ఏకత్వంలో భిన్నత్వం.. ఆధునిక భాషాశాస్త్రం
- – సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి
- 22/12/2014
చదువుకున్న వాళ్లు మాట్లాడే భాషకూ, చదువుకొనని వాళ్లు మాట్లాడే భాషకూ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందువల్ల? చదువుకొననివాళ్లు మాట్లాడేభాష వారి వారి ప్రాంతీయ మాండలిక భాష రూపంలో ఉంటుంది. చదువుకున్నవాళ్ల భాష దాదాపు 80 శాతం సంస్కృత పదాలతోనే నిండి ఉంటుంది. అందువల్లనే ఆ వ్యత్యాసం. చదువుకున్న వారి భాషను ‘శిష్ట వ్యవహార భాష’, లేక ‘ప్రమాణ భాష’ అంటారు. చదువుకోని వారి భాషను ‘జానపద భాష’ లేక ‘మాండలిక భాష’ అంటారు.
‘ప్రమాణ భాష’కు ముఖ్యంగా ఆరు లక్షణాలు కానవస్తాయి. 1) సమాజంలోని ఎక్కువ మందికి- నగరాలలో గ్రామాలలో నివసించే చదువుకున్న వారికీ, చదువుకొనని వారికీ అనగా చదువుకొనక పోయినా చదువుకున్న వారు అనుసరించే వారికీ అత్యధిక శాతం ప్రజలకు ‘ప్రమాణ భాష’ ఆమోదయోగ్యంగా ఉంటుంది. 2) ప్రమాణ భాష నేర్చుకొనడమే విద్యావంతుల ప్రధాన అర్హతగా, లక్ష్యంగా గుర్తింపబడుతున్నది. అందువల్లనే విద్యాబోధన అంతా ప్రమాణ భాషలలోనే జరుగుతుంది. 3) జానపదాలు, మాండలికాల ప్రయోగం కంటె ప్రమాణ భాషా ప్రయోగానికే వ్యాప్తి ఎక్కువ. ఉపన్యాసాలు, కవిత్వాలు,వచన రచనలు, వార్తాపత్రికలు, సినిమాలు, రేడియో, టెలివిజన్ మొదలైన విజ్ఞాన వ్యాపక సాధనాలన్నీ ప్రమాణ భాషనే వాడతాయి. 4) విద్యావంతుల సాంస్కృతిక, వైజ్ఞానిక ఐకమత్యానికి సంకేతంగా ప్రమాణ భాష గొప్ప పాత్ర నిర్వహిస్తుంది. ప్రజల ఐకమత్యానికి సంకేతం ప్రమాణ భాష అయితే వాళ్లను విడదీయడానికి దోహదం చేసేవిగా ప్రాంతాలకు, వర్గ మాండలికాలు తమ పాత్రలను నిర్వహిస్తాయి. 5) ప్రమాణ భాష ప్రాథమికంగా ఏదో ఒక ప్రాంతంలో ఉండి హెచ్చుగా చదువుకున్న వారి వాడుక భాష ఆధారంగా ఏర్పడి దానిలో కొద్దికొద్దిగా జానపదాలను, మాండలికాలనూ కలుపుకుంటూ వ్యాప్తం అవుతుంది. 6) కొన్ని భాషల్లో ప్రాచీన కావ్య భాషనే ప్రమాణ భాషగా వ్యవహరించడం జరుగుతుంది. అట్టి సందర్భాలలో మాండలికాల ప్రభావం ప్రమాణ భాషపై హెచ్చుగా ఉండదు.
