నా దారి తీరు -86 గండ్రాయి స్పెషల్

నా దారి తీరు -86

గండ్రాయి స్పెషల్

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు గండ్రాయి హైస్కూల్ లోను , ట్యూషన్ లో చేసి అందరికి అభిమానుడినయ్యాను .డ్రాయింగ్ మేస్టారు ప్రసాద్ బెజవాడ వాడే .అక్కలు అక్కడ ఉద్యోగం .వారానికి ఒకసారి బెజవాడ వెళ్లి వచ్చేవాడు . కుర్రాడు మంచివాడే   కొంచెం ఈగో ఉండేది  .ఎర్రగా వెడల్పు ముఖం తో ఉండేవాడు .చిటికలో కోపం వచ్చేది .నేను మాట్లాడి శాంతపరచేవాడిని. డ్రాయింగ్ లో  మంచి  నైపుణ్యం ఉన్నవాడు .బాగా నేర్పించేవాడు .చక్కగా బొమ్మలు వేస్తాడు నాకు బాగా దగ్గరయ్యాడు .అతనితో నేచురల్ సైన్స్ బొమ్మలు రంగుల చాక్ పీసులతో బోర్డు మీద వేయించే వాడిని .అది నాకు పాఠాలు చెప్పటానికి బాగా తోడ్పడేది .ఏది అడిగినా చాలా ఇష్టం గా అద్భుతం గా వేసేవాడు .సుధాకర రావు అనే తెలుగు మేష్టారు బందరు దగ్గర వడ్లమన్నాడు  వాడు .తలిదండ్రులు అక్కడే ఉండేవారు భార్య ,పిల్లాడితో ఇక్కడికి వచ్చాడు .మేమున్న బజారులోనే ఒక కమ్మవారి ఇంట్లో పై అంతస్తులో ఉండి ఆరు ఏడు క్లాసులకు ప్రైవేట్ చెప్పేవాడు .సాహిత్య జ్ఞానం బాగానే ఉంది చాకు లాంటికుర్రాడు .పద్యం బాగా పాడేవాడు .నవ్వుముఖం సరదాగా మాట్లాడేవాడు పిల్లలతో మంచి అనుబంధం పెంచుకొన్నాడు .నా ట్యూషన్ పిల్లలకు అప్పుడప్పుడు పిలిపించి తెలుగు చెప్పించేవాడిని. నేను ఎలాగూ అన్ని సబ్జెక్ట్స్ చెప్పేవాడిని .  అతని భార్య కూడా చాలా కలుపుగోలు తనం గా ఉండి మాట్లాడేది .సాయంత్రాలు సుధాకర్ నేను  డ్రాయింగు ఆయనా కలిసి సరదాగా షికారు వెళ్లి తోటల్లో తిరిగి ప్రక్రుతి అందాలు చూసి వస్తూ౦డేవాళ్ళం .సుధాకర్ ఇంటికి వెడితే టిఫిన్ కాఫీ తప్పక ఉండేది .ప్రసాద్ ఒక కమ్మారి కుటుంబం ఉన్న ఒక గదిలో ఉండేవాడు .వాళ్ళు అతన్ని బాగా చూసుకొనే వారు .స్కూల్ కు దగ్గరా రోడ్డుమీదే అతని నివాసం .

ముందుగా నేను నా సైన్స్ క్లాస్ లకు వచ్చే పిల్లలను మోటివేట్ చేయించి వారితో తలా అయిదు రూపాయలు చందాగా వేయించి మొత్తం వసూలు చేసి హెడ్ మాస్టారికిచ్చి సైన్స్ రూమ్ లో రెండు ట్యూబ్ లైట్లు ఒక ఫాన్ తెప్పించి ఏర్పాటు చేయించాను .అది అందరిమీద ప్రభావం చూపింది నేను నా ఎనిమిదవ తరగతి విద్యార్ధుల చేత వాళ్ళ క్లాస్ రూమ్ లో ట్యూబ్ లైట్ ఏర్పాటు చేయించాను .తర్వాత అందరూ దీన్ని స్పూర్తిగా తీసుకొని మిగిలిన క్లాస్ లలో ట్యూబ్ లైట్స్ ఏర్పాటు చేయించి స్కూల్ కు వెలుగు లు తెచ్చారు  .ఒక ఐడియా స్కూల్ వాతావరణాన్నే మార్చేసింది .

