శివరాత్రి.. జ్ఞానదీప్తి

శివరాత్రి.. జ్ఞానదీప్తి

  • 15/02/2015
  • – పసుమర్తి కామేశ్వరశర్మ

‘శివ ఏవ కేవలః’ సృష్టికి ముందు నిరాకారము, నిర్గుణము, నామరూప రహితము అగు ‘సత్’ పదార్థమొక్కటి ఉన్నదని, అది శివుడని తెలుపుతున్నాయి- వేద మంత్రములు. సృష్టి, స్థితి, లయములనే ధర్మముల వలన ఆయనకు బ్రహ్మ, విష్ణు, శివ అనే నామములు ఏర్పడ్డాయి. శివునికి ఉన్న నామ రూపాలలో ఒకానొక ప్రత్యేకత, విశిష్టత ఉంది. పరమ శివుని రూపములు రెండు. ఒకటి పురుష రూపం, రెండవది ‘లింగ’ రూపం. ‘శమయతీతి శివః’ అందరినీ బ్రహ్మానందంలో శమింపచేసేవాడు, శివుడు. ‘శీతే సజ్జన మనస్సు ఇతి శివః’ – సజ్జనుల మనస్సులలో శయనించి ఉండేవాడు, శివుడు. ‘శివం వేదః తద్యోగాత్’ శివమంటే వేదము. ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః అని ప్రపంచానికి శాంతి మార్గాన్ని దర్శింపజేసి, శాంతింపజేసే వేదము – శివమవుతుంది. దాని యోగము గలవాడు శివుడు. శివప్రదత్వాత్ శివః మంగళములను, శుభములను ఇచ్చేవాడు – శివుడు. ఇలా అనేక వ్యుత్పత్యర్థాలు ఉన్నాయి. ముఖ్యమయినది మరోటుంది. ‘శం నిత్య సుఖమానంద మికారః, పురుషః స్మృతః వకారః శక్తిరమృతా మేళనం శివ ఉచ్యతేః’ అన్నది శివపురాణమే. ‘శం’ అంటే నిత్య సుఖము, ఆనందము. ‘ఇ’ కారం – పరమ పురుషుడు. ‘వ’కారం అమృత స్వరూపిణి అయిన శక్తి. ఈ ముగ్గురి కలయికయే ‘శివం’ అవుతుంది. ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్థం. పరమశివుని కంఠం నుండి బయల్వెడిలింది ఓంకారము. దాన్ని విడదీస్తే ‘అ ఉమ్’ అయింది. ‘అ’ను ‘మ్’ ప్రక్కన చేరుస్తే ‘ఉమ’ అయింది. ఉమ అంటే బ్రహ్మ విద్య. ఓంకారం బ్రహ్మవిద్య. అందుకే ‘ఉమ’ను పరమశివుడు ఎప్పుడూ తన దేహార్ధ భాగంలో ఉంచుకొంటాడు. వేదమాత శివునికి అర్ధాంగిగా ఉంటుంది. వారి భార్యాభర్తృ సంబంధము నిత్యము, శాశ్వతము. దీనిననుసరించే భారతీయ వివాహ వ్యవస్థ స్థాపించబడింది. పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు, ఆదిదంపతులు. ‘సనాతన’ అంటే ఎల్లప్పుడూ, నిత్యనూతనం అని అర్థం. కాళిదాస మహాకవి తన రఘువంశ, కుమార సంభవములనెడి కావ్యముల ద్వారా భారతీయ దాంపత్య వ్యవస్థను పార్వతీపరమేశ్వరుల ద్వారా చెప్పాడు. వాగర్థా వివసంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ – పార్వతీ పరమేశ్వరులు వాగర్ధములలాగా శాశ్వత సంబంధం కలవాళ్లు. సప్త మహర్షులు హిమవంతుని దగ్గరకు, పరమశివుని తరఫున రాయబారంగా వెళ్లి, ‘తమర్థ మివ భారత్యాసుత యోక్తు మర్హసి’ వేద వాక్కుతో పరమార్థము జత చేసినట్లు, యోగము చేసినట్లు, నీ కూతురైన పార్వతితో, శివుని యోగము చేయమన్నారు. అందుకే, శివరాత్రి రోజున లింగానికి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటే, ఇటు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇదే మహా శివరాత్రి మహోత్సవమంటే. వ్యక్తమంటే కనిపించేది. ఆ వ్యక్తమంతా ఉమాస్వరూపం. కనిపించనిదంతా – అవ్యక్తం. ఆ అవ్యక్తం – శివస్వరూపం. ‘వ్యక్తావ్యక్త స్వరూపిణి’ అర్ధనారీశ్వర తత్త్వం. ఉమాశంకరుల యోగమునకు విష్ణువని పేరున్నదని రుద్ర హృదయోపనిషత్ చెబుతోంది. బాగా వికసించిన పుష్పములుగల వృక్షము నుండి చాలా దూరము వరకు సుగంధ పరిమళము వ్యాపిస్తుంది. పుణ్యకర్మలు చేసేవాడి నుంచి మంచి సుగంధము వస్తుంది. పరమశివుడు అనే తీగకు వేద రూప పుష్పములు పూయటం వలన, ఆ తీగె నుండి మంచి విద్యాగంధము వీస్తుందిట. ఆ గంధము ప్రజలకు పుష్టిని, వృద్ధిని సమకూరుస్తుంది. ఇహపరముల నిస్తుంది. అందుకే శివుణ్ణి ‘సుగంధి’ అని వేదము వర్ణించింది. ‘త్య్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ ఉర్వారుకమివ బంధనా న్మృత్యోర్ముక్షేయ మామృతాత్’ – ‘యజుర్వేదం త్రినేత్రుడు, పరిమళమును వెదజల్లువాడు, మంచి పుష్టిని చేకూర్చువాడు అయిన రుద్రుణ్ణి మేము ఆరాధించుచున్నాము. దోసపండును తొడిమ నుండి వేరు చేసినట్లు ఆ రుద్రుడు, మమ్మల్ని మృత్యువు నుండి వేరుచేసి, కాపాడి అమృతత్త్వాన్ని చేకూర్చుగాక’ అని అంటూ, మహాశివునికి లింగోద్భవకాలంలో పరమశివుడికి అభిషేకం చేస్తున్నాం. ప్రతిమాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. ‘శివరాత్రి’ అనే పదానికి, శుభప్రదమైన, మంగళకరమైన రాత్రి అని అర్థం. రాత్రి ‘చీకటి’ కదా.. అజ్ఞానానికి సంకేతం. ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, లింగోద్భవ కాల జ్ఞాన జ్యోతి దర్శనం, బిళ్వార్చన, నామసంకీర్తన, శివపార్వతుల కళ్యాణం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగింపబడుతుంది. శివారాధన వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. ‘చంద్రమా మననో జాతః’ మనస్సుకి అధిదేవత చంద్రుడు. చంద్రుని కళలు కృష్ణ పక్షంలో దినదినం క్షీణించి, చతుర్దశి నాడు కేవలం ఒక కళే ఉంటుంది. అలాగే. మనసుకు చేరిన 16 మాలిన్యములు (అష్టమదములు, అరిషడ్వర్గములు, మనస్సు అహంకారం) ఒక్కటే శేషించి ఉంటుంది. ఆ మాలిన్యాన్ని దూరం చేసేది – శివపూజ, శివాభిషేకం, శివనామ సంకీర్తనం. ఇక్కడే మనం మార్కండేయుడి కథను, ఆధ్యాత్మికతను జ్ఞప్తి చేసుకోవాలి. ‘మనుష్యాణాం సహస్రేషు’ అన్నట్టు, కోటికొకడుంటాడు. పట్టుదలగల సాహసికుడు, సాధకుడు. పట్టుదలుంటే చాలదు, పట్టుకోవటానికొక ఆలంబనముండాలి. అదే శివాకార వృత్తి. ‘లీనంగమయ తేతి లింగం’ అఖండమైన జ్ఞానం. మార్కండేయుడు శివలింగాన్ని వాటేసుకొన్నాడంటే ఏమిటి అర్థం? 