నాలుగు మండలాలుగా తెలుగు ప్రజల విభజన
తెలుగు భాషలో నాలుగు మండలాలను గుర్తించడానికి వీలు కలిగిందనీ, ఒకటి- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలు గల ‘పూర్వమండల’మనీ, రెండు- రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు గల ‘దక్షిణ మండలమ’నీ మూడు- తెలంగాణా, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో కోస్తా, రాయలసీమలను ఆనుకొని ఉన్న తాలుకాలు తప్ప మిగతా ప్రాంతంగల ‘ఉత్తర మండలం’ అనీ 4 ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు గల ‘మధ్య మండలమనీ’ – సామాజిక భాషా శాస్త్ర పితామహుడైన భద్రిరాజు కృష్ణమూర్తిగారికి వృత్తి పదకోశాల నిర్మాణంలో సహాయకుడుగా వ్యవహరించిన డాక్టర్ పొరటి దక్షిణమూర్తి తెలియజేశారు. ఈ నాలుగు మండలాలలోనూ వివిధ వృత్తులవారు వాడే తెలుగు పదాలలో కొన్ని తీవ్ర వ్యత్యాసాలూ, కొన్ని స్వల్ప వ్యత్యాసాలూ కూడా ఉన్నాయి. అయితే ఈ వేర్వేరు పదాలకు అన్నింటికీ వౌలికమైన అర్థాలిచ్చే వౌలిక మూలాధార సంస్కృత పదాలు ఉండడం భాషా శాస్త్ర పరిశోధనలు, అధ్యయనంలో ఉత్సాహం కలవారు అందరూ గమనించదగిన విషయం.
అన్ని తెలుగు పదాలకూ వేద సంస్కృత మూలాలు
‘నాగలి’ అనే పదం, రెండు మండలాల్లో ‘నాగలి’ అనే వాడుకలో ఉండగా ఒక మండలంలో మాత్రం ‘నాగేలి’ అని వాడుకలో ఉంది. ఈ పదాలకు సంస్కృత మూలం మామూలుగా వాడుకలో ఉన్న సంస్కృత పదం ‘హలం’ కాదు, కాజాలదు. కాని మామూలుగా వాడుకలో లేని సంస్కృత పదం ఒకటి ఉన్నది. ‘లాంగలి’, లాంగల అని, ‘ఈ ‘లాంగల’ అనే సంస్కృత పదం చదువురానివారి వాడుకలో ‘నాగలి’గా వాడుకలోనికి వచ్చిందని మనం ఊహించలేమా? ‘మోటబావి’లోని ‘మోట’ అనే పదం కూడా మరో రెండు మండలాల్లో వాడుకలో ఉంది. ఒక మండలంలో మాత్రం ‘కపిల’ అనే పదం వాడుకలో ఉంది.
మాండలికాలకు మూలం ప్రాచీన ద్రావిడ భాషలు
ఇలా అన్ని మాండలిక పదాలకూ వౌలిక రూపాలైన వేద సంస్కృత పదాలు కొద్ది శ్రమచేసి పరిశీలిస్తే ఎవ్వరికైనా తప్పక లభిస్తాయి. కాని ‘ఈ మాండలిక పదాల మూల రూపాలు వేద సంస్కృత పదాలు కాదు. ద్రావిడ పదాలు మాత్రమే వాటి మూల రూపాలు. అట్టి ప్రాచీన ద్రావిడ భాష సమగ్ర రూపాన్ని కనుగొనడానికే మేమిప్పుడు కృషిచేస్తున్నాం’ అంటున్నారు కొందరు మహానుభావులు. సూర్యోదయాన్ని చూడడానికి తూర్పు దిశగా పయనించడానికి బదులు పడమటి వైపుగా ఎంతో ఉత్సాహంతో, ఉద్రేకంతో, ఉద్వేగంతో అడుగులు