లలిత సంగీతానికి సిగ్నిచర్ ట్యూన్

లలిత సంగీతానికి సిగ్నిచర్ ట్యూన్
బాలాంత్రపు రజనీకాంతరావు లేని లలిత సంగీతాన్ని ఊహించలేము. ఆయన గురించి మాట్లాడకుండా ఆలిండియా రేడియో తెలుగు ప్రసారాలను ప్రస్తుతించలేము. తెలతెలవారుతూనే అన్నమయ్య కీర్తనలతో తెలుగు లోగిళ్లలో ఆధ్యాత్మికత నింపి, తెలుగువారి ‘ధర్మ సందేహాలు’ ఉషశ్రీ ద్వారా నివృత్తి చేయించింది ఈయనే. కార్మికుల కార్యక్రమం, వనితా వాణి… ఏ కార్యక్రమమైనా దాని సిగ్నేచర్‌ ట్యూన్‌ ‘బాలాంత్రపు’ బాణీనే. కృష్ణశాసి్త్ర పాటలోని మాధుర్యమైనా, శ్రీశ్రీ రాసిన నాటికల రేడియో ప్రసారాలైనా, చలం ఇంటర్వ్యూ అయినా ఆయనకు మాత్రమే సాధ్యమనిపిస్తాయి. అందరికీ సుపరిచితమైన ఆయనే శత వసంతాల బాలాంత్రపు రజనీకాంతరావు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ కథనం…
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వేంకట పార్వతీశ్వర కవుల్లో ఒకరైన బాలాంత్రపు వెంకటరావు, వేంకటరమణమ్మలకు 1920 జనవరి 29వ తేదీన జన్మించిన రెండో సంతానం రజనీకాంతరావు. ఆ ప్రకారం 29న ఆయన 96వ పుట్టిన రోజు. అయితే తెలుగు తిథుల ప్రకారం (అధికమాసాలతో కూడా కలుపుకుంటే) ఈ నెల 31వ తేదీన ఆయన శతవసంతంలోకి అడుగు పెడుతున్నారు.
జ్ఞాపకం మునుపటి వలె కెరటంలా ఆయనను చుట్టుముట్టడం లేదు. సున్నితమైన ఓ అల.. అలా వచ్చి ఆయనను మెల్లగా స్పృశించి వెనుదిరుగుతోంది. అయితే పాట ఆయనను కమ్మేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మేనత్త కూతురు సుభద్ర భద్రంగా ఆయన గుండెల్లోనే కొలువై ఉంది. ఈ శతవసంతాల బాలుడిని ఇప్పటికీ ఉత్సాహంగా నిలుపుతోంది ఆయన ప్రాణంలో ప్రాణమైన పాట, తన ప్రియమైన సుభద్రే. రజనీకాంతరావును పలకరించిన వెంటనే పక్కనే గోడపైన ఉన్న చిత్తరువులో తనతో ఉన్న తన ప్రియసఖి సుభద్రను చూపిస్తారు. ఆమె తన 70వ ఏట తనను పాటకు వదిలేసి వెళ్లిపోయిందని పితూరి చెబుతారు. తన తల్లి తన రెండో ఏటనే కన్నుమూసిందని, అప్పుడు తన తండ్రి వయసు 40 ఏళ్లని గుర్తుచేసుకుంటారాయన. తన భార్య క్రీగంటి చూపును వర్ణిస్తూ ‘‘కాకిలా ఇలా నన్ను చూసేది’’ అని చూపిస్తారు. ఆ వెనువెంటనే ‘..ఓసి నామేనత్త కూతురా.. ఓసోసీ నా బావ చెల్లెలా.. రా దగ్గరకు రా..’ అంటూ ‘ఆశా.. నా ప్రాణసఖీ..’ అని ఆమె కోసం రాసిన పాట పాడి వినిపిస్తారు. ఇక అక్కడి నుంచి మనం ఏ పాట కావాలని అడిగితే ఆ పాట ఆయన గొంతు నుంచి ఉరికొస్తుంది.
కృష్ణశాసి్త్ర అల్లుడు..
రజనీకాంతరావు చదువు గురించి వివరిస్తూ ‘ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణుడినయ్యాను. పింగళి లక్షీకాంతం నాసాహిత్య గురువు’ అన్నారు. కృష్ణశాసి్త్రతో తనకున్న గొప్ప అనుబంధాన్ని నెమరువేసుకుంటూ, ‘ఆయనతో నాకు మామయ్యా అని పిలిచేంత దగ్గరి అనుబంధముంది.. ఆయన కూడా నన్ను ‘అల్లుడూ.. మేనల్లుడూ’ అంటూ పలకరించే వార’ని చెబుతారు.
