జగమెరిగిన నిర్మాతగా, జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేతగా వీబీ రాజేంద్రప్రసాద్‌ది ఒక ప్రత్యేక శకం. ఆయన నిర్మించిన చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. కథకు న్యాయం చెయ్యడం కోసం నిర్మాణ పరంగా ఏనాడు ఆయన రాజీపడలేదు. దసరా బుల్లోడుగా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. అక్కినేని, ఎన్టీఆర్, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగార్జున, బాలకృష్ణ ఇలా మూడుతరాల హీరోలతో చిత్రాలు నిర్మించిన ఘనత ఆయనది. సినిమా హీరో కావాలనే కోరికతో పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన నిర్మాత అయ్యారు. తరువాత దర్శకుడిగా మారారు. జనరంజకమైన ఎన్నో చిత్రాలను నిర్మించారు. ప్రముఖ తారాగణంతో భారీ సెట్లతో లావిష్‌గా సినిమాలు తీసి తన సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
బాల్య మంతా గ్రామీణ ప్రాంతంలో గడిపినందున ఆయన తన చిత్రాల్లో పల్లెటూరి పాత్రలు, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే దృశ్యాలను చూపే వారు. అలాగే తను పుట్టి, పెరిగిన ఊళ్లనే ఎక్కువగా తన చిత్రాల్లో చూపేవారు. దసరాబుల్లోడు చిత్రానికి ఆయన దర్శకత్వం వహించిన క్రమంలో గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో అప్పటి ప్రజల ఆప్యాయతలు, బంధుత్వాలను తెరకెక్కించిన విజయవంతమైనట్టు కూడా ఆయన సన్నిహితులు చెబుతారు. కృష్ణాజిల్లాలోని భట్లపెనమర్రును దసరాబుల్లోడు సినిమాకు లోకేషన్‌గా ఎంచుకుని జనరంజకంగా చిత్రీకరించారు. పలు సినిమాల్లో ఆయన సగటు రైతు, శ్రామికుడు పడుతున్న కష్టాలను, ఉమ్మడి కుటుంబం ప్రాధాన్యాన్ని కూడా చూపించారు. కాకినాడ పి.ఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు నాట్యాలు వేసేవారాయన. ఇంటర్ కాలేజీలో ‘కప్పలు’ నాటకంతో తొలిసారి ఆడవేషం వేసి నాటక ప్రియులను అలరించారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఉత్తమ హీరోయిన్గా ప్రశంసలందుకున్నారు. ఈయన నాటకాల్లో ఉన్నప్పటి నుంచే అక్కినేని నాగేశ్వరరావుగారితో పరిచయముంది. ‘దేవదాసు’ చిత్రం షూటింగ్‌కి అక్కినేని కాకినాడ వచ్చినప్పుడు రాజేంద్రప్రసాద్ తన రూమ్‌కి ఆహ్వానించారు. నాక్కుడా సినిమా హీరో కావాలనుందని ఆయన మనసులో కోరికను అక్కినేని ముందుంచారు. నటుడు కావడం తప్పు కాదు. డిగ్రీ లేక సినిమాల్లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాను. సరే డిగ్రీ పూర్తి చేసి నువ్వు ఇందులోకి రా.. నేను చేయగలిగిన సాయం చేస్తానని ఆయనిచ్చిన మాటతో వీబీకి కాస్త ధైర్యం వచ్చింది. చదువు పూర్తి చెయ్యగానే వీబీ తండ్రి కొంతకాలం వ్యవసాయం చెయ్యమని ఆదేశించారు. ఈయనకు పుట్టుకతోనే ఉబ్బసం. పొలం పనులు, కుప్ప నూర్పుళ్లు అక్కడి ధూళి ఈయనకు పడలేదు. దాంతో వ్యవసాయానికి పనికిరాడని బందరులో రైస్‌మిల్‌కి ఇన్ఛార్జ్ని చేశారు. అక్కడ కూడా అదే పరిస్థితి కావడంతో తనకి ఇష్టమైనది చేసుకోమని తల్లిదండ్రులు పర్మిషన్ ఇచ్చారు.