వేస్తూ-. దాన్ని పురోగమనం అంటారా? ‘తిరోగమనం’ అంటారా? విజ్ఞులే గ్రహిస్తారు. ఇలా దక్షిణదేశాలన్నిటిలోకీ మొట్టమొదటగా భారతదేశంలో, అందునా ఆంధ్ర ప్రదేశాలు తెలుగు భాషలో వృత్తిపదకోశాలు తయారుచేసి- చూశారా? ఈ ద్రవిడ భాషలలో ఎంత వైవిధ్యం ఉన్నదో? ఇంతటి సమగ్రమూ, నిర్దుష్టమూ అయిన ద్రావిడ భాషా చరిత్ర రాయడానికి అనాగరిక భాషా సామగ్రి ఎంత అవసరమో గ్రహిస్తున్నారా? అని ఒకప్పుడు సామాజిక భాషా శాస్త్ర పితామహులు భద్రిరాజు కృష్ణమూర్తి అనడం ఆశ్చర్యం కలించక మానదు. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం పరిశీలింవవలసి యున్నది. అదేమిటంటే- అసలు ‘శాస్త్రం’ అంటే ఏమిటి? ‘శాస్త్రం’ ప్రయోజనం ఏమిటి? అని. సృష్టిలోని మానవ జీవితంలోని వివిధ విషయాల పరిణామక్రమాన్ని యధాతథంగా తెలియపరుస్తూ, ‘ఈ క్రమమే, ఈ విజ్ఞానమే అనుసరణీయం’ అని శాసించేది ‘శాస్త్రం’. ఇలా శాసించడం వలన ప్రయోజనం ఏమిటి?
శాస్త్ర ప్రయోజనం భిన్నత్వంలో ఏకత్వం
ఇలా శాసించడం వలన, అనగా శాస్త్రం వలన ప్రయోజనం ఏమిటి?- అంటే- భిన్నత్వంలో ఏకత్వాన్ని సందర్శింపజేయడం.. తద్వారా ప్రతి మనిషి మనస్సునకూ ఏకాగ్రతను లభింపజేసి- తద్వారా అమంద ఆనందానుభూతిని కలిగించి జన్మచరితార్థం అయిందనే సంతృప్తిని కలిగించడం. మనస్సు ఏకాగ్రమై ఉండడమే ఆనందానికి ప్రతీక. మనస్సు పరిపరివిధాలుగా సంచరిస్తూ ఉండడమే అన్నిరకాలైన ఆందోళనలకు దుఃఖానికీ కారణం.
ఏకత్వంలో భిన్నత్వం సృష్టించే వారు ఏం చెయ్యాలి?
చదువుకున్న వాళ్లందరూ మాట్లాడే ‘ప్రామాణిక భాష’లో 80 శాతం సంస్కృత పదాలు, 20 శాతం మాత్రమే మాండలికాలూ ఉండగా మనం మాట్లాడుతున్న, వ్రాస్తున్న భాష అంతా- ‘్భష’ అనే పదంతో సహా ‘సంస్కృతమే’ అయి ఉండగా- ‘సంస్కృతం’ ఈ భాషలకు మూలం కాదు- ఈ ద్రావిడ భాషలన్నింటికీ మూలమైన ‘మూల ద్రావిడ భాష’ ఎక్కడ ఏ ప్రాంతంలో విశేషంగా వాడుకలో ఉందో పరిశోధించి ప్రజల ముందు ఉంచాల్సి ఉన్నది. ఈ ద్రావిడ భాషలకూ, ఆర్యల భాష, వేద భాష దేశ భాష అయిన సంస్కృతానికీ ఎక్కడా ఏ సంబంధమూ లేదు’ అంటూ తన భాషలోనే తన మాటల్లోనే 80 శాతం సంస్కృత పదాలను ఉపయోగిస్తూ ప్రకటించడం- వితండవాదం తిరోగమన వాదం కాక మరేవౌతుంది? ఇలా తిరోగమన దిశగా భాషా శాస్త్ర ప్రస్థానం జరుగుతుంది. అవాక్కులై చూస్తూ ఊరుకుండేవారిని ఏమని ప్రశంసించాలో అర్థం కావడంలేదు. తాటాకుల చప్పుళ్లకు కుందేళ్లు బెదరవులే అని దీని అర్థమా?