వందేళ్ల ‘రజనీ’కాంతులు!

వందేళ్ల ‘రజనీ’కాంతులు!

  • 31/01/2015
TAGS:

అయిదేళ్ల చిరు ప్రాయంలోనే కల్యాణి రాగాన్ని అలవోకగా ఆలపించి అనతికాలంలోనే ఆయన స్వరలోకపు ‘సంగతుల’న్నీ ఔపోసన పట్టేశారు.. తన 18వ ఏట తొలి గీతాన్ని రాసి సొంతంగా బాణీ కట్టి ‘్భష్’ అనిపించుకున్నారు.. తొలినాళ్లలో చలనచిత్ర సీమవైపు మమకారం పెంచుకుని స్వర వైవిధ్యంతో అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు.. ఎన్నో చిత్రాలకు పాటలు రాసి, స్వరాలు సమకూర్చి సినీ సంగీతానికి దిశానిర్దేశనం చేశారు.. ఘంటసాల వంటి గాయకులను, సాలూరు రాజేశ్వర రావు, పెండ్యాల వంటి సంగీత దర్శకులను వెన్నుతట్టి ప్రోత్సహించారు.. ఎలాంటి ప్రచారాన్ని ఆశించకుండా ఇతరుల కోసం సినీ గీతాలు రాశారు, లాలిత్యపు సుగంధాలను అద్ది పాటను కొత్త పుంతలు తొక్కించారు.. ‘నాగరాజు’, ‘తారానాథ్’, ‘నళినీకాంత్’ వంటి అనేక పేర్లతో పాటలు రాసినా, తన స్వరాలు ఎందరికో పేరు తెచ్చినా ఆయన ఏనాడూ కీర్తిప్రతిష్ఠలను కోరుకోలేదు. ఓ రేడియో నాటకంలో పాటలకు తొలిసారి స్వరాలందించిన ఈ సృజనకారుడు ముందుగా సినీ రంగంలో, ఆ తర్వాత ‘ఆకాశవాణి’లో అద్భుతాలను సాధించారు.. అనేక కారణాలతో చలనచిత్ర సీమకు దూరమయ్యాక రేడియోలో వినూత్న ప్రయోగాలు చేసి కొత్త ఒరవడికి నాంది పలికారు. రాగాలకు మాధుర్యాన్ని రంగరించి లలిత సంగీతానికి ‘ఆకాశవాణి’లో ప్రాణప్రతిష్ఠ చేశారు..
లలిత సంగీతానికి పర్యాయపదంగా నిలిచిన ‘శత వసంతాల’ బాలాంత్రపు రజనీకాంతరావు అక్షరాలా స్వర మాంత్రికుడే..! లలిత సంగీతంలో విభిన్న శైలితో వినూత్న ఆవిష్కరణలు చేసిన ఆయన ఓ వాగ్గేయకారుడిగానే కాదు, ‘ఆకాశవాణి’లో భక్తిరంజని, ధర్మసందేహాలు, వనితావాణి వంటి కార్యక్రమాల రూపశిల్పి కూడా.. సినిమా, రేడియో, ప్రైవేటు రికార్డులు.. ఇలా విభిన్న రంగాల్లో ఆయన స్వరాలు ఏ తరం వారినైనా ఉర్రూతలూగిస్తాయి. బిఎన్ రెడ్డి నిర్మించిన ‘స్వర్గసీమ’లో భానుమతి ఆలపించిన ‘ఓహో పావురమా..’ పాటను రాసి అద్భుత సంగీతాన్ని అందించారు. అదే సినిమాలో ‘గృహమే కదా స్వర్గసీమ’, ‘హాయి సఖీ’, ‘ఎవరి రాకకై’ వంటి పాటలు ఆయన సృజనే. గోపీచంద్ నిర్మించిన ‘గృహప్రవేశం’లో ‘మేలుకోవే భారతనారీ..’ పాటతో అప్పట్లోనే స్ర్తివాదాన్ని రజనీ వినిపించారు. తాను రచించి స్వరపరచిన పాటలు ఎవరి పేరుమీదో ప్రచారం పొందినా ఆయన ‘శైలి’ మాత్రం ప్రస్ఫుటంగా కనిపించేది. 1920 జనవరి 29న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించి, అధిక మాసాలతో కలిపి నేడు నూరవ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనాలు…

మా పింగళి మాస్టారు…
‘సాహిత్య చరితలో జంటకవుల పంట
ఆంధ్రికి ప్రత్యేకమయిన దంట
ఆధునికాంధ్రాన ఆదికవుల జంట
తిరుపతి వేంకటేశ్వరుల దంట
మలికైతరీతుల తొలి పంట వేంకట
పార్వతీశ్వర కవిద్వయముదంట,
తొలకరి కైతల మలిపంట పింగళి,
కాటూరి కవి యుగ్మకమ్ము దంట
ఒక్క కవుల జంట నొకరికి పుత్రుడు
నొక్కజంటలోనే యొకరి శిష్యు
డగుట రెండు జంటలందున మిగిలిన
తండ్రి, గురుని భక్తిదలతునెపుడు’
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షతలో రిటైరై, విజయవాడ ఆకాశవాణిలో సాహిత్య కార్యక్రమ ప్రయోక్తగా ఉంటూండిన మా గురువుగారు పింగళి లక్ష్మీకాంతం గారికి 1967 జనవరిలో, నూజివీడులో ఆయన శిష్య బృందం చేసిన సన్మానంలో నేను రచించి చదివిన పద్యాలలో ఒకటి ఇది.

నెం.7 అరుళమ్మాళ్ వీధిలో..
నెంబర్ 7 అరుళమ్మాళ్ వీధిలో కొమ్మూరి వారి ఇంట్లో ఉండగా ఒక సంఘటన జ్ఞాపకం ఉంచుకోవలసినది జరిగింది. నా హోల్డాల్‌కి బెల్ట్ ఉంది కానీ ఆ బెల్ట్‌కి తాళం కప్ప ఏదీ ఉండేది కాదు. నా హోల్డాల్‌లో నా డైరీ.. నేను వ్రాసుకునే దినచర్య పుస్తకం ఉండేది. సాముద్రిక పుస్తకం ఒకటి చదివి, నా చేతిలో రేఖలకి నేనే ఒక రీడింగు ఆ డైరీలో వ్రాసుకున్నాను.
‘నా 20వ ఏడు పూర్తయేసరికి నా చదువు పూర్తయిపోతుంది. మా నాన్నకి ఇష్టం లేని- ఒక అమ్మాయితో నాకు ప్రణయం ఏర్పడి, ఆమెను పెండ్లి చేసుకోడానికి నిశ్చయించడం, మా నాన్నగారితో అభిప్రాయ భేదానికి దారి తీస్తుంది’ అని వ్రాసుకున్నాను నా డైరీలో.
హోల్డాల్ తాళం లేకుండా ఓపెన్‌గా తెరిచే ఉండడం చేత కృష్ణశాస్ర్తీ గారు నా డైరీ తీసి చదివారు. ‘ఇలా డైరీలో నీ ఇష్టం వచ్చినట్లు వ్రాసేసుకుని, ఇలా నలుగురాడపిల్లలూ వచ్చిపోతూ ఉండే హాలులో- నీ హోల్డాల్‌లో ఆ డైరీ పెట్టుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడికి వచ్చే పిల్లలలో ఎవరినో ఆ పంక్తులు ఆకర్షించాలనేనా? ’అని అడుగుతూ నన్ను దబాయించాడు.
