నా దారి తీరు -91
కొత్త వొరవడి
సెకండరీ గ్రేడ్ మాస్టారు బ్రహ్మానందం ,హిందీ శంకరరావు గార్ల చొరవ తో కార్తీక వనభోజనం ఒక మామిడి తోటలో ఏర్పాటు చేయించాను .స్టాఫ్ అందరూ వచ్చారు .ఏర్పాట్లన్నీ బ్రహ్మానందం దగ్గరుండి స్వయం గా చూశాడు .ఆ స్కూల్ చరిత్రలో ఇది రికార్డ్ .
టెన్త్ పరీక్షలు
టెన్త్ క్లాస్ పరీక్షలకు వత్సవాయి హైస్కూల్ కేంద్రం గా ఉంది . ఆ సంవత్సరం లోనే క్వేస్చిన్ పేపర్లను పోలీసు స్టేషన్ లో ఇనప పెట్టెలో భద్రం చేసి ,ఏ రోజుకారోజు తెచ్చు స్కూల్ కు తెచ్చుకొని పరీక్ష నిర్వహించాలి .విపరీతం గా పేపర్లు ముందే లీక్ అవుతున్నాయని సెంటర్ హెడ్ మాస్టర్లె ‘’లీకు వీరులు’’ అని భావించి చేసిన పకడ్బందీ ఏర్పాటు ఇది .ఆ సంవత్సరమే పోలీస్ స్టేషన్ వత్సవాయికి వచ్చింది .అదీ స్కూలుకు ఎదురుగానే .కనుక ఇబ్బంది లేదు .అలాగే పేపర్లు తెచ్చి పరీక్షలు జరిపాం. చాలా పకడ్బందీ గా పరీక్షలు నిర్వహించాం కాపీలు కొట్టనివ్వలేదు .
ఇన్స్పెక్షన్
కాంగ్రెస్ మంత్రి జానారెడ్డి మేనల్లుడు శ్రీ వీరభద్రా రెడ్డి విజయవాడ డివిజన్ గజెటెడ్ ఇన్స్పెక్టర్ గా వచ్చారు .చాలా స్ట్రిక్ట్ అని వెళ్ళిన స్కూల్ లో అరుపులు కేకలతో భయపెడుతున్నారని నిర్మోహ మాటం గా ఉంటున్నారని పుకార్లు షికార్లు చేశాయి .ఆయన పెనుగంచిప్రోలులో ఇన్స్పెక్షన్ కు వచ్చారని తెలిసి నేను సైన్స్ మాస్టర్ అప్పారావు కలిసి ఆయన స్కూటర్ మీద పెనుగంచి ప్రోలుకు వెళ్లి కలిసి మా స్కూల్ కు కూడా త్వరలో ఇన్స్పెక్షన్ కు రమ్మని ఆహ్వానించాను .ఆయన ఆశ్చర్య పడ్డారు నా చొరవకి . పేనల్ ఇన్స్పెక్షన్ జరపటం అనేది అప్పటి అలవాటు. అంటే అన్ని సబ్జెక్టులు ఇన్స్పెక్టర్ చూడలేడు కనుక దగ్గర స్కూల్స్ నుంచి సబ్జెక్ట్ లో సీనియర్ టీచర్ లను పేనల్ ఇన్స్పెక్షన్ కు ఆహ్వానించి ఇన్స్పెక్టర్ తనకిష్టమైన ఏదో ఒక సబ్జెక్ట్ ను హెడ్ మాస్టారు చెప్పెక్లాసును ఇన్స్పెక్ట్ చేయటమే పీనల్ ఇన్స్పెక్షన్ .పెద్ద స్కూలు కనుక రెండు రోజుల పైనే పడుతుంది .ఆయన రెండు సార్లు డేట్ ఇచ్చి రాలేదు .మూడో సారి నేనే నేను పిలిచిన సబ్జెక్ట్ టీచర్స్ చేత పీనల్ ఇన్స్పెక్షన్ పూర్తీ చేయించి ,ఆయన కోసం ఎదురు చూశాను .ఆయన గుమాస్తాతో వచ్చి స్కూలువాతావరణం ,నిర్వహణ చాలా బాగా ఉందనిమెచ్చుకొన్నారు .మంచి భోజనం ఏర్పాటు చేశాం స్టాఫ్ తరఫున .ఆయన గుమాస్తా పీనల్ టీచర్లూ మా స్టాఫ్ అందరు కలిసి విందు చేశాం .రిమార్కులు కూడా చాలా ఫేవరబుల్ గా రాశారాయన .’’ఉగ్ర వీరభద్రం ‘’గా రంకె లేస్తాడేమో అనుకొంటే అదేదో సినిమాలో రేలంగి లా ‘’ఒట్టివీరబద్రం ‘’లా శాంతంగా తనిఖీ జరిపి అందరిని ఆశ్చర్య పరచారు .