శివరాత్రికి జాగరణం ఎందుకు?శ్రీ స్వరూపానంద-అక్షర’ లక్షల ఆది దేవుడు

శివరాత్రికి జాగరణం ఎందుకు?
అక్షర’ లక్షల ఆది దేవుడు

శివుడు శివంకరుడు, వశంకరుడు కూడా. తన తకధిమి తాండవ కేళీ లయ విన్యాసాలతో సమస్త చరాచర జగత్తును ఆడించే హృదయాలయ వశుడు శివుడు. విలయ కారకుడుగా విఖ్యాతుడైన పరమేశ్వరుడు, నిజానికి భావ పరంపరా వారధి అయిన భాషకు ఉద్భవ కారకుడు. నటరాజుగా మారిన తాండవ శివుని అభంగ ఢమరుక నాదం నుంచే సకల భాషలకు మూలమైన ధ్వనులు ఉద్భవించాయి. ఆ ధ్వనులే ఉత్పత్తి స్థానం ఆధారంగా వర్ణాలుగా పరివర్తన చెందాయి. ఆ వర్ణాలే లక్షల అక్షర మాలలై, వ్యాకరణాన్ని వరించి భాషలుగా అవతరించాయి. అందుకే ఆదిదేవుడి వలె అక్షరం కూడా అనశ్వరమైనది. అర్థనారీశ్వరమైన ఆది దంపతుల వలె వాగర్థాలు కూడా విడదీయలేనివి. శివరాత్రి సందర్భంగా శివుని ఢమరుకం నుంచి జాలువారిన
వర్ణోత్పత్తి క్రమం…
శ్లో// నృత్తావసానె నటరాజ రాజః
ననాదఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్‌
ఏతద్విమర్శేత్‌ శివసూత్రజాలం
నటరాజైన శంకరుడు ఆనందతాండవం తర్వాత తన చేతిలోని ఢమరుకాన్ని 14సార్లు మోగించాడు. అప్పుడు ఈ క్రింద సూచించబడిన ధ్వనులు వెలువడ్డాయి.
1) అ, ఇ, ఉ, ణ్‌ 2) ఋ, ……(అచ్చు)క్‌ 3) ఏ, ఓ, ఙ్‌, 4) ఐ, ఔ, చ్‌ 5) హ, య, వ, ర, ట్‌ 6) ల, ణ్‌ 7) ఞ, మ, ఙ, ణ, న, మ్‌ 8) ఝ, భ, ఞ్‌ 9) ఘ, ఢ, ధ, శ్‌ 10) జ, బ, గ, డ, ద, శ్‌ 11) ఖ, ఫ, ఛ, ఠ, థ, చ, ట, త, వ్‌ 12) క, ప, య్‌ 13) శ, ష, స, ర్‌ 14) హ, ల్‌.
పై ధ్వనుల ఆధారంగా మహర్షులు ప్రస్తుతం మనం వాడుకుంటున్న వర్ణమాలను… అంటే ‘‘అ’’ నుండి ‘‘హ’’ వరకుగల రూపొందించి వాటికి ‘‘అక్షరములు’’ అని నామకరణం చేశారు. ‘క్షరము’ అంటే నశించేది అని అర్థం. క్షరము కానిది కాబట్టి ‘అక్షరము’ (శాశ్వతంగా నిలిచేది) అన్నారు. అలాంటి ధ్వనులను చెవులతో మాత్రమే వినగలం. కళ్లతో చూడటానికి, చేత్తో రాయటానికి తగినవిధంగా ఆ ధ్వనులకు ఒక రూపం కల్పించి ‘అక్షరాలు’ అన్నారు. ఈ అక్షరాలతో పదాలు, పదాలతో వాక్యాలు ఏర్పడి ప్రత్యక్షంగా ఉన్నవారికి, పరోక్షంగా ఉన్న వారికే కాకుండా ఆ తర్వాతి తరాలవారికి కూడా తమ భావాన్ని అందించగల ఒక గొప్ప అవకాశం లభించింది. ఆ లిపి రూపంలో ఉన్న అక్షరాలు కాలక్రమంలో అనేక మార్పులకు లోనయ్యాయి. చివరకు దేవనాగరి లిపిలో, వివిధ ప్రాంతీయ భాషలలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అక్షరాలకు ఈశ్వరానుగ్రహంవల్ల లభించిన ధ్వనులే మూలం. ‘‘తల్లి సమస్త భాషలకు దైవతభాషయ’’ అన్నట్లు అన్ని భాషలలోని అక్షరాల ఉచ్చారణకూ ప్రస్తుతం అక్షర రూపంలో మనం ఉచ్చరిస్తున్న ధ్వనులతోనే అధికశాతం