16 ఏళ్ల వయసుకే మృకండ మహర్షి కుమారుడైన మార్కండేయుడు కాలధర్మం చెందవలసి ఉంది. దీనికి ప్రతీకారం చేయాలని శివలింగాన్ని పట్టుకున్నాడు. యముడు వచ్చి కాలపాశం వేశాడు. కానీ, శివలింగం వాటేసుకున్నాడు కాబట్టి శివుడు ప్రత్యక్షమైనాడు, కాలుణ్ణి పంపించి, అజరామరుణ్ణి చేశాడు మార్కండేయుణ్ణి. పదహారేళ్లవోకావు – షోడశ కళాత్మకమీ ప్రపంచం. కాలం వల్లనే దానితో సంబంధం. అది కాలంతోటే తిరుగుతుంది. అదే మృత్యువు. అదే కాలపాశం. కాలమనే పాశం. దాన్ని జయించే మార్గం – శివాకార వృత్తి. మృత్యుభయం లేదు. మానవుడికి, అమృతత్త్వానే్న ప్రసాదిస్తుంది. అసలు అమృతమనేది ఎక్కడుంది? అది సంసారంలోనే ఉంది. విషం లాంటి మృత్యువూ ఉంది. మన జీవిత సాగరాన్ని మధించాలి, అపుడు రెండూ దర్శనమిస్తాయి. హాలాహలం లాంటి కాలాన్ని కబళించి, కాలాతీతమైన శివతత్త్వమే నా స్వరూపమని గుర్తు చేసికొంటే అమృతత్వం లభిస్తుంది. త్యాగగుణం అలవడుతుంది. త్యాగం – నిశ్చల నిర్మల మనస్సునిస్తుంది. ‘త్యాగేనైకే అమృతత్త్వ మనసుః’ అన్నది శ్రుతి. దీనే్న బోధిస్తుంది మహాశివరాత్రి. శివుణ్ణి సాకారంగా అనగా మూర్తమైన విగ్రహంగా తీసికొంటే- ఆయన భస్మానులేపనం, పృథివికి, గంగాజటాజూటం – జలానికి, ఫాలనేత్రం – అగ్నికి, నాగభూషణత్వం వాయువుకి, దిగంబరత్వం ఆకాశానికి సంకేతమైతే, చంద్ర శేఖరత్వం మనస్సుకి, వృషభ వాహనం బుద్ధికి, గజచర్మ ధారణం అహంకారానికి, త్రిశూల ధారణం – త్రిగుణాలు తన కధీనమై ఉన్నాయని, త్రిగుణాతీతుడని వివరిస్తాయి. అమ్మవారు శరీరానే్న పంచుకొని ఉందంటే ఏమిటి అర్థం? చిద్రూపం శివ తత్త్వమైతే, సద్రూదం శక్తితత్త్వం. సచ్చిత్తులు అవినాభూతమయినవని చెప్పేది అర్ధనారీశ్వర తత్త్వం. ‘సత్యజ్ఞానానంద రూపా సామరస్య పరాయణా’ అన్నారు. మాఘ మాసంలో చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలం. ఈ రోజు శివుడు తేజోమయంతో లింగాకారం నుండి ఆవిర్భవించాడు. ‘అధ్యవోచ దధివక్తా ప్రథమోదైవ్యోభిషక్, అహేగ్‌ంశ్చ సర్వాజ్ఞమ్భయస్థ్య ర్వాశ్చయాతు ధాన్యః’ దేవతలకు ప్రప్రథమ వైద్యుడు రుద్రుడు. అందు శివునికి అభిషేకం చేస్తే సర్వరోగములు నశిస్తాయి. ఆయన గొప్ప శస్త్ర చికిత్సా నిపుణుడు. మనిషికి ఏనుగు తలను పెట్టినవాడు. అందుకే వైద్యులు లోపల శస్త్ర చికిత్స చేస్తుంటే జయప్రదంగా జరిగి, స్వస్థత చేకూరాలని, మానసికంగా రుద్రనమకాన్ని ముఖ్యంగా ఈ మంత్రాన్ని ‘అఘారేభ్యో…’ అనే మంత్రాన్ని పఠించి, దైవ బలాన్ని కూడా అర్థిస్తారు. శివరాత్రినాడు శివరాత్రి మహాత్మ్యాన్ని చెప్పుకోవాలి. ఒక వేటగాడు మహాశివరాత్రి పర్వదినాన మృగములను వేటాడే నిమిత్తం ఒక చెట్టుపై కెక్కాడు. చెట్టుకు సమీపంలో వలను వేసి ఎదురుచూస్తున్నాడు. ఎంత రాత్రి అయినా ఒక్క మృగము కూడా ఆ దిక్కుకు రాలేదు. మృగములు రాకను చాటుగా ఉండి చూడాలని చెట్టుపై నుండి కిందికి రాలేదు. కాలక్షేపానికి, ఏదో చేయాలి కాబట్టి, ఆ చెట్టు ఆకులను తెంపి కింద