిలా సొంతం చేసుకున్నారన్న మాట. అతి కొద్దిమందే తమ మంచితనంతో ఇలా తమ ప్రభావాన్ని చూపగలుగుతారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లోని కంభాలపల్లిలో పుట్టి పెరిగిన జిల్లా చక్రధర్‌ హైస్కూల్‌ రోజుల నుంచే సంగీతంలో తొలి అడుగులు వేసి, స్టేజ్‌ మీద పాటలు పాడటం మొదలుపెట్టాడు. డిగ్రీ ఫస్టియర్‌లో ‘ఒకే జాతి మనదిరా, ఒకే బాట మనదిరా, కులభేదం లేదురా, ఒకే కులం మనదిరా’ అంటూ ఓ దేశభక్తి గీతం రాసి, దానికి బాణీలు కూడా కట్టి, ఆ పాటను పాడి బహుమతి సంపాదించేశాడు. సెకండియర్‌లో ‘సాహితి కళాభారతి’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి, ప్రోగ్రామ్స్‌ చేస్తూ వచ్చాడు. సినిమాల్లో ప్రయత్నిస్తే రాణిస్తావంటూ స్నేహితులు పోరుపెడుతుంటే, పదివేల రూపాయలు అప్పుచేసి మరీ హైదరాబాద్‌ వచ్చి వాలాడు. ఇక్కడి వాతావరణం చూసి, హైదరాబాద్‌పై పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడు. ‘హైదరాబాద్‌ నాదే’ అనుకున్నాడు. అప్పుచేసిన డబ్బు ఖర్చుపెట్టి ‘పండు వెన్నెల’ అనే ఆల్బమ్‌ తయారు చేయించాడు. కానీ కొనేవాళ్లు కనిపించక పోవడంతో దాన్ని పక్కనపెట్టేశాడు. జీవిక కోసం ఓ హాస్పిటల్‌లో డిమాన్‌సే్ట్రటర్‌గా చేరి, మూడేళ్లు పనిచేశాడు. ఆ టైమ్‌లోనే ‘పండు వెన్నెల’ను బయటకు తెచ్చాడు. అది డబ్బు తేకపోయినా, పేరుతెచ్చింది. ఆడియో కంపెనీలతో పరిచయాలు కలిగేలా చేసింది. మరో మూడేళ్లలో 30 ఆల్బమ్స్‌ విడుదల చేశాడు. చక్రధర్‌ను ‘చక్రి’గా మార్చుకున్నాడు. తన ఆల్బమ్స్‌లో ఎక్కువ పాటలను ‘చల్లగాలి’ అనే కలంపేరుతో రాశాడు. మొత్తం పాటలు తనే రాసిన ‘చిరుగాలి’ ఆల్బమ్‌ను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశాడు. అప్పటివరకూ చేసిన ఆల్బమ్స్‌ అన్నింటికంటే ‘చిరుగాలి’ సూపర్‌హిట్‌. చిత్రమేమంటే అతడికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కాక గేయ రచయితగా సినీ పరిశ్రమ నుంచి ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఓ చిరంజీవి సినిమా కూడా ఉంది. కానీ గీత రచయితగా కాకుండా సంగీత దర్శకుడిగా కెరీర్‌ కొనసాగించాలనే అభిప్రాయంతో ఉన్న చక్రి ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలకు సంగీత దర్శకుడి ఆఫర్లు వచ్చాయి. వాటినీ వద్దనుకున్నాడు చక్రి. ఎందుకంటే అతని లక్ష్యం పెద్ద సినిమా. కానీ ‘మరో చరిత్ర’ సృష్టిస్తుందని చెప్పడంతో ‘మరో ప్రేమకథ’ అనే సినిమాకు ఎంతో ఇష్టంగా ఐదు పాటలు కంపోజ్‌ చేశాడు. కానీ ఆ సినిమా వెలుగు చూడలేదు. కానీ వాటిలో ఒక పాటను ఆ తర్వాత నాగార్జున నటించిన ‘శివమణి’ సినిమాకు వాడుకున్నాడు. ఆ పాట ‘మోనా మోనా మోనా’. ఈసారి ఏ తప్పూ చేయకూడదనుకుంటూనే ‘లైఫ్‌’ అనే సినిమాని ఒప్పేసుకున్నాడు. అదీ ఆగిపోయింది. ఆ తర్వాత ఆ సినిమాలు ఆగిపోవడంలో తన బాధ్యత ఏమీ లేదని సర్దిచెప్పుకున్నాడు. ‘లిటిల్‌ హార్ట్స్‌’కు ట్యూన్స్‌ ఇచ్చాడు. ఆ సినిమా రిలీజయ్యింది, కాకపోతే కాస్త ఆలస్యంగా. ఆ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌తో తొలి సినిమా ‘బద్రి’ చేసి, సూపర్‌హిట్‌నిచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పరిచయం కలిగింది. అప్పుడు జగన్నాథ్‌, తన రెండో సినిమా ‘బాచి’ని తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆల్బమ్స్‌కు చక్రి కట్టిన బాణీలు విన్న ఆయన ‘బాచి’కి బాణీలు కట్టే బాధ్యతను చక్రికి అప్పగించాడు. ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో బాణీలు కట్టాడు. పెద్ద చిత్రం కదా, తన దశ తిరుగుతుందనుకున్నాడు. కానీ ‘బాచి’ బాక్సాఫీస్‌ వద్ద పల్టీకొట్టడంతో, చక్రికి ఎవరూ ఆఫర్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ జగన్నాథ్‌ తన తదుపరి చిత్రం ‘ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం’కు కూడా చక్రినే తీసుకున్నాడు. ప్రొడ్యూసర్లు ఒప్పుకోకపోవడంతో, చక్రి కోసం వాళ్లనే మార్చేశాడు జగన్నాథ్‌. ‘‘పైసలు పెట్టే ప్రొడ్యూసర్‌ వద్దంటే డైరెక్టర్‌ ఏం చేస్తాడు? కానీ జగన్‌ అన్నయ్య అలా చెయ్యలేదు.
నాకిచ్చిన మాట కోసం వేరే నిర్మాతను వెతుక్కున్నాడు తప్ప, మాట తప్పలేదు. అందుకే మా అమ్మానాన్నల తర్వాత నేను ఆజన్మాంతం రుణపడి ఉండాల్సింది జగన్‌ అన్నయ్యకే’’ అని ఓసారి చెప్పాడు చక్రి. ‘ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం’ విడుదలైంది. సినిమా హిట్‌. మ్యూజిక్‌ సూపర్‌ హిట్‌. ఆ సినిమాతో సంగీత దర్శకునిగా చక్రికీ, హీరోగా రవితేజకూ బ్రేక్‌ లభించింది. ఆ సినిమా తర్వాత చక్రి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలుగలేదు. జగన్నాథ్‌ డైరెక్షన్‌లోనే మరో ఎనిమిది సినిమాలకు బాణీలు కూర్చాడు. వాటిలో ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘దేశముదురు’ వంటి హిట్లున్నాయి. ‘నేనింతే’లో అతను బాణీలు కూర్చగా, భాస్కరభట్ల రాసిన ‘కృష్ణానగరే మామా..’ పాట తెలుగు సినిమా పరిశ్రమకు జాతీయగీతం లాంటిదని కితాబిచ్చాడు జగన్నాథ్‌. చివరిగా వారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గోలీమార్‌’. అలాగే వంశీ సినిమాలు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘గోపి గోపిక గోదావరి’లతో పాటు, ‘సత్యం’, ‘చక్రం’, ‘దేవదాస్‌’, ‘కృష్ణ’, ‘ఢీ’, ‘సింహా’, ‘జై బోలో తెలంగాణ’, ‘దేనికైనా రెడీ’ వంటి సినిమాలు సంగీత దర్శకునిగా అతనికి పాపులారిటీని తెచ్చాయి. వీటిలో ‘సింహా’ సినిమా అతనికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డును అందించగా, అంతకంటే ముందు ‘సత్యం’ సినిమా సంగీతం ఫిల్మ్‌ఫేర్‌ను తెచ్చింది. ఇప్పటివరకూ అతను వందకు మించిన చిత్రాలకు సంగీతం సమకూర్చగా, 97 చిత్రాల వరకూ విడుదలయ్యాయి. ‘ఢీ అంటే ఢీ’, ‘టామీ’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. చక్రి సంగీతంలోని ఆకర్షణ ఏమంటే, అవి మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా అందరినీ అలరించగలగడం. ఈ మధ్యే అతను ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాడు – ‘పనిని మరో పది రెట్లు ఎక్కువగా ప్రేమించాలి. సంగీతంతోనే ఎక్కువ సమయం స్నేహం చేస్తూ సంగీత జీవన సౌందర్యాన్ని ఆస్వాదించాలి’ అని. కానీ ఆ కోరికను తీర్చుకోకుండానే నాలుగు పదుల చిన్న వయసులోనే, సంగీత ప్రియులనందరినీ విషాదంలో ముంచేసి వెళ్లిపోయాడు.
