కాలంతో కదులుతూ వర్తమాన చరిత్రతో కరచాలనం
కాలానికి లేని చూపును మానవులు చారిత్రిక సులోచనాల ద్వారా తమ కళ్ళల్లో పొదుగుకోవాలి. రచయితల, పాత్రికేయుల దృష్టిలో ‘కాలజ్ఞత’కు అర్థం -అనుకూల పరిస్థితులలోనే కాదు, మంచి మార్పుకోసం జరిగే నిరంతర సమరంలో ప్రతికూల పరిస్థితులలో కూడా తెగబడి మరీ తనతనాన్ని సార్దకం చేసుకోవడమని కూడా అర్థం. ‘ధర్మం’ అంటే ‘ఆయుధ’ మేనన్నది వ్యాసభారత సూక్తి. పాత్రికేయులకూ, రచయితలకూ అదే ఆయుధం. ఇది అక్షర సత్యమైన వ్యాఖ్యానం. అక్షరాన్నే ఆయుధంగా చేసుకొని దశాబ్దాల తరబడి పోరాడుతున్నవారు ఎబీకె. ఎబీకేను ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన జగమెరిగిన పాత్రికేయులు. ఇక ప్రస్తుత విషయానికొస్తే గత ఆరేడు సంవత్సరాల కాలం ఒక పత్రికలో ఆయన రాసిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, భాషా, సాహిత్య, సాంస్కృతిక వ్యాసాలను అన్నింటిని ఒక దగ్గరకు చేర్చి ‘కాలంతో కరచాలనం’ పేరుతో వ్యాససంకలనాన్ని వెలువరించారు.
ఈ వ్యాసాలు వారి బహుముఖీనమైన ప్రతిభకు మచ్చుతునకలు.
ఈ వ్యాస సంకలనంలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలు విభజన రాజకీయాలు, జాతీయాంశాలు రాజ్యాంగమూ .. చట్టాలు… సిబిఐ, అంతర్జాతీయం, విదేశాంగ నీతి, అవి.. ఇవి, తెలుగు భాష, ఆర్థికాంశాలు, వాతావరణ సమస్యలు. పర్యావరణం మొదలగు విభాగాలున్నాయి. ఈ అంశాలను పరిశీలిస్తే ఏదో ఒక విభాగంలో ప్రజ్ఞకలిగిన వారిగా కాక ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ధుష్టమైన విధానంతో, విషయ పరిజ్ఞానంతో అందించే వారిగా మనకు ఏబికె కనిపిస్తారు. ‘ఫార్ములా -1’ రేసును ఇండియాలోకి దిగుమతి చేయడానికి ‘తాళి’ కట్టినవాడు చంద్రబాబు. ఈ మధ్య ఆయన గ్రేటర్ నోయిడాలో ‘ఫార్ములా’-1 రేసు ప్రారంభం కానున్నదన్న వార్త రాగానే మహాసంతోషంతో అందుకుతానే అసలు ప్రతిపాదకుడననీ, కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ విదేశీ కార్ల రేసు రాకుండా అడ్డుకున్నారని ‘గొప్పలు’ చెప్పుకోబోయారు. అన్న చంద్రబాబు మాటలను కోట్ చేస్తూ మింగమెతుకులేదు గాని, మీసాలకు సంపెంగనూనె పట్టించుకోవడంకోసం ఆరాటపడ్డాడట వెనకటికొకడు అంటూ వ్యాఖ్యానిస్తారు ఏబికె ‘వికృత క్రీడోన్మాదానికి ఓ ‘ఫార్ములా’! అనే శీర్షికతో రాసిన వ్యాసంలో.