వేయసాగాడు. ఆ ఆకులు అప్రయత్నంగా కిందనున్న శివలింగంపై పడ్డాయ. అతను ఎక్కి కూర్చున్నది బిళ్వ వృక్షము. తనకు తెలీకుండానే శివునికి, శివరాత్రి రోజున శివునికి బిళ్వార్చన చేశాడు. పట్టుదలతో వేట దొరికిన తరువాతే ఇంటికి వెళ్లాలనుకుని రాత్రంతా జాగరణ చేశాడు. తెల్లవారింది. ఏమీ లేకుండానే ఇంటికి వెళ్లాడు. అతని భార్య కూడా భర్త రాక కోసం ఎదురుచూస్తూ జాగరణ చేసింది. ఉపవాసం చేసింది. దాని ఫలితంగా ఇద్దరూ శివసాన్నిధ్యం అందుకున్నారు. తెలియకుండా, అప్రయత్నంగా చేసిన దానికే ఇంత ఫలితాన్ని పొందితే, తెలిసి సంపూర్ణ భక్త్భివంతో చేస్తే ఆ పరమశివుడు ఇంకెంత ఇస్తాడో..! ఈశ్వరునికి వాహనము నంది. ఈశ్వర తత్త్వానికి లింగము ఎలా గుర్తో, జీవతత్త్వానికి ‘నంది’ అలా గుర్తు. జీవతత్త్వములోని పశుతత్త్వం. పశుతత్త్వముతో కూడిన ఈ జీవతత్త్వము ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పకుండా ఈశ్వరుని వైపు తిప్పటం చేత భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందుతుంది. నందిని, ఈశ్వరుడిని రెండుగా విభజించి చూస్తారు. నందికి ఈశ్వరునికి ఎవరూ అడ్డు తగలకూడదు. అంటే జీవునికి, పరమాత్మకు అడ్డం ఉండకూడదు. నంది ధర్మానికి ప్రతీక. జీవుడు నంది శృంగముల మధ్య నుంచి లోపలున్న పరమాత్మను దర్శిస్తాడు. తనలో ఉన్న పశుతత్త్వాన్ని అణచివేసుకొని, ధర్మంతో అర్థ, కామాల్ని అనుభవిస్తే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని పొందుతాడు. అప్పుడు నంది, ఈశ్వరుడు అని రెండుగా ఉండవు. ‘నందీశ్వర’ అని రెండూ ఏకమై పోయినాయి. అప్పుడు అన్నీ ఒకే తత్త్వంగా భాసిస్తాయి. ఇదే శివరాత్రి మనకు అందించే ఆధ్యాత్మికత. బిళ్వార్చన విశిష్టతను, ఆంతర్యాన్ని తెలుసుకుంటే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయ. బిల్వపత్రం మూడు దళములతో కూడి ఉంటుంది. మానవులను ప్రభావితం చేసే త్రిగుణములకు, త్రికాలములకు, త్రితాపములకు ప్రతీక ఈ పత్రం. ఈ శరీరమే బిల్వదళం. త్రిగుణముల ఏకత్వమును సాధించినప్పుడే భగవంతుని అర్పణకు అర్హతను పొందుతుంది. ఆ ఏకత్వమును సూచిస్తుంది బిల్వదళార్చన. తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం దగ్గరలో ఉన్న చిన్న శివాలయంలో గ్రహణ సమయంలో ఒక దేవతా సర్పం ఆలయంలోని బిల్వ వృక్షం మీదకు ప్రాకి బిల్వదళాల్ని తుంచి, సోమ సూత్రం గుండా శివాలయంలోకి ప్రవేశించి శివలింగం మీద దళాన్ని ఉంచి, లింగాన్ని చుట్టుకొని, గ్రహణ సమయమంతా లింగం దగ్గరే ఉండి, గ్రహణం విడిచిన తరువాత, అదే సోమసూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వార్త, ఫొటోలు కూడా పత్రికలలో వచ్చినాయి. ఇది బిల్వపత్రార్చన విశేషం. మనలోని కామ పిశాచాన్ని, పశు రాక్షస తత్త్వాన్ని, దహింప చేసికోవాలి. పాశుపతమైన