స్థూలకాయమే శాపం
కేవలం నలభై ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చక్రి మరణించడానికి స్థూలకాయమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెరీర్‌ కొత్తలో ముద్దుగా, బొద్దుగా ఉన్న చక్రి తర్వాత స్థూలకాయునిగా మారిపోయారు. అందుకే ఆయనను టాలీవుడ్‌ బప్పీలహిరి అని సరదాగా అనేవారు. చక్రి భోజనప్రియుడనే సంగతి ఆయన సన్నిహితులందరికీ తెలిసిన విషయమే. అయితే అది మామూలు భోజనప్రియత్వం కాదు. అపరిమితమైన భోజనప్రియత్వం. సంగీత దర్శకునిగా బాగా బిజీగా ఉన్న కాలంలో రాత్రి వేళల్లోనూ పనిచేస్తూ రావడంతో ఆయన ఆహారపుటలవాట్లు, తద్వారా ఆయన జీవన విధానం మారిపోయాయి. రాత్రంతా పనిచేసి, తెల్లవారుఝామున నాలుగింటికి ఆయన ఆహారం తీసుకున్న సందర్భాలు చాలా ఎక్కువనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఇలా ఎప్పుడుపడితే అప్పుడు ఆహారం ఎక్కువగా భుజిస్తూ రావడం వల్ల ఆయన స్థూలకాయునిగా మారిపోయారు. దానితో పాటు ముఖం కూడా నలుపు తిరిగిపోయింది. ‘‘నేను కూడా ఒకానొక సమయంలో 148 కిలోల బరువు వరకూ పెరిగాను. అప్పుడు బరువుతగ్గమని చక్రి నాకు పలుసార్లు సలహా ఇచ్చాడు. నేనేమో అతన్ని తగ్గమని చెప్పేవాణ్ణి. అతని సలహాను నేను పాటించాను. ఇప్పుడు నా బరువు 75 కిలోలు. కానీ తను మాత్రం మరింత బరువు పెరిగిపోయాడు’’ అని కన్నీళ్ల పర్యంతమయ్యారు దర్శకుడు సూర్యకిరణ్‌. ఆయన డైరెక్ట్‌ చేసిన ‘సత్యం’ సినిమాకు సమకూర్చిన సంగీతంతో చక్రి మొదటిసారిగా ఉత్తమ సంగీత దర్శకునిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు. ఒక్క సూర్యకిరణే కాదు, సన్నిహితులు చాలామంది బరువు తగ్గించుకొమ్మని చక్రికి చెబుతూనే ఉండేవాళ్లు. లైపోసెక్షన్‌ చేయించుకుంటే, దాని వల్ల తర్వాత దుష్ఫరిణామాలు ఎదురవుతాయేమోననే సందేహాన్ని ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే ఆయన తన ఆహార అలవాట్లనూ మార్చుకోలేక పోయారు. ఆ బలహీనతే చివరకు గుండెపోటు రూపంలో ఆయన ప్రాణాన్ని కబళించిందని చెప్పాలి.
