హృద్యమైన కథలకు వనె్నలద్దిన వర్ణనలు
- -కె.బి.గోపాలం
- 24/01/2015

శిలప్పదికారం
ఇలంగో ఆదిగళ్
మణిమేఖల రచన: శీతలై శాత్తనార్
అనువాదం: లంకా శివరామప్రసాద్
వెల: ఒక్కొక్కటి రూ.200/-
ప్రతులు: విశాలాంధ్ర, నవోదయ,
ఇంకా అన్ని పుస్తకాల
అంగళ్లలో దొరుకును.
పేజీలు: 200, 180
డాక్టర్ శివరామప్రసాద్, వృత్తిపరంగా వైద్యులు. ప్రపంచ సాహిత్యంలోని ప్రసిద్ధ గ్రంథాలను తెలుగులో అందించడానికి పూనుకున్నారు. ప్రస్తుతం రెండు తమిళ ప్రాచీన కావ్యాలను ప్రచురించారు. తమిళ సాహిత్యంలోని సంగం కాలంనాటి ఈ రెండు కావ్యాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. నిజంగా ప్రాచీన కావ్యాలు అవి.
చేర రాజ కుటుంబీకుడయిన ఇలంగో – ఆదిగళ్ రచన శిలప్పదికారం. కన్నగి అనే మహిళ యొక్క కాలి కడియం గురించిన కథ యిది. ఈ రచయిత జైన సాంప్రదాయంలోని వాడు. రెండవ కావ్యం మణిమేఖలైలో కథ కొనసాగుతుంది. దీన్ని శీతలై శాత్తనార్ అనే వ్యాపారి రచించాడు. ఈయన బౌద్ధుడు. ఈ రెండు కావ్యాలు, కవితారూపంలో నడుస్తాయి. అనువాదాలు మొదటిదాంట్లో కొంత దూరం వరకు కవితారూపంలో నడిచింది. తరువాత గద్యరూపంలో సాగింది. రెండవ కావ్యం పూర్తిగా గద్య రూపంలోనే నడిచింది.
కన్నగి (కణ్ణగి), కోవలన్ దంపతులు పూంపుహార్ నగరంలో సుఖంగా బతుకుతుంటారు. కోవలన్ ఒక సందర్భం కారణంగా మాధవి అనే వేశ్య ప్రేమలో పడతాడు. ఆమె గొప్ప నర్తకి. కొంత కాలానికి తప్పు తెలుసుకుని అతను తిరిగి భార్యను చేరుకుంటాడు. అప్పటికి అతని ఆస్తి హరించుకుపోయి ఉంటుంది. గౌరవంగా బతికే ప్రయత్నంలో వారు మదురై చేరుకుంటారు. అక్కడ కోవలన్ భార్య పాదమంజీరాలను అమ్మి వ్యాపారం చేయాలనుకుంటాడు. ఆ కడియం మహారాణిదని, కోవలన్ దొంగ అని నిర్ణయించి రాజు అతనికి మరణదండన విధిస్తాడు. కన్నగి రాజుకు ఫిర్యాదుచేసి తనవద్దనున్న రెండవ కడియాన్ని పగలగొట్టి చూపుతుంది. తప్పు తెలుసుకున్న రాజ దంపతులిద్దరూ మరణిస్తారు. కన్నగి మదురై నగరాన్ని శపిస్తుంది. నగరం నాశనమవుతుంది. తరువాత ఆమె స్వర్గం చేరుకుంటుంది. స్థూలంగా ఇది కథ.
కావ్యం చదువుతుంటే, అడుగడుగున రచనలోని ప్రత్యేకత ఎదురవుతుంది. అలనాటి రాజులు, ప్రజల బతుకుతీరు, సంగీతం, నాట్యాలు మరెన్నో వివరాలు వర్ణించినతీరు ఆసక్తిని పెంచుతుంది. శిలప్పదికారంలో మూడు కాండములున్నాయి. వాటిలో కథ నడిచిన తీరు, వర్ణనలు రచనయొక్క ప్రత్యేకతను చాటిచెపుతుంటాయి. పుస్తకం నిజమయిన క్లాసిక్ అన్న భావన కలుగుతుంది. మాధవి, కన్నగిల పాత్రలు ఎంతో ప్రత్యేకమయినవి. ప్రస్తుతం చెన్నయ్ నగరం సముద్రపుతీరాన కణ్ణగి విగ్రహం స్థాపింపబడి ఉందంటే, కావ్యానికిగల గౌరవం, ప్రజాదరణ అర్థమవుతాయి. ఈ కావ్యంలో ఒకచోట ప్రేమగీతాలున్నాయి. వాటితీరు మనసులను తాకుతుంది. రెండు కావ్యాలలోనూ ప్రకృతి వర్ణనం అద్భుతంగా సాగుతుంది.
