|
వ్యంగ్య చిత్రాలను నాలుగు దశాబ్దాలుగా వేస్తూ నవ్వులు పువ్వులు పూయిస్తున్న ఏకైక తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు రాగతి పండరి. మొక్కవోని ధైర్యంతో, జీవితాన్ని ఓ సవాలుగా తీసుకుని వేలాది కార్టూన్లు సృష్టించిన అలుపెరుగని ఆ నవ్వుల రారాణి గురువారం మరణించారు. గతంలో
ఆమె నవ్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలు.. 1965 జూలై 22 న నేను పుట్టాను. పుట్టిన యేడాదికే పోలియో బారన పడటం, ఆ తర్వాత రెండేళ్ళకు నాన్నగారి మరణం నా చిన్ననాట జరిగిన రెండు విషాదాలు. నాన్న నాకు పెట్టిన పేరు పండరీబాయి. ఇంట్లో అందరూ నన్ను ‘చిట్టి’ అని పిలుస్తారు.ఆరేళ్ళ వయసులో నా కాళ్ళకు శస్త్ర చికిత్స జరిగింది. ఆరునెలల్లో కాలీపర్స్ సాయంతో ఇంట్లోనే నడవడం, ట్యూషన్స్ ద్వారా చదవడం ప్రారంభించాను. తోబుట్టువులు బడికి వెళ్ళిపోతే ఇంట్లో అమ్మా నేనూ మిగిలేవాళ్ళం. వంటయ్యాక అమ్మ కథలు చదివి వినిపించేది. తీరిక వేళల్లో రెండో అక్క చదువు చెప్పేది. ఆ రోజుల్లోనే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ తదితర పత్రికలు చూసే దాన్ని. వాటిల్లో ఎక్కువగా జయదేవ్ గారి కార్టూన్లు నన్ను ఆకర్షించేవి. అప్పుడే, నేనూ కార్టూన్లు వేసి పదిమందినీ నవ్వించాలన్న కోరిక పుట్టింది. ఎనిమిదేళ్ళ వయసుకే తొలి కార్టూను వచ్చీరాని ఊహలతో వంకర టింకర బొమ్మలతో చిత్తుకాగితాల మీద జయదేవ్ గారిని అనుకరిస్తూ బొమ్మలు వేసేదాన్ని. వాటిల్లో నాకు నచ్చిన వాటిని డ్రాయింగ్ పేపర్ ముక్కల మీద ఇండియన్ ఇంక్ తో వేసి పత్రికలకు పంపేదాన్ని. చాలా కార్టూన్లు తిరిగి వచ్చేవి. అలా పంపగా, పంపగా ఆంధ్రజ్యోతి వీక్లీ లో నా తొలి కార్టూను అచ్చయింది. అప్పటికి నా వయసు ఎనిమిదేళ్ళు. నా కార్టూనుకు ఆంధ్రజ్యోతి వీక్లీ వారు పంపిన పారితోషికం నాలుగు రూపాయలు. అదే నా తొలి పారితోషికం. పోస్టుమేన్ రిసీవ్డ్ ఫోర్ రూపీస్ అని రాసి సంతకం పెట్టమన్నాడు. కార్టూను పడితే పత్రికల వాళ్ళు డబ్బులు పంపుతారని నాకు అప్పటికి తెలియదు. ఆ సంతోషంతో రిసీవ్డ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని రాశాను. పోస్ట్‌మేన్ కోపంతో అది కొట్టించేసి మళ్ళీ సరిగ్గా రాయించాడు. అదే నా మొదటి ధర్మార్జితం. ఆ సంఘటన ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాకు నవ్వు ఆగదు. ఒళ్ళు పులకరిస్తుంది. ప్రతిభా సత్కారం కళాకారులకు అవార్డులు అందుకునేటప్పుడు మధురానుభూతులు కలగడం సహజం. అలాంటి సందర్భం నాకు 1991 గణతంత్ర దినోత్సవం నాడు వచ్చింది. మైదానంలో పోలీసు విన్యాసాలు, పతాక ఆవిష్కరణ తర్వాత ప్రతిభా పురస్కారం అందుకునేందుకు క్రచర్స్ తో నడిచి వెళ్తుంటే అందరి చూపులూ నా మీదే. ‘ఈ అమ్మాయా రాగతి పండరి, పత్రికల్లో నవ్వించే ఈమె ఈ స్థితిలో ఉందా?’ అనే మాటలు ప్రేక్షకుల నుండి వినిపించాయి. ఆ సానుభూతి చాలా ఇబ్బందిగా అనిపించింది. మొదటిసారిగా తెలుగు కార్టూనిస్టులను మన ప్రభుత్వం గుర్తించింది. 2009 వ సంవత్సరంలో రాష్ట్ర సాంస్కృతిక మండలి కళారత్న (హంస) పురస్కారానికి తొట్టతొలిగా నన్నే ఎంపిక చేసింది. ఇది కార్టూనిస్టుల అందరి విజయం. (అ)మృత దేహ దానం నా మరణానంతరం నా పార్థివ దేహాన్ని ఆంధ్రప్రదేశ్ బాడీ డోనర్స్ అసోసియేషన్‌కు చెందేలా దానం చేశాను. శ్రీమతి గూడూరు సీతామహాలక్షి ్మగారి ఆధ్యర్యంలో సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు ఈ అసోసియేషన్‌ను నిర్వహిస్తోంది. మాస్టారు అవసరాల రామకృష్ణారావుగారు ఇందుకు స్ఫూర్తి. కనిపించే దేవుళ్ళు వైద్యులు. వారి ద్వారా ఏ కొందరికైనా నా పార్థివ దేహం ఉపయోగపడితే నా జన్మ సార్థకం అవుతుంది. ఈ నిర్ణయానికి తమ అంగీకారాన్ని తెలియజేసి సంతకం చేసిన నా కుటుంబ సభ్యులకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలను? ఆనంద బాష్పాలు తప్ప… |