నాకు కళ్లవెంబడి నీళ్లతో గొంతులో డగ్గుత్తికావచ్చి ఆయనతో ఇలా అన్నాను. ‘నేను నా డైరీ నా సొంతానికి వ్రాసుకున్నాను గాని, ఏ అమ్మాయిల మనస్సునీ ఆకర్షించడానికి కాదు. మా నాన్న గారికి గాని, ఇంట్లో ఎవరికి గాని చెప్పని నా హృదయ రహస్యం నీకు చెబుతున్నాను ఇప్పుడు. మా నాగరాజు బావ చెల్లాయమ్మా అని, మీరు పాపా అనీ పిల్చుకొనే సుభద్రని నేనూ, నన్ను సుభద్రా ఒకరికొకరం కోరుకున్నాం. ఈ సంగతి మీకే మొదటిసారి చెబుతున్నా. మా నాన్నగారికి ఆ విషయం ఇష్టం లేని సంగతి.. అని చేప్పే సరికి ఆయన కూడా కళ్లనీళ్లు తుడుచుకుంటూ ‘మా పాపని గురించా వ్రాసుకున్నావు డైరీలో..’ అన్నారు.
జపాన్ బాంబు..
1942లో మద్రాస్ మీద జపాన్ వాడి బాంబు పడటంతో ఆంధ్రతీర ప్రాం తాల వరకూ వచ్చిన అనేకమంది మద్రాస్‌లో ఉంటున్న తెలుగువాళ్లు తమ తమ ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లిపోయారు. (తాత్కాలికంగా) నే నూ పిఠాపురం చేరాను. రేడియోలో వ్యవసాయదారుల కు లేఖలు వ్రాసి చదువుతూంటే గోపీచంద్‌గారు నన్ను చూడ్డానికని పిఠాపురం వచ్చారు. కాంట్రాక్టు పద్ధతిపై వచ్చే డబ్బు పెంచితే బాగుండుననిపించి ఆ కాంట్రాక్టు అయ్యేట్టు, కాలవ్యవధి పెంచుతూ ఆదేశం వచ్చింది. 1943 నాటికి నా నెల జీతం వందరూపాయలయింది. ఐతే ఆ జీతం తీసికోకుండానే రేడియోలో ప్రభుత్వ అధికారి పదవి వచ్చింది. నల్లటి ‘ఆచ్‌ఖాన్’ కోటు (షేర్వానీ) సంపాదించి ఇంటర్వ్యూకి వెళ్లి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ఆగస్టు 15న సెలెక్ట్ అయ్యాను. నాలాగే వైఎస్ రావు (శ్రీవాత్సవ), ఎస్‌వి సుబ్బారావు (బుచ్చిబాబు)లకూ ఇటువంటి అపాయింట్‌మెంటు లభించింది. మొత్తం 10 మందిమి ఉద్యోగులమయ్యాము. 1944 మే 8న ఉద్యోగంలో చేరాను. ఎటొచ్చీ ఆ ‘వంద’ తీసికోలేదనే బెంగ ఉండిపోయింది. అయితే 175 రూపాయల జీతం! రేడియోలో అధికారిగా సోమవారం, బుధవారం పదిహేను నిమిషాలు, నెలకో గంట నాటకం, ప్రత్యేక హాస్యవల్లరి, చిత్రమయ జగత్, రోజూ గ్రామీణ కార్యక్రమం సరేసరి. వీటిని తయారు చేయడం నా పని. ఒకసారి ‘పాఠశాల సమయం’ కూడా నిర్వహించవలసి వచ్చింది.
‘ఇంట నుండ నేల…ఇటువంటి సందె వేళ
విహరింపగ రావేల రావేల..’- అంటూ పాటలు, ఇంటర్య్యూలు సాగేవి.
