ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి

ఆంధ్రా కాశ్మీర్ లమ్మసింగి

  • 21/12/2014
  • -కె.వి.జి. శ్రీనివాస్

అక్కడ మంచుముత్యాలు కురుస్తూంటాయి.. కొమ్మకొమ్మకూ పూలన్నట్లు…ఎటుచూసినా మంచు బిందువులే రాలుతూంటాయి… అక్కడ పిల్లగాలులతో సయ్యాటలాడుతూ తెల్లటిమబ్బులు నేలను తాకుతూ జారిపోతూంటాయి…. తెల్లటి చామంతుల్లా మెరిసి.. విరిసిన కాఫీ పూల పరిమళాలు పలకరిస్తూంటాయి… ఎతె్తైన కనుమల మధ్య, చుట్టూ పరుచుకున్న లోయల మధ్య ఒంటరిగా ఉండే ఆ సీమలో అడుగుపెడితే.. లేలేత ఎరుపుతో నవనవలాడే యాపిల్ కాయలతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తోటలు కన్పిస్తాయి. స్వర్గానికి నిచ్చెనలు ఇక్కడినుంచే వేయొచ్చన్న భావన మనసును తాకుతుంది. ఇదంతా చూస్తే మీకు అందాల కాశ్మీరం కళ్లముందు కదలాడుతుంది. కానీ ఇది కాశ్మీర్ కాదు. అక్కడున్న అందాలను తనవి చేసుకున్న లమ్మసింగి సొబగులు ఇవి. విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో ఉన్న ఈ గిరిజన పల్లె అందరికీ లంబసింగిగా సుపరిచితమే. ఎముకలు కొరికే చలికి..అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదుతో వార్తల్లోకి ఎక్కింది. పర్యాటకులనూ, ప్రకృతి ప్రేమికులను, శాస్తవ్రేత్తలను రా..రమ్మని పిలుస్తున్న లమ్మసింగి కథాకమామిషు ఇది…. ఆ గిరిజన పల్లె చలికి పుట్టినిల్లు.. కొండకోనల మధ్య ప్రకృతి అందాలు ఆరబోసుకున్న ఓ చిన్నపల్లె… మిట్ట మధ్యాహ్నమైనా ఆ ఊరివేపు తొంగి చూసేందుకు సూరీడు కూడా కాస్తంత జంకుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే చలికే వెన్నులో వణుకు పుడుతుంది. శీతాకాలం వస్తే అక్కడ నీరు గడ్డకట్టుకుపోతుంది.. పట్టపగలే చలిమంటలు వేసుకోవాలి. కొండలను ముద్దాడుతూ దిగివచ్చే తేలికపాటి తెల్లమబ్బులు మనను తాకుతూ వెళుతూంటే గుప్పిట్లో బంధించేద్దామా అన్న కోరిక పుట్టుకొస్తుంది. పోగులు పోసినట్టు కనిపించే మంచు ముత్యాలు.. ప్రకృతి అందాలన్నీ ఒకేచోట ఆరబోసుకున్నాయా.. అనిపించే ప్రాంతమది. ఈ సోయగాలను కెమెరాల్లో బంధించాలనుకున్న వారికి.. ఈ సోయగాలను తనివితీరా తిలకించాలనుకునేవారికి అనువైన లోయ ఇది. కొంతకాలం వరకూ ఈ గ్రామం గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ గ్రామం ప్రధాన వార్తల్లోకెక్కింది. డిసెంబర్-జనవరి నెలల్లో ఇక్కడ జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడమే ఇందుకు కారణం. విశాఖకు సుమారు 105 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో లమ్మసింగి ఉంది. ఇక్కడికి ఒక్కసారి అడుగుపెడితే…అదో నవలోకంలా కన్పిస్తుంది. కాశ్మీర్ అందాలన్నీ ఇక్కడ కన్పిస్తాయి. సూరీడు నడినెత్తిమీదకొచ్చినా ఇక్కడ తెల్లవారు జామున ఉండే వాతావరణమే కనిపిస్తుంది. మధ్యాహ్నం దాటితే కానీ వెలుతురు కనిపించదు. ఇంతలోనే చీకట్లు ముసురుకుంటూంటే సూరీడు ఇక సమయం లేదనుకున్నట్లు పడమటి దిక్కుకు పరుగులు తీస్తాడు. కాశ్మీరు, కులుమనాలికి దీటైన అందాలు మన మధ్యనే ఉన్నాయి. తలచుకుంటే కొద్ది గంటల్లోనే ఆ అందాల వాకిట్లోకి వెళ్లిపోవచ్చు. కొడైకెనాల్, ఊటీకో వెళితే ఎలా తన్మయత్వంలో తడిసిపోతామో, సరిగ్గా అలాంటి అనుభూతే లమ్మసింగిలో కూడా కలుగుతుందంటే అతిశయోక్తికాదు. సూర్యుడు నడినెత్తిన