డ్రాయింగ్ మేస్టర్ ప్రసాద్ తో సైన్స్ రూమ్ బోర్డ్ పై ఉన్న భాగం లో ‘’మధన పడే మేధావుల చివురాశలు చివురించే రస రాజ్యం లేబరేటరి’’ అనే నాకిష్టమైన దాశరధి కొటేషన్ రాయించాను పెద్ద అక్షరాలతో. నేను పని చేసిన ప్రతిస్కూల్ లోనూ ఈ పని చేశాను .ఇది ఇక్కడ అందరికి నచ్చింది .పదవ తరగతి లో బాగా చలాకీ అయిన అమ్మాయి కొండపల్లి లక్ష్మి ఉండేది .తారకేశ్వరి తో పోటీ పడి చదివేది .సైన్స్ లో బాగా అభిరుచి ఉన్న ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్ధినీ విద్యార్ధులను సెలెక్ట్ చేసి ‘’సైన్స్ క్లబ్ ‘’అనేదాన్ని ఏర్పాటు చేసి దానికి కార్య దర్శిగా లక్ష్మిని నియమించి ప్రతిబుధవారం సాయంత్రం చివరి పీరియడ్ లో సైన్స్ క్లబ్ సమావేశాలు జరిపించి విద్యార్ధులతో సైన్స్ సంబంధిన ఆ వారం పేపర్ల లో వచ్చిన వార్తలు సేకరించి చదివించటం ఒక సైంటిస్ట్ గురించి విషయాలు సేకరించి మాట్లాడించటం చేసేవాడిని .పిల్లలకు ఇది కొత్త .చాలా బాగా పాల్గొని ప్రతిభను రుజువు చేసుకొనే వారు .

స్కూల్ కు ముందున్న కాంపౌండ్ వాల్ తప్ప అట స్థలానికి ఫెన్సింగ్ లేదు .అన్నీ ముల్ల పొదలే .కాలు పెట్ట టానికి వీలున్దేదికాడు .డ్రిల్ మేష్టారు జనార్దన రావు  అని జ్ఞాపకం .నందిగామ దగ్గర ఏటూరు నుంచి రోజూ వచ్చేవాడు .బుగ్గన ఎప్పుడూ జారదా కిళ్ళీ ఉండేది .మంచి ఆటగాడు .డ్రిల్ బాగా చేయించేవాడు .పిల్లలకు బాగా దగ్గరయ్యాడు .ఆయన నేను,డ్రాయింగ్ ప్రసాద్ కలిసి హెడ్ మాస్టారు తో చెప్పి కంచే వేయటానికి సీమ తుమ్మ విత్తనాలు తెప్పించి పిల్లలతో సాయంత్రం డ్రిల్ పీరియడ్ లలో గ్రౌండ్  చుట్టూ పలుగుతో కన్నాలు వేయించి విత్తనాలు వేయించి నీరు పోయించా౦ .అవి నెమ్మదిగా మొలకెత్తి అల్లుకొని కంచే లాగా ఆరు నేలలయ్యేసరికి పెరిగిపోయి అందరికి ఆశ్చర్యం వేసింది ఇక్కడెవరూ ఊహించని విషయం అందరి ప్రశంసలు  అందుకోన్నాం టీం లీడర్ నేనే .మొలవని విత్తనాల స్థానాలు గుర్తించి అక్కడ మళ్ళీ విత్తనాలు నాటించి దట్టం చేశాం .కనుక స్కూల్ కు కొంత వరకు రక్షణ కల్పించామన్న మాట గొడ్లు లోపలి రావటానికి ఇక కుదరకుండా చేశాం .ఇదీ ఒక ముందడుగే  .

