ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు-3
ఆధునిక సంగీత నిర్మాత –రిచార్డ్ వాగ్నర్ -1
తండ్రికి ఉన్న తొమ్మిది మంది సంతానం లో చివరివాడుగా లీప్ లిజ్ లో పుట్టి ,పుట్టిన కొన్ని నెలలకే తండ్రిని కోల్పోయి ,ఇరవై ఏళ్ళకే ప్రపంచ ద్రుష్టి అలవడి తన పేరు విల్ హెమ్ రిచార్డ్ వాగ్నర్ లో మొదటి భాగాన్ని తీసేసుకొన్నాడు ..కుటుంబానికి సన్నిహితుడు చిత్రకారుడు ,నటుడు నాటక రచయిత ,జ్యూ అయిన లుడ్విగ్ గేయర్ ను తల్లి మళ్ళీ పెళ్ళాడింది .కొత్త మొగుడు వలన ఒక కూతురును కన్నది .వాగ్నర్ మారుటి తండ్రి కుటుంబాన్ని చాలా ఆప్యాయం గాబాధ్యతా గా పెంచాడు .ఇతనిపై ప్రత్యెక శ్రద్ధ వహించాడుకూడా .ఇదొక విశేషమే .కుటుంబం డ్రెస్ డేయిన్ కు మారింది .గేయర్ వాగ్నర్ ను స్కూల్ లో చేర్చి రిచార్డ్ గేయర్ అని పేరు నమోదు చేశాడు .పద్నాలుగో ఏట పుకార్లు షికార్లు చేసి చెవిన పడి రిచార్డ్ వాగ్నర్ గా పేరు మార్చుకొన్న స్వతంత్ర జీవి .పది హేనేళ్ళ వయసులో షేక్స్ పియర్ రచనలు చదివి హేమ్లెట్ నాటకం ప్రభావం తో’’లీ బాల్డ్ అండ్ అడిలైడ్’’ నాటకం రాశాడు .అందులో వచ్చే పాత్రలనన్నిటిని మొదటి అంకాలోనే చంపేశాడు .నాటకం ట్రాజెడీ కావటానికని వాళ్ళని మళ్ళీ చివర్లో బతికించి ప్రయోగం చేశాడు .గ్రీకు ట్రాజేడీలపై ఆరాధన ఏర్పడింది . హోమర్ సాహిత్యాన్ని పన్నెండు భాగాలు అనువాదం చేశాడు .అప్పటిదాకా సంగీతం అంటే పెద్దదా గా ఇష్టం ఉండేదికాదు .
వెబర్ రాసిన ‘’ఫ్రీస్చిట్జీ ‘’గురించి విన్నతరవాత సంగీతం పై విపరీతమైన మోజు ఏర్పడింది .వాటిని తన పియానో మీద వాయించి తృప్తి చెందాడు .సోనాటాలు సిమ్ఫనీలపై ద్రుష్టి పడింది .షేక్స్పియర్ ను బీతొవెన్ మొజార్ట్ ను కలలలో కలుసుకొని మాట్లాడానని వాగ్నర్ చెప్పుకొన్నాడు .అంటే మనసంతా వాళ్ళే నిండి పోయారన్నమాట .పదహారో ఏట సంగీతం లో మెళకువలు గ్రహించి సంగీత కర్త అయ్యాడు .మనసులోని భావాన్ని హాహార్మని తో పలికించటం ,బీతోవన్ నుంచి కౌంటర్ పాయింట్ ను పొందటం జరిగింది కుటుంబం వారెవ్వరూ వాగ్నర్ సంగీత కర్త అవటానికి అభ్యంతరం చెప్పలేదు .అతని పెద్దక్క అప్పటికే ఒపేరా గాయనిగా ప్రసిద్ధి పొందింది .కంపోసర్ గా కంటే గాయకుడిగా స్తిర జీవితం అతనికి లభిస్తే బాగుంటుందని మాత్రం వాళ్ళు ఆశించారు .
తల్లి పియానో వయోలిన్ విద్యలో కొడుకు ఆరితేరాలని కోరుకొన్నది . గురువుల వద్ద నేర్పించింది .కాని నేర్పిన గురువు ‘’వాగ్నర్ ను ‘’వరస్ట్ ఫెలో –తెలివిగాలాడే కాని బద్ధకిస్టు’’అన్నాడు .ఈ రెండిటినీ సంపూర్తిగా నేర్వనే లేదు .పద్దెనిమిదో ఏట లీప్ జిగ్ యూని వర్సిటిలో చేరి సంగీతకర్త బాష్ వారసుడైన థియోడర్ వీన్లిగ్ దగ్గర సంగీతం నేర్చాడు గురువు శిష్యుడుచేసిన పియానో సొనాటా ,పోలోనైజ్ అనే రెండు కంపోజిషన్ లను ముద్రించే ఏర్పాటు చేసి ప్రోత్సహించాడు .యూని వర్సిటీకి రెగ్యులర్ గా వెళ్ళేవాడుకాడు .తాగి త౦దనాలాడేవాడు .జూదం ఆడేవాడు .తల్లి కొచ్చే పెన్షన్ డబ్బుల్ని విచ్చల విడిగా ఖర్చు చేసి ఎప్పుడూ అప్పుల అప్పారావు అవతారం లోనే ఉండేవాడు .కాని సంగీతం లో ప్రయోగాలు చేస్తూనే ఉండేవాడు .
