రాగాల తోట.. వీటూరి పాట

రాగాల తోట.. వీటూరి పాట
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి… (దేవత-1965), బలేబలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు (భక్తతుకారాం-1973), మబ్బే మసకేసిందిలే, పొగమంచే తెరగా నిలిచిందిలే (వయసు పిలిచింది-1978), నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా (మల్లెపువ్వు-1978)… తెలుగువారు ఏనాటికీ మరిచిపోలేని గీతాలు ఇవి. కానీ ఈ మధుర గీతాలు రాసిన మహాకవి ‘వీటూరి’ని మాత్రం చాలామంది మరిచిపోయారు. కారణం… ఆయన పేరు మరో మహాకవి వేటూరి పేరును పోలి ఉండడం! వీటూరి రాసిన గొప్ప పాటల వల్ల అప్పుడప్పుడూ ఆ పేరు వినిపించినా, దానిని వేటూరిగా భ్రమపడే అవకాశమే ఎక్కువ. వేటూరి, వీటూరి – ఇద్దరూ పాటలు రాసిన ‘యమగోల’ చిత్రం (1977) పాటల పుస్తకంలో చివరి పాటకు కవి పేరు ‘వీటూరి సుందరరామమూర్తి’ అని పొరబాటుగా ప్రచురించడం ఇలాంటి ప్రమాదానికి ఓ ఉదాహరణ!
వీటూరి పూర్తిపేరు వీటూరి వేంకట సత్యసూర్య నారాయణమూర్తి. 1934 జనవరి 3న విజయనగరం జిల్లా ‘రెల్లివలస’లో ఆయన జన్మించారు. భీమిలిలో ఉపాధ్యాయ శిక్షణను పూర్తిచేసి స్వల్ప కాలం ఆ వృత్తిలో ఉన్నారు. ‘అక్కాచెల్లెలు’ చిత్రానికి రచనా సహకారం అందించడానికి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఆయన పేరు వెండితెరకెక్కింది మాత్రం శ్రీ మురళీకృష్ణా ఫిలింస్‌ వారి డబ్బింగ్‌ చిత్రం ‘శ్రీ కృష్ణ లీలలు’(1956)తోనే! ఆ చిత్రంలో ‘మురళీధరా కృష్ణయ్య, నిన్నే నమ్ముకొంటినయ్యా’ అనే చివరి పాటను వీటూరి రాశారు. ఆ తర్వాత ‘మహారథి కర్ణ’, ‘జగదేకసుందరి’ అనువాద చిత్రాలకు ఇతరులతో కలిసి పాటలందించినా, 1962లో ‘ఏకైక వీరుడు’(మన్నాది మన్నన్‌) డబ్బింగ్‌ చిత్రానికి రచనతోనే పరిశ్రమలో స్థిరపడ్డారు. అదే ఏడు కృష్ణకుమారి, కాంతారావు జంటగా నటించిన ‘స్వర్ణగౌరి’ చిత్రానికి కూడా మాటలు, పాటలూ రాసే అవకాశం వచ్చింది. వీటూరి ప్రతిభను గుర్తించి విఠలాచార్య, పద్మనాభం, హీరో కాంతారావు ఆయనను ఎక్కువగా ప్రోత్సహించారు.
ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ గాయకుడిగా పరిచయమైన ‘ఓ! ఏమి ఈ వింత మోహం…’ (శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న 1967) గీతం వీటూరి (సు)కృతమే! అద్భుతమైన భావాలు కలిగిన ఎన్నో మధుర గీతాలతోపాటు నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన (బంగారు తిమ్మరాజు-1964), గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు (ఇదాలోకం-1973), గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను (యమగోల 1977) వంటి హుషారైన పాటలూ రాసి ఆయన శభాష్‌ అనిపించుకున్నారు.
వీటూరి రచన చేసిన శతాధిక చిత్రాలలో దాదాపు సగం డబ్బింగ్‌ చిత్రాలే! తెలుగులో తీసిన నాలుగు భాషల (హిందీ, తమిళ, కన్నడ, మలయాళ) డబ్బింగ్‌ చిత్రాలకూ రచన చేసిన ముగ్గురు కవుల్లో వీటూరి ఒకరు. ‘ఏకైక వీరుడు’ (మన్నాదిమన్ననే), మన్మథలీల’ (మన్మదలీలై), ‘ఎర్ర గులాబీలు’ (సిగప్పురోజాక్కళే), ‘ధనమే ప్రపంచలీల’ (తాయిక్కుతలైమగనే), ‘అమరగీతం’ (పయనంగళ్‌ ముడివదిల్లె), ‘పట్నంపిల్ల’ (మనిదరిల్‌ ఎత్తనయో నిరంగళ్‌) మొదలైనవి వీటూరి ప్రసిద్ధ అనువాద చిత్రాలు.
