కళలు నిండిన జీవితం
ప్రపంచంలోని మేధస్సుకు శిరోభాగం, సాహిత్యానికి హృదయ భాగం భారతదేశం. అద్భుతమైన శాస్త్రాలు, అనేకమైన సాహితీ సంపద ఎందరో మహానుభావుల కృషిఫలంగా సనాతన సంప్రదాయం వారసత్వ ధనాన్ని అందిస్తూనే ఉంది. సాహితీ సుహృదయులలో తన సుమధుర కవితాధారచే విరాజిల్లిన ఆప్తకవీశ్వరుడు. రాటుదేలిన కవిపండితుడు మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ.
తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో జన్మించిన మధురకవి సాహిత్యోద్యమంలో అపారకృషి చేసిన మహానుభావులు. మామిడిపల్లి సాంబశివశర్మగారు అనేక గ్రంథ స్రష్టతా, ద్రష్టలు, బహుముఖ ప్రజ్ఞాధురీణులు. కమ్మని గానం రమ్యమైన గాత్రం మృదుమధురమైన హాస్యప్రియత్వం వారి సొంతం. వీరు కేవలం కవులే కాదు, నటకులు నాటక క్రోడీకర్తలు. గేయరచన, సంగీత దర్శకత్వం, నటనాదర్శకత్వం. రంగస్థల రచనా నైపుణ్యం. తెలుగు, హిందీ, సంస్కృత భాషలలో వైదుష్యం, ఉర్దూ పరిచయం, చక్కని వావదూకత, హరికథనం, పురాణ ప్రవచనం, భాషాంతరీకరణ సామర్థ్యం మొదలగునవి వీరి ప్రత్యేకత. స్వాతంత్య్ర సమరయోధులుగా పేరుగాంచినారు.
అనేక రేడియో కార్యక్రమాలు చేసిన ఘనులు. అష్టావధానం చేసిన సుప్రసిద్ధులు మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ.
భగవంతుని మేల్కొలిపే సుమధుర సాహితీగానం సుప్రభాతం. మధురకవి రచనాధురి వివిధ సుప్రభాతాల వెల్లువై అలరారింది. లోకప్రసిద్ధమైన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమునూ, స్తోత్ర ప్రపత్తులనూ తలపించే రీతి మధురకవి శ్రీ రాజరాజేశ్వర సుప్రభాతం రచించబడింది. దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రంలో నేటికీ ఈ కవి వ్రాసిన శ్రీరాజ రాజేశ్వర సుప్రభాతం ఆలపించబడుతూ ప్రభాత వెలుగులను భాసింపచేస్తుంది. ఇదే కాకుండా కాళేశ్వరమునకు సంబంధించిన ముక్తేశ్వర సుప్రభాతం, బాసర సరస్వతీ సుప్రభాతం, గంగాసుప్రభాతం, శ్రీ గౌరీశంకర సుప్రభాతంత. శ్రీ ఆదిశంకర సుప్రభాతం వీరు రచించారు. కొమురవెల్లి మల్లన్న, సుప్రభాతం, బెల్లంపల్లి శ్రీరామచంద్ర సుప్రభాతం. బెజ్జంకి శ్రీ నృసింహసుప్రభాతం. సికింద్రాబాద్ మహంకాళి సుప్రభాతం మొదలగునవి కూడా వీరి కలం నుండి జాలువారినవే.
మధురకవి జయశ్రీ, ముక్తాహారం, కుంజవిహారం. శ్రీ రాజేశ్వర తారావళి అనే పద్యకావ్యాలు అద్భుతంగా రచించారు. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలతో ఈ కవి వ్రాసిన ద్విపద రామాయణం రామకథా సముద్రంలో ఓలలాడిన ఎందరో కవిపుంగవుల పంచన మధురకవినీ సత్కరించిందంటే అతిశయోక్తి లేదు. శ్రీ రాజరాజేశ్వర క్షేత్రమహత్యం, తరిగొండ వెంగమాంబ చరిత్ర హరికథలుగా, భద్రావతి, త్యాగయ్య నాటకాలుగా శ్రీ నృసింహశతకం శతకంగా, దక్షయజ్ఞం, ముగ్గురు మరాఠీలు, దీపావళి, బుర్రకథలుగా, మధుర ఝంకారం, భక్తిగీతాలు, మంగళహారతులు భజన కీర్తనలుగా, లోభసంహారం అనే విలక్షణ రచన అధిక్షేప కావ్యంగా మధురకవి రచనలు ప్రసిద్ధిగాంచాయి. జీవితకాలంలో అనేక రచనలు గావించి విభిన్న కళలలో విశేష ప్రజ్ఞను చెప్పకనే చాటిచెప్పిన నిరాడంబర సామాజిక కవి మధురకవి.