ఉచ్చరించడం సాధ్యమవుతుంది. అందుకే భారతీయ భాషలలో చాలా వరకు, కొన్ని సందర్భాలలో ఇతర భాషలలోకి సంస్కృతం చొచ్చుకుపోగలిగింది. ఆ విధంగా పరమేశ్వరుని అనుగ్రహంతో లభించినవి కాబట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతా సూచకంగా వర్ణమాలను నేర్పేముందు ‘‘ఓం నమశ్శివాయ సిద్ధం నమః’’ అని రాయిస్తారు. ఆ తర్వాతే ‘అ, ఆ’ మొదలైన వర్ణాలను బోధించటం ప్రారంభించారు. తదనంతర కాలంలో అవే ‘ఓనమాలు’గా ప్రసిద్ధమయ్యాయి. అవే ‘అక్షరములు’ (నాశము లేనివి)గా నాటినుంచి నేటిదాకా ఉన్నవి. ‘క్‌+ష=క్ష త్‌+ర=త్ర జ్‌+ఞ=జ్ఞ’ ఇతర సంయుక్తాక్షరాల వంటివేగానీ, స్వతంత్రాక్షరాలు కావు. ఇలాంటి అక్షరాలను ఉచ్చరించడానికి అనువుగా ఉన్న ఈ శరీర భాగానికి ‘‘ఆస్యమ్‌’’ అని నామకరణము చేశారు. ‘‘ఆస్యంతి ఉచ్చారయంతి వర్ణాన్‌ అనేన ఇతి ఆస్యమ్‌’’- అంటే… ‘నోరు’ అని మన మాటల్లో చెప్పుకోవచ్చు. నోటిలో కూడా ఏయే భాగంతో ఏయే అక్షరాలు ఉచ్చరించటం సాధ్యమో కూడా వివరించారు.
మూడు భాగాలు
ఇందులో ‘అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు’ అని మూడు భాగాలున్నాయి. అచ్చుల సహాయం లేకుండా హల్లులను స్వతంత్రంగా పలకటం సాధ్యం కాదు. కాబట్టి హల్లులకు అచ్చులు ప్రాణంవంటివి. అందుకే అచ్చులను ‘ప్రాణులు’ అంటారు. ‘‘అచ్‌’’ ప్రత్యాహారాంతర్గతమైనవి… అంటే- మొదట చెప్పిన సూత్రాలలో ఒకటో సూత్రము మొదటి అక్షరం ‘‘అ’’. నాలుగోసూత్రము చివరి అక్షరం ‘‘చ్‌’’. ఈ మధ్యగల అక్షరాలు ‘‘అ, ఇ, ఉ, ఋ, ……, ఏ, ఓ, ఐ, ఔ’’లకు ‘అచ్చులు’ అని పేరుపెట్టారు. అదేవిధంగా ‘‘హల్‌’’ ప్రత్యాహారాంతర్గతమైనవి… అంటే- ఐదో సూత్రం మొదటి అక్షరం ‘‘హ’’. పద్నాలుగో సూత్రం చివరి అక్షరం ‘‘ల్‌’’. ఈ మధ్యగల అక్షరాలకు ‘హల్లులు’గా నామకరణం చేశారు. ఇటువంటి అక్షరాలు ఆస్యము (నోటి)లో ఏయే ప్రదేశంలో ఏయే అక్షరాల పుట్టుక జరిగిందో దాన్ని కూడా సవివరంగా తెలిపారు.
1) అ, కు, హ విసర్జనీయానాం కంఠః
2) ఇ, చు, య, శానాంతాలు అని ఇలాంటి సూత్రరూపంలో తెలియజేశారు.
1) అ, క, ఖ, గ, ఘ, ఙ, హ (8) వసర్గలు – – – – – – – – వీటికి కంఠం ఉత్పత్తి స్థానం.
2) ఇ, చ, ఛ, జ, ఝ, ఞ, య, శ – – – – – వీటికి దవడలు (తాలు).
3) ఋ, ట, ఠ, డ, ఢ, ణ, ర, ష – – – – – – – వీటికి మూర్ఘ (నాలుక పైభాగము).
4)…., త, థ, ద, ధ, న, ల, స- – – – – వీటికి దంతాలు.
5) ఉ, ప, ఫ, బ, భ, మ – – – – – – – – వీటికి పెదవులు (ఓష్ఠములు).
6) ఞ, మ, ఙ, ణ, న (ముందు చెప్పిన స్థానాలతోపాటు పాటు (నాసిక).
7) ఏ, ఐ – – – – – – – – కంఠం, దవడలు.
8) ఓ, ఔ – – – – – – – కంఠం, పెదవులు.
9) వ, – – – – – – – – దంతాలు, పెదవులు.
