మానవతావాద కవి మునిసుందరం
- ”నా పేరు సుందరం
- నా కవిత మానవతా మందిరం
అని స్పష్టంగా తనను తాను నిర్వచించుకున్న కవి ఎస్.మునిసుందరం. నాలుగు దశాబ్దాలకు మించిన కవిత్వ జీవితం గల తెలగు కవులలో మునిసుందరం ఒకరు. దాదాపు 14 కవిత్వ సంపుటాలు, కొన్ని కథలు, మరికొన్ని నాటకాలు రచించడమే గాక, మునిసుందరం నటుడు కూడా. అంతేగాక తిరుపతిలో నూతలపాటి గంగాధరం పేరుమీద పెట్టిన సాహితీ సంస్థలో చాలాకాలం బాధ్యతలు నిర్వహించారు. ఇంకా ఒకటి రెండు సంస్థలకు నాయకత్వం వహించారు. యాత్రిక జన సందోహంతో ఉక్కిరిబిక్కిరిగా ఉండే తిరుపతిలోని కోట కొమ్ముల వీధిలో నింపాదిగా కవిత్వ రచనా జీవితాన్ని గడుపుకున్న సాహిత్వైక జీవి మునిసుందరం. అనారోగ్యకరంగా, అపసవ్యకరంగా, అమానవీయంగా, అవమానకరంగా ఉన్న సమాజం స్థానంలో ఆరోగ్యకరమూ, సవ్యమూ, మానవీయమ్ము, గౌరవ ప్రదము అయిన సమాజాన్ని నిర్మించాలని కవిత్వ తాపత్రయం పడిన కవి మునిసుందరం. వర్తమాన సామాజిక వ్యవస్థ ఎన్ని రకాలుగా చెడిపోయి ఉందో ఎత్తిచూపి, విమర్శకు పెట్టి మారండిరా అని నెత్తిన నోరుబెట్టి నాలుగు దశాబ్దాలు బుద్ధి చెప్పాడు ఆయన.
విమర్శకులెవరో గుర్తించి నిర్వచించవలసిన అవసరం లేకుండానే తాను మానవతా వాదినని ఆయనే తన చిరునామాను తెలియజేశారు. మట్టి, మనిషి, మానవత ఈ మూడు మాటలు ఆయన కవిత్వంలో అంతటా పరచుకొని ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత నగ్జల్బరీ ఉద్యమం మొదలయిన సందర్భం ఈ మద్యకాలంలో మార్క్సిజం చెప్పిన క్రిటికల్ రియలిజంను స్వీకరించి, మార్క్సిజం చెప్పిన వర్గపోరాటాన్ని కొంచెం దూరం పెట్టి రచన చేసిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వీళ్ళలో నా కవిత్వం కాదొక తత్వం అని చెప్పుకున్న ఖల గంగాధర తిలక్ అగ్రగామి. ఎస్.మునిసుందరం అలాంటి కవి ఆయన మార్క్సిస్టులు లేవనెత్తే సకలాంశాలు లేవనెత్తారు. అయితే అన్నిటికీ మానవతే పరిష్కారమని నమ్మారు. ఆయన కవిత్వంలో లోకపుట న్యాయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. పెట్టుబడిదారీ, ధనిక స్వామ్య వ్యతిరేకత బలంగా వినిపిస్తుంది. అవినీతి పైన ఒంటికాలితో లేస్తారు. కానీ వీటికి పరిష్కారంగా వర్గపోరాటముండదు. దుర్మార్గాలను ధైర్యంగా అధిక్షేపిస్తారు. కాని వర్గపోరాటం వద్దంటారు.
”అవినీతి, అన్యాయం, అధర్మం/దేశమాత దేహసిరిపై రాచపుండ్లు”/అవినీతి పులి అభివృద్ధిని మింగుతున్నది/”నా దేశం నేడొక ఎముకలగూడు/వినిపించుకొనే దెవరు దానిగోడు”
ఇలాంటి విమర్శలు మునిసుందరం కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి. విమర్శనాత్మక వాస్తవికత మునిసుందరం కవిత్వంలో పాఠకునికి దిగ్భ్రమ కలిగిస్తుంది. కవితోపాటు పాఠకుడు కూడా ధర్మాగ్రహానికి గురౌతాడు. అంతా అయినాక అయితే ఏం జేద్దాం? అంటే
”వర్గాల జోలికి పోకండి/ వర్గీకరణలు చేయకండి” అంటాడు./ ”గుండెగిన్నె బోర్లాపడితే / ”మానవత రక్తం నేలపాలౌతుంది…/ తుపానులు వరి కంకుల్ని పండిస్తాయా?”/ అని ప్రశ్నిస్తారు. అదే సమయంలో
”నా అక్షరమే నా సాహసం/ మానవత నాసాధ్యం”
అని ప్రకటిస్తాడు. ”దేశమంటే మట్టికాదోయ్” అని నూరేళ్ళ క్రితం గురజాడ నాటి సందర్భంలో అంటే, మునిసుందరం ”దేశం అంటే నేను పుట్టిన మట్టి” దేశం అంటే మనుషులు” అని పునర్నిర్వచనం చేశారు. ప్రతి భారతీయుడు మానవతా మూర్తి అయితే దేశం బాగుపడుతుందని ఆయన విశ్వసించాడు.
