ఆయనొక నిత్య చైతన్య దీప్తి – జ్ఞాని అక్కినేని

ఆయనొక నిత్య చైతన్య దీప్తి

సాధారణంగా సినిమాల్లో హీరోలు మరణించడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అయినా ‘దేవదాసు’, ‘మేఘసందేశం’, ‘ప్రేమాభిషేకం’ వంటి సినిమాల్లో హీరో మరణించినా ప్రేక్షకులు నీరాజనం పట్టేలా చేసిన ఘనత అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఒక్క ‘దేవదాసు’లో తప్ప మిగిలిన ఆ రెండింటిలోనూ సహజనటి జయసుధ అక్కినేనితో కలిసి కథానాయికగా నటించింది. ప్రాతల గురించిన చర్చ సరే, అంత కు మించిన జీవితసత్యాల మీద నాగేశ్వరరావు చేసే అమూల్యమైన వ్యాఖ్యానాల్ని ఆమె తనివితీరా వింది. తన జీవన గమనానికీ, స్పూర్తికీ అవి ఎంతో ఉపయోగపడ్డాయని మనసు విప్పి చెబుతోంది. ఒక్క జయసుధకే కాదు కోటానుకోట్ల తెలుగు ప్రేక్షకులకు మనోల్లాసాన్ని, చైతన్య దీప్తిని అందించి వెళ్లిపోయిన అక్కినేని తొలివర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్న విశేషాలే ఇవి..
‘‘అప్పటికే ‘నోము’, ‘పండంటి కాపురం’ సినిమాల్లో నటించిన నాకు నాగేశ్వరరావు గారు హీరోగా ‘మహాకవి క్షేత్రయ్య’లో నటించే అవకాశం వచ్చింది. ఆయనతో కలిసి కాకపోయినా అందులో ఉన్న చాలా మంది హీరోయిన్లలో నే నొకరినయ్యాను. అందులో నాది ఒక నర్తకి పాత్ర. నాకు నాట్యం పెద్దగా రాకపోయినా ఏఎన్నార్‌తో కలిసే మహదావకాశం కాబట్టి వెంటనే ఒప్పేసుకున్నాను. ఆ తర్వాత రామానాయుడి గారి ‘సెక్రెటరీ’లో కలిసి నటించే అవకాశం వచ్చింది. అలా దాదాపు పాతిక సినిమాల దాకా ఆయనతో కలిసి నటించాను.
సాధారణంగా మాతరం వాళ్లు షాట్‌లో తమ పాత్ర లేకపోతే దూరంగా వెళ్లి కూర్చోవడం చేస్తుంటారు. అక్కినేని గారు మాత్రం అలా వెళ్లే వారు కాదు. లోపల కూర్చుని స్ర్కీన్‌ మీద మా నటనను గమనిస్తుండే వారు. ఎప్పడైనా వీలు చిక్కినప్పుడు బాగుంటే అభినందించడం, ఏదైనా తేడా కనిపిస్తే ఆ విషయాన్ని సూటిగా చెప్పేవారు. దాంతో ఎక్కడ తప్పు చేస్తున్నామనేది కొత్తవాళ్లకు ఎప్పటికప్పుడు తెలిసిపోయేది. సినిమా అంటే అదొక సమష్టి కృషి.. అనే మాట అనుక్షణం మనసులో ఉంచుకోవడమే అందుకు కారణం. ‘‘ఈ అమ్మాయికి తెలుగు రాకపోయినా ఒకసారి డైలాగ్‌ వినిపించగానే వెంటనే గుర్తు చేసుకుని ఇంత బాగా ఎలా చెబుతోంది?’’ అంటూ పలుమార్లు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ వ్యక్తం చేసేవారాయన. మీడియా ముందు కూడా నన్ను మెచ్చుకుంటూ ఓపెన్‌గానే మాట్లాడే వారు. వాస్తవానికి ఆ మహానటునికి అప్పుడప్పుడే వచ్చిన నటి గురించి అంతగా మాట్లాడాల్సిన అవసరమేముంది? ఆయన పెద్ద మనసు కాకపోతే!.
సరదా మనిషి..
తానున్న వాతావరణాన్ని ఎప్పుడూ తేలిగ్గా, హాయిగా ఉంచడం అక్కినేని నైజం. సభావేదికల్లో ఉన్నంత సహజంగానే షూటింగ్‌ సమయాల్లో కూడా ఉండేవారు. కాకపోతే సరదాగా ముందు మాట్లాడినా ఆ తర్వాత ఆయన ఆలోచనలు మెల్లమెల్లగా విషయాల లోతుల్లోకి వెళ్లేవి. ప్రతి తాత్విక విషయాన్నీ ఒక హాస్యోక్తితో మొదలుపెట్టే వారు. ఎక్కడా కాసింత నిరాశకూ, నిర్లిప్తతకూ చోటిచ్చే వారే కాదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? వాస్తవానికి ఎలా ఉండాలి? అనే విషయమే ఆయన మాటల్లో ఎక్కువగా ధ్వనించేది. ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో ఎప్పుడూ స్పష్టంగా చెప్పేవారు. అయితే పరోక్షంగానే తప్ప ఏ రోజూ వ్యక్తిగత విషయాల్ని ఉటంకించేవారు కాదు. అలా మాట్లాడటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఒక పరంపరగా ఆయన నోట వచ్చే మాటలు మనం ఊహించని దూరాలకు తీసుకువెళ్లేవి. చాలా మంది నటీనటులకు ఆరోగ్యపరమైన విషయాలు జీవన శైలికి సంబంధించిన విషయాలే ఆసక్తిగా ఉంటాయి. పరిధి దాటితే ఆ మాటల్ని వినడానికి ఆసక్తి చూపరు. ఆయన ప్రపంచంలోని పలు విషయాలు మాట్లాడేవారు. నాకైతే ఈ విషయాలపైనే ఆసక్తి ఎక్కువ. అందుకే ఎంత సేపు మాట్లాడినా అంతే ఆసక్తిగా వినేదాన్ని. ఆయన నడిచే గ్రంథాలయం అనే మాట నేనే కాదు ఒక గంట పాటు ఆయన సంభాషణలు విన్న ఎవరికైనా అదే భావన కలుగుతుంది.