ఇంత వరకు స్కూల్ విద్యార్ధులు ,ఉపాధ్యాయులు ప్రతి ఏడాది జరిగే గ్రిగ్ ఆటల పోటీలలో పాల్గొనే వారు కాదు కారణం స్కూలుకు స్పెషల్ ఫీజు ల వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఇక్కడంతా బి .సి. లు ఎసి., ఎస్. టి. విద్యార్ధులే అవటం వలన  ఫీజు కు ఎక్సేం ప్షన్ ఉండటం తో ఆదాయం రాదు .అదే ప్రతిస్కూలు పరిస్తితి .కాని ఆలోచన వస్తే అదేదో వచ్చినట్లు ఆటలూ  ఆడించ వచ్చు .మేమంతా కలిసి బాగా ఆడే  పిల్లలను ఎంపిక చేసి ఆటలు ఆడించి తర్ఫీదు చేశాం  బాడ్మింటన్ వాలీ బాల్ లో బాగా నైపుణ్యం చూపారు .పిల్లలనే  డబ్బులు కట్టుకోమని ఆడటానికి వెళ్ళటానికి ఖర్చులు కూడా వాళ్ళనే పెట్టుకోమని చెప్పి మొదటిసారిగా గ్రిగ్ పోటీలలో స్కూలు పాల్గోనేట్లు చేసి విద్యార్ధులలో క్రీడల పట్ల ఆసక్తి పెంచటానికి తోడ్పడ్దాం.అదో ‘’తుత్తి’’(తృప్తి ).మేస్తర్లం కూడా డబ్బులు వేసుకొని ఎంట్రీ ఫీజు కట్టి రోజూ బాడ్మింటన్ , వాలీబాల్ స్కూలు కాంపౌండ్ –రోడ్డు మధ్య ఉన్న ఖాళీ స్థలం లో నెట్ కట్టి ప్రాక్టీస్ చేసి నందిగామ సబ్ జోన్ కు వెళ్లి ఆడాం .ఇదొక రికార్డే ఇక్కడ .

ట్యూషన్ పిల్లలకు కార్తీక పౌర్ణమి నాడు రాత్రి ఉయ్యూరు లో చేసినట్లు  వీలైన వాళ్ళ తో పాలుతెప్పించి  పంచదార ఏలకులు వగైరా కొనిపించి భారతమ్మగారితో పాలు కాయించి పరవాన్నం వండించి అందరికి పంచాము .ఇది ఇక్కడ అపూర్వమైన విషయమే అయింది. ఏంతో సంతోషం గా పిల్లలు పాల్గొని ఆనందించారు  .సుహృద్భావం ఐకమత్యంకలగటానికి ఆర్. ఎస్ .ఎస్. వారు దీన్ని ‘’కోజాగరీ ‘’అనే పేరుతొ ఉయ్యూరు కాలేజి గ్రౌండ్ లో చేస్తే మేమంతా పాల్గొనే వాళ్ళం. అలానే ఇక్కడ చేయించాను .దీన్ని గురించి ఊరంతా బాగా చెప్పుకొన్నారు .

గండ్రాయిలో ఎస్. సి .పిల్లలకు హాస్టల్ వుంది .వాళ్లకు హాస్టల్లో చదువు చెప్పేవారు లేరు .ఆ విద్యార్ధులు కూడా ట్యూషన్ కు వస్తామంటే చేర్చుకొని వాళ్లకు స్పెషల్ గా తర్ఫీదు ఇచ్చాను .దగ్గర ఊరు నుంచి అక్కడ హైస్కూల్  లో చదివే ఆడామగా విద్యార్ధులు కూడా నాదగ్గర చదవటానికి సైకిళ్ళమీద వచ్చేవారు .ఆడపిల్లలు రాత్రి ఇంటికి వెళ్ళిపోయేవారు .మగ పిల్లలు ఇక్కడే పడుకొనేవారు .అంత క్రేజ్ వచ్చింది ట్యూషన్ మీద  బాగా కస్టపడి బోధిస్తే ఆరాధన ఉంటుంది అన్నదానికిది నిదర్శనం .డబ్బు ఇవ్వలేము అన్నవారికి ఉచితం గా నే చెప్పేవాడిని .కాకాని గోపయ్య అనేముసలి  జవాను ఉండేవాడు .హాయిగా స్కూల్ కు వచ్చి నిద్రపోయేవాడు .లేక పొతే పేపరు చదువుకొంటూ కూచునే వాడు .పీరియడ్ అవగానే బెల్లు కొట్టేవాడుకాడు .అతనికి చెప్పలేక హెడ్ మాస్టారే  గంట కొట్టే వారు .ఇది చూసి నాకు మంటగా ఉండేది .అయిదారు సార్లు చూసి హెడ్ మాస్టారి దగ్గరకు వెళ్లి ‘’మీరు ఇలా గంట కొట్టడం బాగా లేదండీ . అతనితో కొట్టించాలి .లేకపోతె యాక్షన్ తీసుకోవాలి ‘’అన్నాను అయన దాన్ని తేలిగ్గా తీసేసుకొని అతనికి చెప్పేవారుకాదు .పరిస్తితి యదా తదం .అలాగే హెడ్ గారు టెన్త్ ఇంగ్లీష్ చెబుతుంటే విన్నారో లేదో చూసేవారు కాదు. సగం పిల్లలు నిద్రలో జోగుతూ ఉండేవారు .ఇదీ పట్టించుకొనే వారుకాదాయన .అలసత్వం యెంత దాకా  ఈడుస్తుందో  రెండూ ఉదాహరణలే .కాని ఏమైనా మార్పు తేవాలి అని నిశ్చయించుకొన్నాను .అటెండర్ గోపయ్య తో ఒంటరిగా మాట్లాడి ఆతను చేస్తున్నపని బాగా లేదని డ్యూటీ సక్రమం గా చేయకపోతే ఎవరైనా కంప్లైంట్ చేస్తే చాలా చిక్కుల్లో పడాల్సి వస్తుందని నెమ్మదిగా చెప్పా. మొదట్లో ససేమిరా అన్నా తర్వాత మెత్త బడ్డాడు .ఇక నుంచి సక్రమంగా డ్యూటీ చేస్తానని మాట ఇచ్చి నిల బెట్టుకొన్నాడు .దానికి బదులుగా అతని కూతురు టెన్త్ చదివే ఉమకు ట్యూషన్ ఫ్రీ గా చెప్పా .అతని కళ్ళలో కృతజ్ఞత మెరుపులా మెరవటం చూసి సంతృప్తి చెందాను .అప్పటి నుంచి నేనంటే ఆరాధన గౌరవం అతనికి ఎక్కువైనాయి .డ్యూటీ లో మరెప్పుడూ అలసత్వం చూపలేదు .బెల్లు ఖచ్చితంగా టైం కు కొట్టేవాడు .