శిలప్పదికారం నాయకుడు కోవలన్, వేశ్య మాధవిలకు పుట్టిన కూతురు మణిమేఖల. ఈమె వృత్తాంతాన్ని శీతలై శాత్తనార్ మరొక కావ్యంగా రాశాడు. ఈ కావ్యంలో బౌద్ధం గురించిన విశేషాలు వివరంగా ఎదురవుతాయి. అంటే ప్రస్తుతపు రెండవ పుస్తకం మణిమేఖల ఒక కొనసాగింపు కావ్యం. ప్రియుడు కోవలన్, అతని భార్యల సంగతి తెలిసిన మాధవి బౌద్ధసన్యాసినిగా మారుతుంది. కూతురు మేఖలను కూడా అదే దారిలో పెడుతుంది. మణిమేఖల చాలా అందమయినది. ఆమెను రాజకుమారుడు ఉదయుడు ప్రేమిస్తాడు. కానీ, మణిమేఖల మార్గం మారదు. ఆమె ప్రజాసేవలో కాలం గడుపుతుంది. నిజానికి స్థూలంగా కథ యింతే. కానీ, మణిమేఖల, ఇతర పాత్రల పూర్మజన్మ వృత్తాంతాలు, అర్వణ ఆదిగళ్ వంటి జ్ఞానుల బోధనలు, కథలోని అనుకోని మలుపులు ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తాయి. ఈ కావ్యాలు గొప్పవి అని ఇవాళ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే తెలుగు పాఠకులకు ఈ కథలతో పరిచయంలేకపోవడం ఆశ్చర్యం. వెనకట ఎప్పుడో వీటిని పద్యకావ్యాలుగా పూతలపట్టు శ్రీరాములురెడ్డి రాశారు. అయినా అంతగా ప్రచారం జరిగినట్టులేదు. కనుకనే ఈ రెండు కావ్యాలు అవశ్యంగా చదవదగినవి.
ఈ పుస్తకాలు అనువాదాలని ఎక్కడా చెప్పలేదు. కానీ, రచన మాత్రం అనువాద ధోరణిలోనే సాగింది. ‘కాళ్లకు బరువయిన కడియాలున్న మహారాజా!’ వంటి మాటలు ఈ విషయాన్ని రుజువుచేస్తాయి. కావ్యాలను కేవలం కథచెప్పిన ధోరణిలో చెప్పడం కుదరదు. రెంటిలోనూ గొప్ప వర్ణనలు, వివరాలు ఆసక్తికరమయినవిగా ఉన్నాయి. రాత్రి, ఉదయాల వర్ణన, చివరకు నగరంలో గస్తీ వివరాలు కూడా ఉన్నాయంటే వాటి లోతు తెలుస్తుంది. బౌద్ధ, జైనముల తీరు గురించి కూడా ఎన్నో విశేషాలు ఈ రచనల్లో ఎదురవుతాయి.
ఈ రెండు కావ్యాలలోనూ స్ర్తిపాత్రలు ఎంతో ప్రత్యేకత గలవి. వాటి గురించి ఎంతో చర్చ జరిగింది. జరుగుతున్నది. ఇప్పుడు చర్చలో పాల్గొనే అవకాశం తెలుగు పాఠకులకు కూడా కలిగింది. అసలు మొత్తం కథను చదివే అవకాశం కలగడమే బాగుంది.
వందల సంవత్సరాలనాటి ఈ కావ్యాలలోనిది ప్రాచీన తమిళ భాష. మరోభాష ఆధారంగా ఈ రచనలు(అనువాదాలు) సాగినయి. కథనం బాగానే నడిచింది. కానీ అక్కడక్కడ దుష్టసమాసాల ప్రయోగం కనబడుతుంది, మృత్యుకొట్టము, ఏకైక దిక్కు, నృత్యగాన సంబరాలు వంటి మాటలు లేకుంటే బాగుండేదేమో? అట్లాగే నడయాడ్తున్నాయి, చేతుల్నిండా, విసుర్రాయి లాంటి మాటలుకూడా బాగుండలేదు. ప్రాచీన గ్రంథాలలోని భాష తీరును అనువాదంలో కొంతవరకయినా నిలపగలిగితే, మరింత బాగుంటుంది.
తమిళంనుంచి నేరుగా అనువాదాలు చేసేవారు కనిపించడం లేదు. మరో భాష ద్వారా అనువాదాలు జరగడంలో కొన్ని కష్టాలున్నాయి. పక్కనే ఉన్న తమిళ ప్రాంతపు సాహిత్య సంపద పాతదయినా, కొత్తదయినా మన భాషలోకి రాకపోవడం అన్యాయం. అనువాదాలు (ఏ రకంగానయినా) రావాలి. ఈ కావ్యాలను రెంటినీ పాఠకులు ఆదరిస్తారు. సందేహం అవసరం లేదు!