అరణ్యం కాదు… నందనవనమే!
- -పిఎస్ఎన్.
- 24/01/2015

అరణ్యం
-సిహెచ్.వి.బృందావనరావు
పుటలు: 114,
వెల: రు.100/-
ప్రచురణ: మల్లెతీగ,
విజయవాడ.
ఈ సంపుటిలో పదునెనిమిది కథలున్నయి. అందులో చాలావరకు ఇంతకుముందే వివిధ పత్రికలలో ప్రచురింపబడి పాఠకుల ప్రశంసలు అందుకున్నవే.
జీవితంలో తారసపడే మనుష్యులను, సంఘటనలనే సిహెచ్.వి. బృందావనరావుగారు కథలుగా మలచి పాఠకులకు అందించారు. సహజత్వంతో నిండి పాఠకుడిని ఎంతో ఆసక్తిగా చదివిస్తయి.
‘స్పర్శ’ అన్న కథ చదవటం పూర్తిచేసిన పాఠకుడు కొద్దినిముషాలపాటు ఆ స్పర్శలో బందీఅయి ‘అసలు నిజాన్ని’ రచయిత తన గుప్పిటలో ఎంతో జాగ్రత్తగా భద్రపరచి చివరికి పాఠకుడి గుండెల్లోకి ఎలా బాణంలా వదిలిందీ గ్రహించి విస్మయం చెందుతాడు. ఎనిమిది మంది పిల్లల్ని కని, ‘హెచ్చుదిగుబడి వరివంగడం’ అని పేరుబొందిన ఆ దంపతులు ఓ రాత్రి, తెలిసిన పొరుగూరి వ్యక్తి నిండు గర్భిణీ అయిన భార్యతో ఆ ఇంట గడపవలసిన పరిస్థితి ఏర్పడగా, ఆ అమ్మాయి పురిటినొప్పులు మొదలయినప్పుడు ఆ ఇంటి ఇల్లాలే మంత్రసాని అవుతుంది. ఆ అమ్మాయి వెళుతూ కృతజ్ఞతలు చెబితే, ‘నువ్వుకాదు చెప్పవలసింది, నేనే… నాలుగు సంవత్సరాలుగా మాటలులేని మా దంపతులకు నీ మూలకంగా రాత్రే మాటలు కలిసినయి’ అంటుంది తృప్తిగా. చాలా మంచి కథ.
సుబ్రహ్మణ్యశాస్ర్తీ పురోహితుడు. కొడుకును పౌరోహిత్యంలోకి దింపితే తిండికి ఇబ్బందిలేకుండా రోజులు గడుస్తయిలే అనుకుంటాడు. కానీ భార్య పిల్లవాడిని చదివించి వృద్ధిలోకి తీసుకురావాలనే ఆశతో ఉంటుంది. ‘జంఝాలు, దీపాల ఒత్తులూ కూడా ఓ రిలయన్స్ వాళ్ళ షాపుల్లో అమ్ముతారట’లాంటి చురకలు, పౌరోహిత్యంలో కూడా బ్రోకర్ల దోపిడీ మీద విసుర్లు కథకు జీవంపోస్తయి. మనిషికి చదువైనా ఉండాలి, లేకపోతే శ్రమపడే శక్తయినా ఉండాలనే సత్యాన్ని వివరిస్తారు. ఆనందానే్న కాదు వేదననూ సృష్టించిన కథ ‘విస్సిగాడి చదువు.’ ‘దేవుడూ సెడిపోయినాడే’ అనేది ఒక విలక్షణమైన కథ. ‘పోలియో వచ్చి ఎడంకాలు కాస్త వంకర తిరిగినందున- కొంచెం కుంటుతుంది గాని చుక్కకేం తక్కువ. ఎడంకంట్లో పువ్వేసి కొంచెం ఎబ్బెట్టుగా కన్పిస్తుంది గాని అది చుక్కకు పెద్ద అవకరమా. పద్దెనిమిదేండ్ల పండు పరువం చుక్క వొంట్లో అణువణువునా తిష్ఠవేసుకుకూర్చున్న’ ఆ అమ్మాయిని సురేష్ మోసం చేస్తే, బుర్రినాయుడు మనువాడతానంటాడు. సుక్కమ్మ చెడిపోయినానంటే, ‘మనసుంటోల్ల మొగాన ఇట్టా సెడిపోయే బతకండిరా సెత్త నాకొడకల్లారా అని రాసిపెట్టినోడుండాడే- ఆ దేవుడు వాడు అందరికంటే సెడిపోయినాడు’ అని ఆమెను ఓదారుస్తాడు అతడు. మనిషి మానిసి అయినవేళ కలిగే భావనను రచయిత చక్కగా చిత్రీకరించారు.
