అన్యాయంగా నిందలు పడ్డ అగ్రనేత
- – కె.శ్యాం ప్రసాద్ syamprasadk56 gmail.com
- 01/03/2015

సైద్ధాంతిక రాజకీయాలకు మారుపేరుగా, రాజకీయ నిబద్ధతకు ఉదాహరణగా నిలిచిన బంగారు లక్ష్మణ్ స్వర్గస్తులై ఒక సంవత్సరం పూర్తయింది. 2014, మార్చి 1న తీవ్ర అస్వస్థతతో భాగ్యనగర్‌లో స్వర్గస్తులయ్యారు.
బంగారు లక్ష్మణ్ పేరు చెప్పగానే వారికి సన్నిహితంగా మిగిలిన వ్యక్తుల్లో వున్న వ్యక్తిత్వ చిత్రానికి టి.వి ఇతర ప్రసార మాధ్యమాలలో జరిగిన ప్రచారం కారణంగా సాధారణ ప్రజానీకంలో గల వ్యక్తిత్వ చిత్రానికి భిన్నమైన రూపాలు కల్పిస్తాయి. కేవలం పత్రికలుచూసి సాధారణ ప్రజలకు బంగారు లక్ష్మణ్ పేరు చెప్పగానే తెహెల్కా ఆపరేషన్‌లో కేవలం ఒక లక్ష రూపాయలు తీసుకుంటున్న నేతగా గుర్తిస్తారు. ఈ ఆరోపణల కారణంగా పార్టీ నిర్ణయం మేరకు పార్టీ జాతీయాధ్యక్షునిగా రాజీనామా చేసారు. తిరిగి వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. సుమారు 12 సంవత్సరాలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. జిల్లా కోర్టులో శిక్ష పడిన కారణంగా సుమారు ఆరు నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
తనకు రక్షణ శాఖలో ఎవరితోను సన్నిహిత సంబంధాలు లేవని వారు స్పష్టంగా పలకడం తెహెల్కా టేపులో వినపడుతుంది. తీసుకున్న లక్ష రూపాయలకు పార్టీ జారీ చేసిన రసీదునుకూడా కోర్టు ముందుంచారు. ఏ సందర్భంలోను రక్షణ శాఖకు ఎటువంటి సిఫార్సు చేయలేదు. ఆ సమయంలో వారు మంత్రిగా లేరు. కేవలం పార్టీ జాతీయాధ్యక్షునిగా మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ వారికి జిల్లా కోర్టులో శిక్ష పడింది. పడక మంచంలో కోట్ల రూపాయలతో పట్టుబడిన మాజీ కేంద్రమంత్రికి చాలా త్వరలోనే బెయిలు వచ్చింది. అవినీతి ఆరోపణలకు గురైన లాలు ప్రసాద్ యాదవ్‌కు చాలా తక్కువ రోజుల్లోనే బెయిల్ వచ్చింది. అయితే బంగారు లక్ష్మణ్ జైలులో ప్రవేశించిన ఆరు నెలల వరకు బెయిలుపై జడ్జి వాదనలే వినలేదు. బెయిల్ దరఖాస్తుపై వాదనలు లేకుండానే వాయిదాలు పడుతూ వచ్చాయి. ఆరు నెలల తరువాత వాదనలకు అవకాశం కల్పించిన తరువాత వారికి బెయిలు వచ్చింది. జైలులో ఏకాంతంగా గడపడం, అవాస్తవ ఆరోపణలపై తనపై జరిగిన దుష్ప్రచారం, ఆరోపణలకు గురైన సమయంలో ఆప్తులు పార్టీవారు తగురీతిలో అండగా నిలవకపోవడంపై లక్ష్మణ్ ఎంతో వేదనకు గురయ్యారు. శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగిపోయారు. గతంలో ఆయనకు గుండె ఆపరేషన్ జరిగినా మంచి ఆరోగ్యవంతమైన శరీరం. ఈ జైలు జీవితం కారణంగానే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విడుదలైన కొద్ది కాలానికి తీవ్ర అస్వస్థతకు గురై తనువు చాలించారు.
లక్ష్మణ్‌జీతో సన్నిహితులైన వ్యక్తులకి వారిపట్ల గల చిత్రం భిన్నమైంది. మృదు స్వభావం, జ్ఞాన తృష్ణ, నిరంతర అధ్యయనం, ఆచి తూచి మాట్లాడడం, ఆంగ్లం, హిందీ, తెలుగు భాషల్లో వక్తృత్వము, ఎవ్వరినీ నొప్పించని స్వభావము, లోతైన సిద్ధాంతపరమైన విషయాలను సైతం సరళంగా అందరికీ అర్ధమయ్యే భాషలోచెప్పగల నేర్పు ఇలా ఎన్నో సుగుణాలు ఆయనలో కనపడతాయి.
17 మార్చి 1939న లక్ష్మణ్ భాగ్యనగర్‌లో ఆర్థికంగా ఒక చిన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి నర్సింహ వాటర్ వర్క్స్ విభాగంలో చిన్న కార్మికుడు. 1950లో హైస్కూల్ విద్యార్థిగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఆయన చేరారు. ఒకపక్క విద్యాభ్యాసం, మరోపక్క ఆర్ఎస్ఎస్ ద్వారా దేశభక్తికి సంబంధించిన పాఠాలు నేర్చుకున్నారు. వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ బిఏ, ఎల్ఎల్బి పూర్తి చేసారు. హైదరాబాద్ నగర శాఖకు ఆర్ఎస్ఎస్ నగర బౌద్ధిక్ ప్రముఖ్‌గా పనిచేసారు. చిన్నప్పటినుండి తెలివైన విద్యార్థి. విద్యుత్ శాఖలో ఏజిస్ కార్యాలయంలో, రైల్వే శాఖలో ఉద్యోగాలు చేసారు. భారతీయ జనసంఘం పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జనసంఘ పూర్తిసమయ కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో జనసంఘానికి బలమైన పునాది వేసిన వారిలో లక్ష్మణ్‌జీ ఒకరు. 1971లో నెల్లూరు లోక్‌సభ రిజర్వు స్థానంనుంచి పార్టీ ఆదేశాల మేరకు వారు పోటీ చేసేవరకు వారు దళిత వర్గానికి చెందిన వారని ఆర్‌ఎస్‌ఎస్‌లోను, భారతీయ జనసంఘంలోను ఆప్తులు సైతం తెలియదు.
