పెరుమాళ్‌ మరుగన్‌ ఇక రాయడా!

పెరుమాళ్‌ మరుగన్‌ ఇక రాయడా!

రాత్రికి రాత్రి ఒక రచయిత అంతర్జాతీయ రచయితగా అవతరించటం వెనుక కుట్ర లేదంటే నమ్మగలమా! పెరుమాళ్‌ మురుగన్‌ చారిత్రక స్పృహవున్న రచయిత. ఆయనకి రాస్తేగాని పొట్టగడవని పరిస్థితి లేదు. కాని ఒక పబ్లిషర్‌కి, ఆ అగత్యం వుంటుంది. అందుకోసం సదరు పబ్లిషర్‌ కొన్ని అఘాయిత్యాలు చేయిస్తాడు. కొన్ని శక్తులని ప్రకోపింప చేస్తాడు. గిట్టని రాజకీయ పార్టీలు ఒహళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకుంటాయి. తమిళనాడులో కులతత్వ శక్తులు బలంగా వున్నాయి. వాళ్ళ ఆసరాతో దీన్ని మరింత రాద్ధాంతంగా మార్చిన మీడియా మూలంగా తమిళనాడుకే పరిచితమైన రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ రాత్రికి రాత్రే సన్మాన్‌ రష్దీ, తస్లీమ్‌ నస్రీన్‌ సరసన చేరటం అది రచయితకే ఎంతో మేలు చేసింది. కీడు చేయటం వెనక ఖ్యాతి వచ్చింది. ఆయన తమిళ నవల మధురుభగన్‌ గొడవ వెనుక పబ్లిషర్‌తో పాటు కార్పొరేట్‌ విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. పెరుమాళ్‌ మురుగన్‌ అదే చెప్పాడు. ఆయన ప్రస్తుత విద్యావిధానం మీద పోరాటం చేస్తా ఎన్నో వ్యాసాలు రాశాడు. కులతత్వం మీద ప్రస్తుత విద్యా విధానం మీద తిరగబడ్డాడు. విద్యార్థుల చేత కులాల పట్ల నిరసనతో 32 వ్యాసాలు రాయించాడు. నమక్కల్‌, తిరుచెంగోడు ప్రాంతాలలో స్కూళ్ళు నడుపుతున్న యాజమాన్యాలకి అది కంటగింపుగా మారింది. వాళ్ళే తనమీద దాడికి పూనుకున్నారని రచయిత అభిప్రాయం.

ఒన్‌ పార్ట్‌ ఉమన్‌గా పెంగ్విన్‌ ఇంగ్లీషులోకి ఆయన నవల మధురు భగన్‌ తర్జుమా చేశాకే ఈ కొడవంతా వచ్చింది. కొంగునాడుకి కోపం తెప్పించింది. ఈ కొత్త సంవత్సరం జనవరి ఎనిమిది రాత్రిన ఆయన కుటుంబంతో సహా అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు. తన నవలలోని ఊరిపేరుని మారుస్తానని, వాస్తవిక ఘఠనలని కాల్పనిక సాహిత్యంలోకి తేవడం పొరపాటని అంగీకరించాడు.

అయినా ఆ శక్తులు శాంతించలేదు. హిందు మున్నడి మరో మూడు కుల తత్వ సంస్థలు కలసి ఆ నవలని నిషేధించాలని గోల చేశాయి. కులతత్వ, హిందుత్వ శక్తులు ఒక వేదికగా ముందుకు రావటం తమిళనాడులో ఇదే మొదటిసారని రచయిత వాపోయాడు. ఒక నవలకి వ్యతిరేకంగా ఆరు చెంగోడులో బంద్‌ జరగటం ఆశ్యర్యమే! 2010లో వచ్చిన మధురుభగన్‌ మీద రాని గొడవ అదే నవల 2014లో ఇంగ్లీష్‌లోకి వచ్చాక ఎందుకొచ్చిందని ఆరాతీస్తే కానరాని సత్యాలు చాలా వున్నాయి.

ఈ విషయం మీద, తమిళనాడులో వున్న నా యిద్దరు రచయిత మిత్రులతో ఈ వ్యాసం రాసేముందు మాట్లాడాను. పేరు రాయద్దని అభిప్రాయపడ్డ రచయిత నెపం పబ్లిషర్‌ మీద, దేని మీదేనైనా గొడవ చేసే రాజకీయశక్తుల పైనా అనుమానపడ్డాడు. మరో రచయిత నీలకంఠన్‌ ఈ గొడవ జరగటం మంచిదే, పెరుమాళ్‌ మురుగన్‌కి అది మేలు చేసిందని అభిప్రాయపడ్డాడు. పొట్ట గడవటం కోసం కొన్ని శక్తులు చేయించిన అరాచకంగా నీలకంఠన్‌ నొక్కి చెప్పాడు.

