ఘంటసాల గానం చేసిన సంప్రదాయ గణేశగీతం

ఘంటసాల గానం చేసిన సంప్రదాయ గణేశగీతం
ఘంటసాల గానంతోనే ఈ నాటికీ దినచర్యను ఆరంభించేవారెందరో ఉన్నారు… విఘ్నాలు తొలగించమంటూ తొలివేలుపుగా వినాయకుని పూజించడం మన సంప్రదాయం… గణపతి సంప్రదాయ గీతం ఘంటసాల గళంలో జాలువారి మనలో భక్తిభావాన్ని నింపింది… గణపతిని స్మరించుకోగానే ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని ధ్యానించుకోవడమూ ఎందరికో ఆచారం… అక్కడా ఆయన గాత్రంలో చిందులు వేసిన గీతమే మన మదిలో మెదలి పులకింప చేస్తుంది…
ఆ పాట నా నోట

హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని ‘ఘంటసాల సంగీత కళాశాల’లోకి ప్రవేశించగానే అదో ధ్యానమందిరంలా తోచింది. టైం పదకొండు అవుతోంది.. లోపలినుంచి ‘నమో వెంకటేశ నమోతిరుమలేశా’… పాట వినిపిస్తోంది. ఎదురుగా కుర్చీలో తామడ శరత్‌చంద్ర ఉన్నారు. ఆయన వెనుక గోడకి వేంకటేశ్వరస్వామి పెద్దచిత్రం ఉంటే.. ఆయనకి ఎదురుగా గోడకి ఘంటసాల వెంకటేశ్వరావు ఫొటో ఉంది. ఘంటసాలగారికి వేంకటేశ్వరుడు ఇష్టం, నాకు ఘంటసాల ఇష్టం అంటూ శరత్‌చంద్ర తన అంతరంగాన్ని ‘నవ్య’తో పంచుకున్నారిలా…
ఘంటసాల పాట సమ్మోహనం.. అది శ్రోతల్ని వివశుల్ని చేసి పరవశింపచేస్తుంది. అలాగే నేనూ పులకించిన వాణ్ణే. అందరూ ‘శరత్‌చంద్రది ఘంటసాల గొంతు…’ అంటారే గానీ అది నిజం కాదు… ‘ఘంటసాల లాగే పాడతాడు’ అనటం కరెక్ట్‌. నేనిలా ఉన్నానంటే అదంతా ఘంటసాల చలువే.. ఆయన పేరుమీద సేవ చేస్తున్నానంతే. మాది శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలోని లంకపేట గ్రామం. అమ్మ పేరు పద్మావతి, గృహిణి. నాన్నగారు బ్రహ్మం పేరున్న నాటకాల గురువు. ఆయన ధర్మరాజు, హరిశ్చంద్ర, అర్జునుడు వేషాలు వేసేవారు. తిరుపతి వేంకటకవుల పద్యాలు బాగా పాడేవారు. హార్మోనియం వాయించేవారు. ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉండడం వల్ల సంగీత రుచి నాకు తెలిసింది… రాగజ్ఞానానికి మా నాన్నగారే నా తొలి గురువు. మేం ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండోవాణ్ణి.
ఆ అందమే చిత్తు చేసింది…
ఏడో తరగతి నుంచే మా ఊరి రామమందిరంలో రాముని చరితపై భజనలు చేసేవాడిని. అప్పటినుంచే భజనలకి హార్మోనియం వాయించటం నేర్చుకున్నాను. పదోతరగతిలో ఉండగా మా రమణాచారి మాస్టారు ‘బ్రతుకుతెరువు’ చిత్రంలో ‘అందమె ఆనందం …ఆనందమె జీవిత మకరందం..’ పాట నేర్పించారు. ఆ పాటని వింటూ పాడుతుంటే ఆ గొంతులో ఏదో తెలియని గమ్మత్తు ఉందనిపించేది.
