ఆ కామెంట్స్‌ విని ఏడ్చాను.. యాంకర్ shilpa chakro borti

ఆ కామెంట్స్‌ విని ఏడ్చాను..

‘‘ఎందుకయ్యా ఈ బెంగాలీ అమ్మాయిని తీసుకొచ్చి మాకు అంటగట్టారు. ఆమె వచ్చీరాని తెలుగులో నటిస్తుంటే చూడలేక చచ్చిపోతున్నాము’’ అని అవమానాలు ఎదుర్కొన్న ఈ బెంగాలీ శిల్పా చక్రవర్తి.. అచ్చుపోసిన ఆరణాల ఆడపడుచులా యాంకరింగ్‌లో ఎలా మెరిసిపోయారు? పదిహేనేళ్లపాటు అన్ని ఛానళ్లు, ఫంక్షన్లు, సినిమాల్లో ఎలా దూసుకుపోతున్నారు? శిల్ప ఇంటర్వ్యూ మొదలుపెట్టగానే తనదైన శైలిలో గలగలా మాట్లాడారు..
‘‘నాన్నకి ట్రాన్స్‌ఫర్‌ వచ్చినప్పుడల్లా నివసించే ప్రాంతం మారేది. నా స్కూలూ మారేది. నేను ఆరోతరగతిలో ఉండగా మొత్తానికి హైదరాబాద్‌లో కుదురుగా సెటిల్‌ అయ్యాం. తార్నాకలోని రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. హైదరాబాద్‌లో కేవలం ఉద్యోగ నిమిత్తమనీ, ఎప్పటికైనా కోల్‌కతాకు వెళ్ళాల్సిందేనని మాట్లాడుకునేవారు. అందుకే అమ్మానాన్నలు ఇక్కడ ప్రాపర్టీలు ఏవీ కొనలేదు. దీంతో పాటు స్కూల్‌లో నాకు తెలుగు ఆప్షన్‌ ఎంచుకోకుండా చేశారు. ఇక మా ఏరియాలో అన్ని వసతులు ఉండేవి. అదో మినీ ప్రపంచం. అదృష్టమేంటంటే కోల్‌కతాలో నేను స్టార్ట్‌ చేసిన కథక్‌ నృత్యం హైదరాబాద్‌లో కంటిన్యూ చేసే అవకాశం దక్కడం. ఇక ఆరు నుంచి పదో తరగతి వరకూ రైల్వే మిక్స్‌డ్‌ స్కూల్లో చదివాను. చదువుపై ఆసక్తి లేదు. అయితే ఇంట్లో వాళ్ళు తిడతారనీ, క్లాసులో క్లవర్‌ అనిపించుకుంటే విలువ ఉంటుందనే ఉద్దేశంతో బాగా బట్టీపట్టి చదివేదాన్ని. అన్నట్లు స్కూల్‌లో వక్తృత్వపోటీ, డిబేట్స్‌లో మనమే క్వీన్‌. ఇక నేను అథ్లెట్‌ని కూడా. లాంగ్‌జంప్‌, మారథాన్‌లో పాల్గొనేదాన్ని. ఇలా హైదరాబాద్‌లో నా బాల్యం హాయిగా సాగింది. ఓసారి జరిగిన కామెడీ నాకిప్పటికీ గుర్తు. స్టేజ్‌పై కథక్‌ నృత్య ప్రదర్శన చేస్తున్నానప్పుడు. హఠాత్తుగా నా విగ్‌ జారిపోయి ఎగిరి జనాల మీద పడింది. విచిత్రమేంటంటే ఆ ప్రోగ్రామ్‌కు ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన దగ్గర విగ్గు పడటం. ఆ సంఘటన తల్చుకున్నప్పుడల్లా నవ్వు ఆగదంటే ఆగదు.