ఈ దీక్ష మనకుంటే, పశుపతి అనుగ్రహం మనకు లభిస్తుంది. తిరోధన అనుగ్రహాలు రెండూ పరమ శివుని చేతిలో ఉంటాయి. తిరోధానంతో శివుడే జీవుడయ్యాడు. అనుగ్రహంతో మరలా జీవుడైన తానే శివుడే భాసించాడు. ఇదే మహా శివరాత్రినాడు మనం తెలిసికోవలసిన శివలీలా వైభవం. నాదతనుమ నిశం- శంకరం, నమామియే మనసా శిరసా అని చిత్తరంజని రాగంలో త్యాగరాజ స్వామి కీర్తించిన కృతి, మహాశివరాత్రికి సంపూర్ణ స్ఫూర్తిని, దీప్తిని ఇస్తుంది. పంచభూత లింగ క్షేత్రములు ఈ శివ్వం పంచభూతమయం. పంచభూతములనగా – ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. శివునికి భూతపడి అనే నామము ఉంది. అందుకే ‘ఈవావాస్య మిదం సర్వం’ అన్నది శ్రుతి. పంచభూత రూపుడను నేనే అని తెలియజేయటానికి పరమ శివుడు దక్షిణ భారతదేశంలో ఐదు క్షేత్రములందు ఆవిర్భవించి భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. అవి, చిదంబరంలోని ఆకాశలింగం, శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగము, అరుణాచలములో తేజో (అగ్ని), లింగము, జంబుకేశ్వరములో జలలింగము, కాంచీ క్షేత్రములో పృధివ లింగ రూపములు. ఇవే పంచభూత లింగ క్షేత్రములు. చిదంబరం.. చిదంబరం క్షేత్రంలోని నటరాజస్వామి ఆలయంలో ఉన్నదే ‘ఆకాశలింగం’. మానవ రూపంలో శివునకు విగ్రహం ఉన్న దేవాలయం చిదంబరంలో మాత్రమేనని చెప్తారు. చెక్కబద్దలతో చేసిన ఒక గడిలోపల, గుడ్డ తెరలు వేలాడదీసి ఉంటాయి. ఆ తెరను కొంచెం తొలగించి చూడమంటారు. దూరంగా గోడ మీద బంగారపు ఆకులలాటి వాటితోనున్న తోరణం లాంటిది ఒకటి వేలాడుతూ ఉన్నట్లనిపిస్తుంది. శివుడు ఆకాశ రూపంలో ఇక్కడ వెలిసియున్నాడని చెప్తారు. సృష్టిలో మొదటిది ఆకాశం. దాని నుంచి వాయువు. వాయువులో నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటిలో నుంచి భూమి పుట్టుకొచ్చాయని వేదం చెప్పింది. ఈ సృష్టిలో వున్నవన్నీ ఏదో ఒకనాటికి నశించిపోయి చివరకు శూన్యంలోకి చేరవలసినవే. మనస్సును ఆకాశంలాగా నిర్మలంగా ఉంచుకొనడమే మనిషికి నిజమైన సుఖమని చెప్తుంది- ఆకాశలింగం. ‘చిత్’ అంటే మనస్సు, ‘అంబరం’ అంటే ఆకాశం. ఇదే చిదంబరం, ఇదే చిదంబర రహస్యం కూడా. కేదార రాగంలో ‘ఆనంద నటన ప్రకాశం చిత్సభేశం, ఆశ్రయామి శివకామ వల్లీశం’ అంటూ చిదంబర నటరాజ స్వామిని కీర్తించాడు – ముత్తుస్వామి దీక్షితులు. శివునికి ఉన్న రెండు అవస్థల్లో ఒకటి సమాధి అవస్థ. రెండవది తాండవ నృత్య అవస్థ. సమాధి నిర్గుణం, తాండవ నృత్యం సగుణం. శివునికి నాట్యం అంటే ఇష్టం. ప్రదోష కాలంలో పరమశివుడు నటరాజస్వామి అయిః నాట్యం చేస్తే, బ్రహ్మాది దేవతలందరూ ఆనందంతో చూస్తారు. శివతాండవం తొమ్మిది విధములని చెప్తారు. అవి : ఆనంద తాండవం, సంధ్యా తాండవం, ఉమాతాండవం, గౌరీ తాండవం, కాళికా తాండవం, త్రిపుర