కొడుకులు విదేశాల్లో స్థిరపడిపోయి, వృద్ధులయిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, పెద్దవాళ్ళకు ఆసరాగా వుంటూ ఆ ఊరి వ్యక్తిని తప్ప మరొకరిని వివాహం చేసుకోనంటుంది కూతురు. మగపిల్లలకంటే ఆడపిల్లలకే తల్లిదండ్రుల మీద ఆప్యాయత ఎక్కువ అని చెప్పే కథ ఇది.
‘అరణ్యం’ క్రూరమృగాలతో నిండిన ప్రదేశమే కాదు, వృక్ష సంపదకూ స్థావరమే. అంతేకాదు మనుష్యులకన్నా జంతువులే నయం అనే నీతిని చెప్పే ఈ కథ ఈ సంపుటికే ప్రధాన కథ.
పెళ్ళి కావాల్సిన కూతురు, మొగుడొదిలేసిన తల్లి- ఒకరికోసం ఒకరు పడే వేదనే ‘తోడు’ అయితే, కులాంతర వివాహంవలన తల్లీకూతుళ్ళకు కలిగిన వేదనను చూపించిన కథ ‘మనోవేదన.’
అప్పు తీర్చలేక, కొనుక్కున్న గేదె మీద ఆత్మీయతతో, అరెకరం పొలాన్ని వదులుకోవటానికి, కొడుకును బానిసగా మార్చటానికి కూడా వెనుకాడని ఓ స్ర్తికథే ‘రాములమ్మా-తిరుపతి కొండా!…’ మనస్సును తడిచేస్తుంది.
చిన్నప్పుడు తప్పిపోయి, విదేశాల్లో సుఖజీవనానికి అలవాటుపడ్డ ఓ యువకుడు, తనను కన్నవారిని చూడాలనే తపనతో ఇండియాకు వచ్చి వాళ్ళను గుర్తించి, వాళ్ళ దైన్యస్థితికి జాలిచెంది ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు ‘నిర్ణయం’ కథలో. మంచి సందేశాన్ని ఇచ్చిన కథ.
ఇందులోని ‘సందు’, ‘ఆఖరి పేజీ’, ‘తీర్పు’, ‘క్షాళనం’, ‘స్వీపరు కొడుకు’, ‘స‘మ్మతం’ మొదలయిన అన్ని కథలూ చదువరిని ఆలోచింపజేసేవే. చెప్పటంలో క్లుప్తత కథల్ని ఆసక్తిగా చదివించేలా చేసింది. చక్కటి తెలుగు, గ్రామీణ వాతావరణంలో రాసిన కథలకు మాండలికంలో వ్రాసిన సంభాషణలు, మానవ సంబంధాల మీద నడిపిన తీరు వాటికి ఎంతో వనె్నతెచ్చినయి. ఈ సంపుటికి తొలిపలుకు వ్రాసిన ప్రముఖ రచయిత మునిపల్లెరాజుగారు ‘ఈ పాదముద్రల్లో ఎంతో నిజాయితీ వుంది- ఎంతో సహజ సౌందర్యం వుంది’అంటారు. అది అక్షరాలా నిజం.