ఇరవయ్యొకటవ శతాబ్దం వచ్చిన సందర్భాన్ని ప్రపంచ ప్రజలు విశిష్ట సందర్భంగా గుర్తిస్తే కవి మునిసుందరం
”నూరుపుటలు నిండిన చరిత్ర పుస్తకాన్ని/ పుట పుటలో పుటుక్కుమన్న మానవత/ రక్తపు మరకలు అద్దిన దానవత”
అని ఇరవయ్యవ శతాబ్ది చరిత్రను నిర్వచించారు.
ఈ పునాదులు మారకుండా పైపైన వచ్చే మార్పులు రావడం వల్ల ప్రయోజనం ఉండదని మునిసుందరం అభిప్రాయం.
”అధునాతన రథ చక్రాల క్రింద నలిగి/ శాశ్వతంగా కన్ను మూసింది మానవత”
అన్నది ఆయన ఆవేదన. శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం సాధించే అభివృద్ధి మనుషుల్ని మరింత మానవీయంగా తీర్చి దిద్దడం పోయి, మరింత స్వార్థ పరుడుగా, మరింత గుంపు స్వభావాన్ని కల్పించవలసింది పోయి, మరింత ఏకాకిగా మార్చడాన్ని మునిసుందరం అనేక పర్యాయాలు అధిక్షేపించారు.
”స్వతంత్ర భారతీయుడు/ అనూహ్యంగా స్వార్థ సింధువైపోయారు”
భారత దేశ చరిత్ర సంస్కృతులమీద మునిసుందరంకు అపారమైన గౌరవం ఉంది. అదే సమయంలో విమర్శనాత్మక దృష్టి ఉంది.
”శ్రీరాముని పదరజంతో/ గోపాల కృష్ణుని గీతామృతంతో/ బుద్ధభగవానుని ప్రబోధాలతో/ బోసినవ్వుల బాపూ ఆంగికంతో/ తడిసిముద్దయిన/ పరమపునీత యీ మట్టి/ అందుకే నేను మట్టితినే పెరిగాను”
అని ప్రకటించడానికి ఏమీ సంకోచించడు మునిసుందరం. అంతేకాదు
”సీతనాటిన విత్తే నేటి మనిషి/ సీత నాగరికత కంకురార్పణ”
అని కూడా అనగలిగారు. ఇలా అన్న కవి మరో సందర్భంలో
”కత్తులు కటార్లు బరిసెలు బాణాలు/ మనువు బిడ్డలే… సుడిగాలులై దాడిచేస్తారు”
అని అధిక్షేపించడానికి ఆయన వెనుకాడరు. చరిత్ర పట్ల ఆయనకు గౌరవంతో కూడిన విమర్శనాత్మక దృష్టి ఉంది. ఆయన కోపం, ఆయన ఆగ్రహం స్వాతంత్య్రానంతర రాజకీయ వ్యవస్థపైన్నే స్వాతంత్య్రం వచ్చినా భారత దేశం బాగుపడలేదే అన్నది ఆయన ఆవేదన. ఎన్నికలు, ప్రణాళికలు మన దేశాన్ని బాగుచేయలేకపోయాయన్నది ఆయన అవగాహన. దోపిడీ, అవినీతి రాజ్యమేలుతున్నాయి అన్నది ఆయన కోపం. వీటికన్నిటికీ కారణం మానవత లోపించడమే నన్నది ఆయన నిష్కర్ష.
మునిసుందరం ‘మానవత’ అయ్యో పాపం అనేది కాదు. దానికి ఆర్థిక సాంఘిక రాజకీయ సాంస్కృతిక పార్శ్వాలున్నాయి. జన హృదయాలను మధించి తాను హాలాహలాన్ని తాగి ప్రజలకోసం అమృతం తెచ్చినట్లు ప్రకటించిన కవి ”నా అమృతం మానవత్వం” అని ప్రకటించారు. భారతదేశానికి స్వాతంత్య్రం రావలసిన రూపంలో రాలేదన్న అవగాహన మునిసుందరం చాలా కవితల్లో కనిపిస్తుంది.
