గ్రంథాలయ సాహితీమూర్తి వెలగా వెంకటప్పయ్య
- – సన్నిధానం నరసింహశర్మ, 9292055531
- 05/01/2015

–స్మృతి–
వెలగా వెంకటప్పయ్య పేరు వినగానే గ్రంథాలయ రంగం ఠకీమని గుర్తుకు రావడమే ఆ రంగంతో ఆ వ్యక్తి శక్తి ఎంతగా మమేకమయిందో తెలుస్తుంది. అందుకు ఎన్ని నాళ్ళు ఎన్ని ఏళ్ళు సేవ చేస్తే దక్కుతుంది ఆ యశస్సు. అయ్యంకి వెలగా ‘నా వారసుడు’ అని ప్రకటించారు. ‘విజ్ఞాన వికాస’ విధానంలో వెలగా సిద్ధ‘హస్తు’డని వావిలాల శ్లాఘించారు. ‘విజ్ఞానం, కృషి ఈ రెండింటి దృష్ట్యా వెలగా స్థానం అగ్రశ్రేణిలో ఉన్నదనే దేవులపల్లి రామానుజరావు ప్రశంసలో ఆలోచనాత్మక విశే్లషణ ఇమిడి వుంది. కొందరు ఉద్యమపు పెద్దలు, కొందరు శాస్ర్తియ రంగపు పెద్దలూ వున్న కాలంలో గ్రంథాలయ ఉద్యమానికి ఆధునిక గ్రంథాలయ శాస్త్ర విజ్ఞానానికి వారధిగా నిలవడం వెలగా ప్రత్యేకత. తెలుగు సాహిత్యశాఖల్లో గ్రంథాలయ సాహిత్యశాఖ కూడా సరస్వతీ నదిగా సాక్షాత్కరిస్తుంది. ఎప్పుడో కాశీనాధుని నాగేశ్వరరావు ఆంధ్ర వాఙ్మయ సూచిక ఇప్పటికీ సాహితీ పరిశోధకులకు మార్గదర్శిగా ఉంటున్నట్లే వెలగావారి గ్రంథ సూచులు గ్రంథాలయ సాహితీ పరిశోధకులకు నూతన శాస్ర్తియ పద్ధతుల్లో మార్గదర్శకాలవుతాయి.
1956లో గుంటూరు జిల్లా రేపల్లె శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ పాలకునిగా చేరికనుండి తీరిక లేకుండా ఒక ప్రక్క సాంకేతిక సంబంధ గ్రంథాలు వ్రాస్తూ మరోప్రక్క తెలుగు సాహితి వెలగాలని తమవంతు సేవలు ఆయన అందిస్తూనే వున్నారు అని ఆయన దినచర్యా విశేషాలయ్యాయి. చిన్న స్థాయినుండి పెద్ద స్థాయివరకు గ్రంథాలయ పాఠ్యగ్రంథాల రచయితగా ఆయన వనె్నకెక్కారు. ఆంగ్లంలో కూడా గ్రంథ రచన చేయడంతో దేశీయంగానూ పేరుపొందారు. కడపలో సి.పి. బ్రౌను గ్రంథాలయానికి నిర్మాణ పథక రూపకల్పన వెలగావారే చేశారని జానుమద్దివారే ప్రకటించారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వాషింగ్టన్, భారత ప్రభుత్వాలు కలసి చేబట్టిన భారతీయ ప్రచురణల మైక్రో ఫిల్ముల పథకానికి వెలగా సహకారమందించారు.