ఆ రోజుల్లో సినిమాల్లోకి వెళ్ళడం అంటే మాటలు కాదు. అయినాగానీ ఏం చెయ్యలో తోచని పరిస్థితిలో కొంత డబ్బు ఇచ్చి వీబీ తండ్రి సినిమాల్లోకి పంపారు. పరిశ్రమలో అడుగుపెట్టిన కొంత కాలానికే ఆయన తెచ్చిన డబ్బు సగం ఖర్చయిపోయింది. కానీ ఛాన్స్ రాలేదు. డబ్బింగ్ సినిమాలు తీద్దామని పూనె వెళ్లారు. అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనకడుగు వెయ్యాల్సి వచ్చింది. మిగిలిన డబ్బుతో ఏం చెయ్యాలో తెలియక, ఇంటికి తిరిగి వెళ్లడం ఇష్టం లేక జెమిని స్టూడి యోస్‌లో సౌండ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రంగారావుని కలిసి సమస్యను వివరించారు. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు ఖాళీ లేకపోవడంతో వి.మధుసూధనరావు దర్శకత్వంలో జగ్గయ్య, జమున నటీనటులుగా ‘అన్నపూర్ణ’(1960) సినిమాతో నిర్మాతగా మారారు వీబీ. ఆ సినిమాల్లో ఆ రోజుల్లో పెద్ద హిట్ కావడంతో నిర్మాతగా నిలబడి 16 సినిమాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా ‘దసరాబుల్లోడు’ సినిమాతో మెగా ఫోన్ పట్టి 14 సినిమాల కు దర్శకత్వం వహించారు. హిందీ, తమిళంలో కూడా ఆయన సినిమాలు నిర్మించారు. 1965లో వచ్చిన ‘అంతస్థులు’ సినిమాకు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశిష్ఠ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2003లో రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.
అక్కినేనితో, ఆయన తనయుడు నాగార్జునతో, అలాగే ఎన్టీఆర్‌తో ఆయన తనయుడు బాలకృష్ణతో సినిమాలు నిర్మించిన ఘనత రాజేంద్రప్రసాద్‌ది. సక్సెస్ఫుల్ నిర్మాతగానే కాకుండా మంచి వ్యక్తిగా రాజేంద్రప్రసాద్ పేరు సంపాదించుకున్నారు. హీరో దగ్గర నుంచీ బాయ్ వరకు అందరినీ ఒకే రీతితో ఆదరించి గౌరవించిన మంచి మనస్తత్వం ఆయనది. అలాగే తన దగ్గర పనిచేసే వర్కర్స్ కోసం ఒక సినిమా నిర్మించిన ఖ్యాతి రాజేంద్రప్రసాద్‌కి దక్కుతుంది. ఆ చిత్రం ‘పిచ్చిమారాజు’. ఇందులో వచ్చిన లాభాలను వర్కర్స్‌కే పంచిపెట్టి తన విశాలహృదయాన్ని చాటుకున్నారు. తన కుమారుడు జగపతిబాబును ‘సింహస్వప్నం’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు. అయితే ఎంతోమంది హీరోలకు హిట్లు ఇచ్చిన తను కుమారుడికి మాత్రం హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఆయనలో చివరి వరకూ ఉండేది.
‘పెళ్లిపీటలు’ చిత్రం తర్వాత ఆయన చిత్రనిర్మాణరంగానికి దూరంగా జరిగి ఆధ్యాత్మిక రంగంవైపు మళ్లారు. ఫిలింనగర్లో ధైవ సన్నిధానం ఏర్పాటు కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. తన శేష జీవితాన్ని భగవంతుని సేవకే అంకితం చేశారు.