గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –

146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad)

జననం –విద్య-

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కోడి తాడిపర్రు జమ్మల మడక వారి ఆగ్రహం . అందులో జమ్మల మడక వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి హనుమాయమ్మ  దంపతులకు మాధవ రామ శర్మ గారు 13-4- 1907 న జన్మించారు .తాతగారు రామయ్య గారి దగ్గరే వెలి బూడిద లో అక్షరాలు  దిద్దారు .తల్లిదగ్గర పన్నెండో ఏడు వచ్చేదాకా పాలు తాగారు .అదే తన కంఠ స్వర వరం అన్నారు .ఉపనయనం తర్వాత తాతగారి వద్దే సహస్ర గాయత్రి జపించి రామ హృదయం నేర్చారు .తండ్రి ‘’తాడి పర్రు శాస్త్రులుగా ,సాహితీ చక్రవర్తులు’’ గా పేరుపొందారు .వీరివద్ద సంస్కృతం అధ్యయనం చేసి పొలం పనులు చేయటం  అలవాటు చేసుకొన్నారు .ఇసుకలో చెడుగుడు ఆడుతుంటే ‘’స్పటిక వినాయకుడు ‘’దొరికితే బుద్ధి మార్చుకొని  చదువు పై  శ్రద్ధ వహించారు .దీన్ని తర్వాత పూజా మందిరం లో ప్రతిష్టించి నిత్యార్చన చేసేవారు .పాలేళ్ళకు పూరిపాకలో ఆముద దీపాల వెలుగులో చదువు నేర్పేవారు .

ఇంగ్లీష్ నేర్వడం –చదువు కు స్వస్తి –అధ్యయన అధ్యాపనం

మొదటి ప్రపంచ యుద్ధం అయిపోగానే తురుమెళ్ళ జార్జి కరోనేషన్ స్కూల్ లో మూడవ తరగతి చదివి ఇంగ్లీష్అక్షరాలూ నేర్చుకొన్నారు .స్కూలులో  నాటకంలో ‘’ఉపానందుడు’’ పాత్ర ధరించి మద్రాస్ మంత్రి పాత్రో చేతులమీదుగా సిరా బుడ్డి ,పుస్తకం బహుమానం గా పొందారు .లెక్కలలో పూజ్యం .తిలక్ మరణం తో విద్యార్ధుల సమ్మే జరిగి చదువుకు స్వస్తి చెప్పారు .తాతగారి దగ్గర ఒంటరిగా కావ్యాలు గ్రంధాలు నేర్చారు .అలంకార శాస్త్రాలన్నీ కరతలామలకలై నాయి .వాటిలోని పద్యాలూ శ్లోకాలు అన్నీ  కంఠతా వచ్చేశాయి .పుస్తకం అక్కరలేక పోయేది .తెనాలి సంస్కృత కళాశాల న్యాయ శాస్త్రాధ్యాపకులు శ్రీ కురుగంటి శ్రీ రామ మూర్తి గారు మాధవ రామ శర్మగారి వద్ద తర్క ప్రకరణ గ్రంధాలు చదివారు అంటే వీరి విద్వత్ యెంత గొప్పదో తెలుస్తోంది .కాశీ విద్యాకేంద్రం అని తెలిసి అక్కడ చదవాలని ఎవరికీ చెప్పకుండా వెళ్లి దశాశ్వ మేధ ఘాట్ లో సావిత్రీ జపం చేశారు .కాని తలిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళారు .ఇలా కాశీ చదువు సాగలేదు .