కృష్ణశాస్ర్తీ రాస్తే నేను ఆయన పాట పాడటం లేక నేనే రాసి ట్యూన్ చేసుకోవడం జరిగేది. ‘మీ పాపకు ఓ పాట’ అని నేరాసిన పాట ట్యూన్‌లతో కార్యక్రమం కన్నమ్మ గారి ఆధ్వర్యంలో సాగేది. ఇది వారానికి రెండు సార్లు ప్రసారం అయ్యేది. ఆటవిడుపు అనే కార్యక్రమం కోసం ‘రారే చిన్న పిల్లలార’ అంటూ టెడ్డీబేర్స్ పిక్నిక్ ట్యూన్‌లో సాగించి పాడించాను. ఈ పిల్లల కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు బాపు, ముళ్లపూడి రమణలు! అలా వారానికో పిల్లల బృందం పాల్గొనేది. నెలకోసారి జానపద గీతాల కార్యక్రమం ఏర్పాటు చేసి అరుదైన పాటలు సేకరించి ప్రసారం చేశాను. నన్ను పెంచిన మా అమ్మమ్మ దగ్గర పాత మంగళ గీతాలు సేకరించాను. అవి ప్రసారం అయితే విని సంతోషించారు మా అమ్మమ్మ. చుట్టూ చేరే పిల్లల్ని మా మనవడు నా పాటలు వినిపిస్తున్నాడంటూ వాళ్లకి పిఠాపురం పార్కులో రేడియో వినేలా చేసేదావిడ. నేను కాకినాడ నుంచి కలకత్తా- మద్రాస్‌కి కలిపే రైలు ఎక్కాను. సామర్లకోటకు మా నాన్నగారు వచ్చి సాగనంపారు. అలా మద్రాస్ తిరిగి చేరాను. అక్కడ రాయపేటలో నా కోసం ఓ రెండుగదుల మేడ ఇల్లు కుదిర్చారు దుర్గాబాయి గారూ మా అన్నయ్యానూ.
*

చిత్రం.. రజనీ 2012లో ‘ఆత్మకథా విభావరి’ పేరిట తన జీవిత విశేషాలను భావితరాల కోసం అందించారు. ఆ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలు యథాతథంగా…

శతవర్ష సౌందర్యగీతం వాణీ పుత్రుడు

  • -కె.బి.గోపాలం
  • 31/01/2015
TAGS:

‘కవి రాజహంస’ బాలాంత్రపు వేంకటరావు, వేంకట రమణమ్మ దంపతులకు 1920 జనవరి 29న నిడదవోలులో జన్మించిన రజనీ కాంతరావు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పాఠశాల విద్య పూర్తి చేశారు. కాకినాడ పిఆర్ కళాశాలలో హైస్కూల్ విద్య ముగించి, 1940లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బిఎ (ఆనర్స్) పూర్తి చేశారు. 1941లో ‘ఆకాశవాణి’ మద్రాసు కేంద్రంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1947 ఆగస్టు 15న తొలి స్వాతంత్య్ర దినం సందర్భంగా ‘మాదీ స్వతంత్ర దేశం’ గీతాన్ని ప్రముఖ గాయని టంగుటూరి సూర్యకుమారిచేత రేడియోలో పాడించిన ఘనత రజనీదే. విజయవాడ ఆకాశవాణిలో బాధ్యతలు చేపట్టాక ‘్భక్తిరంజని’ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అహ్మదాబాద్, విజయవాడల్లో స్టేషన్ డైరెక్టర్‌గా పనిచేసి అదే హోదాలో బెంగళూరులో పదవీ విరమణ చేశారు. ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలాన్ని రేడియోలో ఇంటర్వ్యూ చేసిన ఖ్యాతి రజనీకే దక్కింది. రేడియోలో అన్నమయ్య కీర్తనలను పరిచయం చేసిన గొప్పదనం ఆయనదే. సినీ రంగంలో కొన్నాళ్లు పనిచేశాక ఆకాశవాణి ద్వారా లలిత సంగీతానికి ఎనలేని కృషి చేశారు. భావకవి దేవులపల్లి చేత రేడియో కోసం మూడు యక్షగానాలను రాయించి ప్రసారం చేశారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం శాఖలో, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర కళాపీఠంలో సేవలందించారు. స్వరకర్తగానే కాదు, ఎనె్నన్నో లలిత గీతాలు, నృత్య రూపకాలు రచించి సాహితీ రంగానికీ వనె్న తెచ్చారు. 1961లో కేంద్ర సాహిత్య అవార్డును, 1981లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌ను, 2000లో ‘అప్పాజోస్యుల విష్ణ్భుట్ల ఫౌండేషన్’ (అమెరికా) పురస్కారాన్ని అందుకున్నారు.

