ప్రపంచీకరణలో తెలుగు కథా సాహిత్యం
- – బానోత్ అనితబాయి, 9441680713
- 22/12/2014
చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, ఉపాధి కోల్పోతున్న కుల వృత్తుల గురించి వ్యాఖ్యానించిన సాహిత్యం తెలుగులో విస్తృతంగా వచ్చింది. ప్రపంచీకరణ, అభివృద్ధీకరణ, నగరీకరణ తెచ్చిపెట్టే సమస్యలకుతోడు ప్రాజెక్టుల కింద భూములను తక్కువ ధరకు కొనుక్కుని వలసవాదులు తెలంగాణలో స్థిరపడ్డారు. దాంతో తెలంగాణ ప్రజలు వారి భుక్తినుండి, తరతరాల వ్యవసాయ కృషినుంచి, గ్రామాల నుండి మూలాల నుంచి దూరమై నైజాం పాలనకన్నా భయంకరమైన భూసమస్యను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ సంపదలను దోచుకొని తెలంగాణను వలస భూమిగా మారుస్తున్నారనే ఆవేదనను కథల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా పులుగు శ్రీనివాస్ ‘సంకర విత్తులు’, పి.చంద్ ‘్భ నిర్వాసితులు’, సుజాతారెడ్డి ‘గుడిసెలు గుడిసెలు’ కథలను ప్రత్యేకించి చెప్పవచ్చు.
ప్రపంచీకరణ వల్ల వ్యక్తికీ, సమూహానికి మధ్య ఒక కృత్రిమమైన దూరం ఏర్పడుతోంది. దాన్ని జయించడానికి చైతన్యవంతుడైన వ్యక్తి కొన్ని ప్రత్యామ్నాయాల్ని వెతుక్కోక తప్పదు. అది అనివార్యత. ఆ అనే్వషణకు ప్రధానమైన సాధనం స్థానికత. ఈ నేపథ్యంలో కాలువ మల్లయ్య కథలు రాసారు. నూతన వ్యవసాయిక, సాంకేతిక విధానాలు, పరిణామాలు, ఫలితాలు వస్తువుగా కలిగిన కథ ఇది. కుల వృత్తుల మూలాలను, వాటి విచ్ఛినాన్ని వాటిలో వచ్చిన ఆధునికీకరణను ఈ ‘పరారుూకరణ’ ఆవిష్కరించింది.
ప్రపంచీకరణ క్రమంలో గ్రామాలను, గ్రామ సంపదలను అందులో భాగంగా రైతు జీవితాన్ని ఆక్రమించుకొంటూ, మింగేస్తూ బహుళజాతి సంస్థలు విస్తరిస్తూ బలపడే క్రమాన్ని స్వామి రాసిన ‘తెల్లదయ్యం’ కథ సమర్థవంతంగా చిత్రించింది. కుల వృత్తులు అంతరిస్తూ జీవితాలలో తెచ్చే సంక్షోభాన్ని పెద్దింటి అశోక్‌కుమార్ తన కథలలో చిత్రించారు. ‘తెగిన బంధాలు’ కథలో పెండ్లిళ్ళ పద్ధతులు మారటంవలన కూరాడు కుండలకు, పోలు ముంతలకు పెళ్ళితంతులో స్థానం లేకుండాపోవటం అది కుమ్మరికి ఇంతకుముందున్న ప్రాధాన్యతను అభావం చేయటం, ఒక్క కుమ్మరులే కాదు డబ్బు పెట్టుబడి, వ్యాపారీకరణల ప్రాధాన్యతలో అభివృద్ధిచెందిన కొత్త పెండ్లి తీరులో చాకలి, మంగలి, మాదిగ మొదలైన అన్ని కులాల వాళ్ళూ ఉపాంతీకరించబడటం చిత్రితమయ్యాయి.
కాగుబొత్త కథ కుమ్మరి జీవన విషాదాన్ని చిత్రించిన కథ. జాతరలో చలివేంద్రం పెట్టడానికి మట్టికాగులు చేసే పని తండ్రి చేపడితే నీటి ప్యాకెట్లను అమ్ముకొనే కాంట్రాక్టు పట్టాడు కొడుకు. బతుకుతెరువు పాకులాటలో తండ్రీ కొడుకుల సంబంధాలు నిలబడనివే అయినాయి. నీళ్ళను ముల్లెగట్టి అమ్మే వ్యాపారం వచ్చి కాగు బొత్తకు స్థానం లేకుండా చేసిన క్రమంలో ఉన్న హింస ఈ కథ వివరిస్తుంది. వ్యాపార సంస్కృతి గ్రామీణ సహజ వనరులను కొల్లగొట్టే ప్రమాదం ఎంతగా ఉందో ‘పేగు ముడి’ కథలో అశోక్‌కుమార్ సూచించారు. ‘కీలుబొమ్మలు’ కథలో ప్రపంచీకరణ క్రమంలో కార్పొరేట్ వ్యవసాయ విధానం గ్రామాలలోకి చొచ్చుకొని వస్తూ రైతుల, కూలీల జీవితంలో నింపుతున్న సంక్షోభాన్ని ప్రతిఫలించింది.