ఇక – రజనీకాంతరావు పుట్టిన రెండేళ్లకే అమ్మ వెంకటరమణమ్మ కన్నుమూయడంతో పిఠాపురంలో చిన్నమ్మమ్మ ఆయనను తన వెంట తీసుకెళ్లింది. ఆ పసిప్రాయంలోనే రజనీకి శ్రీమహాలక్ష్మి ఇష్ట దేవత అయింది. అదెలాగంటే.. పిఠాపురం కుమారస్వామి కోవెలలోని కోనేటి ఒడ్డున రాత్రిపూట అమ్మమ్మ ఒళ్లో కూర్చుని చెంచులక్ష్మి వీధినాటకం చూడడం వల్లనట. నీలపురంగు పూసిన చెంచులక్ష్మి ముఖాన్ని ఇష్టపడేవారు కాదట. ఆదిలక్ష్మి ముఖానికి రాసిన పసుపు రంగు ఆయనకు సంతోషాన్ని కలిగించేది.
బెంచీ ఎక్కి పద్యాలు పాడేవారు..
పిఠాపురంలో చదువుతున్న రజనీకాంతరావును సిక్స్త్‌ ఫారం (ఎస్‌ఎ్‌సఎల్సీ) చదివేందుకు గుంటూరు పంపించారు. అక్కడి టౌన్‌ స్కూల్లో చదువు. తరగతి గదిలో గొడవ వినిపిస్తే ప్రధానోపాధ్యాయులు వెదురు బెత్తంతో వచ్చి అందరినీ వరసపెట్టి కొట్టేవారట. అదే పిఠాపురం స్కూల్లో అయితే పంతుళ్లు గదిలోకి వచ్చే వరకూ గొడవ చేసినా కొట్టేవాళ్లు కాదట. పైగా అక్కడ ఉపాధ్యాయులకు ఈయన పద్యాలు బాగా పాడతాడని తెలిసి అడిగి మరీ పాడించుకునేవారు. గుంటూరులో ఈ విషయం ఎవరికీ తెలియదట. అక్కడ సంగీతం టీచర్లు సంగీతం నేర్పరట. అందుకే అక్కడ చదవడం ఇష్టం లేక, తండ్రికి లేఖ రాసి ఆయన అనుమతితో పిఠాపురం తిరిగి వచ్చేశారు. ‘బెంచీ ఎక్కించి నా చేత పద్యాలు పాడించిన బడి అది. నాకెంతో ఇష్టమైనది’ అంటారాయన. తమలోని ఆసక్తిని, నైపుణ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించని బడిని పిల్లలు ఇష్టడరనేదే రజనీకాంతరావుగారి అనుభవం కూడా.
ఐదేళ్లకే కల్యాణిరాగం 
వయసుతోపాటే ఆయనలోని విద్వాంసుడూ ఎదిగాడు. ఐదేళ్లకే కల్యాణిరాగాన్ని ఆలపించారు. పాఠశాల చదువు పూర్తయ్యే నాటికే ఎన్నో రాగాలనూ అలవోకగా ఆలపించిన ఆయన 18వ ఏట తొలి పాట రాసి, బాణీకట్టి పాడారు. అదే తెలుగు తల్లిపై రాసిన ‘పసిడి మెరుంగుల తళతళలు…’ అనే పాట. అప్పుడు ఆయన ఆంధ్రాయూనివర్సిటీలో బీఏ (ఆనర్స్‌) చదువుతున్నారు. ఆనందభైరవి రాగంలో ఆ పాట పాడుతుండగా, నాటి వీసీ సి.ఆర్‌.రెడ్డి కూడా వచ్చి గళం కలపడం ఆయన మరచిపోలేని మధుర స్మృతి.
స్వర రచనలో వైవిధ్యం..
రేడియోలోకి రాక పూర్వమే (యుక్తవయసులోనే) తన సంగీత రచన రెండు ప్రవాహాల్లో సాగిందంటారాయన. ‘‘వాటిలో ఒకటి సంప్రదాయ పరిధిలో ప్రసిద్ధ కర్ణాటక రాగం కాగా, మరొకటి సమకాలీన ఆంధ్రేతర, భారతీయ, ప్రపంచ సంగీత ధోరణులను మన పాటకు నప్పేలా చేయడం’’ అని చెబుతారు. మధ్య ప్రాచ్య సంగీతపు ఆలాపనా పద్ధతులను అవలీలగా పలికించిన నైపుణ్యమే ఆయనను బి.ఎన్‌.రెడ్డి వంటి దర్శకులకు దగ్గర చేసింది. ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహో పావురమా..’ మొదలు రాజమకుటంలో ‘ఊరేది పేరేది..’ వరకు అలా వచ్చిన పాటలే.
