ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -15

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -15

                     8- ఆధునిక ప్రతీక వాద రచయిత -చార్లెస్ బాడేలేర్

ఆధునికత అనే పదానికి సృష్టికర్త ,సింబాలిజం కు ఆద్యుడు ,ది ఫ్లవర్స్ ఆఫ్ ఈవిల్ నవల ద్వారా ప్రపంచ  ద్రుష్టి నాకర్షి౦చిన ఫ్రెంచ్ రచయిత చార్లెస్ పియరీ బాడేలేర్.19 వ శతాబ్దపు ఫ్రెంచ్ రచయితలు కొరడా దెబ్బలు కొట్టుకొని పాఠకులనూ అలానే కొట్టారు .వాళ్ళమనసులోని కోపం ,డిప్రెషన్ ,లను వ్యక్తిగత సెన్సేషనలిజం , ,బాహ్య ప్రదర్శనం గా మార్చుకొన్న విపరీత మనస్కులు .అందులో బార్లీ డీ ఆర్విల్ సముద్రపు ఎండ్రకాయ లాగా జీవిస్తూ అది సముద్రపు రహస్యాలు తెలుసుకోగలదని దాని హ్రుదయ౦  అతి పవిత్రమైనదని  అన్నాడు .బాడేలేర్ వీధుల్లోనే యెర్ర ఈకలతో చేసిన దాన్ని మెడ చుట్టూ కట్టుకొని తిరిగితే ,ఇంకో ఆయన రి౦బాడ్ దైవ దూషణ రాతలను పార్కు బెంచీల మీద పిచ్చ పిచ్చగా వంకర  టింకర గా ‘’షిట్ – గుడ్ బై ‘’( Merde a Dieu) అని రాసేవాడు .బాడేలేర్ చాలాబాధలు అనుభవించాడు .సమకాలీన రచయితల కంటే ఎక్కువగా స్వయంకృత డయాబాలిజంఅంటే  దెయ్యాల భయం తో   ,అపరాధ భావం తో క్షోభ చెందాడు .ఇవే మనసంతా నిండిపోయి ‘’ఫ్లవర్స్ ఆఫ్ ఈవిల్ ‘’అనే ప్రఖ్యాత నవల రాశాడు .దీనిని సమీక్షిస్తూ ప్రముఖ విమర్శకుడు డీ ఆర్విల్ ‘’డాంటే స్వయం గా నరకం సందర్శిస్తే,  బాడేలేర్ ఆ నరకం నుండే వచ్చాడు ‘’అన్నాడు.

 పారిస్ లో 1821ఆగస్ట్ 9 న  బాడేలేర్ పుట్టేనాటికి తండ్రి వయసు 62,తల్లి వయసు 26.అంత వ్యత్యాసం ఉంది .ఒక్కడే పిల్లడుకనుక సంపన్నుడైన తండ్రి తన వెంట మ్యూజియం లకు తిప్పుతూ ఎన్నోకధలను చెబుతూ వాత్సల్యాన్ని కురిపిస్తూ  ,ఉత్సాహం కలిగించాడు .ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు .ఏడవ ఏటనే తండ్రి చనిపోగా తల్లి యువ కమాండర్ ను ప్రేమించి పెళ్ళాడింది .బాడేలేర్ కు ఈ కొత్త తండ్రిపై ద్వేషమే కలిగి హామ్లెట్ లాగా తల్లిమీదా అది ప్రతిఫలించి ఆమె తనకు నమ్మక ద్రోహం చేసిందని నిశ్చయించుకొన్నాడు . మాతృప్రేమను కోల్పోయానని బాధపడ్డాడు .ముప్ఫై  ఏళ్ల తరువాత అమ్మ ఒడిలోని మాధుర్యాన్ని ,ఆమె చూపించిన  శ్రద్ధ ,వాత్సల్యాలను అనుభూతిని  గుర్తుకు తెచ్చుకొని  రాసుకొన్నాడు .