భావ వేగి

భావ వేగి అయిన శర్మగారు ఇంటి పట్టున ఉండక విద్యాకేంద్రం విజయ నగరం  తాతా సుబ్బారాయ శాస్త్రి గారనే రాయడు శాస్త్రి గారి వద్ద శాస్త్రాలు నేర్వాలని వెళ్లి రాజా గారి సంస్కృత కళాశాలలో చేరి ‘’సాహిత్య విద్యా ప్రవీణ ‘’చదివి ఉత్తీర్ణులై ,తర్కం నేర్వాలనుకోన్నరుకాని సాహిత్యం అభ్యసించారు. రాయడు శాస్త్రి గారి అంతేవాసులై సకల శాస్త్రాలు నేర్చేశారు .రామ శాస్త్రి గారి వద్ద తర్కం ,గంటి సూర్య నారాయణ శాస్త్రి గారి దగ్గర మీ మాంస ,రామానుజ చార్యుల వద్ద శాస్త్ర దీపిక  నౌడూరి వెంకట శాస్త్రి ,కంభం పాటి రామ శాస్త్రి గారి నుండి వ్యాకరణం నేర్చారు .అలంకార కౌస్తుభం ,వక్రోక్తి జీవితం ,అభినవ భారతి పై పట్టుసాధిం చారు .రాయడు శాస్త్రి గారి వద్ద ఉన్నప్పుడే మాధవ రామ శర్మ మాధవ ‘’రాయ’’ శర్మ అయ్యారు .

ఉద్యోగం

జీతం తీసుకోకుండా పన్నెండేళ్ళు తెనాలి సంస్కృత కళాశాలలో సాహిత్యాలంకార భాష శాస్త్ర అధ్యాపడుగా ,ఉపాధ్యక్షుడు ,ప్రిన్సిపాల్ గా సేవలందించిన మహోన్నత మూర్తి .ఈ బోధన వల్లనే తనకు గ్రంధాలు రాసే భావ వ్యూహం కలిగిందన్నారు .తర్వాత నెల్లూరు వేదం సంస్కృత కళాశాలలో ‘’సర్వాధ్యక్షులు ‘’గా పని చేశారు .పిమ్మట గుంటూరు  క్రైస్తవ కళాశాలలో సంస్కృతాంధ్ర  భాషాధ్యాపకుడుగా ఉన్నారు .అక్కడ రిటైరై కే .వి .కే .సంస్కృత కాలేజి లో అయిదేళ్ళు పని చేశారు ,నాగార్జున యూని వర్సిటిలో తెలుగు విభాగం లో ఉద్యోగించారు .

వివాహం –సంతానం

శర్మగారు వేదాంతం వారి ఆడబడుచుశ్రీమతి  కామాక్షీ హైమవతి ని  వివాహమాడారు. వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలిగారు .రెండవ కుమారునికి భావ భూతి శర్మ అని నామకరణం చేసి ఆ మహా కవిపై తనకున్న భక్తీ తాత్పర్యాలను చాటుకొన్నారు .అయిదవ కాన్పు సమయం లో శర్మ గారి భార్య చనిపోయారు .అప్పటినుండి పిల్లలకు తానే తల్లి అయ్యారు శర్మగారు .

గ్రంధ రచన

శర్మ గారు సంస్కృతాంధ్రాలలో 29గ్రంధాలు రచించారు .వారికి వాల్మీకి ,కాళిదాసు  భవభూతి ,అభినవ గుప్తుడు ,క్షేమేంద్రుడు అభిమాన రచయితలు .జగద్గురు శ్రీ కళ్యానంద భారతీ మహా స్వామి వారి చేత మంత్ర విద్యా దీక్ష స్వీకరించారు . ఆ సంస్కారమే  తన రచనా వ్యాసంగానికి దోహదం చేసిందని తెలియ జేశారు .  సంస్కృతం  లో శర్మగారు ఆనంద వర్ధనుని ధ్వన్యాలోక అలంకార శాస్త్రానికి సంగ్రహ సంస్కృత రచన ‘’ధ్వని సారం ‘’ రాశారు . దీక్షా గురువులైన శ్రీ కళ్యానంద భారతీ స్తుతిగా ‘’కళ్యాణ భారతి ‘’రాశారు .శర్మగారికి పుట్టపర్తి సత్య సాయి బాబా అంటే అమితాభిమానం సంస్కృతం లో ‘’సత్య సాయి పురాణం ‘’గా నలభై వేల శ్లోకాల తో సర్వ పురాణ సారం గా రచించారు . తెలుగులో మంత్రం శాస్త్ర గ్రంధం గా శ్రీ ,జగన్నాధ పండిత రాయని రసగంగాధరానికి వ్యాకహారికాంధ్ర భాషా వివరం గా ‘’నవ రస గంగాధరం ‘’,విద్యానాధుని ప్రతాప రుద్రీయానికి’’ఆంద్ర ప్రతాప రుద్రీయం ,ముమ్మటుని కావ్య ప్రకాశానికి ప్రామాణికాలైన పది వ్యాఖ్యానాల సారం గా ‘’కావ్య ప్రకాశం ‘’,రుయ్యకుని అలంకార సర్వస్వానికి ‘’అలంకార సూత్రం ‘’,భరతుని నాట్య శాస్త్రానికి వ్యాఖ్యానం గా ‘’నాట్య వేదం ‘’,క్షేమేంద్రుని రచనకు ‘’ఔచిత్య విచార చర్చ ‘’కుంతకుని గ్రంధానికి అనువాదం గా ‘’వక్రోక్తి జీవితం ‘’,భగవద్గీత ఆరు వేల శ్లోకాలకు వ్యాఖ్యానం ,మహా భారతాన్ని ధర్మ శాస్త్రం గా నిరూపిస్తూ ‘’శ్రీమన్మహా భారతం –ధర్మ శాస్త్రం ‘’మొదలైనవి రచించారు .ఇంకా కొన్ని గ్రంధాలు ముద్రించాల్సినవి ఉన్నాయి .’’సాహిత్యం అంటే సర్వ పురుషార్ధ సాధనం గా రసభావ స్పురణ ,తత్పర్యవసానమూ ఉండాలి ‘’అని శర్మ గారి అభిప్రాయం .

