ఆదర్శ ఎక్సిబిషన్ సొసైటీ -హైదరాబాద్ ”నుమాయిష్ ”

నుమాయిష్…తగ్గని జోష్

  • 25/01/2015
  • -బి.శ్రీధర్

ఓ పది రూపాయలతో అక్కడ మీకు నచ్చిన ఓ వస్తువు కొనుక్కోవచ్చు. జేబు నిండుగా ఉండి, మీ హోదాకు తగ్గట్టు ఖరీదైన వస్తువులనే తీసుకోవాలంటే వేయి రూపాయలకూ మీకు నచ్చిన ఐటెం అక్కడ దొరుకుతుంది. వాటితోపాటు కావలసినంత ఆనందమూ మీకు లభ్యమవుతుంది. మీతోపాటు వచ్చినవారికీ బోలెడంత వినోదం దక్కుతుంది. ఇవన్నీ ఒక్కచోటే దొరుకుతాయంటే మీరు నమ్మాలి. నమ్మకం లేకపోతే హైదరాబాద్‌లోని నుమాయిష్‌కు వెళ్లి రావాలి. ఇంటిల్లిపాదీ కలసి వెళ్లి ఆనందాన్ని ఆస్వాదించి హాయిగా ఇంటికి వెళ్లగలిగేలా వినోదాన్ని అందించే ప్రాంతం అది. హైదరాబాద్ నుమాయిష్ కు మరోపేరు నాంపల్లి ఎగ్జిబిషన్. పాత, కొత్తతరాల్ని ఆకర్షిస్తున్న అద్భుత వేదిక. కార్పొరేట్ కల్చర్ ఆక్రమణలను తట్టుకుని, షాపింగ్ మాల్ సంస్కృతిని ఢీకొట్టి ఏటేటా పెద్దసంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్న నుమాయిష్ వనె్న తరగని వ్యాపారకూడలి. ఆనందాల కడలి. అక్కడ అడుగుపెట్టిన మీరు కాశ్మీర్ శాలువలు, కుంకుమపువ్వు, అరబ్బులు నేసిన రగ్గులు, ఇరానీ ఖర్జూరాలు, పాక్ కళాఖండాలు… ఒకటేమిటి మీకు కావలసిన గుండుసూదినుంచి అత్యాధునిక గృహోపకరణాలు… ఏమైనా అక్కడ లభిస్తాయి. ఓ ఇంట్లో ఉన్న సభ్యులందరికీ వారివారి వయసును బట్టి, వారి అవసరాలకు తగ్గ వస్తువులన్నీ చౌకగా అక్కడ కొనుక్కోవచ్చు. అబ్బబ్బ…ఎంతసేపూ ఈ కొనడం, అమ్మడమేనా…మరీ రోజులు వ్యాపారమయమైపోయాయన్పిస్తే…అలా మరో పది అడుగులు ముందుకు వేయండి…తన్మయత్వంతో సాగే ముషాయిరాలో కవితల ఆలాపన వీనులవిందు చేస్తాయి. వహ్వా..వహ్వా అంటూ సాగే అభినందనలూ హుషారెత్తిస్తాయి. నాటకాలు, నాటికలూ అలరిస్తాయి. ఆ రంగం మీకు ఇష్టం లేదా… మరోవైపు అడుగులు వేయండి…అజయ్ జైస్వాల్ రేడియో స్టేషన్ మిమ్మల్ని పలకరిస్తుంది. హైదరాబాద్‌తో మమేకమైన హిందీ పాటలు,…అదీ మీకు అందుబాటులో లేనివి, పాతవి వినాలనుకుంటే ఆయన మీకు విన్పిస్తారు. కిషోర్‌కుమార్, మహమ్మద్ రఫీ, మన్నాడే గీతాలను ఆస్వాదిస్తూ మిమ్మల్ని మీరు మరచిపోతే మీతోపాటు వచ్చిన ఇల్లాలు, పిల్లలు ఊరుకోరు కనుక మరో నాలుగైదు అడుగులు వేయాల్సిందే. అప్పుడక్కడ టాయ్ ట్రెయిన్, జెయింట్‌వీల్ కన్పిస్తాయి. మీరు వాటిని చూసేలోగానే మీ పిల్లాజెల్లా అవి ఎక్కడమో, ఎక్కాలని గోల చేయడమో ఖాయం. అక్కడున్న జనం, ఉత్సాహం, మీవాళ్ల ఉత్సుకత చూశాక మీరు మాత్రం వెనక్కు తగ్గుతారేంటి. చలోచలో అంటూ మీరూ చిన్నపిల్లలైపోతారు. కొంచెం డబ్బు…కాస్తంత తీరిక…కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలన్న ఉబలాటం మీకుంటే ఓ సారి నుమాయిష్‌కు వెళ్లిరావొచ్చు. ఆ తరువాత వద్దన్నా వెళ్లాలని మీరు తపించకపోతే అది హైదరాబాద్ ఎగ్జిబిషనే కాదు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పాతిక ఎకరాల స్థలంలో 2575 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ దేశవిదేశాలనుంచి వివిధ సంస్థలు, వ్యక్తులు తమ ఉత్పత్తులను విక్రయిస్తారు.