ఉన్నా గడియారం చూస్తే తప్ప, ఎంత పొద్దెక్కిందో ఎవ్వరికీ తెలియదు. మనిషి ఎదురుగా నిలిచినా ఆనవాలు పట్టలేనంత దట్టమైన మంచు. పట్టపగలు లైట్లు వేసుకుని తిరుగాడే వాహనాలు.. ఇదీ.. లమ్మసింగి ప్రత్యేకత. నర్సీపట్నం-చింతపల్లి మధ్య లమ్మసింగి ఉంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఈ ప్రాంతం కాశ్మీరు లోయలా కొత్త అందాలతో మెరిసిపోతుంది. సాధారణ రోజుల్లో రాష్ట్రం అంతా ఎండలు మండిపోతున్నా, అక్కడమాత్రం ఐదు నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతుంటాయి. ఏప్రిల్, మే నెలల్లో కూడా ఇక్కడ రాత్రి పూట దుప్పటి కప్పుకోవలసిందే. ఇక ఈ సీజన్‌లో జీరో డిగ్రీ ఉష్ణోగ్రతలోకి వాతావరణం చల్లగా జారుకున్నప్పుడు చెట్టు.. చేమ.. కొండ.. కోన అన్నీ మంచు తో చేసినట్లు కన్పిస్తాయి. ప్రకృతి కాన్వాస్‌పై గీసిన అద్భుత దృశ్యమిది. ప్రకృతి అందాల మాటున కష్టాలెన్నో కేవలం 500 మంది జీవించే పల్లె ఇది. లమ్మసింగి పంచాయతీ పరిధిలో 18 చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి. ఇక్కడి ఇళ్ళు విసిరేసినట్టు కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారం. విపరీతమైన చలి, మంచు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నా, ఇక్కడి గిరిజనులకు మాత్రం ఈ చలే శాపంగా పరిణమించింది. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు ఇక్కడి గిరిజనులవి. బయటకు వెళ్లి కాయకష్టం చేయకపోతే కానీ కడుపునిండదు. అలాంటి వీరికి చలి అవరోధంగా నిలిచింది. చలికి భయపడి పనుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. బయటకు రాలేక, పనులు చేసుకోలేక సతమతమవుతున్నారు ఇక్కడి అడవి బిడ్డలు. వృద్ధులు, చిన్న పిల్లలు చలికి పండుటాకుల్లా వణికిపోతుంటారు. పర్యాటకశాఖ చిన్న చూపు అందచందాల్లో కాశ్మీర్‌ను తలదనే్న లమ్మసింగి పర్యాటకంగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడికి కొద్దిపాటి దూరంలోనే ఉన్న అరకు ప్రపంచ పర్యాటకలను ఆకర్షిస్తోంది. ఆంధ్రాలో ఓ కాశ్మీరు దాగి ఉందని బాహ్య ప్రపంచానికి తెలిసేట్టు మన పర్యాటక శాఖ చేయలేకపోయింది. ప్రకృతి అందాలు ఆహ్వానిస్తున్నా పర్యాటకులు ఒకటి, రెండు రోజులు ఇక్కడ గడిపేందుకు తగిన వసతులు లేవు. పర్యాటకులు ఇలా వచ్చి, అలా వెళ్లిపోవలసిందే తప్ప, మంచుతెరల చాటున దాగిన లోయ అందాలను తనివితీరా చూద్దామంటే తగిన వసతి లేక వెళ్లిన కొద్దిసేపటికే వెనుదిరగాల్సి వస్తోంది. ఇక్కడ కనీసం కాకా హోటళ్ళు కూడా కనిపించవు. ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునేవారు తమ వెంట తినుబండారాలు విధిగా తీసుకువెళ్లాల్సిందే. ఈ గ్రామంలో కూరగాయలు కూడా దొరకవు. వారానికోసారి జరిగే సంతకు వెళ్లి ఇక్కడి గ్రామస్తులు కూరగాయలు కొనుగోలు చేసుకుంటారు. స్వచ్ఛమైన పల్లె అంతా వ్యాపారమయమైన రోజుల్లో.. అలాంటి వాసనలు సోకని స్వచ్ఛమైన అడవి పల్లె ఈ లమ్మసింగి. చెట్లమీద పూలతో పోటీ పడుతూ రంగు రంగుల చీరలతో అందంగా.. అమాయకంగా కనిపించే యువతులు చెట్ల కొమ్మల చాటు నుంచి తొంగి చూస్తూ కనిపిస్తారు. మంచు తెరల మధ్య నుంచి నీళ్ళ కడవలతో వరుసగా నడిచివచ్చే గిరిపుత్రికలు చూడ ముచ్చటగా ఉంటారు. కట్టు..