ఆసుపత్రి కెక్కిన ‘వన్‌ సైడ్‌ లవ్‌’ …
ఇంటర్‌లో ఎం.పి.సి. బాధ తాళలేక బీకామ్‌ జంప్‌ అయ్యా. తర్వాత హాయిగా అనిపించింది. ఇక ఇంటర్‌మీడియట్‌లో నాకెవరూ ప్రపోజ్‌ చేసే సాహసం చేయలేదు. ఎందుకంటే మా అన్నయ్య నాకంటే ఐదేళ్ళు సీనియర్‌. పైగా నన్ను కాలేజీలోని క్లాస్‌ దగ్గరివరకూ తీసుకొని వచ్చేవాడు. క్లాస్‌ అయిపోయాక తీసుకెళ్ళేవాడు. అదీ సంగతి. ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఓ రోజు క్లాసులో పాఠం వింటున్నాను. మా ప్రిన్సిపాల్‌ రమ్మని పిలిస్తే వెళ్లాను. ‘ఏంటమ్మా ఇది?’ అన్నారు ఆయన సీరియ్‌సగా. నాకర్థం కాలేదు. ‘దేని గురించి సర్‌’ అని అడిగా. ‘నీ ప్రేమ కోసం ఇద్దరు బాస్కెట్‌బాల్‌ ప్లేయర్స్‌ బాగా దెబ్బలాడుకున్నారు. పెద్ద గాయాలతో వారిద్దరూ ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నారు’ అన్నారు. వారి గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదని బయటికొచ్చా. విషయమేంటంటే… బాస్కెట్‌ బాల్‌ ఆడే సమయంలో ఓ అబ్బాయి మరో అబ్బాయితో ‘శిల్పని లవ్‌ చేస్తున్నా… తను నా లవర్‌’ అన్నాడట. రెండో అబ్బాయి ‘నా లవర్‌ని లవ్‌ చేస్తావా?’ అని గొడవేసుకున్నాడట. అలా పీక్‌ స్టేజ్‌లో వారి వన్‌ సైడ్‌లవ్‌ హాస్పిటలైజ్‌ అయ్యింది. ఆ ఏజ్‌లో మొదట గిల్టీగా ఫీలయ్యా, బాధపడ్డా… ఆ తర్వాత ఫ్రెండ్స్‌ అందరూ శిల్ప కోసం ఇద్దరు అబ్బాయిలు ప్రాణాల్ని లెక్కచేయలేదనీ, మాకోసం అంతసీన్‌ లేదనేవారు.
అలా వచ్చింది అవకాశం..
డిగ్రీలో ఉన్నప్పుడు కల్చరల్‌ యాక్టివిటీస్‌ కోటాలో నన్ను రైల్వే ఆఫీసర్‌ చేద్దామనుకున్నారు మా పేరెంట్స్‌. నాకిష్టం లేదు. ససేమిరా అన్నాను. అయినా సరే దరఖాస్తు చేయించారు. పరీక్షలో భాగంగా కథక్‌ నాట్య ప్రదర్శన ఇచ్చా. సరిగ్గా ఆ ఏడు ఎక్కువ మంది కల్చరల్‌ యాక్టివిటీస్‌ కోటాకి హాజరుకావటంతో సంబంధిత రైల్వే అధికారులు ‘రెండేళ్ళ తర్వాత ఈ కోటాలో రిక్రూట్‌ చేసుకుంటాం’ అన్నారు. హమ్మయ్య అనుకున్నా. ఎప్పటిలాగే డిగ్రీలో ఉండగా హైదరాబాద్‌లోని బెంగాళీల కోసం ప్రత్యేకంగా ఉండే ‘బంగయా సాంస్కృతిక సంఘం’ ఆధ్వర్యంలో కథక్‌ ప్రదర్శన ఇస్తుండగా, ఆ ప్రోగ్రామ్‌ని కవర్‌ చేయటానికి వచ్చిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ రిపోర్టర్‌ హిందీలో పరిచయం చేసుకున్నారు. అలా యాంకరింగ్‌ అవకాశమొచ్చినప్పుడు నేను తటపటాయిస్తుంటే ‘వచ్చిన అవకాశం వదులుకోకు’ అన్నారు పేరెంట్స్‌. ఛానెల్‌ ఆఫీసుకి వెళ్లాను. కెమెరా ముందు చాలా ఫ్రీగా మాట్లాడా. ప్రోగ్రామ్‌ స్టార్ట్‌ చేసినపుడు తప్పక పిలుస్తామన్నారు. అన్నట్లే పిలుపొచ్చింది. తెలుగు పలుకులు పలుకుతూ సంతూర్‌ టాప్‌ 10, డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌, మేటి చిత్రాలు ప్రోగ్రామ్స్‌ని లాగించాను.
తిట్టే నా గెలుపుకు తొలిమెట్టు!
భాష రాకున్నా నేను ఎలాగైనా టేక్‌ ఓకే చేయాలని యాంకరింగ్‌ చేసేదాన్ని. స్ర్కీన్‌పై బాగా కనిపించినా, ఫేస్‌లో అసలు ఫీలింగ్‌ పలికేది కాదు. ప్రతి యాంకర్‌ పార్ట్‌కీ ముప్పయి టేకులకి పైగా తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ స్టూడియోలోనే ఉండేదాన్ని. పాపం… నా యాంకరింగ్‌ అంటూనే కెమెరా వాళ్ళు భయపడేవాళ్ళు. ఆ సమయంలో కెమెరామెన్‌ల ముఖాల్లో సంతోషం కనిపించినప్పుడే నేను సక్సెస్‌ అయినట్లు భావించా. టీవీలో కనిపించటం వల్ల త్వరగా ప్రేక్షకులకి దగ్గరయ్యా, దీంతో సీరియల్స్‌లోనూ అవకాశాలు వచ్చాయి. మద్రాసులో బాలాజీ టెలిిఫిలింస్‌ వారి ‘కంటే కూతుర్ని కనాలి’ సీరియల్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఆ సీరియల్‌లో కోమాలిక అనే పాత్ర పోషించా. డైలాగ్స్‌ చెప్పలేక చాలా టేక్స్‌ తీసుకున్నా ఓ ఎపిసోడ్‌కి. ఆ సీరియల్‌ కో-డైరక్టర్‌ ‘ఎందుకండీ తెలుగురాని వాళ్ళని మాకు అంటగట్టి చంపుతారు? అసలు తెలుగు వాళ్లే లేనట్లు ఈ బెంగాళీ అమ్మాయిని మా మొహాన పడేశారు’ అంటూ యాభైమంది ముందు సెట్లో తిట్టేశారు. కళ్ళెంబడీ నీళ్లు దిగాయి. ఏడుస్తూ నా గదిలోకి వెళ్లా. బయటికి రావాలనిపించలేదు. సిగ్గుగా అనిపించింది. మళ్లీ టేక్‌ కోసం పిలిచారు. ఆ ఏడుపు మొహాన్ని కవర్‌ చేసుకుని నటించా. టేక్‌ ఓకే అయ్యింది. ఆ రోజు రాత్రి బాధపడ్డా. తర్వాతి రోజు నుంచి సెట్‌లో అందరితో తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసేదాన్ని. కొంచెం కొంచెం మాట్లాడుతూ చదవటం త్వరగా అలవాటు చేసుకున్నా.
