ఆసక్తి రేపే ‘దేవ రహస్యం’
- -ముదిగొండ శివప్రసాద్
- 24/01/2015
దేవ రహస్యం
భారతీయ పౌరాణిక కథల వర్ణన
వివరణ వ్యాఖ్యానం
-కోవెల సంతోష్‌కుమార్
వెల:రూ.150/-
ప్రతులకు:kovelas@gmail.com
ఫ్రతీక – సంకేతం- సింబాలిజం- అనేవి సమానార్థకాలు. భారతీయులు పురాణాల్లో ఎక్కువగా సంకేతాలను ప్రయోగించారు. అంటే, వారు చెప్పిన కథలు, గాథలు పుక్కిటి పురాణాలు అని అపహాస్యం చేసేవారు. అందలి సంకేతాలను గ్రహిస్తే అర్థం పరమార్థం రెండూ లభిస్తాయి. ఇటీవల కోవెల సంతోష్‌కుమార్ ‘దేవ రహస్యం’ అనే గ్రంథం ప్రచురించారు. ఇందులో దశావతారములవంటి అనేక పౌరాణిక కథలలోని సంకేతాలు చాలా సరళంగా వివరించారు. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస పంచమ వేదాదులలో సంకేతాలున్నాయి. వాటిని డీకోడ్ చేసే మేధావులు కరువు కావడంతో విషయం అగమ్యగోచరంగా మారింది. సంతోష్ రచించిన ఈ గ్రంథంలో దాదాపు 50 పౌరాణిక, దేవీ దేవతల సంకేతార్థాలు చర్చింపబడ్డాయి. మనం ఏ మంచిపని సంకల్పించినా ముందు గణపతిని స్తుతిస్తాం. ఈ గ్రంథ రచయిత కూడా గణేశునిమీది వ్యాసంతో గ్రంథం ప్రారంభించారు. గణేశుని స్థూలరూపం పదార్థానికి (మేటర్) సంకేతం. ఆయన బొజ్జ, తొండము కుండలినీయోగమేనని సంతోష్‌కుమార్ వివరించారు. ఆ తరువాత సరస్వతీ స్వరూపము పరిశోధించి ఈమె వాగ్దేవత అని సూచించారు. ‘‘ప్రణోదేవతి దేవీ సరస్వతి వాజౌంధిరీ వాజినీవతీ’’ అని రుగ్వేదంలో ఒక మంత్రం ఉంది. సరస్వతి వాగ్దేవత. స – రస శబ్దంలోనే ఈ భావం గోచరిస్తుంది. మన దశావతారములో సృష్టి పరిణామం కన్పడుతున్నది. వీటికి ఇంకా చాలా వ్యాఖ్యానాలున్నాయి. ‘‘రా’’ అంటే సూర్యుడు. సీత భూమి. హనుమంతుడు వాయుపుత్రుడు- ఇవన్నీ సంకేతాలే కదా. అలాగే, భారత పాత్రలన్నీ బాహిర కథా సంవిధానంతోపాటు అంతర్లీనంగా ఎన్నో పరమార్థాలు ప్రతీకాత్మకంగానూ చెప్పబడ్డాయి. కైలాసంలో శివుడు ఉన్నాడా? దేవకాలమానం మానవ కాలమానాల్లో తే డాలు ఎలా వచ్చాయి? మహాభారతం రామాయణంలోని యుద్ధాలు అణుధార్మిక శక్తిని, విస్ఫోటనం వెలువరించా యా? భూతాలకూ లిపి ఉంటుందా? 60 వేలమంది కృష్ణులు ఎక్కడ ఉన్నారు? విశ్వంలో తొలి సర్జన్ ఎవరు? ఇలా ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలు రచయిత వేసుకొని వాటికి ఈ గ్రంథంలో సమాధానం చెప్పారు. ఆంజనేయుని పెళ్లి ఏమిటి? అమ్మోరు ఎవరు? బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం ఎలా అయినాడు? ఇవన్నీ నేడు మనకు ధర్మసందేహాలే. వీటికి ఈ గ్రంథంలో సమాధానాలున్నాయి. అంటే, ఇదొక కథా కావ్యం కాదు. శాస్ర్తియ విశే్లషణ. సంతోష్‌కుమార్ జర్నలిస్టు కావడంవలన పాఠకుల నాడిని గుర్తించి తదనుగుణమైన పదజాలం, భాష వాడి పుస్తకానికి రీడబులిటీ కల్పించారు. అవసరమైన చోట ఆంగ్ల పదాలు వాడారు. ఆనాటి గాంథారం నేడు ఎక్కడ ఉంది? ఇంద్రప్రస్థం ఏది? పురాణాలు భారతదేశ ప్రాచీన చరిత్ర గ్రంథాలని కోట వెంకటాచలం వంటివారు ఎందరో అంగీకరించారు. అయితే, వాటిని విడమరచి చెప్పేవారే కరవైనారు.
కోవెల సంతోష్‌కుమార్ చేసిన ఈ ప్రయత్నానికి సద్గురు శివానందమూర్తిగారు ముందుపుటలో ఆశీస్సులందించారు. చాలాకాలం తరువాత ఒక ప్రయోజనాత్మక గ్రంథం అందుబాటులోకి వచ్చింది. అన్యమతస్థులకు, నాస్తికులకు ఇది అవశ్య పఠనీయం. కోవెల అంటే గుడి. ఈ గ్రంథం భారతీయ సంకేతార్థాల కోవెల.