ఇక్కడ దొరికే అరుదైన, అబ్బురమైన, చౌకైన వస్తువులను కొనేందుకు, చూసేందుకు హైదరాబాదీలు తరలివస్తారు. దీనినే నుమాయిష్‌గా పిలుస్తున్నారు. హైదరాబాద్ పేరు చెబితే భోజన ప్రియులకు బిర్యానీ గుర్తొస్తుంది… సాహితీ ప్రియులకు ముషాయిరాలు, సంగీతసాహిత్య చర్చాగోష్టులు గుర్తుకువస్తాయి…ఇలా వారి ఇష్టాయిష్టాలను బట్టి నగరంతో ఏదో ఒక అనుబంధం హృదయాన్ని మీటుతూనే ఉంటాయి. కానీ ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని అందించే ఓ వేదిక హైదరాబాద్‌లో ఉందంటే..అదే నుమాయిష్. ప్రతి ఆంగ్ల సంవత్సరాదితో ప్రారంభమయ్యే ఈ వేడుక నలభై ఐదు రోజులు సాగుతుంది. రోజులు గడుస్తున్నకొద్దీ కొత్త సొగసుతో, ప్రజల కిటకిటతో కళకళలాడుతుంది. అరె అప్పుడే అయిపోయిందా అని ఏటా జనం అనుకునేట్లు అలరించే ఈ వేడుకే నుమాయిష్. 1938లో… సరిగ్గా డెబ్భై అయిదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ సంస్థానం పరిథిలో ఆర్థికసర్వే చేయాలని భావించారు. కానీ అది చేయడానికి నిధులు లేవు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఉస్మానియా యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొందరు ఇక్కడ తయారు చేసిన వస్తువులను అమ్మేందుకు ఓ ఎగ్జిబిషన్ నిర్వహించాలని, తద్వారా నిధులు సేకరించాలని ముందుకొచ్చారు. అలావచ్చిన నిధులతో సర్వే చేసి, మిగతా సొమ్ముతో మహిళలకు చదువు చెప్పించాలని నిర్ణయించారు. అప్పటికే పబ్లిక్‌గార్డెన్‌లో నిజాం నిర్వహించిన సిల్వర్‌జూబ్లీ నుమాయిష్‌కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పడగొట్టవద్దని, అందులో తాము మరో ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటామని కోరారు. అలా తొలిసారిగా ఉస్మానియా గ్రాడ్యుయేట్ల ఆధ్వర్యంలో తొలి నుమాయిష్ నిర్వహించారు. ఇది అక్టోబర్, 1938నాటి మాట. కేవలం రూ. 2.50లతో, ఆరు స్టాల్స్‌తో, పదిరోజులపాటు తొలి ప్రదర్శన జరిగింది. వరుసగా మూడేళ్లు, ఏటా అక్టోబర్‌లో ఈ ఎగ్జిబిషన్ కొనసాగాక, క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ రాష్ట్ర ఏడవ నిజాం తొలి ప్రదర్శనను ప్రారంభించారు. 1946లో హైదరాబాద్ స్టేట్ ప్రైమ్ మినిస్టర్ సర్ మీర్జాఇస్మాయిల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 32 ఎకరాల స్థలాన్ని ఎగ్జిబిషన్‌కోసం కేటాయించారు. తరువాతికాలంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్య్రం రావడం, హైదరాబాద్ సంస్థానం విలీనం వివాదాలతో 1947,48లలో నుమాయిష్ నిర్వహించలేదు. 1949తరువాత ఇప్పటివరకు ఎగ్జిబిషన్‌కు ఎటువంటి అంతరాయం కలగలేదు. 1949లో భారత తొలి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి నుమాయిష్‌ను ప్రారంభించారు. ఆ ఏడాదినుంచి దీనిని ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా పిలుస్తున్నప్పటికీ 2009లో నుమాయిష్ అన్న పేరును పునరుద్ధరించారు. రికార్డుల్లో ఏ పేరున్నా జనం నోట్లో మాత్రం నుమాయిష్ లేదా నాంపల్లి ఎగ్జిబిషన్ అన్న పదాలే పలుకుతాయి. ఎన్నో మార్పులు కాలానుగుణంగా నుమాయిష్ నిర్వహణలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ఎగ్జిబిషన్ సొసైటీ వ్యాపారకోణంలోనే కాకుండా సేవాదృక్పథంతో పనిచేస్తోంది. ఏటేటా కనీసం వంద స్టాల్స్ పెరుగుతున్నాయి. ప్రతీ ఏటా సందర్శకుల సంఖ్య కనీసం లక్ష పెరుగుతోంది. లాభాలూ బాగా వస్తున్నాయి. 