యాంకరింగ్‌లో బిజీగా ఉండే రోజుల్లో ఇ.వి.వి. సత్యనారాయణ గారు హీరోయిన్‌గా అవకాశమిచ్చారు. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఓ రోజు దర్శకుడు త్రివిక్రమ్‌ కాల్‌ చేశారు. అదే ‘నువ్వే నువ్వే’ చిత్రం. చిన్న సీన్‌ అయినా నోటెడ్‌ అయ్యాను. తర్వాత ‘అందరివాడు’ చిత్రంలో నటించా. ఇప్పటివరకూ ఏడు చిత్రాల్లో నటించా. ప్రస్తుతం నాగచైతన్య మూవీలో ఓ పాత్రలో నటిస్తున్నా.
ద్వేషించిన ఆయన్నే లవ్‌ చేసి..
కళ్యాణ్‌ అనే ఇంగ్లీషు పేపరు జర్నలిస్ట్‌ నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు. ఇంటర్వ్యూ కంప్లీట్‌ అయ్యాక ‘కాఫీ కెళ్దాం’ అన్నారు. ఇలాంటివి నచ్చవన్నాన్నేను. ఆ తర్వాత రెండు, మూడు సార్లు ప్రోగ్రామ్స్‌ కోసం కాల్‌ చేశారు. నా అసిస్టెంట్‌లతో ఫోన్‌ లిఫ్ట్‌ చేయించి బిజీ అని చెప్పించే దాన్ని. బాలాజీ టెలిఫిలింస్‌ వారి సీరియల్‌ చేస్తుండగానే ఓసారి కలిశారు. ఆయన మాటల వల్ల కోప్పడి తన ఫోన్‌ నెంబర్‌ డిలీట్‌ చేశా. షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఒకాయన ‘కళ్యాణ్‌ అనే మీడియా పర్సన్‌, ముంబై మార్కెట్‌పై అవగాహన ఉన్న వ్యక్తి. అతనే మీ పేరుని నిర్మాతలకి సూచించాడు’ అన్నారు. షేమ్‌గా ఫీలయ్యా. ఆయన్ని ఎలాగైనా కలవాలనుఉని, ఆరువేల రూపాయలు పెట్టి గాగూల్స్‌ కొన్నా. వెళ్లి ఆ గిఫ్ట్‌ ఇచ్చా. అప్పుడూ ఇలాంటి చీప్‌ గాగూల్స్‌ అని తూలనాడటంతో కోపం నషాళానికి అంటింది. విషయం తెలుసుకున్న కళ్యాణ్‌ సారీ చెప్పాడు. కోపంతో స్కూటీ వేసుకొని ఇంటికొచ్చా. ఆ తర్వాత రెండు, మూడు సార్లు ఫోన్‌ చేసి కలిశా. కొన్నెళ్ళకి ప్రపోజ్‌ చేశాను. పెళ్లి చేసుకుంటా అంటే.. కెరీర్‌ గురించి ఆలోచించు.. రెండు, మూడేళ్ళు ఆగు అన్నారు పెద్దలు. గొడవలొచ్చాయి. ఇది మంచిది కాదని తలచి కళ్యాణ్‌కి ఫోన్‌ చేసి మ్యారేజ్‌ చేసుకుందాం అన్నాను. ఓ రోజు బయటికెళ్ళిపోయి ఫిల్మీస్టైల్‌లో ఆర్యసమాజ్‌కి వెళ్లి పెళ్లిచేసుకున్నా. అలా తెలుగింటి కోడలినయ్యా. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు. జీవితం హాయిగా సాగిపోతోంది..’’
– నవ్య డెస్క్‌
ఫోటోలు: ఎస్‌.మహమ్మద్‌ రఫీ

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.