టెన్త్ క్లాస్ పిల్లలకు నేను క్లాస్ కు వెళ్ళినప్పుడు హెడ్ మాస్టారి క్లాసులో నిద్ర పోవద్దని మళ్ళీ నిద్ర పోతుండగా చూస్తె క్షమించనని హెచ్చరించా .అప్పటి నుండి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు .ఈ రెండు మార్పులూ గ్రామస్తులు ఊహించనిమార్పులు .మంచి జరిగినందుకు అందరికీ ఆనందం గా ఉంది ఇది చాలు .ప్రైవేట్ చదివే టెన్త్ క్లాస్ నైంత్ క్లాస్ పిల్లలను ఒక ఆదివారం గండ్రాయి లో మా ఉయ్యూరుకు చెందిన వారణాసి సదాశివరావు గారి పెద్ద భార్య గారి కుమారుడు ఆర్ ఏం పి గా ఇక్కడ చాలా ఏళ్ళుగా స్థిర   నివాసం గా ఉంటున్న డాక్టర్ మూర్తి గారి మామిడి తోటలోకి పిక్నిక్ తీసుకొని వెళ్లాను .పిల్లలు ఇంటి దగ్గర చేయిన్చుకోచ్చిన పదార్ధాలను అందరం కలిసి తిన్నాం. గొప్ప అనుభవం కలిగించా .అప్పుడే ఇండియా ఆస్ట్రేలియా లు మద్రాస్ చేపాక్ గ్రౌండ్ లో క్రికెట్  టెస్ట్ లో టై చేసి చరిత్ర సృష్టించారు దానిపై ‘’చేపాక్ టై ‘’పేర కవిత రాసి వాళ్లకు అక్కడ వినిపించా .అందరూ సంతోషం పొందారు .

స్కూల్ నైట్ వాచ్మన్ పేరు జ్ఞాపకం లేదుకాని చాలా మంచివాడు చాకలి కులం అనిజ్ఞాపకం. అతని కొడుకు తొమ్మిది చదువుతున్నాడు .వాడు రోజూ నా దగ్గరకొచ్చి  అంట్లు  తోమి బట్టలుతికే వాడు గది ఊడ్చేవాడు .అతనికి ట్యూషన్ ఫ్రీ గా చెప్పాను .ఇన్ని అనుభవాలు గంద్రాయితో పెన వేసుకొని ఉన్నాయి ఇవన్నీ నాకు మధురానుభావాలే అనుభూతులే .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-1-15- ఉయ్యూరు .

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.