10) ః ఖ – – – – – – – – జిహ్వమూలం (నాలుక మొదటి భాగము)
11) (0) సున్న
ఆ తర్వాత ‘హ్రస్వాలు, దీర్ఘాలు’ అనే మార్పుతో మరిన్ని అక్షర రూపాలు ఏర్పడ్డాయి. ముందు చెప్పినట్లుగా ఈ అక్షరాలతో పద, వాక్య నిర్మాణం జరిగి మనసులోని భావాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నవారికి తెలిపే అవకాశం ఏర్పడింది.
 టి.సుధాకరశర్మ
70363 70381

 

 సాహితీ బంధువులకు17-2-15 మంగళవారం  శ్రీ మహా శివ రాత్రి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్

మనం ఏటా మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటున్నాము. దీనికి కారణం? పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
ఒకసారి బ్రహ్మ విష్ణువుతో ‘‘నేను ఈ విశ్వానికి సృష్టికర్తను కనక నేనే గొప్ప’’ అని అన్నారు. దానికి విష్ణువు ‘‘నీవు నా బొడ్డులో పుట్టావు కనక నేనే గొప్ప’’ అని తిరిగి సమాధానం చెప్పారట. ఇద్దరికి ఘోర యుద్ధం మొదలయ్యింది. వారిద్దరికి బుద్ధి చెప్పడానికి పరమేశ్వరుడు ఆకాశము, పాతాళము వ్యాపించి ఒక అగ్నిస్తంభ ఆకారంలో జ్యోతిర్లింగమై ఆవిర్భవించారు. దాన్ని చూసి బ్రహ్మకు, విష్ణువుకు భయం కలిగింది. అప్పుడు ‘‘మీలో నా మొదలూ తుదీ ఎవరు తెలుసుకొని వస్తారో వారే గొప్ప’’ అని శివుడి యొక్క అదృశ్యవాణి వినిపించింది.
బ్రహ్మ హంస రూపం ధరించి జ్యోతిర్లింగం పైభాగాన్ని తెలుసుకోవడానికి వెళ్లాడు. విష్ణువు వరాహరూపంతో ఆ జ్యోతిర్లింగం మొదలు ఎక్కడ ఉందో వెదుకుతూ బయలుదేరాడు. ఇలా వారిద్దరు ఎన్నో సంవత్సరాలు వెళ్లినా వారికి ఆ జ్యోతిర్లింగము ఆది అంతాలు కనబడలేదు. అయితే వారు పూర్తిగా అలసిపోయి శివుడిని ప్రార్థించగా శివుడు జ్యోతిర్లింగం మధ్య ప్రత్యక్షమై ‘‘నేను గొప్ప నేనేగొప్ప అని మీరు అనవసరంగా తగువుపడుతున్నారు. మీకందరికీ నేనే మూలం. మీలోని శక్తికి నేనే కారణం. ఈ పవిత్రమైన రోజును ప్రజలు మహాశివరాత్రిగా జాగరణము, ఉపవాసము మొదలగు వాటి చేత నా నిజస్వరూపాన్ని తెలుసుకుని ముక్తులు అవుతారు’’ అని అనుగ్రహించి అదృశ్యమైపోయాడని శివపురాణంలోని విశ్వేశ్వర సంహితలో ఉంది.
ఈ జ్యోతిర్లింగ విషయమై ఆపాతాలనభస్థలాన్త భువన బ్రహ్మాండ మా విస్పుర జ్యోతి స్ఫాటిక లింగ.. అని మొదలుగు విధాల వర్ణన మహాన్యసంలో కూడా ఉంది. కనక భారతీయులు అనాదిగా ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉంటూ, రాత్రి జాగరణం చేసి శివునికి నాలుగు జామల్లో పూజాభిషేకాలు చేస్తూ, మరుసటి రోజు ఉదయం ప్రసాదం తీసుకుంటారు.
శివజాగరణ రహస్యం
‘‘ఇతిహాస పురాణాఖ్యానం వేదం సముప బృహయేత్‌ (భారతం)’’ అంటే ఇతిహాస పురాణాలు వేదార్థాన్ని తెలుపుతాయి అని ఉంది. అందుకే పురాణాల్లో ఈ శివరాత్రి కథకి వేదార్థాన్ని గ్రహించాలి.
తైత్తిరీయ నారాయణంలో మనోబ్రహ్మ అని ఉంది. కనక ఈ విశ్వాన్ని సృష్ట్టించే మనస్సే బ్రహ్మదేవుడు. ‘విష్ణుంకృత్వాథ సారథికు’ అను శృతి ప్రకారము, ‘బుద్ధింతు సారధిం విద్ధి’ ప్రకారం స్థూల శరీరాన్ని రషించే బుద్ధియే విష్ణువు. మనస్సు అనే బ్రహ్మ ఇంద్రియాల రూపంలో అంటే హంసరూపంతో ఎంత ప్రయత్నించినా, బుద్ధి అనే విష్ణువు తర్కరూపం అంటే వరాహరూపంలో ఎంత ప్రయత్నించినా వారిద్దరు ఆత్మ అయిన జ్యోతిర్లింగము యొక్క ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు.