బొట్టు నుంచి ప్రత్యేకంగా కనిపించే వీరిని కెమెరాల్లో బంధించాలనుకునేవారికి ఇంతకు మించిన రమణీయ దృశ్యాలు ఎక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు. అసలు పేరు కొర్రుబయలు లమ్మసింగికి మరోపేరు కొర్రుబయలు. ఈ పేరు వెనుక చిన్న కథ ఉంది. కొర్రు అంటే బిగుసుకుపోవడం అని, బయలు అంటే బయట అని అర్థం. ఓసారి ఈ గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి ఆరు బయట చలిలో కూర్చుని బిగుసుకుపోయాడట. అప్పుడు ఆ వ్యక్తి పెట్టిన పేరే కొర్రుబయలు. కాలక్రమేణా ఈ పేరు తెరమరుగై, లమ్మసింగిగా రూపాంతరం చెందింది. ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో తాజంగి గ్రామం ఉంది. ఇది సముద్రమట్టానికి 1,600 అడుగుల ఎత్తున ఉంది. దీనికి మరో 2,000 అడుగుల ఎగువన లమ్మసింగి ఉందన్నమాట. అంటే లమ్మసింగినుంచి చూస్తే కాళ్లకింద ఉన్నట్లు తాజంగి పల్లె కన్పిస్తుంది. అక్కడ కూడా ఇదే వాతావరణం దర్శనమిస్తుంది. చల్లని గాలితెమ్మెరలు మనసును ఉత్సాహపరుస్తాయి. ఇక్కడి నుంచే పొగమంచు లమ్మసింగి వైపు పరుగులు తీస్తుంటుంది. లమ్మసింగి యాపిల్ వస్తోంది… యాపిల్ అంటే కాశ్మీర్, సిమ్లా గుర్తుకు వస్తాయి. సీజన్‌లో ఇబ్బడిముబ్బడిగా యాపిల్స్ అక్కడి నుంచి దిగుమతి అవుతుంటాయి. ఇకపై మనం సిమ్లా నుంచో కాశ్మీర్ నుంచో యాపిల్స్ దిగుమతి చేసుకోనక్కర్లేదు. లమ్మసింగిలో ఇంతకన్నా నాణ్యమైన యాపిల్స్ దొరకనున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో జీరో డిగ్రీల ఉష్ణోగ్రత, ఏటా 1000 నుంచి 1200 మిల్లీ మీటర్ల వరకూ కురిసే వర్షం ఈ ప్రాంతానికి కలిసి వచ్చింది. అదే యాపిల్ సాగుకు ఉపకరించింది. సాధారణంగా గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తుంటారు. ఇక్కడ పసులు, క్యారెట్, పైనాపిల్, క్యాబేజీ పండిస్తుంటారు. వీటితోపాటు యాపిల్ కూడా ఇక్కడ పండించగలమని నిరూపించారు. ఐదు డిగ్రీకల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నచోట యాపిల్ సాగుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వాతావరణం లమ్మసింగిలో ఉండడంతో సెంట్రల్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సంస్థ ఇక్కడ యాపిల్ పండించే విషయమై అధ్యయనం చేసి, పరిశోధనలు ప్రారంభించింది. యాపిల్ సాగుకు ఇది మంచి ప్రాంతమని నిర్ధారించింది. 60 మంది రైతులతో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఇప్పుడు యాపిల్స్ ఇక్కడ కాస్తున్నాయి. నాలుగేళ్ల కిందట రాంబాబు అనే రైతు యాపిల్ విత్తనం నాటారు. అది మొక్కగా ఎదిగింది. నాలుగు సంవత్సరాలకు కాయలు కాశాయి. కాశ్మీర్ యాపిల్‌ను తలదనే్న యాపిల్ చేతికందింది. ఇంకేం..కాశ్మీర్, సిమ్లా మాదిరి యాపిల్, స్ట్రాబెర్రీ కూడా పండించగలమన్న ధీమా ఇక్కడి రైతుల్లో వచ్చింది. అంటుకట్టిన మొక్కలు నాటితే ఎనిమిదేళ్లకు కాపు మొదలై 40 ఏళ్లపాటు దిగుబడినిస్తాయి. అదే రూట్ స్టాగ్ మొక్కలను నాటితే రెండేళ్లకే పంట మొదలై, 20 ఏళ్లవరకూ పంటనిస్తాయి. ప్రస్తుతం గిరిజనులు యాపిల్ సాగులో నిమగ్నమై ఉన్నారు. లమ్మసింగి యాపిల్ తినేందుకు సిద్ధంగా ఉండండి మరి! బాక్సైట్ బాంబ్ పేలుతుందా? లమ్మసింగికి కొద్దిపాటి దూరంలోనే బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. చాలాకాలంగా పెద్దల కళ్ళు వీటిపైనే ఉన్నాయి. ఈ ఖనిజాన్ని వెలికి తీయడానికి పర్యావరణవేత్తల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ ఖనిజాన్ని వెలికి తీసేందుకు కార్పొరేట్ సంస్థలు కాస్త వెనుకంజ వేస్తున్నాయి. కానీ సమీప భవిష్యత్‌లోనే ఈ ఖనిజాన్ని వెలికి తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదే జరిగితే ఇక్కడున్న ప్రకృతి రమణీయత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ చల్లని వాతావరణం కాలుష్యమయమవుతుంది. ప్రకృతి కన్నీరు కార్చకుండా ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరెన్సీ చెట్ల కథ తెలుసా…? లమ్మసింగికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏపుగా పెరిగే కొన్ని చెట్లను కరెన్సీ నోట్లను తయారు చేయడానికి మాత్రమే వాడతారు. లంబసింగికి సమీపంలోని జాలికొండ ప్రాంతంలో ఈ చెట్లు ఎక్కువగా కన్పిస్తాయి. ప్రస్తుతం దాదాపు 30 ఎకరాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ మొక్కలను మరిన్ని ప్రాంతాల్లో పెంచేందుకు ప్రయత్నించినా పరిస్థితులు సానుకూలంగా లేక ఫలితమివ్వలేదు. కారణాలు ఇతమిత్థంగా తెలీదు. ఇక్కడివారు మాత్రం వీటిని కరెన్సీ చెట్లనే పిలుస్తారు. వాటి శాస్ర్తియనామం వారికి తెలీదు. ఇటీవలి హుదూద్ తుపాను తీవ్రతకు కొన్ని చెట్లు విరిగిపడ్డాయి. వీటి పరిరక్షణకు అటవీశాఖ రంగంలోకి దిగింది. రెండోస్థానం ఆదిలాబాద్‌దే తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఏపీలోని లంబసింగి మొదటి స్థానంలో ఉంటే తెలంగాణలోని ఆదిలాబాద్ రెండోస్థానంలో ఉంది. ఆ జిల్లాలో 90శాతం అటవీప్రాంతమే. దట్టమైన అడవులు, చుట్టూ ఉన్న చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలోని అటవీప్రాంతాలవల్ల శీతల వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉట్నూరు, ఆసిఫాబాద్, బోధ్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువ. ఈఏడాది ఇప్పటికి కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటిగ్రేడ్‌గా నమోదైంది. ఈనెలాఖరుకు, జనవరి తొలివారంలో అది 2 డిగ్రీలకు పడిపోవచ్చు. దట్టమైన పొగమంచు కప్పుకుని, ఎండ పొడకూడా పడని తండాలు ఈ జిల్లాలో ఎన్నో. రోజుల తరబడి సూరీడు తలెత్తి చూడని పల్లెలకు లెక్కేలేదు. కాఫీ.. మిరియాలూ ప్రత్యేకం లంబసింగిలో మంచు, పొగమంచు, చల్లనిగాలులు ఎంత సాధారణమో కాఫీ, మిరియాల సాగూ అంతే. అందమైన కాఫీ మొక్కల పూలు ధవళవర్ణంతో మంచుతో పోటీపడుతూ ధగధగలాడుతూ కనువిందు చేస్తాయి. నిజానికి వీటిని చూస్తే పెద్దపెద్ద తెల్లని చామంతుల్లా కన్పిస్తాయి. కాఫీ తీగలకు దండ గుచ్చినట్లు అందంగా విరిసి ఉంటాయి. గబుక్కున చూస్తే వాటిని చామంతులనే అనుకుంటాం. కడిగిన ముత్యంలా తెల్లటి పూలను చూస్తే మనసు ఎటో వెళ్లిపోతుంది. లంబసింగితోపాటు చింతపల్లి ఏజెన్సీ అంతటా మిరియాల సేద్యం పుంజుకుంది. ఇక్కడి మిరియాలకు ఘాటుకూడా ఎక్కువే. కాఫీ సేద్యం సంగతి చెప్పనే అక్కర్లేదు. మన కాఫీ గింజలు ఎగుమతికి తగిన నాణ్యతతో ఉన్నాయంటే లంబసింగి ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. లంబసింగి కథ చదివాక మీకు అనిపిస్తోంది కదూ అక్కడికి వెళ్లాలని. బయలు దేరండి మరి. లమ్మసింగికి దారేదంటే.. అతి శీతల ప్రాంతమైన లమ్మసింగికి వెళ్లాలంటే