చరిత్రకందని కాలం నుండి నేటివరకూ…

చరిత్రకందని కాలం నుండి నేటివరకూ…

  • -ముదిగొండ శివప్రసాద్
  • 17/01/2015
TAGS:

తెలంగాణ చరిత్ర
జి.వెంకటరామారావు
వెల:రూ.300/-
ప్రతులకు: అన్ని ప్రధాన
పుస్తక విక్రయ కేంద్రాలు.

తెలంగాణలో ప్రతి రాయికి, ప్రతి రప్పకూ చరిత్ర ఉంది. ప్రతి చెట్టుకూ, ప్రతి గట్టుకూ చరిత్ర ఉంది. ఎందరో మరుగున పడిన మాణిక్యాలున్నారు. వారిని వెలికితీసే పరిశోధకుల సంఖ్య అగణితంగా ఉండాలి. జి.వెంకటరామారావుగారి పేరు చెప్పగానే నిరాడంబరుడు, కర్తవ్యశీలి అయిన ఒక పండిత రచయిత, విమర్శకుడు మన కన్నులముందు సాక్షాత్కరిస్తారు. పరిశీలనాత్మక వ్యాసాలను పత్రికలకు అందించడంలో జివిఆర్ దిట్ట. ఇటీవల 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్ఫూర్తితో చరిత్రకందని కాలంనుండి నేటివరకూ తెలంగాణ చరిత్రను సాధికారికంగా అందించేందుకు ఒక బృహత్ ప్రయత్నం చేశారు. తెలంగాణ అనే పదం త్రిలింగ శబ్ద్భావం. త్రిలింగనుండి తెలుగు, తెలింగాణా, తెలంగాణా పదములు పుట్టాయి. శాతవాహనుల మూడు రాజధానులలో ఒకటి ప్రతిష్ఠానపురం. నేడు పఠాన్ పేరుతో ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఓ మోస్తరు పట్టణం. ఇదికాక ధాన్యకటకం, శ్రీకాకుళం (కృష్ణాజిల్లా) వారి మరి రెండు రాజధానులు కాణ్వాయన సుశర్మను ఓడించి శ్రీముఖ శాతవాహనుడు (సిముఖ) క్రీ.శ.187లో శాతవాహన రాజ్యం ప్రారంభించటంతో తెలంగాణా – ఆంధ్ర ప్రాంతాల చరిత్ర మొదలవుతుంది. వీరు క్షత్రియ వృత్తిని స్వీకరించిన బ్రాహ్మణులు. దాదాపు 300 సంవత్సరాలు పాలించిన తొలి తెలుగు రాజులు. ఆ తరువాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, శాలంకాయనులు, చోళులు, చాళుక్యులు, ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాల్లో పాలించారు. గరుడచేత, బొట్టుచేత రాజులతో కాకతీయ వంశం ప్రారంభమైంది. వీరి పాలన క్రీ.శ.1000 నుండి 1323 వరకూ సాగింది. తెలంగాణ చరిత్రలో ఇదొక స్వర్ణయుగం. అందరూ అనుకుంటున్నట్లు కాకతీయ రాజ్యం కాంచీపురం వరకే పరిమితం కాలేదు. అది రామేశ్వరం వరకూ వ్యాపించింది. 1310 నుండి వరుసగా ఖల్జీ తుగ్లక్ రాజవంశాలు ఢిల్లీనుండి చేసిన దాడులతో తెలంగాణా బలహీనమైపోయింది. ఆ తరువాత కాపయనాయకుడు, ప్రోలయ నాయకుడు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనప్పటికీ ఎక్కువకాలం వారి రాజ్యం నిలువలేదు. బహమనీ సుల్తానులు, మొగలులు, అసఫ్ జాహీలువంటి ఎన్నో రాజవంశాలు తెలంగాణాను పాలించాయి. అంటే, 1948 సెప్టెంబర్ వరకూ తెలంగాణ తురుష్క పాలనలోనే ఉంది. 1947 ఆగస్టు 15 మొత్తం దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణా ప్రాంతంలో మాత్రం జాతీయ పతాకం ఎగురలేదు. 1952లో బూర్గుల రామకృష్ణారావుగారి నేతృత్వంలో స్వతంత్ర తెలంగాణ మంత్రివర్గం ఏర్పడింది. 1956లో ఆంధ్ర తెలంగాణలు ఆంధ్రప్రదేశ్ అనే భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది. అయితే ఈ పొత్తు ఎక్కువ దశాబ్దాలు నిలువలేదు. 2014 జూన్‌లో మళ్లీ సీమాంధ్రనుండి తెలంగాణ విడివడిపోయింది. ఇందుకుగల నేపథ్యం ఉద్యమ కారణాలు, పరిణామాలు అన్నీ రామారావుగారు ఈ గ్రంథంలో విశే్లషించారు. రచయిత ప్రధానంగా పత్రికా పాఠకుల నాడి తెలిసినవాడు కావటంతో గహనమైన చారిత్రక విషయాలను సరళమైన భాషలో సామాన్యులకు అందించటానికి కృషిచేశారు.