పుట్టపర్తి నారాయణాచార్యులు ,విశ్వనాధ సత్య నారాయణ గారల రచనలంటే శర్మ గారికి యెనలేని అభిమానం వారంటే ఆరాధనా భావమూ .

ఆధ్యాత్మిక జీవనం

నిత్య సంధ్యావందనం ,ధ్యానం ,మంత్రజపం చేసేవారు .ఇలవేల్పు అయిన శ్రీ లలితా పర భట్టారిక సహస్ర నామ రహస్యాలను బోధించేవారు .ఫాల భాగం లో భస్మం ,గంధం ,కుంకుమ ధరించేవారు .శర్మ గారి ప్రత్యేకత క్రాపుతో పాటు ‘’పిలక ‘’ఉండటం .ధోవతి ,దానికి అందమైన కుచ్చెళ్ల తో ప్రత్యేకంగా దర్శన మిచ్చేవారు .ఉత్తరీయ కప్పుకొంటే మహా రాజ ఠీవి జ్యోతక మయ్యేది .కంచి పరమాచార్య వారరి కటాక్షం పొందారు .శృంగేరీ స్వాముల వారి ఆశీస్సు లందుకొన్నారు సత్య సాయి కి ప్రీతి పాత్రులయ్యారు .తను సేకరించిన అయిదు వేల అపూర్వ గ్రంధాలను సత్య సాయి కాలేజి లైబ్రరీకి బహూక రించారు .భద్రాద్రి లో శ్రీరామనవమి కల్యాణం రోజున ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు .’’నారాయణి నమోస్తుతే ‘’అనే మాట తరచుగా వాడేవారు .

భువన విజయ సృష్టికర్త

మాధవ రామ శర్మ గారే  శ్రీ కృష్ణ దేవరాయల భువన విజయం కు ద్రష్ట ,స్రష్ట .తిమ్మరుసు పాత్ర ధరించేవారు .దాని రూపకర్త శర్మ గారే .ఏ సి కాలేజిలో మొదటి సారి దాన్ని ప్రదర్శించారు .విశ్వనాధ ,గడియారం పుట్టపర్తి మధునా పంతుల వంటి సాహితీ దిగ్గజాలు పాల్గొన్న సభ అది .