తాండవం, సంహార తాండవం, లలితా తాండవం, ఊర్థ్వ తాండవం. శ్రీకాళహస్తి.. సప్త మహర్షులలో శ్రేష్టుడైన వశిష్టునికి నూరు మంది కుమారులు. ఒకానొక సందర్భంగా వారంతా హతులయ్యారు. అమిత దుఃఖంతో కొండ మీద నుండి కిందికి దూకటానికి ఉద్యుక్తుడైనాడు వశిష్ఠుడు. భూదేవి రక్షించి, దుఃఖ శమనానికి పరమ శివుణ్ణి ప్రార్థించమన్నది. పట్టుదలతో దీక్షగా తపస్సు చేశాడు. ప్రత్యక్షమయిన పరమశివుణ్ణి- ‘బ్రహ్మ విద్యని ప్రసాదించమ’ని ప్రార్థించాడు. శివలింగం మధ్యలో నుంచి పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంతో వశిష్టునికి దర్శనమిచ్చి ఆయన కోరుకున్న వరాల్ని ప్రసాదించి వాయు రూపంగా అంతర్ధానమయినాడు. శివలింగం వశిష్టునికి ఎదురుగా ఉండిపోయింది. కైలాసంలో పార్వతీ దేవి భర్తను అనే్వషిస్తూ వచ్చి, జ్ఞాన భిక్ష నొసగే జ్ఞాన ప్రసూనాంబగా స్వయంభువుగా వెలిసింది. శివలింగం ప్రక్కనే. ప్రమధ గణమంతా వచ్చి తూర్పు దిక్కున, దుర్గాదేవి ఉత్తర దిక్కున ఆవిర్భవించారు. ఇప్పటికీ శ్రీకాళహస్తి ఆలయంలో దక్షిణామూర్తి విగ్రహం ఒకటి ప్రత్యేకంగా ఉండి, ప్రతిరోజూ పూజలందుకుంటోంది. ఆలయానికి ఉత్తరంగా ఊరి బయట దుర్గాదేవి ఆలయం కొండమీద ఉన్నది. ‘శ్రీ’ అంటే సాలెపురుగు. కాళ అంటే పాము. ‘హస్తి’ అంటే ఏనుగు. శివలింగాన్ని పూ జించి ముక్తిని పొందటం చేత ‘శ్రీకాళహస్తీశ్వరుడు’ అని ఆ స్వామికి పేరు వచ్చింది; ఆ ఊరిని ‘శ్రీకాళహస్తి’ అని పిలుస్తున్నారు. శ్రీకాళహస్తికి దగ్గరలో ‘ఉడుమూరు’ అనే బోయవారి గ్రామం ఉండేదట. ఆ ఊరికి ‘నాదనాథుడు’ అనే నాయకుడుండేవాడు, ఆయన కుమారుడే -తిన్నడు. తిన్నడు అడవిలో తిరుగుతూ ఉండే సమయంలో శ్రీకాళహస్తీశ్వర లింగం కనపడింది. భక్తిశ్రద్ధలతో పూజించటం ప్రారంభించాడు. అచంచల భక్తితో పరమేశ్వరుడు పెట్టిన పరీక్షలో తన రెండు కళ్లనూ స్వామికి అర్పించి కృతార్థుడై తిన్నడు భక్తకన్నప్ప అయినాడు. శ్రీకాళహస్తీశ్వర లింగం మీద సాలెపురుగు, పాము, ఏనుగు కలిసి ఉన్నట్లుగా పరీక్షగా వీక్షిస్తే దర్శనమిస్తాయి. ఆలయ గర్భగుడిలోనే స్వామి లింగం ప్రక్కనే తిన్నడి విగ్రహం కూడా ఉంటుంది. అందుకే శివుడు భక్తపరాధీనుడు, భోళాశంకరుడు. తమ తమ పూర్వ జన్మలలో సాలెపురుగు విశ్వకర్మ కొడుకైన ఊర్ణనాభుడని, పాము శంభుడనే నాగలోక వాసి అని, ఏనుగు హస్తి అనే ప్రమధుడు అని, తిన్నడు సాక్షాత్తు అర్జునుడేనని కొన్ని గాథలున్నాయి. ఈ క్షేత్రం గురించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మధురానగరంలో మాణిక్యవల్లి అనే వేశ్య ఉండేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వాళ్లిద్దరూ చిన్నతనం నుండి గొప్ప శివభక్తులు. తల్లి ఎంత చెప్పినా వారు వేశ్యావృత్తిలోకి రాలేదు. ఒకరోజున ఇద్దరు దొంగలు ఆ అక్కచెల్లెళ్ల వద్ద ఉన్న