మామిడిపల్లి సాంబశివశర్మగారు సాంబకవిగా సుపరిచితులు సాంబకవి పవిత్ర కవితాజీవనులు. వీరి సాహితీ జీవనం సువిశాలమైంది. కవిసార్వభౌముడు శ్రీనాథుని పోలిన జీవితం వీరిది. సర్వసౌఖ్యాలూ, సత్కారాలూ, కష్టములూ అనుభవించారు. అనేకుల సహృదయ మన్ననలు పొందినవారై మధురకవి, విద్వత్కవి అనే బిరుదులను గ్రహించారు సాంబకవి. సాంప్రదాయ ఛాయలో అభ్యుదయ ఆలోచనలకు రూపమిచ్చిన పండితులు వీరు. ప్రాథమిక విద్యనే అభ్యసించిన ఈ కవి సరస్వతీ కఠాక్షంతో అనేక కావ్యరచనలు చేసారు.
మానవత్వాన్ని మోసం చేస్తున్నది దైవం కాదనీ, దానవత్వం ఆవహించిన మానవ సమాజమేననీ సమాజమేననీ గుర్తించిన సాంబకవి లోభసంహార కావ్యం ద్వారా సమసమాజ స్థితిగతులను వర్ణించారు. మనిషికి వివేకం నశింపజేసే ఒక్క లోభమే అనేక అనర్థాలకు కారణమైతే మిగతా కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు మానవులలో మూర్తీభవిస్తే మానవుల పరిస్థితేమిటోనని దిగులు పడుతూ తస్మాత్ జాగ్రత్త అంటూ సమాజానికి సందేశమిచ్చిన అద్భుత అభ్యుదయ కావ్యం లోభసంహారం.
సాంబకవి ప్రగతిశీలి. జీవితంలోని ఒడిదుకులను తట్టుకోలేక పరితపించినా ఎదుటివారికి జీవన పంథాను తన రచనల ద్వారా నిర్దేశించారు. తెలంగాణా కవులు నివురుగప్పిన నిప్పులని నిరూపించిన ధీరోధాత్తులు సాంబశివశర్మ బహుముఖ ప్రజ్ఞాపాండిత్యము గల అరుదైన కవులలో వీరూ ఒకరు. వీరి అప్రతిమ ప్రతిభావిశేషం ప్రాజ్ఞ ప్రశంసాపత్రమై అలరారుతుంది. కళాసాహితీరంగాలను బట్టి, చారిత్రక ఆధారాలను బట్టి ఇంతటి కళాకారుడు, కవిపుంగవుడు గత శతాబ్దకాలంలో ఉద్భవించిన దాఖలాలు లేవు అనలేక ఉండలేము.
అనంతమైన సాహితీ ప్రపంచంలో, కళాప్రకృతిలో రవిగాంచని మహా వట వృక్షంలాంటి కవిపుంగవుడు, సంస్థాస్వరూప వ్యక్తి, మహామనీషి, బహుముఖ ప్రజ్ఞాశాలి. కళాతపస్వి, ధన్యజీవి, అమరజీవి మామిడిపల్లి సాంబశివశర్మ.
సరస కవిత్వంలో, గంభీర భావుకతలో, నటనా వైదుష్యంలో, నర్మగర్భ వ్యవహారశైలిలో, హరికథాకథన చాతుర్యంలో, వివిధ రచనా పటుత్వంలో సాంబకవికి సాంబకవే సాటి. సహజ పాండిత్య సంపన్నులై, సరస సద్గుణాలంకార శోభితులై, బహుముఖ ప్రజ్ఞాధురంధరులై విరాజిల్లిన మధురకవి రచనలు అమృత గుళికలు, ఆపాత మధురాలు.
దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీరాజరాజేశ్వరపురం వేములవాడలో సుప్రభారత గీతమై, విద్వద్వరేణ్యుల ప్రశంసలలో భాగమై, ముద్రిత రచనలలో చిక్కిన అక్షరమై అముద్రిత రచనల్లో కనిపించని భావమై శ్రీ మామిడిపల్లి సాంబశివశర్మ మధురకవిగా, సాంబకవిగా అలరారుతారు. కవితా సామ్రాజ్యానికి శాశ్వత చక్రవర్తియై వెలుగొందుతారు.
‘జయంతితే సుకృతి నోరససిద్ధా: కవీశ్వరా:
నాస్తిమేషాం యశ: కాయే జరామరణజం భయమ్.’