రేడియోలో కృష్ణ‘రజని’
రజనీ మోహన రాగం లేకుండా కృష్ణశాసి్త్ర పాట లేదు. ఆయన యక్షగానమూ లేదు. అందుకే వారిద్దరినీ కృష్ణ-రజనీ అని పిలిచేవారు. రజనీకాంతరావు సంగీతంలో ప్రసారమైన దేవులపల్లి తొలి సంగీత నాటకం ‘శర్మిష్ట’. 1941 మార్చి 23న మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైంది. ‘ఉమర్‌ ఖయ్యాం జీవిత ఘట్టాలను చిత్రిస్తూ దేవులపల్లి రచించిన నాటకానికి సంగీతం, ప్రధానపాత్ర నావే. అందులో పారశీక సంగీత ధోరణులను ప్రదర్శించాను’ అని గుర్తు చేసుకున్నారు రజనీకాంతరావు. దేవులపల్లి చేత మూడు యక్షగానాలు రచింపజేసి హైదరాబాద్‌ నుంచి ప్రసారం చేశారు. వాటిలో ఒకటి ‘క్షీరసాగర మథనం’. రెండవది ‘విప్రనారాయణ’, మూడవది ‘మాళవిక’. క్షీరసాగరం రచనలో మూడొంతుల రచన రజనీదే. ఈ మూడు యక్షగానాలకు ఆరంభ ప్రదర్శనలో చరణం చిట్టచివర ‘శ్రీకృష్ణ దాన చకోర పూర్ణిమా, రజనీకాంతోదయా దయారాశీ హెచ్చరిక‘… అని జంట కవుల్లా వారిద్దరి పేర్లూ వచ్చే విధంగా రాసుకోవడం విశేషం. ఇలా.. అందమైన రాగ భావాల కాంతుల హరివిల్లు కింద పుట్టిన రోజును జరుపుకుంటున్న ఈ శతవసంతాల ‘బాల’ రజనీకరునికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
 పద్మావతి వడ్లమూడి, విజయవాడ
స్వరకర్తే కాదు.. పరిశోధకుడు కూడా..
తాను చదివిన, చూసిన ఏ అంశాన్నైనా విశ్లేషించడం, దాని మూలాల్లోకి వెళ్లి శోధించడం రజనీ తత్వం. కాళిదాసు మహాకవి వర్ణించిన మేఘదూత తొలకరి మేఘమేనని విశ్లేషణాత్మకంగా వివరించిన పరిశోధకుడు. పక్షుల కిలకిలరావాల్లో అర్థాలను అన్వేషించిన తాత్వికుడు. బాల్యంలో తాము పెంచిన రామచిలుక, మైనా గోరా తమ వద్ద నేర్చుకున్న మాటలను, వాటంతటవే నేర్చుకున్న మాటలను, బాలమురళీకృష్ణ ఇంట మైనా తనంతట తానే నేర్చుకుని స్వరయుక్తంగా పలికే రాగస్వరగుచ్ఛాలను జాగ్రత్తగా గమనించారాయన. తెల్లవారు జామున కొక్కోరోకో అనే కోడి కూతలో దాంపత్య సంబంధమైన స్వర సామాన్య నిగూఢార్థం ఏదో ఉంటుందంటూ, నేడు ఫౌలీ్ట్ర ఫారాల్లో కోళ్ల దాంపత్య పద్ధతుల్లో మార్పు వల్లనేమో వాటి స్వర విన్యాసాలు మారిపోయాయంటారు. దోమల సంగీతంలోని రిథమ్‌ను గుర్తించిన గొప్పవాడు. పిచ్చుకల కిచకిచలను జాగ్రత్తగా గమనించి వ్యాకరణం రాయవచ్చేమోనని ఆలోచించిన వాడు.
వాల్మీకి కవితకు..
సహజమైన ధ్వనులను సంగీత వాయిద్యాలపై పలికించడంలో ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది. విజయవాడలో ఓ రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఒక వాద్య గోష్ఠికి రిహార్సల్స్‌ చేస్తూ వాల్మీకి కవితకు కారణమైన క్రౌంచ పక్షుల ప్రణయ కలాపాల ధ్వనులను వాయిద్యంపై పలికించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మామిడిచెట్టు గుబుర్లలో విశ్రమిస్తున్న పక్షుల గుంపు చటాలున లేచి కిలకిలరావాలు చేశాయట. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘గాయక విద్వాంసులంతా ఆనందంతో ఒళ్లు పులకరించగా నన్ను అభినందిస్తూ చేతులు జోడించారు. నేను ఆ నాదబ్రహ్మకు చేతులు జోడించి నమోవాక్యాలు అర్పించానప్పుడు.’…అని చెబుతారు బాలాంత్రపు వారు. ఇందుకు భిన్నంగా ‘మూసీపై వలపు వంతెన’ నృత్య రూకంలో గుర్రపు డెక్కల శబ్దాన్ని కొబ్బరిచిప్పలపై పలికించిన ఘనత ఆయనదే!

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.