అలనాటి కవిత్వం కవితా కదంబం
”మా అక్కగారగు శ్రీమతి తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ 1920 -49 సంవత్సరముల మధ్య వ్రాసిన రచనలను ఈనాటికి ఒక ”కవితా కదంబము”గా ఆంధ్ర సాహితీపరుల కర్పించగల్గినందులకు ఆమె సోదరులగు మేము ధన్యులము” అంటూ 1973లో ఈ కవితా సంపుటిని ప్రచురించిన మల్లవరపు కృష్ణరావు విశ్వేశ్వరరావులు ముందుమాట రాశారు.
విశ్వసుందరమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో 1899లో జన్మించారు. తల్లా వర్ఝ&ుల శివశంకర శాస్త్రి వంటి గొప్ప పండితులు దీనికి పీఠిక రాస్తూ ”ఈమెకు చిన్నతనము నుండియు దేశభక్తి మెండు. బ్రాహ్మ సమాజికులగుటచేతనూ ఆమెకు సంఘ సంస్కరణాభిలాష మెండు. ఈమెది తనివిదీర్చు కవిత్వము” అనటం విశేషం. స్వాతంత్య్ర సమరంలో పాల్గొని చెరసాలకు వెళ్ళిన దేశ సేవాభిమానురాలు సుందరమ్మ.
”కవితా కదంబం”లో హృదయవీణ, కథా కవిత, సుజన స్తుతి, జాతీయ సాంఘిక గీతావళి, భగవత్కీర్తనము, అనే విభాగాలున్నాయి. కథా కవిత అప్పట్లో రాయడం గమనార్హం! దేశభక్తి ఎంత ఉందో భావకవితా వైభవం అంతే ఉంది -భావకవితా వైభవం ఎంత ఉందో సామాజిక తపన అంతే ఉంది.
”ఎతట దు:ఖ భయంబుల కిరవు లేదొ
స్వర్గ సౌఖ్యంబులెచ్చోట జరుగుచుండు
నాయెడకు నాదు నావను నడుపుమయ్య
చేరి యనుకూల వాయువులే దారిజూప”
అనటం భావకవిత్వ పోకడ! భావకవిత్వంలో గల స్వేచ్ఛా ప్రియత్వలక్షణం ఈమె కవితలో కనిపిస్తుంది. కోకిల పాట ఎంత ప్రశస్తమూ, ఆనందకరమో విశ్వసుందరమ్మ ఇలా ప్రకటిస్తారు.
”కోకిలమ్మా లేని కోనలు తనకు
కా కిమూకలతోడి కానలేనంట
తావిలేనట్టి యాంపూవులేనంట”
”అర్జును తీర్థయాత్ర” అనేది కథాకవిత. రాజా రామమోహనరాయలు, వీరేశలింగం, సరోజినీ నాయుడు వంటి వారిని స్తుతిస్తూ రాశారు. జాతీయోద్యమంలో ఖాదీ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ ఎందర్నో ప్రభావితం చేశారు. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ-
”ఖద్దరెంతో ప్రీతిగట్టు మా
మొద్దు దనుచు మూతిముడువక”
అంటూ కవిత రాశారు. విశ్వసుందరమ్మ స్త్రీల సమస్యలపై కూడా కలమెత్తారు-
”ఇట్టి వెతలకు గురియైం ఇంతులెల్ల
తలచి కొన్నంత దు:ఖము తరగలౌను”
అంటారు. ఇవన్నీ ఒక ఎత్తు -మానసిక స్వభావాల్ని వివరిస్తూ తాత్త్వికంగా చెప్పిన కవితలూ ఉన్నాయి-
”దూషణ మానుము మనసా!
పరదూషణ మానుము మనసా
ఆత్మదోషముల నమ్రతతో గని
ఆత్మస్తుతినీ వేళనుమాని”
– – -ద్వా.నా. శాస్త్రి
9849293376