రజనీకి నూరేళ్లు వచ్చాయని పండగ చేస్తున్నారు. వందేళ్లకు సంబంధించి లెక్క మనకు అవసరం లేదు. పండగ చేస్తున్నారంటే మాత్రం చాలా బాగుంది. ఒక వ్యక్తి అంతకాలం జీవించారంటేనే పండగ చేయాలి. ఆ వ్యక్తి గొప్పగా బతికి ప్రపంచానికి సంతోషం పంచిన వారయితే పండగ మరింత ఘనంగా చేయాలి. అదే జరుగుతున్నది. నాకు తెలిసి రజని ఈ సంగతులేవీ పట్టించుకోరు. అమాయకంగా తన ప్రపంచంలో తాను ఉంటారు.
ఇంతకు, ఎవరీ రజని అనే అడిగేవాళ్లుంటారేమో? ఆయన పేరు బాలాంత్రపు రజనీకాంతరావు! ఆయన వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరయిన బాలాంత్రపు వెంకటరావుగారి కుమారుడు. తండ్రి గొప్పవాడని ఇవాళ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొడుకు ఆయనంత గొప్పవాడూనూ. రజని గాయకుడు, గీత రచయిత, సంగీతకారుడు, సాహిత్యవేత్త, పరిశోధకుడు, ప్రయోక్త, ప్రయోగాలకు పెట్టింది పేరు. లలిత సంగీతం, లలిత శాస్ర్తియ సంగీతం విన్న, వినేవాళ్లకు ఆయన దేవుడే!
‘ఓహోహో.. పావురమా’ అని ఒక పాత పాట ఉంటుంది. అది ఈనాటికీ అందరూ ఇష్టంగా వింటూ ఉంటారు. అంటే అంత హిట్‌సాంగ్ అన్నమాట. చిత్రమేమంటే ఆ పాట రాసింది తానేనని రజని అని ఎక్కడా చెప్పరు. రికార్డుమీద నాటికీ, నేటికీ ఆయన పేరు లేదు. అదేమిటని అడిగితే అందంగా నవ్వుతాడు ముసలాయన! ఆయనను ముసలాయన అంటే పొరపాటు, పొరపాటున్నర! ఆమధ్యన ఒక కుటుంబ కార్యక్రమంలో చూస్తే రజని ముందువరుసలో ఉన్నాడు. అరవయి ఏళ్లు వస్తే ‘అస్తావిస్తు’ అని ఒక మాట ఉందని తెలుసు! వెళ్లి అనుమానంగా నమస్కారం చేసి, పేరు చెప్పుకుని, ‘గుర్తున్నానా?’ అని అడిగాను. ‘అదేమిటి గోపాల్! మనం ఎన్ని సంగతులు చర్చించుకున్నాం? ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం! ఆ ధృవుడు, 26 వేల సంవత్సరాల సంగతి నాకు ఇంకా గుర్తుంది!’ అంటూ సులభంగా కబుర్లలోకి దిగాడాయన. అక్కడ కనిపించకుండా జాగ్రత్తపడ్డాను కానీ, బిత్తరపోవడం నా వంతయింది! అదీ- రజని అంటే!