సి మేజర్ లో చేసిన స్వర సమ్మేళనం అంటే కంపోజిషన్ ప్రేగ్ లో ప్రదర్శించాడు .మొదటి ఒపేరా ‘’ది వెడ్డింగ్ ‘’స్వరాలు కూర్చి నచ్చక మంటల్లో తగల పెట్టేశాడు .ఇరవై రెండవ ఏట రెండవది’’ది ఫెయిరీస్’’ ప్రారంభించాడు .ఇది జర్మన్ కవి గోతే రాసిన ‘ఫాస్ట్ ‘’కూర్పు లా ఉంటుంది .ఇదీ ప్రదర్శనకు నోచుకోలేదు .అప్పటికే సంగీతం లో పండిపోయాడు .ప్రొఫెషనల్ అని పించుకొన్నాడు .వాగ్నర్ సోదరుడు స్టేజి మేనేజర్ గా ఉన్నాడు .ఇతనికి కోరస్ మాస్టర్ గా అవకాశం ఇచ్చి ఒక గుర్తింపు తెచ్చాడు .తిండికి ఇబ్బంది లేని ఉద్యోగం దొరికింది .ఇప్పుడు మూడవ ఒపేరా’’దిలవ్ బాన్ ‘’ కోసం ప్రయత్నం చేశాడు .ఇందులో షేక్పియర్ రాసిన ‘’మెజర్ ఫర్ మెజర్ ‘’ఇతివృత్తాన్ని వాడుకొన్నాడు .దీనితో కీర్తి వచ్చిమాగ్దేబర్గ్ లోని చిన్న దియేటర్ డ్రామా కంపెనీ కి సంగీత దర్శకుడయ్యాడు ..ఆ ప్రదేశం కాని ,అక్కడి జనం కాని నచ్చక మళ్ళీ లీప్ జిగ్ కు వెళ్ళిపోయాడు .
ఇక్కడ మన వాడి కద మలుపుతిరిగింది .ఆరేళ్ళ కూతురున్న మిన్నా ప్లానర్ అనే పెద్దగా సంస్కారం లేని ఆమె తో పరిచయం ప్రేమగా మారి పెళ్లిదాకా వచ్చింది .ఆమె నాటకరంగం పై అభినివేశం నిర్వహణా సామర్ధ్యం ఉన్నావిడ .పెళ్లి అయిందికాని వాగ్నర్ తిక్క కుదర్లేదు .బాధ్యతారాహిత్యం గా ,ప్రవర్తిస్తూ ఆడంబరాలకు పోయి భార్య డబ్బంతా తిరుక్షవరం చేసి అప్పులపాలై మునిగి ఆమె తో పోట్లాడుతూ జీవితం నరకం చేసుకొని, చేశాడు .వీడిని భరించలేక ఆరు నెలలకాపురానికే విసిగిపోయి వదిలేసి ఆమె మానాన ఆమె వెళ్లి పోయింది .మనవాడు ‘’అత్తారింటికిదారేది ? అని వెతుక్కోని చేరి సయోధ్య చేసుకొన్నా అది తాత్కాలికమే అయింది .మళ్ళీ గొడవ ,విడిపోవటం .చివరికి వాగ్నర్ రీగాలో సంగీత దర్శకుడైన తర్వాత ఆమె వచ్చి చేరింది .సంగీతం కూరుస్తూనే ఉన్నాడు .ప్రదర్శిస్తూనే ఉన్నాడు వచ్చిన రూపాయి నిలవటం లేదు .మళ్ళీ అప్పులే అప్పులు .తిప్పలే తిప్పలు .ఈ బాధ భరించలేక స్నేహితుడికి ఉత్తరం రాస్తూతనకు డబ్బు కావాలని లేక పొతే పిచ్చివాడినై పోతానని చెప్పుకొన్నాడు .డబ్బు మంచి నీళ్ళ ప్రాయం గా ఖర్చు చేసేవాడిని ఎవరు ఎంతవరకు ఎన్నిసార్లు ఆదుకొంటారు ?.అధిక వడ్డీలకు డబ్బు తేవటం తీర్చలేక మళ్ళీ అప్పులు చేయటం అదీ అతని పరిస్తితి .నిండా మునిగిపోయాడు .ఉద్యోగం ఊడింది .పరువు గంగ పాలైంది .నెత్తిన గుడ్డ వేసుకొని రీగా నుండి రష్యాకు కుటుంబం తో వెళ్ళిపోయాడు .సరస్వతి ఉన్నా లక్ష్మీ ప్రసన్నం అయినా ఖర్చు శని వాగ్నర్ ను పట్టుకొనిపీడించి పిప్పి చేసింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-15- ఉయ్యూరు