”స్వాతంత్య్రానికి నా దేశంలో అర్థం/ బాధ్యతారహితంగా అనుచితంగా ప్రవర్తించడం”
మునిసుందరంకు మానవత సర్వ రోగనివారిణి.
ఆయన గమ్యం, గమనం రెండూ మానవతే.
నిజాయితీ ఊపిరిగా/ మంచి ఆయుధంగా/ మానవత గమ్యంగా కదంతొక్కు/ అని ప్రబోధించారు, అయితే ఈ మానవత ఎలా సాధించడమంటే! అయోమయంలో ఎకె 47, తుపాకీ మానవతా పుష్పాలు పూయిస్తుందా? అని ఆయన ఎదురు ప్రశ్న వేస్తారు.
”నా దేశంలో/ అంతస్తుల వారీగా బిచ్చగాళ్ళు/ లచ్చలకు లచ్చలు బయలుదేరారు”
అనగలిగినంత రాజకీయ దృష్టి ఉంది మునిసుందరంకు.
”పేదరికం తివాచీవలె రోడ్డుమీద పడివున్నది”
అనగలిగిన ఆర్థిక దృష్టి ఉంది.
”చెత్తపని చేసి అయినా / విత్తము సంపాదించుబిడ్డా”
అనే వ్యంగ్య కంఠస్వరముంది.
”దోపిడి పిల్ల వున్నంత అందంగా / ‘స్వేద’భారతి వుండదు.”
అనగలిగే వర్గ దృష్టి ఉంది. వీటన్నింటికీ విరుగుడు మానవత్వమేనని మునిసుందరం తీర్పు.
”మానవతా మేఘం/ చినుకై నేలతల్లిని చుంబిస్తే/ చిక్కటి ఉషస్సులా/ దిక్కుల్ని కమ్మేసి/ తెలుగు పలుకులతో/ నాచరమాంకాన్ని నేనే రాసుకోవాలని”
ఆయన మానవత్వ భారతీయ సమాజ ఆవిర్భావం కోసం ఎదురు చూశారు.
చాలామంది లాగే మునిసుందరం కూడా ఇజాలను చాలా పర్యాయాలు ఎద్దేవా చేస్తూ వచ్చారు. ఇజాలు.. మనిషి… వ్యవస్థ… రాజ్యం, అంతా డొల్ల… అంతా నల్ల ”అని నైరాశ్యంగా మాట్లాడారు. అయితే ఆయన మానవత్వంకు ఒక పెద్ద ఇజమని గుర్తించలేకపోయారు.
జాతీయ అంతర్జాతీయ సమాజం మీద కవితలు రాస్తూనే మునిసుందరం రాయలసీమ మనిషిగా సీమ నిర్దిష్ట సమస్యల మీద కూడా రాశారు.
”రాయలసీమ మట్టి నేను/ నా కిన్నినీళ్ళు కావాలి…./ గంగమ్మ తల్లి నీకో నమస్కారం/ నా సీమను / ఎడారిగా మార్చవద్దు”
అని విన్నవించాడు.
జీవించినన్నాళ్ళు మానవత్వాన్ని అమృత సిద్ధాంతంగా ప్రచారం చేసిన కవి ఎస్.మునిసుందరం ఆర్భాటం లేని కవి. మునిలాగే ఉండిపోయారు. ఆయనలో చివరిదాకా ఏవో కొన్ని ఆధ్యాత్మిక వాసనలున్నా, భౌతిక జీవితం గురించే రాశారు. ప్రపంచీకరణను తిరస్కరించాడూ, భావాన్ని అందమైన అధిక్షేప భాషలో ఒదిగించే ప్రయత్నం చేశారు. ఆధునిక తెలుగు కవిత్వ వికాసానికి తిరుపతి నుండి తనదైన దోహదం చేశారు. ఇప్పుడు ఆయన ఒక చరిత్ర అయ్యారు. ఇకమీదట ఆధునిక తెలుగు కవిత్వ చరిత్ర ఆయనను గురించి మాట్లాడుకోకుండా సమగ్రం కాదు.
”నేను చచ్చిన తర్వాత/ నన్ను ముక్కలుగా కోసి/ మీరంతా వండుక తినండి/ ఒకపూట మీకాహారమై/ నన్ను తృప్తి చెందనివ్వండి/ నా ఎముకల్ని పిండిచేసి/ కాఫీ కాసుకోండి/ మీ అలసట పోతుంది”
మునిలాంటి పి.కేశవరెడ్డితో పాటు మాట్లాడుకున్నట్లు ఒకేరోజు మరణించిన మునిసుందరం గారికి నివాళితో…