|
‘‘సుస్వరాల సంగీత సాధనే మాకు ప్రభుత్వోద్యోగాన్ని లేదా జీవనభృతిని తప్పక కల్పిస్తుందని ఎంతో
నమ్మకంగా’’ చెప్తారు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన ఈ సోదరీమణులకి
సంగీతమే ప్రాణం. వీరిలో ఒకరు వీణ, కీబోర్డుల్లో నిష్ణాతురాలు కాగా మిగతా ఇద్దరు వయొలిన్, హార్మోనియంల్లో నైపుణ్యం సాధించారు. ప్రజ్వల, ప్రత్యూష, ప్రవళ్లిక అనే ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు గాత్ర సాధన కూడా చేస్తారు. సంగీతంలో రాణిస్తున్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల గురించి…
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కపాటిపాళెంకు చెందిన కమతం ప్రకాష్‌కు ముగ్గురు కూతుర్లు. ప్రజ్వల ఆఖరి అమ్మాయి. బాల్యం నుంచీ ఈ అమ్మాయికి సంగీతమంటే ప్రాణం. దాంతో టీవీ, రేడియోల్లో వచ్చే సంగీతాన్ని శ్రద్ధగా ఆలకించేది. వాళ్ల ఇంటి పక్కన ఉండే జాన్ అనే కీబోర్డు ప్లేయర్ దగ్గర కీబోర్డులో మెళకువలు నేర్చుకుంది. ‘‘ఆయన వద్ద రెండేళ్లలోనే కీబోర్డు ప్లే చేయడం బాగా నేర్చుకోగలిగాను. ఆ తరువాత వీణ వాయించడంలో మాదేష్కుమార్ వద్ద శిక్షణ పొందాను. ఇంట్లో ఉన్న హార్మోనియం పెట్టెతోనే సాధన చేసేదాన్ని. మా ఇంట్లో ఉన్న హార్మోనియంకు సుమారు వందేళ్లు ఉంటాయి. మా కుటుంబంలో తరతరాలుగా ఈ హార్మోనియం పెట్టెమీదే సంగీత సాధన చేసేవారట.
నెల్లూరులోని ప్రభుత్వ సంగీత పాఠశాలలో వీణావాయిద్యంలో, గాత్రంలో సర్టిఫికెట్ కోర్సు చేశాను. చక్కని గాత్రం కూడా ఉండడంతో పాఠశాల స్థాయి నుంచే పలు కార్యక్రమాల్లో పాడేదాన్ని. వీణ, హార్మోనియం వాయించేదాన్ని. నేను సంగీతంలో రాణించడం చూసిన ఇద్దరు అక్కలు ప్రత్యూష, ప్రవళ్లికలు కూడా నా బాటలోకి వచ్చారు. ప్రత్యూష బీటెక్ పూర్తి చేసింది. ప్రవళ్లిక బిబిఎ చదువుతూనే సంగీతంలో బ్యాచిలర్ ఆఫ్ మ్యూజిక్ కోర్సు చేసింది.
గిన్నిస్‌బుక్ ఎక్కాం
హైదరాబాద్‌లో సిలికాన్ ఆంధ్రా వారు 2009లో నిర్వహించిన త్యాగరాయ లక్ష గళార్చన కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి మేం ముగ్గురం ఎంపికయ్యాం. లక్షా అరవై వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలోనే గిన్నిస్ రికార్డు అందుకున్నాం. అదే సంవత్సరం నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ కాకాణి గోవర్దన్‌రెడ్డి ‘బహురూప’ అనే కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొని పలువురి ప్రశంసలు అందుకున్నాం. అప్పటి నుండి మా జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కచేరీలు చేయడం మొదలుపెట్టాం. 2009లోనే నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి యువజన పోటీల్లో పాల్గొని వీణా వాయిద్యంలో మొదటి స్థానం సాధించాం. కర్ణాటక మైసూరు రాజావారి ఇంట్లో ఉన్న పురాతన వీణను మంచి విద్వాంసులకు అందజేస్తామని వారు ప్రకటించినప్పుడు అక్కడికి వెళ్లి ఆ వీణ వాయించాను. నా ప్రతిభను మెచ్చి ఆ వీణనే నాకు బహుమతిగా ఇచ్చారు. 150 సంవత్సరాల క్రితానిదా వీణ’’ అని వివరించింది ప్రజ్వల.
ఫ కె.గయాజుద్దీన్, నెల్లూరు.
ఫోటోలు: అశోకుడు
సంగీతానికి ‘కమతం’
వీణ, హార్మోనియం, వయొలిన్ వంటి వాయిద్యాలను వాయించడం యువతీ యువకులకు నేర్పించాలనే ఉద్దేశంతో వాళ్ల ఇంటిపేరు కమతం పేరుతో ఇంట్లోనే సంగీత పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇదేకాకుండా కోవూరులో కూడా సంగీత పాఠశాలను స్థాపించారు. కార్పొరేట్ పాఠశాలల్లో సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు. నారాయణ వైద్య కళాశాలకు చెందిన ప్రముఖ వైద్యులు కూడా ప్రజల్వ దగ్గర వీణ, హార్మోనియం నేర్చుకుంటుండడం విశేషం.
|