అలాగే కేజీ బేసిన్ సంపదపై వైఎస్ వైఖరే ఆదర్శం, ఆంధ్రా గ్యాస్ అంబానీల సొత్తా? అనే శీర్షికతో ఒక వ్యాసం కనిపిస్తుంది. అలాగే వైఎస్ పట్టించిన గ్యాస్ దొంగ, వైఎస్ స్వతంత్రుడు… అందుకే దాడి, ‘పావురాల గుట్ట’పై ప్రశ్నల తుట్టె, తెలుగువారి సమైక్యతా వారధి బూర్గుల: వేర్పాటు’తోనే అసమానతలు తొలగవు వంటి వ్యాసాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఈ వ్యాసాలు ఆరేడు సంవత్సరాల కాలంలో రాసినవని గుర్తుపెట్టుకోవాలి.తనది ‘వీర తెలంగాణాయే గాని వేరు తెలంగాణ కాదు’ అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి తెలంగాణ భవితవ్యానికి, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆవేదనతో చేసిన ప్రతిపాదనకు మించి శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో అదనంగా ప్రత్యేకించి చెప్పిందేమీ లేదంటారు ఏబికె ‘వేర్పాటుపై శ్రీకృష్ణ ఒంటరికాదు! అనే వ్యాసంలో. ఇందులో ‘కక్ష రాజకీయమే కూలింది’ పేరుతో రాసిన ఒక వ్యాసంలో జగన్మోహన్ రెడ్డిని అసలెందుకు నిర్భందించవలసి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వకుండా, క్షమాపణ చెప్పుకొనకుండా కాంగ్రెస్ నల్లిలాగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ ఉనికి కోసం కాంగ్రెస్ అధిష్టానం జగన్‌పై కక్ష సాధింపునకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చివరకు దొరికిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వమూ, సిబిఐలేనంటారు ఈ వ్యాసంలో. ఏబికె కు కొన్ని నిర్దుష్టమైన నిశ్చితాభిప్రాయాలున్నాయి. వాటిని వ్యక్తం చేయడంలో ఎప్పుడూ వెనకంజ వేసిందిలేదు. నిర్మొహమాటంగా చెప్పటంలోనూ ఆయనెప్పుడు ముందే ఉంటారు.
‘వాగుడు కాయల కొలువులు’ పేరుతో ఒక వ్యాసమిందులో కనిపిస్తుంది. దాదాపు పన్నెండు చానళ్ళు ఒకే పార్టీపైనా, ఆ పార్టీ నేతపైనా వీక్షకుల తలమొత్తేలా వ్యతిరేక ప్రచారాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికల రుతువు ఆఖరి వారం రోజులలో అవి ఎంతహద్దు మీరాయో కూడా ప్రేక్షకులు గమనించారు. అక్కసుతో కూడిన ఆ దుష్ప్రచారం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనా, ఆ పార్టీ నాయకుడు జగన్‌పైన. అంటూ చానళ్ళ నైజమేమిటో తనదైన కోణంలో వివరిస్తారు.