ఇంటరుమీడియేట్‌లో చదివేటపుడు భజన కార్యాక్రమాలతో పాటు ‘పేరడీలు’ పాడేవాడిని. సినిమా పాటల ట్యూన్స్‌ ఆధారం చేసుకుని దేవుళ్ళ పాటలు పేరడీలుగా పాడేవాణ్ణి. పేరడీ వల్ల ఒరిజినల్‌ సాంగ్‌పై మక్కువ కలిగేది. మంచి హార్మోనిస్టుగా కూడా మా జిల్లాలో నాకు పేరుంది. డిగ్రీ చదివేటప్పుడు ఎలిశెట్టి రామ్మోహనరావు గారి ప్రోత్సాహంతో విజయనగరం జిల్లా గరివిడిలో ‘ఘంటసాల సంగీత సమాఖ్య’ను 1994లో నెలకొల్పాను. ‘జగదేకవీరుని కథ’ చిత్రంలో శివశంకరీ … , ‘పాండురంగమహత్యం’ చిత్రంలోని ‘అమ్మా అనిపిలిచినా…’ పాటలు స్టేజ్‌ ఎక్కి పాడుతుంటే శ్రోతలు ఎంతగానో స్పందించేవారు. తర్వాత తర్వాత నేను ఘంటసాల గారి ప్రభావానికి లోనయ్యాను. ఘంటసాల పాటంటే వెర్రెత్తిపోయేవాణ్ణి. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో ఘంటసాల గారి పెద్దబ్బాయి విజయ పేరుమీద మ్యూజిక్‌ చేసేవారు. అందుకని ‘విజయ ఆర్కెసా్ట్ర’ నెలకొల్పి అక్కడిప్రాంతాల్లోని చాలామందిని గాయకులుగా తయారు చేశాను. సింగర్‌ టి.పి. రామకృష్ణగారు పరిచయం కావటం నా జీవితంలోని మరో ముఖ్యమైన మలుపు. వారి ఫ్యామిలీ నన్ను హైదరాబాద్‌ పంపించారు. హైదరాబాద్‌ వచ్చాక కోరమాండల్‌ సిమెంట్స్‌ అధినేతలు లక్ష్మీచంద్రమోహన్‌గారి సహాయంతో ‘స్వరనిధి’, ‘భాగేశ్వరీ సాంస్కృతిక సంస్థ’ లు ప్రారంభించి కొన్ని వందలమంది గాయకుల్ని తయారు చేశాను. ఎన్నో జిల్లాల్లో ప్రోగ్రామ్స్‌ చేశాను.
ఆరు సంవత్సరాల పాటు ఏకధాటిగా హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో సాధన చేశాను. ఘంటసాలగారి పాటలకి నోట్స్‌ తయారు చేసుకున్నాను. అప్పటి సంగీత దర్శకులు ప్లే చేసిన సంగీత పరికరాలు వాడి పాటలు పాడించేవాడిని. పాడేవాడిని. 1994 డిసెంబరు 14 వ తేదీ త్యాగరాయగానసభలో అక్కినేని, నటుడు టి.ఎల్‌.కాంతారావు, జమున, సినారే సమక్షంలో ‘ఘంటసాల సంగీత విభావరి’ చేశాను. అక్కడ దేవదేవ నారాయణ.., మురిపించే అందాలే పాటలు పాడినపుడు ఎంతోమంది నన్ను అభినందించారు. అక్కినేని గారు ‘దేవదాసు’ రాసిన శరత్‌చంద్రని ఎలా మర్చిపోలేనో ఈ శరత్‌ చంద్రని మర్చిపోలేను అన్నారు. సినారె ‘తరుణ ఘంటసాల’ అంటే లేత ఘంటసాల అని అన్నారు.
ఆ మహానుభావుడికి గుడి
2001లో శ్రీకాకుళం జిల్లాలోని లంకపేట గ్రామంలో ఆరెకరాల స్థలంలో ఘంటసాల గుడి ప్రారంభించాను. 2005లో ఆ గుడి పూర్తి అయ్యింది. ఘంటసాల ఆధ్యాత్మిక విగ్రహం ఉన్న ఆ గుడి పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. ఈ గుడిద్వారా సామాజిక సేవ చేస్తున్నాం. గ్రామాలకి మంచినీళ్ళు ఇస్తున్నాం. చెరువులు తవ్విస్తున్నాం. 18 పాఠశాలల్ని దత్తత తీసుకుని అందులోని పేద విద్యార్థులకి ‘స్వామి వివేకానంద మోరల్‌ అండ్‌ టెక్నిక్స్‌’ ద్వారా కంప్యూటర్స్‌ ఇచ్చి 200 మంది పేద పిల్లలకి ఉచిత విద్యను అందిస్తున్నాం. ఇవన్నీ ఘంటసాల పాటల కచ్చేరీల ద్వారా వచ్చిన డబ్బులతోనే సాధ్యమవుతోంది.
ఘంటసాల పాటలు ప్రపంచానికి తెలియజేయాలన్నదే నా ఉద్దేశ్యం. ‘ఘంటసాల సంగీత కళాశాల’ పేరుతో ఘంటసాల పాడిన ఎంతోమంది కవుల సినీ సాహిత్యాన్ని 24 వ్యాల్యూమ్స్‌గా విడుదల చేశాను. తెలుగురాషా్ట్రల్లో మొత్తం ఏడు సంగీత కళాశాలలు నెలకొల్పాను. హైదరాబాద్‌లో ‘ఘంటసాల సంగీత కళాశాల’ ప్రారంభించాను. 2012లో విశాఖపట్నం, ఏలూరు, మహబూబ్‌నగర్‌, తిరుపతి, గుంటూరు, వరంగల్‌ జిల్లాల్లో ఆరు కాలేజీలు నెలకొల్పాను. ఇందులో ఏడు కోర్సులు ఉంటాయి. కోర్సుల్లో ఘంటసాల సబ్జెక్టులు ఉంటాయి.