నగల్ని కాజేద్దామన్న దురుద్దేశంతో, వాళ్లిద్దరికీ శ్రీకాళ హస్తీశ్వర స్వామిని చూపిస్తామని చెప్పి తీసికొని వెళ్లారు. రాత్రిపూట ఆ దొంగలు వారిద్దరిని చంపాలని నిర్ణయించుకున్నారు. పరమేశ్వరుడు దుష్టుల్ని శిక్షించి, తన భక్తుల్ని రక్షించడమే కాదు మోక్షాన్ని ప్రసాదించాడు. ఆలయం దగ్గరలోనే వారిద్దరి పేరునా ఒక అందమైన మంటపం ఉంది. ఇదీ శ్రీకాళ హస్తీశ్వరుని కరుణ, భక్తిపరాధీనత. ‘శ్రీకాళ హస్తీశ శ్రీతజనావన జ్ఞాన ప్రసూనాంబికాపతే’ అని కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. అరుణాచలం ‘అరుణాచల నాథం స్మరామి అనిశం అసేత కుచాంబాసమేతం. అప్రాకృత తేజోమయ లింగం’ అంటూ సారంగ రాగంలో, అరుణాచలంలో అసేత కుచాంబా సమేతుడైన అరుణాచలేశ్వరుని స్మరించినంత మాత్రమున కైవల్యాన్ని ఇచ్చే స్వామి అని కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. కొండకి ప్రదక్షిణం చేస్తారు. కొండ శివాకారంగా ఉంటుంది. ఆలయ గాలి గోపురం నిర్మాం సుమారు 1560 ప్రాంతంలో శ్రీకృష్ణ దేవరాయల చేత ప్రారంభించబడి, తరువాత వారిచే పూర్తి చేయబడింది. కృతయుగంలో అగ్ని లింగంగాను, త్రేతాయుగంలో వజ్ర రూపంగాను, ద్వాపర యుగంలో బంగారపు కొండ రూపంలో ఉండేదని, కలియుగంలో శివాకారంగా రూపుదాల్చిందని స్కాంద పురాణంలో చెప్పబడింది. తిరువణ్ణామలై పేరు వినగానే జ్ఞప్తికి వచ్చేవారు – కార్తికేయ అంశభూతులైన భగవాన్ రమణ మహర్షి. జంబుకేశ్వరం… జలలింగం శ్రీరంగపట్టణంలో కలిసే ఉంటుంది. పరమశివుని లింగరూపం కింద వున్న పీఠం లోంచి నిరంతరమూ నీరు కొంచెం కొంచెంగా, బొట్లు బొట్లుగా ఊరుతూ ఉంటుంది. పీఠం చుట్టూ ఒక వస్త్రం కప్పి ఉంచుతారు. ఆ వస్త్రం తడిసిన తరువాత తీసి, పిండేసి మళ్లీ పరుస్తారు. స్వామివారి గర్భగుడి ప్రక్కగా అమ్మవారి ఆలయం, ఆ జగన్మాత ‘అఖిలాండేశ్వరి’. మొదట్లో అమ్మవారి విగ్రహ మూర్తి చాలా ఉగ్రంగా, భీకరంగా ఉండేదట. ఆదిశంకరులు తపస్సు చేసి, తల్లిని ప్రసన్నురాలిని చేసికొని శాంతమూర్తిగా చేశారు. జగద్గురు శంకరులే జాతి రత్నాలతో కూర్చిన శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారు. ‘తాటంక యుగళీభూత తపనోడుప మండలా’ అని లలితా సహస్ర నామంలో చెప్పినట్లు అఖిలాండేశ్వరీ అమ్మవారి కర్ణ్భారణములు మహిమాన్వితమైనవి. ఆ తల్లి సర్వదా చిరునవ్వుతూ ప్రసన్న వదనంతో ఉండేందుకు, ఆమె ప్రియ తనయుడైన వినాయకుని విగ్రహం ఒకదానిని ఆమె ముందు ప్రతిష్ఠించారు. పెద్ద పుష్కరిణి ఒడ్డున మంటపం. దీన్ని శ్రీరామచంద్రుడు నిర్మించాడన్నది స్థల పురాణం. ‘జంబూపతే పాహిమాం, పర్వత జాప్రార్థితాప్సు లింగ విభో’ అని ముదావహంగా కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. *

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.