తమిళ చిత్రం ‘మన్నాది మన్నన్‌’లో ఎంజీఆర్‌ కథకూ, తన అన్నాడీఎంకే పార్టీకి రెంటికీ అన్వయించేలా ‘కణ్ణదాసన్‌’ చేత ఒక పాట రాయించారు. ‘అచ్చమ్‌ ఎలేబదు మడమైయడా, అంజామై ద్రావిడర్‌ ఉడమైయడా, ఆరిలుమ్‌ సావు నూరిలుమ్‌ సావు తాయగమ్‌ కాప్పదు కడమైయడా’ అనే ఈ పాటకు ‘‘భయమనేది మూర్ఖత్వం. సాహసం ద్రావిడ లక్షణం. ఆరేళ్లకు చచ్చినా, నూరేళ్లకు చచ్చినా మాతృభూమిని కాపాడడం మన కర్తవ్యం. చేర, పాండ్య రాజులు తమ వీరత్వంతో జన్మభూమిని పునీతం చేశారు. తమిళ తల్లులు తమ బిడ్డలకు పుట్టుకతోనే వీరత్వాన్ని నూరిపోస్తారు. ఆ తల్లి గౌరవానికి భంగం కలిగితే ఆ పుత్రులు శూరులై పైకి లేస్తారు’’ అని భావం. దీని తెలుగు డబ్బింగ్‌ ‘ఏకైక వీరుడు’ లో ‘న్యాయం ధర్మం మరువకురా, ఏనాడూ ఎవరికి వెరువకురా, ఆంధ్రుల త్యాగం, ఆంధ్రుల శౌర్యం అవనిలో స్థిరముగ నిల్పుమురా…’ అంటూ ప్రాంతీయ భావాన్ని ప్రభోదిస్తూ స్వేచ్ఛానువాదం చేశారు వీటూరి. చరణాల్లో రుద్రమదేవి, మాంచాల, బ్రహ్మన, బాలచంద్రుడు మొదలైన వారి వీర ప్రశంస చేయడం ద్వారా ఈ పాటకు పూర్తి తెలుగుదనాన్ని అద్దారు.
‘మన్మదలీలై’లోని ‘హలో మైడియర్‌ రాంగ్‌ నంబర్‌, కేట్కవే ఉందన్‌ కురల్‌ సొర్గమే, నెరితే పార్తాల్‌ ఎన్న వెట్కమే’ అనే మూల గీతానికి ‘హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌, గొంతుకే వింటే ఎంత మధురం, చెంతకే వస్తే ఎంత స్వర్గం’ అనే పాట తెలుగుదనం ఉట్టిపడే వీటూరి అనువాద ధోరణికి మరో నిదర్శనం. సె్ట్రయిట్‌ చిత్రాల్లోని పాటలతో సమంగా ప్రాచుర్యాన్ని పొంది నేటికీ చెవిమరుగు కాని వీటూరి అనువాద గీతాలకు మరికొన్ని ఉదాహరణలు 1. ఎదలో తొలి వలపే, విరహం జత కలిసే, మధురం ఆ తలపే నీ పిలుపే (ఎర్రగులాబీలు-1979) 2. నెలరాజా, పరుగిడకు, చెలి వేచే నా కొరకు (అమరగీతం-1982) 3. పయనించే చిరుగాలీ, నా చెలి సన్నిధిలో చేరి (పట్నం పిల్ల-1980), 4. త్రిపుర సుందరీ, దర్శనలహరీ (జగద్గురు శంకరాచార్య- 1981).
అనువాదకవిగా తన సత్తా నిరూపించుకున్న వీటూరి పట్ల ఆ రంగానికి చెందిన నిర్మాతలకు గల గురికి నిదర్శనమైన ఓ ఉదంతాన్ని గుర్తు చేసుకోవాలి. ‘శుభలేఖ’ చిత్రానికి ముహూర్త గీతంగా రికార్డు చేసిన వీటూరి పాట కారణాంతరాల వల్ల ఆ చిత్రంలో చోటుచేసుకోకపోతే – ఆ పాట నచ్చిన ‘బందిపోటు విప్లవ సింహం’ (తమిళంలో ‘రాణువవీరన్‌’) నిర్మాతలు దానిని తమ చిత్రంలో అదనపు పాటగా (మూలంలో లేదు) వినియోగించుకున్నారు. శ్రీదేవి, రజనీకాంత్‌, చిరంజీవి ప్రముఖపాత్రల్లో నటించిన ఈ భారీ చిత్రంలో దీనిని ఓ ఐటం సాంగ్‌గా చిత్రీకరించారు. వ్యక్తిగతంగా వీటూరి ఎలాంటి భేషజాలు లేని నిరాడంబరుడు, సహృదయుడు. ‘దేవత’ చిత్రానికి ‘సింగిల్‌ కార్డ్‌’ పడాల్సిన ఆయన నిర్మాత పద్మనాభం కోరిక మేరకు తను రాసిన బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, మావూరు మదరాసు, నా పేరు రాందాసు… అనే పల్లవులను ప్రసిద్ధులైన సహకవులకిచ్చి వారిచేత పాటలను రాయించారు. పై రెండింటిలో మొదటి పాటను రాసిన శ్రీశ్రీ వీటూరి ఔదార్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు కూడా! (‘పాడవోయి భారతీయుడా’ పుస్తకంలో).
వీటూరి చివరి అనువాద చిత్రం 1985 డిసెంబరు 6 న విడుదలయిన ‘యవ్వనం పిలిచింది’. ఆ చిత్రం విడుదల కాకుండానే వీటూరి 1985 సెప్టెంబర్‌ 21న అనారోగ్యంతో అకాల మరణం పాలయ్యారు. చనిపోయే నాటికి ఆయన పేరు తప్ప ఏమీ మిగుల్చుకోలేదు. అటు అనువాదాల్లోనూ, ఇటు నేరుగా తీసిన తెలుగుచిత్రాల్లో నేటికీ నిలిచిన ఆణిముత్యాల్లాంటి పాటలెన్నిటినో రచించిన వీటూరి ప్రతిభకు తగ్గ గుర్తింపు మాత్రం లభించకపోవడం బాధాకరం.
ఫ డా. పైడిపాల
సెల్‌:9989106162

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.