1. వేదిక (సినిమా సంగీతం), 2.వాహిని(లలిత సంగీతం), 3. విపంచి(లలిత సంగీతం), 4.సంకీర్తన(అన్నమాచార్యుల సిలబస్‌), 5.విశద(యాంకరింగ్‌), 6.సురభి(పద్యసంగీతం), 7.రాగిణి(వాద్యసంగీతం). ఇవి కంప్లీట్‌ చేసుకున్న వారికి సంగీతంలో డిప్లమో సర్టిఫికేట్‌ ఇస్తున్నాం.
ఆ సప్తస్వరాలు కాలేజీలకి అంకితం
ఘంటసాల పాటలపై 2012 సంవత్సరంలో శాంతాబయోటెక్‌ అధినేత వరప్రసాదరెడ్డి గారి సహాయంతో ‘సప్తస్వరాలు’ అనే ఏడు పుస్తకాల్ని విడుదలచేశాను. ఏడు కళాశాలలకు సంబంధించి స- షడ్జమం పుస్తకం హైదరాబాదు కళాశాలకి అంకితం చేశాను. అలానే రి- రిషభం(విశాఖపట్నం), గ-గాంధారం(ఏలూరు), మ-మధ్యమం(మహబూబ్‌నగర్‌), ప-పంచమం(తిరుపతి), ద- దైవతం(గుంటూరు), ని-నిషాదం(వరంగల్‌)కి అంకితం చేశాను. ఇందులో అన్నీ ఘంటసాల గారి పద్యాలు, పాటలే ఉన్నాయి.
ఆయనే నా ఆయుధం
ఘంటసాల సంగీత కళాశాలలో ఏడేళ్ల వయసు నుంచి 70 యేళ్ళవాళ్ల వరకూ విద్యార్థులున్నారు. సంవత్సరానికి 500 మంది విద్యార్థులు ఉతీర్ణులవుతుంటారు. మా కళాశాలలో ఓ ఘంటసాల పాట పాడాలంటే ముందు ఓ పద్యం పాడాలి. పద్యం అమ్మ లాగ, పాట తండ్రిలాగా భావిస్తాను. ప్రపంచంలోని భాషలన్నింటిలో తెలుగువారికి ఉన్న ఒకే ఒక గొప్ప సాహిత్యం పద్యం. ఈ సంగీత కళాశాలలో అందరూ సాధకులే. నేను ఇప్పటివరకూ 3870 కచ్చేరీలు చేశాను. నాకు ప్రదానం చేసిన ‘అభినవ ఘంటసాల’ బిరుదును ఎంతో అమూల్యంగా భావిస్తాను. భారతీయ మహిళాశక్తి సంస్థ గండపెండేరాన్ని తొడిగారు. ఆంధ్రాయూనివర్శిటీ తెలుగు సాహిత్యానికి సేవ చేసినందుకు సత్కరించింది. హార్మోనియంలో అన్ని ఇన్‌సు్ట్రమెంట్స్‌ను పలికించటం చూసి ముగ్ధులై అమెరికాలోని తెలుగువారు 500 ఇంసు్ట్రమెంట్స్‌ ఉండే కీబోర్డుని నాకు బహుమతిగా ఇవ్వడాన్ని నేను మర్చిపోలేను. ఘంటసాల ఆరాధకుడిని. ఆయన పాటే నా ఆయుధం.
నా దృష్టిలో ఘంటసాల
దేవుళ్ళందరూ కలిసి తయారుచేసిన గొప్ప వ్యక్తిగా ఘంటసాలగారు నాకు కనిపిస్తారు. గొప్ప తెలుగుభాషా సేవకుడిగా అనిపిస్తారు. 56 తెలుగు అక్షరాల్ని స్పష్టంగా పలుకుతూ పాడే ఘంటసాల గురించి ఎంత చెప్పిన తక్కువే… అందుకే ‘ఘంటసాల… సంగీత కళాశాల’ అంటాను నేను. ఆయన 658 చిత్రాల్లో 2700 పాటలు పాడారు. 450 పద్యాలు ఆలపించారు. ఘంటసాల ‘భగవద్గీత’ అద్భుతం. 110 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అందులో తెలుగుచిత్రాలు 83. సంగీతజ్ఞులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, జేసుదాసు, బాలు లాంటి గొప్పవారు ఘంటసాల గారిని గ్రేట్‌ అంటారు. నన్ను ఏ ప్రభుత్వాలూ, సంస్థలూ గుర్తించకపోయినా ఫరవాలేదు. ఘంటసాల పాటని ప్రపంచం నలుదిశలా విస్తరింపచేయటమే నా లక్ష్యం. ఓ మ్యూజిక్‌ యూనివర్శిటీని కూడా నెలకొల్పాలని ఉంది నాకు.
 నవ్య డెస్క్‌
ఫోటోలు: జి.శ్రీనివాస్‌

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.