సభలూ సమావేశాలు

‘’ శర్మ గారు మహా వక్త. అనర్గళం గా ఏ విషయం పైన నైనా మాట్లాడేవారు .ముందు సంస్కృతం లో  ధారాళం గా ప్రసంగించి తర్వాతే తెలుగులో మాట్లేడేవారు .అ౦తటి గీర్వాణ భాషాభిమానం వారిది .శర్మగారిది ‘’కంచు కంఠం’’.ఆ నాడు ‘’జకార త్రయం ‘’అని పిలువ బడే ఉద్దండ మహోపన్యాసకులు శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మ శ్రీ జటావల్లభుల పురుషోత్తం ,శ్రీ జొన్నల గడ్డ సత్యనారాయణ మూర్తి గార్లు .ఆస్థానకవి శ్రీ కాశీ క్రిష్ణాచార్య వారి 90వ జన్మ దినోత్సవం నాడు శర్మగారి ఆధ్వర్యం లో గుంటూరులో ‘’సంస్కృత సామ్రాజ్యం’’అనే అపురూప సభ నిర్వహించారు. ప్రత్యెక సంచిక తెచ్చారు .

బిరుదులు –సత్కారాలు

మాధవ రామ శర్మ గారి మహా విద్వత్తు కు అంతే స్థాయిలో 18బిరుదులూ లభించాయి .అదేరీతిలో  సత్కార సన్మాన పురస్కారాలు పొందారు .వీరి బిరుదులలో మహోపాధ్యాయ ,దర్శనాచార్య ,లాక్షణిక సామ్రాట్ ,శాస్త్ర విశారద ,సాహిత్య సామ్రాట్ ,అభినవానంద వర్ధన ,రస జగన్నాధ ,నవ విద్యానాద ,సాహిత్య వాచస్పతి ,ధర్మ విద్యా ప్రవీణ ,సంస్కృత విద్యా భూషణ మచ్చుకు కొన్ని మాత్త్రమే .

నాగార్జున విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ,డి లిట్ ఇచ్చి గౌరవించింది .అన్నవరం శ్రీ సత్య నారాయణ స్వామి దేవస్థానం వార్షికం ఇచ్చి  సమ్మానించేది .ఆలిండియా ఓరియంటల్ కాన్ఫ రెన్స్ లో ప్రతినిధి గ పాల్గొన్నారు .నవ ద్వీపం లో  గౌడీయ మఠం తరఫున పాల్గొని సంస్కృతం లో గంట సేపు ప్రసంగించి ఆనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి జ్యోతి బాసు నే ఆశ్చర్య చకితుల్ని చేసి ‘’భారత దేశం లో ఇంత అనర్గళం గా సంస్కృతం లో ఇంత సేపు ప్రసంగించే వ్యక్తీ ఉన్నారా?’’అని  అప్రతిభులను చేశారు .వీరికి వచ్చిన శాలువాలు సన్మాన పత్రాలకు లెక్కే లేదు .అనేక చోట్ల పల్లకీలో ఊరేగించారు .ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు . సత్య సాయి పెన్ను ,రిస్ట్ వాచీ  బహూకరించారు .కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ‘’సాహితీ మాధవం ‘’అనే  ప్రశంసా  పద్యం రాసి చివరలో ‘’అభినవానంద భరత ‘’భావార్ద్ర ‘’మధుర రస పధ విహారి  మాధవ రామ సూరి ‘’అని కీర్తించారు .సాహిత్య వాచస్పతి పండిత పరమేశ్వర ,సాహిత్య విద్యాధర శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మగారు ఎనభై ఒక్క ఏడాది సార్ధక జీవితం గడిపి గీర్వాణ భాషా సేవలో పునీతులై  13-7-1988 న ‘’మాధవ సదనం ‘’చేరుకొన్నారు .

అధారం – శర్మ గారి శత జయంతికి(2007)కుమారుడు శ్రీ జమ్మల మడక భవ భూతి శర్మ రచించిప్రచురించిన  పుస్తకం . ‘’మా నాన్న –జమ్మల మడక మాధవ రామ శర్మ ‘’ .Inline image 1

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ – 19-2-15-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

1 Response to గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad)

 1. చల్లా రామలింగశర్మ says:

  అయ్యా!
  .
  మీసాహితీ సేవ మిక్కిలి అభినందనీయము. ఆనందదాయకము.

  శ్రీ జమ్ములమడక మాధవరాయశర్మ గారి గురించి మీ రు రూపొందించిన వ్యాసమును, పదిమంది మిత్రులతో ఫేస్ బుక్ ద్వారా పంచుకునెందుకు మీ అనుమతి కొరుతున్నాను.

  నమస్కారములు

  చల్లా రామలింగశర్మ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.