పెరుమాళ్‌ మురుగన్‌ సామాజిక స్పృహ వున్న మంచి రచయిత. రాయనని చెప్పించినంత మాత్రాన అదో పెద్ద బాధ కాదని, ఆయనకి రాత్రికి రాత్రి పేరు రావటం సంతోషంగా నీలకంఠన్‌ భావించాడు. తమిళ భాషలోని ఒక నవలకి అంతర్జాతీయ ఖ్యాతి రావటం ఆ భాషా ప్రియులని ఆనందపరుస్తోంది అంటే అనుమానం ఎందుకు. వాళ్ళు అంత భాషాప్రియులు. అసలు అస్తిత్వ ఉద్యమాలు వెనక ఆర్థిక కారణాలు బలంగా వుంటాయని చరిత్ర ప్రస్తుతం భావిస్తోందని వేరే రాయనక్కర్లేదు. ప్రపంచీకరణలో భాగంగా తిరుచెంగోడు అనేవూరు కొంగునాడుగా పిలవబడే కోయంబత్తూరు, ఈరోడ్‌ తిరువూరు, సేలం కరూర్‌ జిల్లాల్లో భాగమై వ్యవసాయానికే కాదు సాహిత్య మాగాదిగాను తమిళనాట ప్రసిద్ధమే. నల్లరేగడి మట్టితో పుట్టిన పెరుమాళ్‌ మురుగన్‌ త్వరలోనే మరింత గొప్ప సాహిత్యమే సృష్టిస్తాడు. ఆ నమ్మకం ఆ భాషాప్రియులు వెల్లడిస్తున్నారు. ముక్కుమీద వేలు వేసుకోవాల్సింది మనమే!

పిల్లలు లేని పొన్నా కాళీల ఆనందమయ జీవితంలోకి ఒక్క నలుసు పుట్టకపోతే సంసార జీవితం ఏముంటుంది. ఇరుగు పొరుగుల సూటి పోటీ మాటలు అవమానాలునూ! తిరు చెంగోడు లోని అర్ధనారీశ్వర ఆలయంలో జాతర రోజున కేవలం గర్భధారణ కోసం ఒక స్త్రీ తప్పు, అది ఆచారంగా వందలయేళ్ళుగా వస్తోంది. అదే మధురుఘవన్‌ నవల చిత్రీకరించింది. గొప్ప హేతువాది పెరియార్‌ రామస్వామి కూడా 125 ఏళ్ళ క్రితం తిరు చెంగోడు వాసి గానే జన్మించాడు. ఆయన తాత్విక వారసుడు పెరుమాళ్‌ మురుగన్‌, ఆయనతో ప్రస్తుతం మనం మాట్లాడలేము. దేవాలయాల మీద బూతు బొమ్మలు వుండంగా పూజిస్తాము. అదే గుడుల వెనుక ఆచారాల వెనుక, ఉత్సవాల వెనుక జరిగే శృంగార కాంక్షని రాసినందుకి రచయితకి శిక్ష వేస్తాము. నీలకంఠన్‌ చెప్పినట్టు పెరుమాళ్‌ మురుగన్‌ తప్పక రాస్తాడు. ఇదో తాత్కాలిక తెరచాటు మాత్రమే, ఆయన కులతత్వం ఎదిరించాడు. ఆయన తన కొత్త నవల పూకళిని కులపీడితుడైన ధర్మపురి ఐలవాసన్‌కి అంకితం యిచ్చాడు. ఫలితంగా ఆయన కొత్త నవలని కొనటానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారట. సమాజంలో కులం వేళ్ళూనుకున్నప్పుడు ఒక రచయిత కులం నించి తప్పించుకోలేడు. మధురు భగన్‌లో గౌండర్‌ పేరుని రచయిత వాడాడు. తమిళనాడులో గౌండర్‌ పేరుని అనేక కులాలు వాడుకుంటాయి. అప్పటికి రచయిత తన కొత్త నవల పూకళిలో ఏ కులాన్ని ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డానని అయిన దాన్ని కొని చదవటం లేదని బాధపడ్తున్నాడు. కొంతమంది తమ లబ్ధి కోసం రచయితని బలి చేస్తున్నారు. రచయిత అదే వ్యాఖ్యానించాడు.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.