ప్రఖ్యాత నర్తకి శోభానాయుడు బృందం కొరకు ‘కళ్యాణ శ్రీనివాసం’ అని కొత్త ‘బాలే’ రాయించాలి. ననే్న రాయమన్నారు. నేను జంకాను. ‘రజని చేత రాయిద్దాం’ అన్నాను. నేను రాస్తానన్న నమ్మకంతోనో, మరో కారణంగానో, సంగీత దర్శకుడుగా కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావుగారిని నిర్ణయించి, ఆయనకు చెప్పేశారు కూడా. రజని రెండు వేపులా వాడిగల కత్తి మరి! పాట రాస్తుంటే, రాగం, వరుస కూడా అక్కడే సెటిల్ చేసేస్తాడు. రచన చేయడానికి ఒప్పుకున్నాడు. అందుకని టెంపొరరీగా కూచిపూడి అకాడమీలోనే ఉన్నాడు కూడా. నేనెంత అదృష్టవంతుడినో మరి. నిత్యం ఆయన దగ్గరకు పోవాలి. ఆనాడు రాసిన భాగం వినాలి. దాని గురించి చర్చించాలి. అవసరాలు వినిపించాలి. అది నా పని! రచన ఎంత గొప్పగా వచ్చిందో నేను చెప్పనవసరం లేదు. కానీ, పెద్దాయన ‘దక్షిణానిలాలు’ అంటూ ఫలానా రాగంలో పాట అంటూ ఏకంగా పాడడం ప్రారంభించాడు. ‘అయ్యా! అక్షరాలు మాత్రమే మన వంతు! రాగం సంగతి మరెవరికో అప్పగించారు’ అని మెత్తగా ప్రతినిత్యం గుర్తుచేయవలసి వచ్చేది. మహానుభావుడు గనుక, ఆయన ఏనాడూ నొచ్చుకోలేదు. ‘కదూ!’ అని ముందుకు సాగాడు. ఆ నృత్య నాటిక ఎంత బాగా వచ్చిందో, చూచినవాళ్ళు చెప్పుదురుగాక!
కొందరు కారణజన్ములుంటారు. రజని అలాంటివాడేనని గట్టి నమ్మకం. రజని పుట్టి రెండేళ్లు నిండకముందే అమ్మ చనిపోయింది. మహాకవి, పండితుడయిన తండ్రి ఈ బిడ్డను చంకనెత్తుకుని అన్నీ తానే అయ్యి పెంచాడు. గోరుముద్దలతోపాటు పద్యాలు తినిపించాడు. జోలపాటలతో బాటు సాహిత్యం తలకెక్కించాడు. అమ్మ ఏదీ? అని బిడ్డ అడిగితే, చుక్కల్లో ఉంది అని చెప్పేవారట ఆయన. అమ్మ పాడేది అని ‘నల్లనల్లని వాడే, నగుమోము వాడే’ అనే పాట వినిపించేవారట. రజనికి మేనత్తగారయిన నరసమ్మగారు అప్పట్లో ఒక మహిళా పత్రికకు సంపాదకురాలు. ఆమె బోధన కూడా జతకలిసి ‘నా మనసులో భక్తిరంజని ఆనాడే మొదలయింది’ అంటాడు రజని. ఆయన రాసిన పాట ‘శతపత్ర సుందరి’ ఇప్పటివాళ్ళు విన్నారో లేదో తెలియదు. నిండా సంస్కృతం. వింత నడక. పాట బాగుంది అనిపించింది గానీ, నిజం చెప్పాలంటే, కుర్రవాడయిన నాకు అర్థం కాలేదు. అది సరస్వతి అమ్మవారి గురించిన పాట అని తరువాత తెలిసింది. అంత జిగిపాకంగా పాటలు రాసి, వరుసలు కట్టిన రజని ‘బురదలోన పంది’ అంటూ సరదాగా నడిచే పిల్లల పాటలు కూడా రాశాడంటే ఆశ్చర్యం. ఆయనలోని వస్తు విస్తృతి గొప్పది!