నర్సీపట్నం నుంచి చింతపల్లి మీదుగా 32 కిలో మీటర్లు ప్రయాణించాలి. హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. భద్రాచలం నుంచి లమ్మసింగికి 240 కిలోమీటర్లు. భద్రాచలం నుండి నెల్లిపాక, జికెవీధి మీదుగా ఇక్కడికి చేరుకోవాలి. ఒంపుసొంపుల ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణించి లమ్మసింగి చేరుకోవలసి ఉంటుంది. అక్కడికి వెళ్లాలనుకునేవారు ఒకటికి రెండు స్వెట్టర్లు, లేదా జర్కిన్‌లు ఎక్కువ తీసుకోవలసిందే. అచ్చమైన అమాయకత్వం లమ్మసింగిలో ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అక్కడి ప్రజలూ అలాగే ఉంటారు. మాయామర్మం ఎరగని గిరిపుత్రులు కొత్తగా వచ్చే వారిని విచిత్రంగా చూస్తారు. పలకరించడానికి సిగ్గుపడతారు. మనం చొరవచూపితే మొహం చాటేస్తారు. వారిని ఫొటోలు తీద్దామని ప్రయత్నిస్తే, ముఖం దాచేసుకుంటారు. భయంతో పారిపోతారు. ఇదంతా పరిచయం అయ్యేవరకే. మనపై నమ్మకం కుదిరేవరకే… ఒక్కసారి వారితో మాట్లాడి మచ్చిక చేసుకుంటే, వారి ఆదరాభిమానాలకు మనం మురిసిపోవలసిందే. అంత చల్లదనం ఎలా… భూ ఉపరితలం నుంచి 18-20 కిలోమీటర్ల వరకు టోపోస్పియర్ ఉంటుంది. భూ ఉపరితలం నుండి 164 మీటర్ల ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూంటుంది. నిజానికి లంబసింగి నైసర్గికంగా కీలక ప్రాంతంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 3600 అడుగుల ఎత్తున ఉంది. దీంతో చల్లదనం మామూలే. చుట్టూ ఎత్తుగా తూర్పుకనుమలు విస్తరించడం, లోతైన లోయలు, చిక్కటి అడవి, శీతలగాలుల తీవ్రత, బొగ్గుపులుసు వాయువు తక్కువగా ఉండటం వల్ల లమ్మసింగిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మంచి శీతాకాలంలో జీరో అంతకన్నా తక్కువగానే ఉష్ణోగ్రత నమోదవుతోంది. 2007నుండి మార్పు మరింతగా కన్పిస్తోంది. 2010లో తొలిసారిగా, అధికారికంగా జీరో డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో చలికి గజగజలాడాల్సిందే. -డి.శేఖర్, శాస్తవ్రేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, చింతపల్లి రూ. 5 కోట్లతో రిసార్టు ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన లమ్మసింగిని అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ ఆరు ఎకరాల్లో 25 గదులతో కూడిన రిసార్ట్‌ను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. ఈ రిసార్ట్ బయటకు పూర్తిగా గిరిజన సంప్రదాయంతో కనిపిస్తుంది. లోపల మాత్రం ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ఈ రిసార్ట్ మధ్య ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయనున్నాం. ఎకో ఫ్రెండ్లీ రిసార్ట్‌గా దీన్ని తీర్చదిద్దాలని భావిస్తున్నాం. సీజన్‌లో చాలామంది అరకు వెళ్లాలనుకుంటారు. అంతకన్నా రమణీయ దృశ్యాలు ఉన్న లమ్మసింగిని కూడా బాహ్య ప్రపంచానికి తెలిసేలా ఓ టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పాడేరు-చింతపల్లి-లమ్మసింగి-కెడి పేట మధ్య ఈ టూరిజం సర్క్యూట్ ఉంటుంది. విశాఖ నుంచి పర్యాటక శాఖ ప్యాకేజి బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది. -భీమ శంకరం , డివిజనల్ మేనేజర్, పర్యాటక శాఖ **

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.