స్కూల్ పైనా నాపైనా గుడ్ ఇంప్రెషన్ కలిగి ఉండటం మొదటి సారిగా నేను హెడ్ మాస్టర్ అయి పొందిన ప్రశంస నాకు ప్రోత్సాహాన్నిచ్చింది .ఆయనా చాలా స్కూళ్ళకు చెప్పకుండా వెళ్లి అక్కడ పరిస్తితుల్ని చూసి వీరంగం వేసే వాడట .ఆ సీన్ కు అవకాశం లేకుండా చేశాం .ఇది స్టాఫ్ సమష్టి సహకారమే నా గొప్పకాదు .అందర్నీ కలుపుకు పోవటమే ఈ విజయానికి హేతువు .ఇన్స్పెక్షన్ జరిగినా స్కూల్ కు రాము అని భీష్మిన్చుకొన్న తెలుగు మేస్టర్ని, భార్య సోషల్ టీచర్ని స్టాఫ్ సెక్రటరీ తో ఇంటికి పంపించి నచ్చ చెప్పించి వారినీ హాజరయ్యేట్లు చేయగలిగాను .అప్పుడు అర్ధం చేసుకొన్నారు వాళ్ళిద్దరూ వారికి ఇది యెంత మేలు చేసిందో .వారి ఆరోగ్య విషయం ముందే ఇన్స్పెక్టర్ గారికి చెప్పి ,ఆయనకాకుండా పేనల్ టీచర్ల తో వారిద్దరికీ తనిఖీ చేయించి వాళ్ళను బయట పడేశాను .
ఏడవ తరగతి పరీక్షలు
ఏడవ తరగతి పరీక్షలు కూడా హెడ్ మాస్టారి ఆధ్వర్యం లో జరపాలి. అవి వార్షిక పరీక్షలకంటే ముందే జరుగుతాయి పేపర్లు జగ్గయ్య పేట హైస్కూల్ నుంచి తెచ్చుకోవాలి .లెక్కల మేష్టారు రమణయ్య తో పేపర్లు తెప్పించి ,నిర్వహించాను వీటినీ పకడ్బందీగా నే జరిపాను .మా స్కూల్ తో పాటు రెండు మూడు అప్పర్ ప్రిమరీస్కూల్ పిల్లలూ మా సెంటర్లో రాస్తారు .వారందరి నామినల్ రోల్స్ నాలుగుకాపీలు తయారు చేయించటం తెప్పించటం డి ఇ వొ ఆఫీస్ లో అందజేయటం జరగాలి అన్నీ యదా ప్రకారం చేశాను .
వార్షిక పరీక్షలు –వార్షికోత్సవం
వార్షిక పరీక్షలు కూడా పద్ధతిప్రకారమే జరిపాను .సబ్జెక్ట్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారి పేర్లను తయారు చేయించి వారందరికీ బహుమతులు ఇప్పించాను .వ్యాసరచన వక్తృత్వం పోటీలు జరిపి బహుమతులిచ్చాం .స్కూల్ బెస్ట్ స్టూడెంట్ పై తరగతులలో ఒకరిని కింది తరగతులలో ఒకరిని ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులిచ్చాం .
సినిమాలు
వత్సవాయి మెయిన్ రోడ్డు మీద ఒక డాక్టర్ గారు ఉండే వారు .క్లినిక్ కూడా ఉండేది . అయన తండ్రికూడాడాక్టరు. ఈయనతో బాగా మంచి పరిచయం ఆచార్యుల గారి వలన కలిగింది .తరచుగా వారింటికి సాయంకాలం వెళ్లి కబుర్లు చెప్పుకొనే వాళ్ళం. చాలా సహ్రుదయులాయన పేరు మర్చిపోయాను .నేనూ క్రాఫ్ట్ మాస్టారు ఆచార్యులు బోనకాల్ వెళ్లి సినిమాలు చూసి వచ్చేవాళ్ళం. సైకిల్ మీద వెళ్లి వచ్చేవాళ్ళం .ఈప్రాంతం అంతా పెసర పంట బాగా పండేది .రోడ్డుమీదే వేసి నూర్చేవారు. ఆ వాసన బలే తమాషాగా ఉండేది .