ఈ గ్రంథంలో మొదటి 60 పుటలలోనే దాదాపు 16వ శతాబ్దంవరకుగల చరిత్రను ముగించారు. ఈ కారణంచేత ఈ భాగంలో ఇంకా చాలా అంశాలు చేర్చే అవకాశం లేకుండాపోయింది. తరువాతి భాగాన్ని విస్తరించారు. ఉదాహరణకు కాకతీయ చరిత్ర 15 పుటల్లో ముగించారు. పద్మనాయకుల చరిత్రకు ఐదు పుటలే కేటాయించారు. హళిబీడుద్వార సముద్ర ప్రాంతం. ఇక్కడి శిల్పానికి పాలంపేట రామప్ప శిల్పానికి సాన్నిహిత్యం ఉంది. రామప్ప హొయసాల రాజ్యంనుండి వచ్చాడా? ‘అప్ప’ శబ్దం రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లోనే వాడతారు. పాలంపేట చెరువువద్ద పెద్ద శిల్ప కళాక్షేత్రం ఉండేది. రామప్ప త్రికూట నిర్మాణం కందుకూరు రాజుల సోమేశ్వర త్రికూట నిర్మాణం వంటి వివరాలు కాకతీయుల అధ్యాయంలో విస్తరించటం అవసరం.
30వ పుటలో ఘీయాజుద్దీన్ ఉలుఫ్ దండయాత్రల సుదీర్ఘ చరిత్రను పది పంక్తులలో సంగ్రహీకరించారు. కోహినూరు వజ్రాన్ని కాకతమ్మ జ్ఞాననేత్రంగా అలంకరించేవారు. దానిని ప్రతాపరుద్రుడు మాలిక్ నరుూబ్ కాఫర్‌కు ధారాదత్తం చేశాడు. ఈ వివరాలన్నీ పాఠకులకు అవసరం. అంటే ఈ అధ్యాయం పది పంక్తులనుండి పాతిక పుటలు విస్తరించి ఉండవలసింది. కాకతీయుల పతనానికి అనేక కారణాలున్నాయి. రామారావు పేర్కొన్నట్లు హిందువుల అనైకమత్యం ఒక ప్రధాన కారణం. పద్మానాయకులు, రెడ్డిరాజులు పరస్పరం కలహించుకున్నారు. ఫలితంగా కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయింది. ఈ గ్రంథంలో పదవ అధ్యాయం నిజాం రాజుల పాలననుండి ఎక్కువ వివరాలు ఉన్నాయి.
సర్దార్‌పటేల్ పోలీసు చర్యకు దారితీసిన పరిస్థితులేమిటో ఈ తరం ప్రజలకు తెలియవు. వాటిని ఈ గ్రంథంలో చూడవచ్చు. ‘‘హైదరాబాద్ భారతదేశం నడిబొడ్డున ఉంది. హైదరాబాద్ పోతే మొత్తం భారతదేశం పోయినట్లేనని అప్పటి బొంబాయి ప్రావిన్స్ గవర్నర్స్ హైదరాబాద్ రెసిడెంట్‌ను హెచ్చరించాడు’’ (191వ పుట).
‘‘అప్పటివరకూ నిజాం దుశ్చర్యలను ప్రతిఘటించటానికి స్టేట్ కాంగ్రెస్‌లో కలిసి పనిచేసిన కమ్యూనిస్టులకు నెహ్రూ ప్రభుత్వం ప్రజావ్యతిరేకంగా కనిపించింది’’ (అదేపుట).
పోలీసు చర్య తరువాత పటేల్ కమ్యూనిస్టులపై గాలింపు ముమ్మరం చేశారు. ‘‘పగలంతా మిలటరీవారు రాత్రిళ్ళు కమ్యూనిస్టులు గ్రామాలలో బీభత్సం సృష్టించారు’’ (191వ పుట).
ఇదంతా భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం జరిగిన పోరాటమేనా? రష్యాకు మార్షల్ స్టాలిన్ డాంగే, అజయ్‌ఘోష్, రాజేశ్వరరావు, బసవపున్నయ్యలను పిలిచి తెలంగాణ పటం ముందుపెట్టుకుని సుదీర్ఘ చర్చలుచేశారు (అదే పుట).
స్వామి రామానంద తీర్థ ఉద్యమం, వినోబాభావే భూదాన ఉద్యమం, జె.పి ఉద్యమం, అణచివేతలు, ఆంధ్ర మహాసభ స్థాపన, రాజరాజనరేంద్ర కృష్ణదేవరాయ గ్రంథాలయాల ఆవిర్భావం- అవి భాషాపరంగా సాధించిన వివరాలు, అణచివేతలు ఈ గ్రంథంలో రామారావుగారు సప్రమాణంగా, సరళభాషలో వివరించారు. 2014 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల అవతరణతో గ్రంథం పరిసమాప్తమైంది. ఇది మంచి ప్రయత్నమే అయినా గ్రంథాన్ని రెండు భాగాలుగా చేసి ప్రథమ భాగం మరింత పెంచవలసిన అవసరం ఉంది. శాతవాహనులనుండి కాకతీయులవరకు గల తెలంగాణ చరిత్ర, కోటిలింగాల వివరాలు పాఠకులకు అందించాలి. బృహత్క్థ రాసిన గుణాఢ్యుడు, శ్రీకృష్ణుని భార్య రుక్మిణీమాత తెలంగాణావారే. ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యుల వివరాలు ఈ పరివర్థిత గ్రంథంలో ఇవ్వవచ్చు. ఇలాంటి పుస్తకాలు రాయడానికి చిత్తశుద్ధి, ఓపిక, పట్టుదల, వివేకం తప్పనిసరిగా కావాలి. అవి జి.వెంకటరావుగారిలో సమృద్ధిగా ఉన్నాయి. తెలంగాణ 400 సంవత్సరాలు ముస్లిం పాలనలో మగ్గినప్పటికీ అక్కడక్కడా ఎడారిలో ఒయాసిస్సులవలె దోమకొండ, వనపర్తి, గద్వాల వంటి సంస్థానాలు చేసిన సాహిత్య సేవ తక్కువేమీ కాదు. ఆ వివరాలు ఈ తరంవారికి తెలియజెప్పడం అవసరం.గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.