నార్ల వెంకటేశ్వరరావు శత జయంతి స్మరణిక సంపాదకుని ఆయన ‘సాహిత్య రంగంలో నార్ల’ అనే ప్రకరణాన్ని ప్రయోజనవంతంగా తీర్చారు. భావ విప్లవకారుడు నార్ల వంటి విశేష వ్యాసాలను ఆయన సాహితీ లోకానికందించారు. సాహితీ పరిశోధకులకు ఆయన గాంధీ వాఙ్మయ సూచి, రవీంద్ర వాఙ్మయ సూచి వంటివి వినియోగార్హతను తెలిపాయి. దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత చక్రపాణిపై ఆయన సంపాదకుడుగా వచ్చిన చక్రపాణీయం పసగల వైవిధ్య భరిత ‘చక్రపాణి’ రుచుల్ని ఎన్నో అందించింది. చక్రపాణి అనువాదకథా రచనలు సినిమా సాహిత్య రచనా నైపుణ్యాలపై ఆ గ్రంథం ఉత్తమోత్తమ గ్రంథం అని అందలి వింగడింపులు హేమాహేమీ రచనల సేకరణలే చెబుతాయి. చక్రపాణిపై వెలగావారు రాసిన గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించి రచయిత ప్రతిభని తెలిపింది. మహీధర జగన్మోహనరావుతో కలిసి వెంకటప్పయ్య తయారుచేసిన ఆంధ్ర వాఙ్మయ సంగ్రహ సూచిక శ్రమైక సాధ్యఫలం ‘తెలుగు చదువు చాలా తేలిక’ అనే వెలగా వయోజన విద్యాపుస్తకం ప్రయోజనదాయకమై పలు పునర్ముద్రణల్ని చూసింది. మూడువేల పైచిలుకు పొడుపు కథల్ని సేకరించి, వింగడించి శాస్ర్తియ దృష్టితో మనకందించిన సాహిత్య సేవకుడు వెలగా. రాయలసీమ పొడుపు కథల్ని ప్రత్యేకంగా ఆయన సేకరించారు. తెలుగు బాల సాహితీ వికాసం ఆయన నుండి వచ్చిన మంచి సిద్ధాంత గ్రంథం. పెద్దగా లోతులు లేకపోయినా ఆయన ‘తెలుగు ముద్రణ వికాసం’ గ్రంథం సేకరణాధిషణత్వం కలిగి వెలిగింది. సి.పి.బ్రౌను నిఘంటువుల్ని పునర్ముద్రింపజేయడంలో శంకర నారాయణ తెలుగు- ఇంగ్లీషు, ఇంగ్లీషు తెలుగు నిఘంటువులను పునర్ముద్రింపజేయడంలో ఆయన పరిశ్రమ ప్రశంసనీయం. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన తెలుగు నిఘంటు వికాసం గ్రంథాన్ని రాసి నిఘంటు పరిణామాల్ని అక్షరబద్ధం చేశారు. తెనాలి చరిత్ర- సంస్కృతి వంటి ఎన్నో గ్రంథాలకు ఆయన సంపాదకుడయ్యారు. విశిష్ట గ్రంథ సంపాదకులలో ఆయన ఒకరుగా నిలద్రొక్కుకున్నారు.
పొడుపు కథలకు ఆయన ‘పర్యాయ పదాలిస్తూ’ అడ్డుకతలు, ఒడ్డుకతలు, కథ కట్టు పద్యాలు, చిక్కుముళ్ళు, చిట్కాలు, చిటుకులు, మారుతట్లు, యక్ష ప్రశ్నలు, విడుపు కథలు అని ఇస్తూ శాత్రాలు (శాస్త్రాలు), సమచ్చలు (సమస్యలు) అని ఇవ్వడంలో ప్రజావ్యవహారాన్ని కాదనక పోవడంలో కొంచెం ముందుకు వచ్చారనే అనిపిస్తుంది. బాల గేయాలు ఇవ్వడంలోనూ, క్రైస్తవ బాలగేయాలు ప్రత్యేకంగా ఇవ్వడంలో ఆయన విశాల దృష్టి తెలుస్తోంది. విజయవాడ నవరత్న బుక్‌హౌస్ వారిచే ఆయన పాత బంగారం పేర ధారావాహిక ఉద్గ్రంథ ప్రచురణలు జాతి మరువలేనివి వేయించారనిపిస్తుంది.
పాత బంగారం/ తెలుగు శతక మంజరి ఉద్గ్రంథం. ఇందులో మూడువేల పద్యాలుంటాయి. వేమన భాస్కరాది శతకాలతోపాటు గుమ్మా సాంబశివరావు రాసిన సెల్‌ఫోన్ శతకంలో కొన్ని పద్యాల్ని ప్రచురించడం ఆయన ఆధునిక కాలజ్ఞాన ఉదాహరణం.
‘‘శిశువు ఏడ్చుచుండ చెంత జేరిన తల్లి/
జోలపాట లేక లీలగాను/ సెల్లుఫోను తెచ్చి
చెవిలోన మోగించె/ సెల్లుఫోను మహిమ చెప్పతరమె – వంటివి అందులో ఉన్నాయి.
పాత బంగారం-2గా పొడుపు కథల పెద్ద పుస్తకం తయారుచేశారు. పొడుపు కథల తాత్త్విక భూమికలందులో ఇచ్చారు. పాత బంగారం-3గా తెలుగు సామెతల పెద్ద పుస్తకం ప్రకటింపజేశారు.
తమకు ముందు వచ్చిన పరిశోధనా గ్రంథాల్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ స్వీయ సేకరణల్నీ, శాస్ర్తియ సమాచారాన్ని చేర్చి ప్రజలకందించాలనే ఆయన నిత్యతపన ప్రతి సాహితీ గ్రంథంలో కనబడుతుంది. వంద పరిశోధనలకు ఇంద సమాచారం, విజ్ఞానం అంటూ స్వాగతిస్తాయి ఆయన గ్రంథాలు. తెనాలి, ఐతానగరంలో గ్రంథాల మధ్యలో వెలిగే వెలగా ఇప్పుడు మన మధ్యలో లేరు. కాలధర్మమైనా వెలితే. ఆయన భౌతిక కాయానికి వీడ్కోలు పలికామే కాని, ఆయన గ్రంథాలకి గ్రంథాలయాలు స్వాగతాలాపనలు చేస్తూనే వున్నాయి.