ఒక వర్గం వారి ‘ఆడపిల్లలు ప్రత్యర్థి వర్గం జనాభాను పెంచే సంతానోత్పత్తి’ యంత్రాలు కాకూడదట! దీన్నిబట్టి చూస్తే పురుషాధిక్యతా రోగం, బడుగు, బలహీన వర్గాలు మైనారిటీల పట్ల ఏహ్యమైన చిన్నచూపు, దుర్మార్గపు మనస్తత్వం ఎంతగా గూడుకట్టుకుని ఇప్పటికీ ఊళ్లేలుతున్నాయో అర్థమవుతోంది. ఏ రాజకీయ పక్షానికీ మత వ్యవహారాలతో మతాలలో సంబంధం ఉండరాదని, మత సంస్థలకు రాజకీయాలతో ప్రమేయం ఉండరాదని రాజ్యాంగ నిర్ణయ సభ తీర్మానం. కానీ పాలక పక్షాలు మత రాజకీయం ద్వారా ఎన్నికలలో ప్రజల్ని సమీకరించడానికి అలవాటుపడ్డాయని దుయ్యపడతారొక వ్యాసంలో. మారని మనిషి మోడీ! అనే వ్యాసంలో గుజరాత్లో ప్రభుత్వ కిరాతక చర్యలను ముఖ్యమంత్రి మోడీకి గుర్తుచేసి రాజధర్మం కాస్తా తప్పావు. ధర్మం పాటించడం నేర్చుకోమని నాటి ప్రధాని వాజ్‌పేయి స్వయానా పాఠం చెప్పారు! అయినా మోడీ బుద్దిమారలేదు. తాను గుజరాత్లో చేసిన పని తప్పుకాదని, ఒప్పేనని సమర్థించుకుంటున్నాడని మోడీ గురించి వివరిస్తారు. నక్సల్స్ మిలిటెంట్ కార్యకలాపాల గురించి కాంగ్రెస్ తీర్మానం గురించి వివరించిన ఒక వ్యాసంలో రాజకీయ కార్యక్రమం ఏదైనప్పటికీ కనీసం నాగాలాండ్ తరహా కాల్పుల విరమణకు ఉభయులూ సిద్ధమై, వాస్తవ జీవితంలో ప్రజాసమస్యల ఆధారంగా రాజకీయ పరిష్కారం వైపుగా సంప్రదింపులు జరపడం మంచిది. ఈ ఆశ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంలో స్పష్టంగా ఉన్నందున నక్సల్స్ కూడా తెగేవరకూ లాగకుండా ఆచరణలో సమస్యల పరిష్కార దిశగా ప్రజలలో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి కార్యాచరణకు పూనుకుంటే ప్రజాబాహుళ్యం ఆహ్వానిస్తుందనడంలో సందేహం లేదంటారు ఏబికె. అలానే ఈ రోజున 230 జిల్లాలకు నక్సల్స్ మిలిటెంట్ కార్యకలాపాలు పరివ్యాప్తమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడుజాగ్రత్తగా సమస్యను ఒక కొలిక్కి తేవడానికి సంప్రదింపులద్వారానే శతథా ప్రయత్నించాలని హితవు పలుకుతారు ఏబికె. పార్లమెంటే ‘సర్వాధికారి’ కాదు!, కావాలి ప్రతి మహిళ ఒక కాళిక! సుప్రీం మాటే అంతిమం! అమెరికా అవుట్ సోర్సింగ్ ఔట్ కాక తప్పదా! అరబ్బుల ఆగర్భ శత్రువు అమెరికా, లాడెన్ హతం ‘అంతం’ కాదు, లాడెన్ మరణం ఒక మిస్టరీ! స్వేచ్ఛ పేర శత్రు సంహారం, వర్థమాన మహావీరుడు గడాఫీ, డ్రాగన్‌పై అమెరికా డేగ కన్ను, ఏ టాబ్లాయిడ్ పుట్టలో ఏ పామున్నదో?! అమ్మ భాష -అరణ్య ఘోష, మాతృభాషే సార్వత్రిక మాతృక! వంటి అనేకానేక వ్యాసాలు ఇందులో కనిపిస్తాయి. ఏబికే సాహిత్య సంపాదకీయాలు అసిధారా వ్రతంతో చేసిన రచనలు. అపరంజి రేకులు, రమ్యాలోక విలసితాలు. ఆయన మనస్సు మహితం. బుద్దిమహాతీక్షణం. విమర్శ నిష్పక్షపాతం. ఆయన ఊహలు సత్యధర్మ సంయుతాలు. ఆయన సంపాదక శిరోమణి అని తిరుమల రామచంద్ర గారన్నమాటలు ఇక్కడ ప్రస్తావించడం సమయోచితం.
పేజీలు: 494, వెల: 220 రూపాయలు, ప్రతులకు: ఏబికే ప్రసాద్, కేరాఫ్ సి.ఆర్.ఫౌండేషన్, వృద్ధాశ్రమం, రూమ్ నెం.10, కొండాపూర్, హైదరాబాద్ -84. మరియు -విశాలాంధ్ర, నవోదయ బుక్ హౌసుల్లో–