గొప్ప మార్గదర్శి..
మానవ సంబంధాల్ని ఎలా మెయింటెన్‌ చేయాలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎలా హ్యాండిల్‌ చేయాలో బాగా చెప్పేవారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి రంగం మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న ఒక పండితుడాయన. అయినా పరిశ్రమలో అన్ని దశాబ్దాలుగా ఉన్నా ఒక్క నిర్మాతగా తప్ప మరే రంగంలోనూ అడుగు మోపలేదు. రెండు పడవల మీద కాలు మోపడం ప్రమాదమని ఆయన నమ్మడమే అందుకు కారణం. ఎక్కువ రంగాల్లోకి వెళితే ఉన్న రంగం మీద ఏకాగ్రత లోపిస్తుంది. ఇది అసలుకే ముప్ప తెస్తుంది అనేవారారు ఏఎన్నార్‌గారు. మాలాంటి వారు ఎదుర్కొనే ఏ సమస్య విషయంలో సలహా అడిగినా ఒక సమగ్రమైన సలహా ఇచ్చేంత సమర్ధులాయన. అలా సలహా అడగకపోవడం వల్లే మాలాంటి వారు అప్పుడప్పుడు మొట్టికాయలు తినడానికి కారణమయ్యింది. నేను రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలుసుకుని ‘‘అక్కడ నీకు ఓకేనా?’’ ఇంతే అన్నారాయన. నేను సలహా ఏదీ అడగలేదు కాబట్టి. రాజకీయ రంగం మనకంత సరియైుంది కాదనే విషయం నాకు ఎప్పటి కో గానీ తెలిసి రాలేదు.
ఆయనొక వైద్యుడు..
ఆరోగ్య విషయాల్లో ఆయనకున్న అవగాహన చాలా అరుదైనది. మానసికంగా స్థిరంగా ఉండడానికి ఆయన అనుసరించే విధానం కూడా అనుసరణీయమైనది. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు, మనం చేయగలిగేది ఏమీ లేనప్పుడు ఆ విషయాల్లోకి వెళ్లకపోవడమే ఉత్తమమని అక్కినేనిగారు నమ్మేవారు. అందుకే వెళ్లకూడదని భావించిన చోటికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లే వారు కాదు. ఘంటసాల గారు మరణించినప్పుడు తాను వెళ్లకపోవడం పట్ల ఎన్ని విమర్శలు ఉన్నాయో మనకు తెలుసు. విమర్శలు వస్తాయన్నది ఆయనకు తెలియని విషయమేమీ కాదు. ఆయన వెళ్లనంత మాత్రాన ఆ తాలూకు బాధ, దుఃఖం అవేవీ అతనిలో లేవని కాదు కదా! ఏమైనా ఆ నియమాలు అంత కఠోరంగా ఉండేవి మరి. అవన్నీ ఆయన ఆరోగ్య రహస్యాలే. ‘‘మీ ఆయుష్షు ఇక్కడికే పరిమితం’’ అని డాక్టర్లు చెప్పినా ఆయన వారందరినీ ఆశ్చర్యపరుస్తూ 90 ఏళ్లు జీవించారు. ఆయన అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవడానికి ఒక సుఽధీర్ఘమైన జీవితాన్ని కోరుకున్నారు. దాన్ని సాధించారు.
ఆయన నాస్తికుడు. నిజమే. అయితే నా మటుకు నేను ఆయన ఆత్మే ఆయన దేవుడు అని అర్థం చేసుకున్నాను. ఆ దైవం లాంటి ఆత్మతో ఆయన నిత్యం సంభాషించేవారు. దాని ఫలితమే ఆయన నోట అమృతం లాంటి ఆ వాక్యాలు వస్తాయని నా నమ్మకం.
మనసులో దేన్నీ దాచిపెట్టుకునే వారు కాదాయన. తనకు క్యాన్సర్‌ ఉందని బహిరంగంగా చెప్పడానికి ఎవరికైనా ఎంత ధైర్యం కావాలి? అలా చెప్పడం వల్ల ఏమైనా నష్టం కలిగితే కలగవ చ్చు. కానీ అలా చెప్పడం ద్వారా ఇతరులకేమైనా లాభం కలిగే అవకాశం ఉంటే ఎందుకు ఊరుకోవాలి? అనేది ఆయన తత్వం. ప్రతి ఒక్కరిలోనూ క్యాన్సర్‌ కణాలు ఉంటాయి. ఒక్కోసారి అవి కాస్త పెరుగుతాయి. సరైన వైద్యం అందితే అవి మళ్లీ సాధారణ స్థాయికి వచ్చేస్తాయి అంటూ.. క్యాన్సర్‌ ఒక సాధారణ జబ్బేనంటూ ఎంతో మందిలో ధైర్యం నింపారాయన. అందుకే ఆయన ఎప్పటికీ చైతన్యదీప్తి.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.