కాలువ మల్లయ్య రాసిన కథలు ఒకవైపు నూతన ఆర్థిక విధానాల కారణంగా గ్రామీణ వ్యవసాయిక జీవితంలో వచ్చిన సంక్షోభాన్ని, మరొకవైపు పారిశ్రామిక విధానాలలో వస్తున్న మార్పులను చిత్రించాయి. ‘నేల తల్లి’లో వ్యవసాయం గిట్టుబాటుకాక, పెట్టుబడులకు అప్పులు తేలేక, మార్కెట్ తనకు అనుకూలంగా లేక, వ్యవసాయం వదులుకోలేక రైతు పడే వేదనను చిత్రించింది. పారిశ్రామికీకరణం, ప్రపంచీకరణం, యాంత్రీకరణం, వ్యాపారీకరణం మొదలైన దుష్టశక్తులు పల్లె-పట్టణ ప్రజాజీవితాల్లో చేసిన గాయాలను గూర్చి ఎంతో ఆవేదన చెందుతూ తెలంగాణ కథకులు అద్భుతమైన కథలందించారు.
ఈ కథల్లో మట్టివాసనలు మాయమవుతున్న తీరు, గ్రామ స్వరూప స్వభావాలు, వృత్తులు నశించిపోతూ పనిముట్లు మూలన పడేయాల్సి వచ్చి బాధపడే తీరు, భూములు అన్యాక్రాంతం కావడం, జానపద కళలు అడుగంటిపోవడం, వలసలు అనివార్యం కావడం, ఫ్యాక్టరీల మూసివేతతో బతుకుదెరువు కోల్పోయిన దీనస్థితికి దిగజారి మనోవేదన చెందుతూ, ఆత్మహత్యల పర్వంతో వాస్తవ జీవిత గాథలను అక్షరీకరించడం కనిపిస్తుంది. రెండవ తరం రచయితలు కథలు రాసేనాటికి రాయలసీమలో చెప్పుకోదగ్గ మార్పులు చాలానే వచ్చాయి. స్కూళ్ళు, కాలేజీలు బహుళ సంఖ్యలో పెరిగాయి. సెకండరీ స్థాయివరకూ ఉచిత విద్య లభించటంవల్ల మధ్యతరగతికి విద్య అందుబాటులోకి వచ్చింది. పల్లెపల్లెకూ రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. కపిల మోటల స్థానంలో కరెంటింజన్లు వచ్చాయి. కొంత కాలం గడిచేసరికి గొట్టపు బావులు వచ్చాయి. ఇంతకుముందు శ్రమను పెట్టుబడిగా మార్చి పంటలు పండించే రైతులు ఇప్పుడు డబ్బును పెట్టుబడిగా చేసి వ్యవసాయం చేయటం వల్ల క్రమంగా చితికిపోతున్నారు. ఓట్ల రాజకీయాల జోరు క్రమంగా పెరిగింది. ఓట్లకోసం రాజకీయ నాయకులు అమాయకపు పల్లెల్ని రెండువర్గాలుగా చీల్చటం ప్రారంభించారు. కులం మునుపెన్నడూ లేనంతగా పడగ విప్పింది. ఫ్యాక్షన్ పెరిగింది.
రాయలసీమ రైతుకు పండే పంటలు అంతంతమాత్రం. తీరా దాన్ని అమ్మబోతే ఎలాంటి మోసానికి, దోపిడీకి గురౌతున్నాడో తెలియజెప్పే కథలు రచయితలు రాసారు. శాంతి నారాయణ రాసిన ‘దళారీ’, సింగమనేని నారాయణ రాసిన ‘అడుసు’లాంటి కథలు ఇందుకు మంచి ఉదాహరణలు. అంతేకాదు ఈ నేపథ్యం పలు సందర్భాల్లో ఉత్తరాంధ్రకు చెందిన గ్రామీణ, సెమీ, అర్బన్, గిరిజన్ ప్రాంతాలకు చెందినది కావడంతో స్థానిక ముద్ర ఆయా కథలకు మరికొంత ప్రత్యేకతను సమకూర్చింది. అవాంఛనీయ యంత్ర నాగరికతలో చేతి వృత్తులను వెలివేస్తున్న పల్లెలు, ఈ హృదయ విదారక దృశ్యాలన్నీ ‘్భమి పుండు’, ‘తిరుగుడమ్మి’, ‘నీటి ముల్లు’, ‘ఏటి పాట’, ‘వలస పక్షి’ కథల్లో ఆవిష్కరించారు గౌరునాయుడు.
వృత్తులు నశించి ప్రత్యామ్నాయం లేని బతుకుతో జనం విలవిలలాడుతున్నారు. కొన్ని సంస్కృతులు, భాషలు కనుమరుగయ్యే పరిస్థితులొస్తున్నాయి. మానవతా విలువలు మృగ్యమవుతున్నాయి. సేవాభావం నశించి స్వార్థం పెరిగిపోతుంది. డబ్బుకు ప్రాముఖ్యం ఎక్కువై రక్తసంబంధాలను కూడా నశింపచేస్తుంది. మనుషుల మధ్య, జాతుల మధ్య, ప్రాంతాల మధ్య వైరుధ్యాలు ఎక్కువవుతున్నాయి. ‘మానవుణ్ణి అమానవుడిగ మార్చే పెట్టుబడిదారి వ్యవస్థ పరిణామ రూపం సామ్రాజ్యవాదం, దాని అంతిమ దశ ప్రపంచీకరణ.’ పెరుగుతున్న ప్రపంచీకరణలో పెరుగుతున్న డబ్బు అవసరాలు, ప్రాధాన్యత, వృత్తి పనివాళ్ళ జీవితాలలో వస్తున్న సంక్షోభం వీటికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి ఆవిష్కరించటంలో తెలుగు కథకులు సఫలీకృతులవుతూ రచయితలుగా తమ సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తున్నారు.