  స్కూల్ లో చదువులో సాధారణం గా ఉండేవాడు .సాహిత్యం తప్ప మిగిలిన విషయాలేవీ అతన్ని ఆకర్షించలేదు .లాటిన్ పద్యాలకు బహుమతి వస్తే ,అవిదేయతకు శిక్ష పొందాడు .మళ్ళీ చేరి పరీక్ష పాసై తోచిందేదో రాస్తూ కాక్షేపం చేశాడు .కుర్రాడు చెడు సావాసాలుప ట్టిపాడి పోతాడేమో అని భావించి మారుటి తండ్రి సుదీర్ఘ ప్రయాణం తో కలకత్తా కు పంపించాడు .నౌక ఒకసారి ఘోర తుఫాను ప్రమాదానికి గురైతే ప్రయాణం విరమించి మారిషస్ లో .అక్కడి ట్రాపికల్ సీనరీ ,రెచ్చగొట్టే అమ్మాయిలూ బాగా నచ్చి , .లోపల దాగి ఉన్న కవిత్వానికి ప్రేరణ లభించ గా కొద్దికాలం ఉండిపోయాడు .మళ్ళీ పారిస్ చేరి కుర్రగాంగ్ తోకలిసి ‘’బోహీమియన్  అరిస్తో క్రసి ‘’అని పేరుపెట్టుకొని జీవించాడు . .నీటైన సోగ్గాడు బాడేలేర్ విలాసంగా వారిమధ్య కాలం గడిపాడు .బార్బీ డీ ఆర్విల్ అనే వాడుతన వింత చేష్టలతో   జతకలిసి ఉన్నాడు .క్రమంగా ఈ బాచీ సంఖ్య పెరిగింది .డబ్బు మదించిన వాళ్ళే వీళ్ళు .దియేటర్ లో చిన్న వేషాలు  వేసే ఒక పిల్లను చూసి  వ్యభిచారిణి కాదని చేరదీసి పెళ్ళాడాడు బాడేలేర్ .ఏ క్షణానికి తోచిన భావాన్ని అప్పటి అప్పుడే కవిత్వీకరించటం ప్రారంభించాడు .కలిగిన ప్రతిమానసిక భావాన్ని అక్షర బద్ధం చేశాడు .అప్పుడప్పుడు వచన రచనా చేశాడు .తటస్థపడిన ప్రతి స్త్రీపైనా కవితలు రాసినా ,జీన్ డవాల్ అనే ఆమె బాగా ప్రేరణ కలిగించింది .ఆమెనే ‘’డార్క్ వీనస్ ‘’అన్నాడు .ఆమె అంగాంగ  సౌందర్యాన్నీ కవిత్వ బద్ధం చేశాడు .యెంత త్వరగా ప్రేమించి దగ్గరికి చేర్చుకొనే వాడో అంతే స్పీడ్ గా వారితో పోట్లాడి దూరం చేసుకొనేవాడు .కాని జీన్ అతని జీన్స్ నే పట్టుకొన్నది . మనవాడి క్షణికోద్రేకాలకు విసిగి వేసారి ఒక సారి ఆమె అతన్నివదిలి  వెళ్లిపోతానన్నది .ఆమె వియోగాన్ని భరించ లేకపోయాడు .14 ఏళ్ళు కలిసి మెలసి ఉన్న ఆమె తనను వదిలి వెడితే జీవించలేనని తల్లికి ఉత్తరం రాశాడు .కానిఎడబాటు జరగ లేదు . ఇరవై ఏళ్ళు జెన్నీ బాడేలేర్ ‘జీవిత ’నాట్య  నాగిని ‘’గా ఉండిపోయింది .’’అందాల రాక్షసిగా’’’’ ,కాంతి దేవతగా ‘’అతనిమనసులో ఉండిపోయింది .ఆమె అందానికి ఆకర్షణ కి ఆరాధనకి కరిగిపోయాడు .అందం స్వర్గం నుండి భూమికి దిగివస్తుందో నరకంకూపం  నుండి వెడలి వస్తుందో  నిర్ణ యించలేకపోయాడు .దీనినే కవితాపరంగా ‘’viens du ciel profound ou sors-tu de l’abime’’అని రాసుకొన్నాడు .