 
ఆంధ్రా బప్పీలహరి – చక్రి
బప్పీలహరిని ఎప్పుడూ కావాలని అనుకరించలేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు చక్రి. ఆయన ఒకప్పుడు బంగారు గొలుసులను ఇష్టంగా ధరించేవారు. వాటి గురించి గతంలో ఓ సారి చక్రి చెబుతూ ‘‘నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు చెయిన్‌ వేసుకోవాలని ఉండేది. కానీ అప్పుడు కుదరలేదు. పైగా నా ఫ్రెండ్‌ చెయిన్‌ ఒకటి తీసుకొచ్చి తాకట్టు పెట్టేశాను. దాన్ని విడిపించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. సంగీత దర్శకుడిగా స్థిరపడ్డాక ఓ సారి మా అమ్మతో కలిసి నగల దుకాణానికి వెళ్లా. అక్కడ సన్నటి చెయిన్‌ తీసుకున్నా. అది ఎప్పుడూ మెడలో ఉండేది. ఆ తర్వాత ఓ సారి దుబాయ్‌కి వెళ్లినప్పుడు లావు గొలుసులు వేసుకున్నవారిని చూశా. అప్పట్లో మన పరిశ్రమలో ఫైట్‌ మాస్టర్లు కూడా అంత పెద్ద గొలుసులు వేసుకునేవారు. దాంతో మోజుపడి నేను కొనుక్కున్నా. మ్యూజిక్‌ డైరక్టర్‌ అలా ధరించడం అందరికీ కొత్తగా అనిపించిందేమో.. అందరి దృష్టి నామీదే పడింది. దాంతో అందరూ నన్ను ఆంధ్రా బప్పీలహరి అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన్ని నేనెప్పుడూ కావాలని అనుకరించలేదు. విదేశాలకు వెళ్లి ముంబైలో ఫ్లైట్‌ దిగి వస్తుంటే ‘హలో బప్పీజీ’ అని పలకరించేవారు. నేను కూడా హాయ్‌ అని చెప్పేవాడిని. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో మా ఇంటికి మా కజిన్‌ ఓ అమ్మాయి వచ్చింది. తన కాలేజీలో నాకు ఓ పేరు ఉందని చెప్పుకొచ్చింది. ‘ఆంధ్రా బప్పీలహరి అని అంటారా’ అని అడిగా. కాదని చెప్పింది. ఇంకేంటని ఉత్సాహంతో ఆరాతీస్తే ‘గొలుసుల రామన్న’ అని పిలుస్తారని చెప్పింది. ఆ రోజు నుంచి నా మెడలో గొలుసులు వేసుకోవడం మానేశాను. ఎక్కడికైనా ఫంక్షన్లకి వెళ్తుంటే మాత్రం అమ్మ గొలుసు వేస్తుంది. చేతికి మాత్రం ఎనిమిదేళ్ల క్రితం మా సోదరి తొడిగిన కడియం ఉంటుంది. అలాగే నా భార్య శ్రావణి చేయించిన బ్రేస్‌లెట్‌ ఎప్పుడూ ఉంటుంది’’ అని అన్నారు.
జీవితగమకాలు..
పలు సందర్భాల్లో చక్రి తన గురించి పలు అంశాలను స్నేహపూర్వకంగా చెప్పుకొచ్చేవారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆ వివరాలు…
జూ వరంగల్‌లో విజయలక్ష్మి దగ్గర వయొలిన్‌ నేర్చుకున్నారు. తిరుపతయ్య దగ్గర కర్ణాటక సంగీతం (గాత్రం) మూడేళ్లు అభ్యసించారు. చక్రి విద్యార్హత ఎం.కాం.
మెహబూబాబాద్‌లో వినాయకచవితి, శ్రీరామనవమి పర్వదినాల్లో తన ఆర్కెసా్ట్రతో స్టేజ్‌షోలు చేసేవారు.
కంబాలపల్లిలో ఉండగా కబడ్డీ, కోకో బాగా ఆడేవారు. ఇంటర్‌ స్థాయిలో క్రికెట్‌, డిగ్రీలో ఉండగా టేబుల్‌ టెన్నిస్‌ ఆడటం అలవాటయ్యాయి. తన కుటుంబసభ్యులతో ఇంట్లో ఉన్నప్పుడు చక్రి చెస్‌ ఆడటానికి మొగ్గుచూపేవారు. ఎప్పుడూ ఆయనదే పైచేయి.