రజనితో నాకు ఇంచుమించు స్నేహం కలిసిందంటే భుజాలు పొంగిపోతాయి. దేశాలం లేక దేవసాలగం అనే రాగం గురించి పరిశోధన చేస్తున్నాడాయన. ఫోన్‌లో నాకు ఆ రాగం, పాట వినిపించడం ఇంకా గుర్తుంది. ‘పొడిచెనదే శుక్రతార’ అంటూ గాంధీ గురించి రాసిన పాటను ఆ రాగంలోనే మలిచాడని గుర్తు! ధృవనక్షత్రం గురించి పరిశోధన చేసి ‘తూబన్’ అనే మధ్యప్రాచ్య పాత్ర ధృవుడేనని రజని చెప్పాడు. నాకు అర్థమయిన ఆస్ట్రానమీ సంగతులు, అతనికి అర్థమయే పద్ధతిలో చెప్పినట్టున్నాను. 26 వేల సంవత్సరాలు అని భాగవతంలో రెఫరెన్సు దొరికింది అంటూ ఆ విషయంగా తాను నాకు ఉత్తరం రాయడం గుర్తుంది. రజని చాలా గొప్ప పనులు, రచనలు చేశాడు. కానీ, అవి గొప్పవని ఆయన ఎన్నడూ అనుకోలేదు.
రజనీకాంతరావుగారు రేడియోలో స్టేషన్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేశాడు. పదవి నిర్వహించడమంటే ఆర్కెస్ట్రా, వాద్యగోష్ఠి నిర్వహించడం లాంటిదే. రకరకాల వారుంటారు. అందరినీ కలుపుతూ చక్కని రచన సృష్టించాలి, అన్నారాయన ఒకచోట. అక్కడా సంగీతమే తోచింది, ఆయనకు!
విజయవాడ రేడియోలో వీళ్లంతా ఉన్నకాలం.. అన్ని రకాలూ స్వర్ణయుగం. రజని ‘కొండనుంచి కడలిదాకా’ అని సంగీత రూపకం ప్రొడ్యూస్ చేశాడు. దానికి ఎనె్నన్నో బహుమతులు వచ్చాయి. అంతర్జాతీయంగా కూడా! గోదావరి పుష్కరాలొస్తున్నాయి. ఈ రూపకాన్ని తిరిగి పైకి తీస్తే బాగుంటుంది.
‘మనసవునే ఓ రాధా!’ అని ఒక పాట. ఆ కాలంలో శాస్ర్తియ గాయకులంతా లలిత సంగీతం కూడా పాడేవారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వోలేటి వేంకటేశ్వర్లు, యం.వి.రమణమూర్తి అందరూ ఈ పాట పాడారనుకుంటాను. ఘంటసాల కూడా పాడారేమో? రజని పాటలను గురించి వరుసగా చెపుతూ పోతే, ఎంతయినా, ఎంతకాలమయినా చెప్పవచ్చు. 1938లో తాను చదువుకుంటున్నప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏదో ప్రత్యేక సందర్భం వచ్చింది. జాతీయ గీతాలతో బాటు ఒక తెలుగు పాట ఉండాలని పెద్దలు నిర్ణయించారు. రజని చేత ‘పసిడి మెరుంగుల’ అనే పాట రాయించారు. తరువాత ఆ పాట రేడియోలో వచ్చేది. ఆడ, మగ జంట గొంతుకల్లో సాగుతుందది. అది తెలుగుదనం గురించిన పాట. బాగుంటుంది.
రజని కబుర్ల సందర్భంలో ఎన్నో సంగతులు చెప్పారు. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ తాను కలిసి ‘కృష్ణరజని’ అనే పేరుతో కొంతకాలం రచనలు చేశారు. అది చాలా మందికి తెలుసు. రేడియోలో (హైదరాబాద్) విప్రనారాయణ నాటకం షెడ్యూల్ చేశారు. అప్పట్లో అంతా నిజంగానే హాట్‌కేక్స్. కొన్ని అప్పటికప్పుడు వినిపించే కార్యక్రమాలయితే, కొన్ని, కేవలం కొన్ని గంటలు ముందు మాత్రమే రికార్డ్ అవుతాయి. కృష్ణశాస్ర్తీగారికి బద్ధకమని అందరికీ తెలుసు. ముంచుకుపోతున్నా రాయరు. చివరి క్షణాన రాసినదయినా రచన బ్రహ్మాండంగా వస్తుంది. విప్రనారాయణ అలాగే రాశారట. అయినా నిడివి తగ్గింది. రజని కూడా ఒక చేయి వేశారు. ‘కొలువయితివా రంగశాయి’ అన్న పాట ఇంచుమించు రజని రచన. నాటకంలోనూ, నేటికీ కృష్ణశాస్ర్తీ రచనగానే అందరికీ తెలుసది. సినిమాలో కూడా వాడుకున్నారు. (ఈ సంగతి చెప్పి నేను తప్పు చేస్తున్నానా? రజని చెప్పాలి!)