 విపరీతంగా పిచ్చపిచ్చగా ఆడంబరం గా విచ్చల విడిగా డబ్బు ఖర్చుచేస్తున్నాడు బాడేలేర్ .సంక్రమించిన సంపదలో సగం ఖర్చై పోయింది .ఇలా అయితే చేతికి చిప్పెగతి అని మిగిలిన ఐశ్వర్యం ఇలా దుబారాకాకుండా అతనికి ఫైనాన్సియల్ గార్దియన్ గా ఒక నోటరీ ని ఏర్పాటు చేసింది తల్లి .అప్పటి నుంచి ప్రతి రూపాయి ఖర్చుకోసం నోటరీ దయా దాక్షిణ్యం పై ఆధార పడాల్సి వచ్చింది .ఖర్చు అలవాటైన ప్రాణం కదా విలవిల లాడుతోంది .అప్పులు చేస్తున్నాడు విపరీతంగా .అప్పిచ్చే వాళ్లకు ఎర గా మారిపోయాడు .డాబు దర్పం మాయమయ్యాయి .గుండ్రని అందమైన సున్నితమైన ముఖం  గట్టిపడిపోయింది .నవ్వుతూ హాళ్ళూ పెళ్ళూ గా ఉండేవాడు ముభావం గా ఉంటున్నాడు .చెక్కులు చిక్కిపోయాయి .అందమైన ఖరీదైన ధగధగలాడే బట్టలు వదిలేసి నల్ల బట్టలు కడుతున్నాడు .నల్ల బ్రాడ్ క్లాత్ మాత్రమె వేసుకొంటున్నాడు .దావీదు మహిమ కాదు ఇది ధనమహిమ .దనం చేతిలో ఆడక వచ్చిన పరిస్తితి కాదు కాదు సృష్టించుకొన్న స్థితి .దుస్తితి .బోహీమియన్ సంస్కృతీ వదిలి పెట్టేశాడు .బూర్జువా ముఠాకు దూరంగా ఉంటున్నాడు .1848జూన్ రివల్యూషన్ కు సాయం చేశాడు .బారికేడ్ లనిర్మాణం లో ,సాయపడ్డాడు .స్వయం గా ‘’we must shoot General Aupick ‘’అనే బానర్ ‘’నేశాడు ‘’.సాధారణ సైనికుడి స్థాయి నుండి జెనరల్ పదవికి ఆ తర్వాత రాయబారిపదవికి ఎదిగిన వాడిపై ద్వేషం మాత్రం పోలేదు .

     విప్లవ పత్రిక’’సాల్ట్ పబ్లిక్ ‘’ స్థాపించి నడపటం లో రాజీలేని వాస్తవ చిత్రకారుడైన గుస్తేవ్ కూర్బేట్  కు ,హెరాన్ దీమార్ అనే విమర్శకుడికి సహాయపడ్డాడు .విప్లవానికి ఇన్ని రాకాల ఊపిరులు ఊదినా అది విఫలమై చప్పగా చల్లారి పోవటం తో మానసిక క్షోభ చెందాడు బాడేలేర్ .’’సెకండ్ ఎంపైర్ ‘’అధికారానికి వచ్చింది .రాజకీయం అంటే రోతపుట్టింది .వీధుల్లోకొచ్చి విప్లవ నినాదాలిచ్చి ఉద్రేకం తో ఊగి ,ఊగించిన ‘’మాబ్ ‘వింత, విపరీత ప్రవర్తనకు  అసహ్యమేసింది .ఉదాసీనత మనసులో, శరీరం లో ప్రవేశించి నిష్క్రియా పరుడయ్యాడు బ్రాడేలేర్ .

    Étienne Carjat, Portrait of Charles Baudelaire, circa 1862.jpg సశేషం

      మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-15-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.