చక్రి తన నివాసానికి పెట్టుకున్న పేరు ‘పూజ కుటీర్‌’. తనకు సినీ పరిశ్రమలో ‘బాచి’తో తొలి అవకాశాన్నిచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ పేరును కుదించి పూజ కుటీర్‌ అని పెట్టుకున్నారు.
జూ పూరి జగన్నాథ్‌ను అన్నయ్య అని పిలిచేవారు. దర్శకుడు వం శీని అంకుల్‌ అనేవారు. చక్రిని వంశీ బిడ్డ అని పిలిచేవారు.
ఏ మాత్రం ఖాళీ దొరికినా కేరళకు వెళ్లి సేదతీరడానికి ఇష్టపడేవారు చక్రి. మున్నార్‌ అంటే ప్రత్యేకమైన ప్రీతి.
స్టూడియోలో సరిగమలు కూర్చడం మాత్రమే కాదు. గరిట పట్టి చికెన్‌ వండటంలోనూ దిట్ట చక్రి. పెన్ను పట్టి పాటలు రాయడంలోనూ సిద్ధహస్తుడు. కెరీర్‌ ప్రారంభంలో సంగీత దర్శకత్వం కోసం వెతుకుతున్నప్పుడు ఆయన చేసిన ‘పండు వెన్నెల’ ఆల్బమ్‌ విన్నవారు ‘పాటలు రాస్తావా’ అని అడిగేవారట. చిరంజీవి సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చినా నిక్కచ్చినా కాదనుకున్నారు చక్రి.
చక్రి జాతకాలను నమ్మేవారు. ఎప్పుడూ పగడపుటుంగరాన్ని కుడిచేతికి ధరించేవారు.
ప్రతి పుట్టినరోజుకు తన స్నేహితులు, అభిమానులు, బంధుమిత్రులతో రక్తదానం, నేత్రదానం చేయించేవారు.
ఫ్రెండ్‌షిప్‌ డే రోజు ప్రత్యేకంగా తన చిన్ననాటి స్నేహితులను, పరిశ్రమలోని మిత్రులను పిలిచి షడ్‌రుచులతో భోజనాలు పెట్టించేవారు.
సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తల్లో చక్రి ఫిట్‌గా కనిపించేవారు. ‘ఏమయ్యా.. నువ్వు మ్యూజిక్‌ డైరక్టర్‌వా? ఫైట్‌ మాస్టర్‌వా?’ అని తమ్మారెడ్డి భరద్వాజ ఓ సారి చమత్కరించారట. 2007 తర్వాతే తనకి భారీకాయం వచ్చిందని, సమయానికి భోజనం, నిద్ర లేకపోవడమే తన ఊబకాయానికి కారణమని, పరిశ్రమకి రాకముందు తప్పనిసరిగా వ్యాయామం చేసేవాడినని చెప్పేవారు చక్రి.
చక్రికి జేసుదాస్‌ గాత్రం అంటే ప్రాణం. జేసుదాస్‌ పాటలను చక్రి పాడగా విన్నవారు ఆయన వారసుడేనని అనుకున్న సందర్భాలూ ఉన్నాయట.
చక్రి దగ్గర రెండు సెల్‌ఫోన్‌లుంటాయి. ఓ సెల్‌ఫోన్‌లో కేవలం తన భార్య శ్రావణి నెంబర్‌ మాత్రమే ఉంటుంది. ఆమెకి తప్ప ఆ నెంబర్‌ ఇంకెవరికీ తెలియదు. ఆ ఫోన్‌ని ఇప్పటిదాకా స్విచ్ఛాఫ్‌ కూడా చేయలేదట.
తండ్రి జిల్లా వెంకటనారాయణ, సోదరి ఆదర్శిని చేత తన సినిమాల్లో పలు పాటలు పాడించారు చక్రి. ఆయన బలవంతం మీదే శ్రావణి ‘శ్రీమన్నారాయణ’లో కోరస్‌ పాడారు. చక్రి తమ్ముడు మహిత్‌ నారాయణ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.
‘జై బోలో తెలంగాణ’ కోసం కేసీఆర్‌ రాసిన పాటను స్వరపరచిన ఘనత తనదేనని అంటుండేవారు. ఆ చిత్రంలోనే ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానమా..’ పాటను గద్దర్‌ ఆలపించారు.
Related News

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.