రవీంద్రుని రచనలను తెలుగువారికి పరియం చేసిన ఘనత రజనిదే. రవీంద్రుడు స్వయంగా చేసుకున్న వరుసల్లోనే తెలుగులో అనువాదగీతాలు రాసి తెలుగువారికి వినిపించాడాయన. ‘వని వికసించెనదే, పక్షీ ఏలా రాదు’ అని ఒక పాట. ఒకప్పుడు రేడియోవాళ్లు రవీంద్రభారతిలో కార్యక్రమం పెట్టారు. ఒక బెంగాలీ గాయకుడు అసలు పాట పాడిన తరువాత చిత్తరంజన్ తెలుగు వర్షన్ పాడారు. నాకు తెలుగే నచ్చింది. రవీంద్ర సంగీత్ గురించి రజని స్వయంగా పాడుతూ, వివరించిన రేడియో రూపకాన్ని ‘లోకాభిరామం’ అనే నా బ్లాగులో పదుగురితో పంచుకున్నాను. ‘ఎవరూ కేక విని రాకపోయినా, ఒకడినె పదవోయ్’ అని మరో పాట. ‘యాక్లచలో’ అనే బెంగాలీ మూలగీతాన్ని దేశంలోని పిల్లలందరికీ నేర్పించారు.
రజనికి మధ్యప్రాచ్య సంగీతమూ, సూఫీ తత్వము బాగా వంటబట్టాయి. మీరాబాయి, సూర్‌దాసులను మించిన సూఫీలు ఎవరూ లేరు అని తాను అనడం గుర్తుంది. ‘అతిథి శాల’ అనే రేడియో సంగీతరూపకం, ఆయనే సిద్ధం చేశారు. ‘మేలి జలతార్ బుటాలల్లిని నీలివలయం ఈ గుడారం!’ ఎంత బాగుంటుందో పాట!
రజనీ ‘్భవ తరంగాలు’ అనే వీక్లీ కాలం ద్వారా తమ అనుభవాలను, ఆలోచనలను పాఠకులతో పంచుకున్నారు. అది మన అదృష్టం. ఆ పుస్తకం చదివితే ఎవరికయినా ఆశ్చర్యం కలుగుతుంది. ఉద్యోగంలో చేరకుండా రజని, సినిమా రంగంలోనూ, కవి, గాయకుడు, సంగీతస్రష్ఠగా మిగిలి ఉంటే ఎట్లా ఉండేదో? ఆయన అనుభవాలు, ఆలోచనలు కొంతవరకయినా, అక్షర రూపంలో మనకు ఇచ్చాడు. ఇప్పుడా శత వర్ష సుందరుడు, యింకా ఏమయినా చెప్పగలడా? పాడగలడా? మొన్నమొన్నటిదాకా పాడినట్లే గుర్తు. రజని పాటలను, మాటలను సేకరించాలి మరి! వాళ్ల అబ్బాయి రామచంద్ర చక్కగా పాడతాడు. అచ్చంగా తండ్రిలాగే పాడతాడు. పాడి ఒక సీడీ చేశాడు కూడా. అతను చేతనయినన్ని పాటలు రికార్డ్ చేస్తాడని ఆశిస్తే ఆశ కాదు!
రజని వంటి గొప్ప మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయ్యా.. రజనీ గారూ! మీరిలాగే మరింతకాలం హాయిగా పాడుతూ బతకండి! మాలాంటి వాళ్లను ఆశీర్వదించండి! మరిన్ని పండగలు, పాటలు అందించండి! శతశతం జీవేమ శరదస్సువీరాః!

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.