ఆటలు
గ్రౌండ్ లో పల్లేరుకాయలు బాగా ఉండేవి .వాటినన్నిటిని పిల్లలతో తీయించి శుభ్రం చేసి బాడ్మి౦ టన్ వాలీ బాల కోర్టు లు వేయించి ఆదడిన్చేవాళ్ళం. స్టాఫ్ తో నేనూ ఆదేవాడిని .క్రాఫ్ట్ మాస్టారు ‘’పుర్ర చెయ్యి వాటం ‘’బాగా ఆడేవాడు కట్స్ బాగా కొట్టేవాడు .పంచ కట్టి మరీ ఆడేవాడు .కట్టు పైకి ఎగదీసి కట్టేవాడు .వాలీబాల్ లో ను మంచి నైపుణ్యం చూపేవాడు మంచి సర్వీస్ హాండ్ కూడా’ గిన్గర్లు తిరిగేట్లు బాల్ సర్వీస్ చేసేవాడు .ఆచార్యులు ,సైన్స్ అప్పారావు ,నేను ,లెక్కల రమణయ్య ,బ్రహ్మానందం బాగా అడే బాచ్ .చీకటి పడేదాకా ఆడి ఇంటికి వెళ్ళేవాళ్ళం .ఇదొక గొప్ప రిక్రియేషన్ .
గ్రామ పంచాయితీ ఎన్నికలు అప్పుడే వచ్చిన జ్ఞాపకం .నాకు కొండూరు డ్యూటీ వేశారు .అక్కడ కారణం కం ప్రెసిడెంట్ అయిన బ్రాహ్మణుల ఇంట్లోనే ఉన్నాను .ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అంతటి మంచిపేరున్న మనిషి ఆయన .ఆయన మనుషులే ఎన్నికైనట్లు గుర్తు .
ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయ పునః ప్రతిస్టా కార్య క్రమం
పదేళ్ళ క్రితం మా ఆంజనేయ స్వామి దేవాలయం పునః ప్రతిష్ట చేయాలని సంకల్పించి మీటింగులు వేసి చర్చించి విరాళాలు ఇచ్చిన వారికి రాసీదులిచ్చి వచ్చిన డబ్బు పదిహేను వందల రూపాయలను ఉయ్యూరు స్టేట్ బాంక్ లో నా పేరా మండా వీరభద్ర రావు పేరా జాయింట్ అకౌంట్ లో వేశాం.ఆ తర్వాత అడుగు కదలలేదు . గుడి దగ్గర పుల్లేరు కాలువపై వంతెన పడింది .జనం లో చురుకుదనం వచ్చింది. పదేళ్ళ తర్వాత మళ్ళీ విష్ణ్వా లయం లో పెద్దల్ని పిలిచి మీటింగ్ వేస్తె ఈ సారి స్పందన బాగా వచ్చింది .పదేళ్ళ క్రితం పెద్ద విరాళం నూట పదహారు రూపాయలు అయితే ఈసారి ఎవరికి వారు వెయ్యి నూట పదహార్లు ఇచ్చారు .నేనూవీరభాద్రరావు శ్రీ లంకా స౦జీవరావు గారు కలిసి తిరిగాము. వాగ్దానాలు వెల్లువలా రావటమేకాడు నేరవేర్చారుకూడా .దానితో వేడి బాగానే పుట్టి బందరు వెళ్లి శ్రీ వేదాంతం అనంత పద్మ నాభాచార్యుల వారి వద్ద ఆలయం పడగట్టటానికి ముహూర్తం పెట్టించి ఆ రోజే పని మొదలు పెట్టి ,విగ్రహాలను విష్ణ్వాలయం లో ఉంచి ఆలయ నిర్మాణం మొదలు పెట్టాం . దీనికోసం అప్పుడప్పుడు ఎరండ్ లీవ్ కాని హాఫ్ ఏవరేజ్ లీవ్ కాని పెట్టాల్సి వచ్చేది .ఆదివారాలలో ఉయ్యూరు వెళ్లి పనులు చూసి లూనాల మీద గ్రామాలు తిరిగి చందాలు వసూలు చేస్తూ వీరభద్ర రావు కు అందజేసి పనులు జరిపించేవాడిని .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-2-15- ఉయ్యూరు