1960లో ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు పది పైసలుంటే ఇప్పుడు ఇరవై రూపాయలుంది. మహిళలకు, చిన్నారులకోసం ప్రత్యేకంగా కొన్ని రోజులు కేటాయిస్తున్నారు. కేవలం క్రయవిక్రయాలే కాకుండా సందర్శకులకు వినోదాన్ని అందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తి,శ్రద్ధ ఉన్నా అందుకు తగిన ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఎగ్జిబిషన్ సొసైటీ వెన్నుదన్నుగా నిలుస్తోంది. 20 కళాశాలలను నిర్వహిస్తూ మధ్య తరగతి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. ఉన్నత విద్య అభ్యసించే పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత ఇస్తోంది. సరికొత్త జోష్! ఏడాదికోసారి జరిగే నుమాయిష్‌లో పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్, బంగ్లాదేశ్‌సహా పది పదిహేను దేశాలకు చెందిన సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈసారి ఏర్పాటు చేసిన 75వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు పాకిస్తాన్ దూరంగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ నుమాయిష్‌కు సందర్శకుల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకే ఎగ్జిబిషన్ ప్రారంభమైనా ఐదయ్యేసరికి ఊపందుకుంటుంది. రాత్రి పది గంటల వరకు సందర్శకులతో కిటకిటలాడుతోంది. వచ్చే నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనకు ఈ నెల 16వ తేదీ సాయంత్రానికి నాలుగున్నర లక్షల మంది సందర్శించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రదర్శన ప్రారంభమైన కొత్తలో అంతంతమాత్రంగా ఉన్న సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నెల 15వ తేదీ సంక్రాంతి సెలవు కావటంతో ఆ ఒక్కరోజే 70వేల మంది నుమాయిష్‌ను సందర్శించినట్లు సొసైటీ గౌరవ కార్యదర్శి పి.నరోత్తమ్ రెడ్డి చెప్పారు. చిన్నారులకోసం అమ్యూజ్‌మెంట్ జోన్ పారిశ్రామిక ప్రదర్శన ముఖ్యంగా చిన్నారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తొంది. ఇక్కడి అమ్యూజ్‌మెంట్ జోన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న జెయింట్ వీల్స్, కొలంబస్, వెల్ ఆఫ్ డెత్, కప్ సాసర్, క్యామిల్, బౌన్సర్, రేంజర్, రంగులరాట్నం వంటివి చిన్నారులను ఆకట్టుకుంటాయి. కేవలం ఈ జోన్ 150 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్గుతోంది. సాహస విన్యాసాలతో సందర్శకులను అబ్బురపరుస్తున్న డేర్ డ్రైవర్లు, చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న చుక్ చుక్ రైలుతో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఎంతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ స్టాల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన చారిత్రక కట్టడాల నమూనాలు, హస్తకళాఖండాలు సందర్శకుల ఆదరణను పొందుతున్నాయి. ఐటి కార్పొరేట్, విద్యా, వైద్య సంస్థలు, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో కూడా సందర్శకులు కిటకిటలాడుతున్నారు. ఎగ్జిబిషన్‌లో హిందీపాటలను ఇష్టపడేవారికోసం జైశ్వాల్ రేడియోస్టేషన్ విన్పించే పాతపాటలు రోజునుబట్టి, జనంరద్దీని బట్టి, సమయాన్ని బట్టి మారిపోతూంటాయి. జనం మూడ్‌నుబట్టి పాటలను విన్పిస్తారు. కానీ ఎగ్జిబిషన్ ముగుస్తున్న సమయంలో పాకిజాలోని చల్తేచల్తే కోయి మిల్‌గయా పాటను ప్రసారం చేస్తారు. ఆ తరువాత చిరాగ్ భుజ్హ్రేహైన్…కామెంట్ తో స్టాల్స్ నిర్వాహకులను హెచ్చరిస్తారు. ఇక స్టాల్స్‌ను మూసేయాలని సూచించడం ఓ ఆనవాయితీ. నుమాయిష్ సందర్శన ముగిసిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు సందర్శకులు చేరేందుకు వీలుగా ఆర్టీసి అర్థరాత్రి వరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. భద్రత ఎంత? 45 రోజుల ప్రదర్శనకు సుమారు 23 నుంచి 24లక్షల మంది హాజరవుతారని అంచనా. ప్రతిరోజు కనిష్ఠంగా 20వేలమంది, గరిష్ఠంగా లక్ష మంది హాజరయ్యే నుమాయష్ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. గ్రౌండ్ లోపల ముప్పై చెక్ పోస్టులు, అడుగడుగున నిఘా, ప్రతి ఒక్కరి కదలికలను గమనించేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేసినా ఎప్పటికపుడు కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. నుమాయిష్ ప్రారంభమైనప్పటినుంచి రెండంచెల్లో భద్రతను కల్పిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో భద్రతలోని డొల్లతనాన్ని పోలీసులు వెల్లడిచేయడంతో సొసైటీ అప్రమత్తమైంది. మెయిన్ గేట్ల వద్ద సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ప్రయివేటు మార్షల్స్‌ను నియమించింది. ఆటాపాటా..పోటీ పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించటంతోపాటు సందర్శకుల్లోని విభిన్న కళ, క్రీడాంశాలకు సంబంధించిన ప్రతిభను ప్రోత్సహించటంలో కూడా ఎగ్జిబిషన్ సొసైటీ తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తోంది. చిన్నారులు, మహిళలకు రంగోలీ, యువతీయువలకు క్రీడాపోటీలు నిర్వహిస్తోంది. వెల్‌బేబీ షో, ఫ్యాన్సీడ్రెస్ పోటీలు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేగాక, ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న కాలేజీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నుమాయిష్ జరిగే రోజుల్లోనే పతకాలను బహుకరిస్తూ ప్రోత్సహిస్తోంది. బాధితులకు ఆపన్నహస్తం కేవలం విద్యాలయాల నిర్వహణకే పరిమితం కాకుండా ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో బాధితులకు ఆపన్న హస్తం అందజేస్తోంది. ఇటీవల జమ్ముకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు రూ. 20 లక్షలను ఆర్థిక సహాయంగా అందజేసింది. అంతేగాక, పోలీసుల సంక్షేమానికి ఏటా రూ. 10 లక్షలు, ఫైర్ విభాగానికి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ సొసైటీ తన ఉదారతను చాటుకుంటోంది. తాజాగా ఈ సారి హైదరాబాద్ పాతబస్తీలోని గౌలీపురా, మొఘల్‌పురాల్లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తతకు తీసుకుంది. తొలి దిశగా వీటిలో వౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ. 