‘యతోనాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ’ అంటే ఆత్మ మనస్సు, ఇంద్రియాలకు తెలియబడేది కాదు. అది అనుభవంతోనే తెలియబడుతుంది.. అని ఈ తైత్తిరీయ ఉపనిషత్‌ వివరణే ఈ కథ.
శివరాత్రి నాడు నిద్ర చేయకూడదు అని జాగరణ చేయాలి అని, ఉపవాసం చేయాలని పురాణాలలో ఉంది. ఇక్కడ నిద్ర అంటే ఏమిటి? అంటే శ్రీ గౌడపాదులు నిద్రా తత్త్వ మజానతః (గౌ.కా) అన్నారు. అందరి స్వరూపమైన ఆత్మ యొక్క పరమార్థాన్ని తెలియకపోవడమే అంటే అవిద్యయే నిద్ర.
‘అన్యథా గృహ్లాతః స్వప్నః’ అన్నారు గౌడపాదులు. అంటే ఉన్న ఆత్మను ఉన్నట్లు తెలుసుకోక దానిని దేహమని, మనస్సని, ఇంద్రియాలని తప్పుగా తెలుసుకోవడమే స్వప్నము. ఈ రెండు నిర్వచనాల వల్ల యధార్థ గ్రహణమే జాగ్రత్త (మెలకువ) అని గౌడపాదులు అన్నారు. అంటే తన స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే జాగరణము. ఆ రోజే మన జీవితంలో శివరాత్రి. గౌడపాదులు అనాది మాయయా సుప్తః యదా జీవః ప్రభుద్యతే.. అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా.. అన్నారు. అంటే పరమ కరుణామూర్తి అయిన గురువులు ఆత్మోపదేశం చేయగా అనాది మాయానిద్ర తొలగి, అజము, అనిద్రము, అస్వప్నము, అద్వైతము అయిన తన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన జాగరణ. ఇలా తెలుసుకోకుండా ప్రజలు ఈ రోజు శివరాత్రి కనక జాగరణ చేయాలని రాత్రంతా సినిమాలు చూడటం, వేరే వేరే పనులు చేయడం సరికాదు. శివరాత్రి నాడు అన్నం తినకూడదు అని రకరకాల తిండి తీర్థాలను జాముజాముకి తీసుకుని, ఉపవాసం చేసామని భావించకూడదు. ఉప అంటే దగ్గర. జీవాత్మ పరమాత్మకు సమీపంలో ఉండడం. గురువుల వద్ద శ్రవణం చేసి తన ఆత్మ పరమాత్మయే అని గుర్తించడమే నిజమైన ఉపవాసం. అంతేగాని శరీరం ఎండబెట్టడం ఉపవాసం కాదు. అయితే శివరాత్రి రోజు ఆహారం స్వీకరించకుండా ఉపవాసం చేస్తే మంచిదే అది ఆరోగ్యానికి, అంతఃకరణశుద్ధికి ఉపయోగం కాని ఇదే పరమార్థం అనుకోకూడదు.
ఇక యామ పూజ, యామం అంటే జాము. ఆ రోజు రాత్రి ప్రతి యామం శివునికి అభిషేకం చేయాలి. ప్రథమయామం రెండవ యామంలోను, మూడవ యామంలో మొదటి రెండు యామాలను అంతర్గతాలు. ఇలాగే నాలుగో యామం చివర తెల్లవారుతుంది. ఈ నాలుగు యామాలు వాస్తవంగా మాండుంక్యంలోని (స్నోయమాత్మా చతుస్పాత్‌’) ఆత్మకి నాలుగు పాదాలు ఉన్నాయి అని తెలుపుతుంది. విశ్వపాదం తైజసపాదంలోను విశ్వతైజసపాదాలు ప్రాజ్ఞపాదంలోను ఈ మూడు పాదాలు తురీయపాదంలోను అంతర్గతాలు. ‘త్రయాణాం’ విశ్వాదీనాం పూర్వపూర్వ ప్రవిలాపనేన తూరీయస్య ప్రతిపత్తిరితి’ అని శ్రీ శంకర భాగవతాదులు మాండూక్య భాష్యంలో చూపారు. ఈ విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయములు అద్వితీయ ఆత్మలో వికల్పాలని గుర్తిస్తే ఆ నాల్గవ యామం చివరిలో తెల్లవారినట్లు అప్పుడు పరమార్థ జ్ఞానోదయం కలుగుతుంది. ఇదే శివ జాగరణ రహస్యం.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి,
విశాఖ శారదాపీఠాధిపతి,
ఫోన్‌ : 9966669658

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.