ఎన్నికల్లో ఓటమి ఖాయం అని తెలిసినప్పటికీ పార్టీని బలోపేతం చేయడం దృష్ట్యా పోటీ చేయమన్నప్పుడల్లా బంగారు లక్ష్మణ్ పోటీ చేసారు. 1971లో నెల్లూరునుండి 1978లో పెద్దపల్లి పార్లమెంటునుండి 1992లో నంద్యాల పార్లమెంటు నుండి 2004లో రాజస్తాన్‌నుండి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 1984లో స్థానిక సంస్థలనుండి ఎమ్‌ఎల్‌సిగా ఆంధ్రప్రదేశ్‌నుండి ఎన్నికైన కొన్ని నెలలకే కౌన్సిల్ రద్దయింది.
1996లో గుజరాత్‌నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న సమయంలో పార్టీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించారు. నాగపూర్ జాతీయ కౌన్సిల్ సమావేశంలో జాతీయ అధ్యక్షులుగా బంగారు లక్ష్మణ్ చేసిన ప్రసంగం దేశంలోని దళిత మైనార్టీ వర్గాలను ఎంతో ఆకట్టుకుంది. ఎంతోకాలంగా పార్టీకి దూరంగా వున్న ఈ వర్గాలు పార్టీకి సన్నిహితం కావడం ప్రారంభమైంది. లక్ష్మణ్‌జీ వ్యక్తిత్వం, వక్తృత్వం కారంగా దేశవ్యాప్తంగా దళిత వర్గాలు బిజెపి పట్ల విశేష ఆసక్తిని కనిపించడం ప్రారంభించారు. ఈ సందర్భంలో అధికారంలో వున్న బిజెపిని బలహీనం చేయడంలో ఒక కుట్రగా తెహెల్కా స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించబడింది. రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌పై ఆరోపణలు వచ్చినా ఆయన పదవిలో కొనసాగారు. ఫెర్నాండెజ్‌ను కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వంలోని నాయకులందరు అండగా నిలిచారు. కానీ ఇటువంటి సమర్ధన పార్టీ నాయకత్వంనుండి, కేంద్ర ప్రభుత్వంనుండి బంగారు లక్ష్మణ్‌కు లభించలేదు.
తెహెల్కా అనంతరం రాజకీయంగా తనను దూరంగా వుంచుతున్నారని ఆయన సన్నిహితుల వద్ద అప్పుడప్పుడు ఆవేదనను వ్యక్తం చేసినా ఆయన ఏనాడూ పార్టీకి, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా బయట ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇతర పార్టీలలోని ప్రముఖ దళిత నాయకులు ఆయనను దగ్గరకు తీయాలని, బిజెపినుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేసినా, పదవులు ఆశ చూపినా ఆయన ఏనాడూ దారితప్పే ప్రయత్నం చేయలేదు. పైగా పార్టీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో వ్యక్తిగత రాగద్వేషాలకు తావులేకుండా ఆయా నాయకులపట్ల సానుభూతితో మాట్లాడేవారు. వారు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల పట్ల సానుభూతి వ్యక్తం చేసేవారు.
ఆంధ్రప్రదేశ్ జనసంఘ శాఖ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షునిగా, జాతీయ కార్యదర్శిగా, దళిత మోర్చా జాతీయ అధ్యక్షునిగా, జాతీయ ఉపాధ్యక్షునిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా వివిధ బాధ్యతలలో పార్టీ బలోపేతం కోసం పనిచేసారు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసి జైలుజీవితం గడిపారు.మంత్రాలయంలో ఒక శాసనసభ్యుని ప్రవేశం సందర్భంగా అవమానానికి గురైన సంఘటనలో, చుండూరు, కారంచేడు, పొదిరికుప్పం ఘటనలలో దళితులపై జరిగిన దాడి సందర్భాలలో పార్టీలోపలా బయటా దళితుల సమానత్వం కోసం హక్కుల కోసం ఆయన ఎంతో చొరవ చూపించారు. దళిత గిరిజన వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం ఎస్సి, ఎస్టి ఉపప్రణాళికను కేంద్రంలో వివిధ రాష్ట్రాలలో సక్రమంగా అమలు కావాలని ప్రైవేటు రంగంలోరిజర్వేషన్లు కావాలని పార్టీలోపల అభిప్రాయం కూడగట్టారు. ఎన్డిఏ అధికారంలోవున్న సమయంలో ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం విజయవంతం కృషి చేసారు.లక్ష్మణ్ అవాస్తవ ఆరోపణలకు గురై ఆవేదనతో అకాలంగా మరణించారని, లక్ష్మణ్‌జీ అసువులు బాసిన తర్వాత కూడా కేసును కొనసాగించి లక్ష్మణ్‌జీపైనున్న అవినీతి ఆరోపణలన్నీ అవాస్తవమని కోర్టులో నిరూపించడమే లక్ష్మణ్‌జీకి నిజమైన నివాళి.