10 లక్షలను వెచ్చిస్తోంది. అంతేగాక, భాస్కర మెడికల్ కాలేజీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ పేద విద్యార్థినికి వార్షిక ఫీజు చెల్లించింది. * గిరాకీ ఇంకా పెరగాలి! మేము 30 ఏళ్ల నుంచి ఇక్కడ స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం తొలి పది నుంచి పదిహేను రోజుల్లో అమ్మకాలు ఊపందుకునేవి. ఈ సారి స్టాల్‌ను సందర్శించే వారి సంఖ్య అశాజనకంగానే ఉన్నా, కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. వ్యాపారపరంగా కాకుండా ఏ ఉత్పత్తికైనా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశమున్నందునే ఇక్కడ స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నాం! -ఇంతియాజ్ (కాశ్మీర్ గీటు నగల వ్యాపారి) ఎగ్జిబిషన్ అదుర్స్‌నుమాయిష్ చాలా బాగుంది. హైటెక్ సిటీ సమీపంలోని మైండ్ స్పేస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మేం, స్నేహితులు శశికాంత్, పావెల్, రమణలతో కలిసి వచ్చాం. అన్ని ప్రాంతాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే లోపలికి రావటం, బయటకు వెళ్లటమే కొంత ఇబ్బందిగా మారింది. ఇక్కడున్న అన్ని స్టాళ్లను చూస్తాం. చైతన్య, దివ్య ఐటి ఉద్యోగులు కాశ్మీర్ నగలకు డిమాండ్ మేం ఆర్లేళ నుంచి పారిశ్రామిక ప్రదర్శనలో స్టాల్‌ను పెడుతున్నాం. ప్రతిసారికూడా తొలి పదిహేను రోజులు పెద్దగా అమ్మకాలుండవు. ఈ సారి కూడా సరిగ్గా ఇదే జరిగింది. సంక్రాంతి నుంచి అమ్మకాలు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. కాశ్మీర్ సంప్రదాయ నగలకు ఆదరణ దక్కుతోంది. కొనుగోలుదారులే కాకుండా మిగతావారూ ఈ నగల గురించి వివరాలు తెలుసుకోవడం ఆనందంగా ఉంది. మీర్ తాసిర్ రషీద్ ఎస్‌కెవై కాశ్మీర్ జ్యుయెలరీ యజమాని ఇది చాలదు…ఇంకా పుంజుకోవాలి పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా, ఇంత వరకు కనీసం రూ. 10వేల సరుకు అమ్మలేకపోయాం. మునుపటితో పోలిస్తే కొనుగోలుదారుల సంఖ్య తగ్గింది. వ్యాపారం బాగా సాగుతుందన్న నమ్మకంతో రాజస్థాన్‌నుంచి ఇక్కడికొచ్చాం. మావెంట వచ్చిన నిరుద్యోగుల పరిస్థితి మరింత దయనీయం. అహ్మద్ రాజస్థాన్ చెప్పుల వ్యాపారి విభజన ప్రభావం కన్పిస్తోంది హైదరాబాద్‌కు చెందిన నేను ప్రతి సంవత్సరం హ్యాండ్లూమ్ స్టాల్‌ను ఏర్పాటు చేస్తుంటాను. కానీ ఎపుడూ లేని విధంగా ఈ సారి అమ్మకాలు బాగా తగ్గాయి. ఇందుకు రాష్ట్ర విభజనే కారణం. హ్యాండ్లూమ్ కొనుగోలుపై నగరవాసులు ఎంతో మక్కువ చూపుతారని, వివిధ రాష్ట్రాలకు చెందిన హ్యాండ్లూమ్స్ అందుబాటులోకి తెచ్చాం. కానీ తాము ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగటం లేదు. -మూల్‌చంద్ కేశ్వాని హ్యాండ్లూమ్ వ్యాపారి ప్రతి సారి వస్తాం! అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను తిలకించేందుకు నేను, మా కుటుంబ సభ్యులు ప్రతి సారి వస్తాం! గతంతో పోల్చితే ఈ సారి స్టాళ్ల సంఖ్యను పెరిగింది. సందర్శకుల సౌకర్యాలపై సొసైటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొత్తం నుమాయిష్ చూడాలంటే ఒక రోజు సమయం సరిపోదు. తీరిగ్గా ఉన్నపుడు మళ్లీ వస్తాం. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే నగరవాసులు కుటుంబ సమేతంగా సేదదీరే వేదిక నుమాయిష్. నర్సింగ్‌రావు, మాధవి దంపతులు లెక్చరల్, విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ, ఘట్‌కేసర్ సందర్శకుల సంఖ్య 5 లక్షలు దాటింది! అఖిల భారత 75వ పారిశ్రామిక ప్రదర్శనకు ఆశించిన స్థాయిలోనే ఆదరణ కన్పిస్తోంది. జనవరి 16 మధ్యాహ్నం నాటికి సందర్శకుల సంఖ్య 5లక్షలకు దాటింది. గతంలో పరిస్థితులను పోల్చితే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఎక్కడా కూడా అంగుళం స్థలం వృథా కాకుండా స్టాళ్లను ఏర్పాటు చేసినా, వ్యాపారస్తుల డిమాండ్ మేరకు స్టాళ్లను అందుబాటులో తేలేకపోయాం. బహుళజాతి సంస్థలు, షాపింగ్ మాల్స్, చిన్నాచితకా ఎగ్జిబిషన్లు వచ్చినా నాంపల్లి నుమాయిష్‌కు ఆదరణ తగ్గలేదు. పైగా ఏటేటా ఆదరణ పెరుగుతోంది. గత సంవత్సరం మొత్తం ప్రదర్శన జరిగిన 45 రోజుల్లో 23లక్షల మంది సందర్శకులు హాజరుకాగా, ప్రస్తుతం వస్తున్న ఆదరణను బట్టి ఈ సారి కనీసం లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి పి. నరోత్తమ్‌రెడ్డి అప్పుడు…ఇప్పుడు 1938లో తొలి ప్రదర్శన ఆరు స్టాల్సుతో, మూడు రోజులు నిర్వహించారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉత్పత్తులను విక్రయించాలని అప్పుడు భావించారు. ఇప్పుడు 75వ ఏట 2575 స్టాళ్లతో, దేశవిదేశాల వస్తువులను విక్రయిస్తున్నారు. అప్పుడు వారానికోసారి మహిళలకోసం ఎగ్జిబిషన్ ప్రత్యేకిస్తే ఇప్పుడు మొత్తంమీద ఒక్కరోజు వారికోసమే కేటాయించారు. పిల్లలకు ఓ రోజు కేటాయించారు. రోజులు మారినా, కార్పొరేట్ సంస్థలు రంగంలోకి దిగినా, షాపింగ్ మాల్స్ వెల్లువెత్తినా సంప్రదాయ వస్తువులు దొరికే నుమాయిష్‌కు నానాటికీ ఆదరణ పెరుగుతూనే ఉంది. గత ఏడాది ఎగ్జిబిషన్‌ను 21 లక్షలమంది సందర్శించారు. గతేడాదికన్నా ఈ సారి 100 స్టాల్సు ఎక్కువ పెట్టారు. ఈ ఏడాది సందర్శకుల సంఖ్య 23-24 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతేడాది ఎగ్జిబిషన్ సొసైటీకి 11 కోట్ల లాభం వచ్చింది. ఈసారి మరో కోటి రూపాయలు లాభం రావచ్చని అంచనా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి బస్సులు పారిశ్రామిక ప్రదర్శన జరిగినన్నీ రోజులు ప్రయాణికులకు అనుకూలంగా ఆర్టీసి బస్సులను నడుతోంది. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పదిగంటల వరకు సందర్శన సమయం కావటంతో చాలామంది తమ వృత్తి, ఉద్యోగాలను ముగించుకుని కుటుంబ సమేతంగా ఇక్కడకు వస్తుంటారు. ఈ క్రమంలో సందర్శనానంతరం వారు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు వీలుగా అర్థరాత్రి వరకు ఆర్టీసి బస్సులను నడుపుతున్నాం. మామూలు రోజుల్లో రద్దీని బట్టి దాదాపు 120, ఇక సెలవురోజుల్లో అదనంగా 60 అంటే మొత్తం 180 బస్సులను వివిధ ప్రాంతాలకు నడుపుతున్నాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుతాం. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ జి.జయరావ్ టిఎస్ ఆర్టీసీ

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.